పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్థాన్ చర్యలకు ఉపక్రమించినట్టు కనిపిస్తోంది.
ఇస్లామాబాద్: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్థాన్ చర్యలకు ఉపక్రమించినట్టు కనిపిస్తోంది. పఠాన్‌కోట్ దాడికి సూత్రధారులుగా భావిస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూప్ సభ్యులను పాక్ భద్రతా దళాలు బుధవారం అదుపులోకి తీసుకున్నాయి. జైషే మహమ్మద్ కార్యాలయాలపై దాడులు జరుపుతూ.. వాటిని మూసివేసినట్టు తెలుస్తోంది.
'జైషే మహమ్మద్‌కు చెందిన పలువురు సభ్యులను అదుపులోకి తీసుకొని, వాటి కార్యాలయాలను సీల్ చేస్తున్నట్టు పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అరెస్టైన వారిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ బంధువులు కూడా ఉండి ఉండొచ్చునని పాక్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పఠాన్‌కోట్ దాడిపై ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు పురోగతిని తెలుసుకునేందుకు తమ విచారణాధికారులను భారత్ పంపిస్తామని ఇప్పటికే పాక్ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై భారత్ ఇంకా స్పందించలేదు. పఠాన్‌కోట్ దాడికి కారణమైన జైషే మహమ్మద్ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటేనే.. భారత్-పాక్ చర్చలు ముందుకు కొనసాగిస్తామని మోదీ ప్రభుత్వం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.