అతనికి మోదీ జన్మదిన శుభాకాంక్షలా?
ఔరంగజేబుకు శివాజీ ఎప్పుడైనా చెప్పారా?
ముంబై: భారత్-పాకిస్థాన్ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దాయాది ప్రధాని నవాజ్ షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపడాన్ని శివసేన పరోక్షంగా తప్పుబట్టింది. దేశ విరోధులకు మరాఠా రాజు శివాజీ ఎప్పుడూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపలేదని పేర్కొంది. ముంబైలో శివాజీ స్మారకస్థూపానికి ప్రధాని మోదీ ఇటీవల శంకుస్థాపన చేసిన నేపథ్యంలో శివసేన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతేకాకుండా ఈ సభలో బీజేపీ శ్రేణులు పదేపదే 'మోదీ', 'మోదీ' అనడాన్ని తప్పుబట్టింది.
'శివాజీ మహరాజ్ ఎప్పుడూ స్వరాజ్య వ్యతిరేక శక్తుల్ని దేశ శత్రువులుగానే చూసేవారు. ఆయన ఎన్నడూ ఔరంగజేబు, అఫ్జల్ ఖాన్, షాయిస్త ఖాన్ లకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపలేదు' అని శివసేన పార్టీ పత్రిక 'సామ్నా' తన సంపాదకీయంలో పేర్కొంది. అదేవిధంగా రాజకీయ ప్రయోజనాల కోసం శివాజీని, ఆయన వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించవద్దని, అలా చేసినవాళ్లు చరిత్రహీనులుగా మిగులుతారని సామ్నా ఘాటుగా విమర్శించింది.