దాడులు ఆగితేనే.. చర్చలు!
* పాక్ ప్రధానికి తేల్చిచెప్పిన మోడీ
* మోడీ-షరీఫ్‌ల భేటీ వివరాల్ని వెల్లడించిన సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో భారత్ వ్యతిరేక తీవ్రవాద కార్యకలాపాలు ఆగితేనే ఇరు దేశాల మధ్య చర్చలు సాధ్యమని భారత ప్రధాని నరేంద్రమోడీ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌కు తేల్చి చెప్పారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ బుధవారం వెల్లడించారు. భారతదేశ నూతన విదేశాంగ మంత్రిగా ఆమె బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంగళవారం నాటి మోడీ, షరీఫ్‌ల భేటీ వివరాల్ని ఆమె మీడియాకు తెలిపారు.
‘ఇరుదేశాల మధ్య సంబంధాల్ని మెరుగుపరిచేందుకు జరిపే ఏ చర్చలైనా ఫలప్రదం, విజయవంతం కావాలంటే.. ముందుగా భారత్ వ్యతిరేక తీవ్రవాద కార్యకలాపాలు అంతం కావాలి. బాంబు విస్ఫోటన ధ్వనుల్లో శాంతి చర్చలు వినిపించవు. బాంబు దాడులు ఆగాలి. అప్పుడే మనం చర్చలు జరపవచ్చు. అప్పుడే చర్చల్లో మన వాణి స్పష్టంగా వినిపిస్తుంది’ అని నవాజ్ షరీఫ్‌తో మోడీ విస్పష్టంగా చెప్పారని సుష్మా వివరించారు. రెండు దేశాల మధ్య చర్చలను ముందుకు తీసుకెళ్లే దిశగా భారత్, పాక్‌ల విదేశాంగ కార్యదర్శులు పనిచేస్తారన్నారు.
పాకిస్థాన్‌తో సుహృద్భావ సంబంధాలనే భారత్ కోరుకుంటోందన్న విషయం షరీఫ్‌కు స్పష్టం చేశామన్నారు. పాక్‌లో జరుగుతున్న ముంబై దాడుల కేసు విచారణను వేగవంతం చేయాలని కూడా కోరామని సుష్మా వెల్లడించారు. భారత్ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పడం, పొరుగుదేశాలు, వ్యూహాత్మక భాగస్వాములు, ఆఫ్రికా, ఆసియా దేశాలు, ఆసియాన్ సభ్య దేశాలు, యూరోప్ దేశాలు.. వీటన్నింటితో సంబంధాలను మెరుగుపర్చుకోవడం విదేశాంగ మంత్రిగా తన ప్రాధమ్యాలని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ నేతలను పిలవడంపై స్పందిస్తూ.. ‘సంప్రదాయ రీతికి భిన్నంగా, వినూత్నంగా ఆలోచించే ప్రభుత్వం, ప్రధాని భారత్‌లో అధికారంలోకి వచ్చాయని మొదటిసారి సార్క్ దేశాలు భావించాయి’ అన్నారు.