ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ పర్యటనల సందర్భంగా దేశ ప్రధానమంత్రి విదేశాంగమంత్రులు, ఇతర అధికార ప్రతినిధులకు అందించే బహుమతులు, గౌరవసూచికగా ఇచ్చే కానుకల రూపంలో కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో 17.7 కోట్ల రూపాయలు ప్రభుత్వనిధి తోషఖానాకు చేరాయి. వీటిలో దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు లభించిన కోట్ల రూపాయల బంగారు, వజ్రాల ఆభరణాల బహుమతి అతివిలువైనదిగా నిలిచింది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన ఈ ఆరు సంవత్సరాల కాలంలో 230మందికి పైగా వ్యక్తులు 2,800 బహుమతులు అందుకోగా, వీటి విలువ సుమారు 17.74 కోట్ల రూపాయలు.
సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు 2019లో ఆమెకిచ్చిన 6.7 కోట్ల విలువైన వెండి వజ్రాల పచ్చ ఆభరణాల సెట్ ఈ కాలానికి అత్యంత ఖరీదైన బహుమతిగా నిలిచింది. అలాగే 2015లో ప్రధాని మోదీ అందుకున్న 35 లక్షల విలువైన, హారము, చెవిపోగులు పెట్టె చాలా ఖరీదైన వాటిల్లో ఒకటిగా నిలిచింది. సాధారణంగా దేశ ప్రధానమంత్రి లేదా విదేశాంగ మంత్రికి ఖరీదైన బహుమతులు లభిస్తాయి. కానీ 2018-2019 కాలంలో కోట్ల విలువైన వజ్రాల గడియారాలతో చాలామంది అధికారులు టాప్ లో నిలిచారు. మంత్రులు, బ్యూరోక్రాట్ల తమ తమ విదేశీ పర్యటన సందర్భంగా మెమెంటోలు, సాంస్కృతిక కళాఖండాలు, పెయింటింగ్‌లు, ఫోటోలు, గాడ్జెట్లు, చీరలు, కుర్తాలతోపాటు మద్యం కూడా బహుమతిగా అందుకున్నారు. ముఖ్యంగా పాలరాయి రాయిపై మోదీ బొమ్మ, హిందీలో పద్యం వంటి వ్యక్తిగతీకరించిన బహుమతి కూడా ఉంది. అంతేకాదు 2014 నుండి తోషాఖానాకు చేరిన వాటిలో రహస్య ఇంటెలిజెన్స్ ఫైల్స్, పశ్చిమ బెంగాల్ నజాఫీ రాజవంశానికి చెందిన 18 వ శతాబ్దపు కత్తి, మహాత్మా గాంధీ డైరీ నుండి ఒక ఫ్రేమ్డ్ పేజీ, గాంధీ చిత్రాలు, అంతర్జాతీయ క్రికెట్ జట్టు ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ బ్యాట్,బంతి, ఇత్తడి కంటైనర్‌లో నింపిన మానస సరోవర్ పవిత్ర జలం, బుల్లెట్ ట్రైన్ నమూనా, వెండి ఎద్దుల బండి ఉండటం విశేషం.
సాంప్రదాయం ప్రకారం విదేశీ సందర్శనల సమయంలో దేశానికి చెందిన ముఖ్య ప్రతినిధులు అందుకున్న బహుమతులు నేరుగా ప్రభుత్వనిధి తోషాఖానాకు వెళతాయి. ఖరీదైన ఆభరణాలు, గడియారాల, కళాఖండాలు, గాడ్జెట్లు ఇతర వస్తువులు ఈ కోవలో ఉంటాయి. తోషాఖానా వెల్లడించిన డేటా ప్రకారం జూన్ 2014 - ఫిబ్రవరి 2020 మధ్య లభించిన బహుమతులలో 61శాతం 5,000 కంటే తక్కువ విలువైనవి కాగా, ఒక లక్ష లేదా అంతకంటే ఎక్కువ విలువైనవి 4శాతం. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ 650కి పైగా గిఫ్ట్ లు అందుకోగా, ఆ తరువాత వరుసలో సుష్మ స్వరాజ్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు. అయితే వీటికి సంబంధించిన వివరాలకు సమాచార హక్కు నుంచి మినహాయింపు నివ్వడంతో అందుబాటులో లేవు.
Comments
Please login to add a commentAdd a comment