శాంతి సందేశంతో వచ్చా: నవాజ్ షరీఫ్
న్యూఢిల్లీ : పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ భారత్ చేరుకున్నారు. భారత దౌత్య అధికారులు ఆయనకు ఢిల్లీ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. నవాజ్ షరీఫ్తో పాటు ఆయన సతీమణి కుల్సుమ్ నవాజ్, కుమారుడు హుస్సేన్ నవాజ్ కూడా భారత్ విచ్చేశారు.
ఈరోజు సాయంత్రం జరిగే నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి నవాజ్ షరీఫ్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్కు శాంతి సందేశంతో వచ్చినట్లు తెలిపారు. అంతకు ముందు ఇస్లామాబాద్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాక్ నుంచి శాంతి సందేశం తీసుకుని భారత్ బయల్దేరుతున్నట్లు తెలిపారు.
భారత్తో స్నేహ సంబంధాలు కొనసాగాలని పాక్ కోరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. షరీఫ్ మంగళవారం మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే కూడా ఈరోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. రాజపక్సే రాకను తమిళ పార్టీలు నిరసిస్తున్న కారణంగా ఆయనకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.