కశ్మీర్‌పై ఐసీజే పాత్ర ఉండదు
న్యూఢిల్లీ: కజకిస్తాన్‌లో త్వరలో జరగనున్న షాంఘై కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) సమావేశం సందర్భంగా భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య భేటీ జరగబోదని విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదం, చర్చలు ఒకదానితో ఒకటి కలిసి కొనసాగలేవన్నారు. ఎన్డీయే ప్రభుత్వ మూడేళ్ల సంబరాల సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కశ్మీర్ విషయాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో ఫిర్యాదుచేస్తామన్న పాకిస్తాన్ వ్యాఖ్యలను సుష్మ ఖండించారు.
‘కశ్మీర్ సమస్యను పాకిస్తాన్ ఐసీజేలో ఫిర్యాదు చేయలేదు. మూడో దేశం మధ్యవర్తిత్వం లేకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారమని షిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ స్పష్టం చేస్తున్నాయి’ అని సుష్మ స్పష్టం చేశారు. పారిస్ ఒప్పందం విషయంలోపై భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను సుష్మ తీవ్రంగా ఖండించారు.
‘డబ్బుల కోసమో.. మరెవరి ఒత్తిడి వల్లో భారత్ ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు. పర్యావరణ పరిరక్షణకు మేం కట్టుబడి ఉన్నాం. పర్యావరణంపై 5వేల ఏళ్ల నిబద్ధత మాది’ అని ఆమె స్పష్టం చేశారు. ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వంపై తాజాగా మరోసారి అభ్యంతరం చేసిన చైనాతో చర్చలు జరుపుతామన్నారు.