Rajapakse
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని రాజపక్సే
సాక్షి, తిరుమల: శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం తిరుమలలోని శ్రీకృష్ణ విశ్రాంతి గృహం వద్దకు ఆయనకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, టీటీడీ ఏఈవో ఎవీ ధర్మారెడ్డి, తదితరులు స్వాగతం పలికారు. అంతకముందు రేణిగుంట విమానాశ్రయంలో మహింద రాజపక్సేకు సాదర స్వాగతం లభించింది. విమనాశ్రయంలో వారిని భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శనలతో విద్యార్థులు స్వాగతం పలికారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
శ్రీలంక రాజకీయాల్లో కీలక పరిణామం
కొలంబో: శ్రీలంక రాజకీయాల్లో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రధానమంత్రిగా రణీల్ విక్రమసింఘేను తొలగించి.. ఆ స్థానంలో దేశ మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సేను నియమిస్తున్నట్టుగా సిరిసేన కార్యాలయం ప్రకటించింది. ఆ వెంటనే రాజపక్సే ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత కొంత కాలంగా సిరిసేన, విక్రమసింఘేల మధ్య కొనసాగుతున్న విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఈ నిర్ణయం వెలువడినట్టు తెలుస్తోంది. గతంలో రాజపక్సే వద్ద మంత్రిగా పనిచేసిన సిరిసేన ఆయనతో విభేదించి 2015 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సిరిసేన పార్టీ మద్దతుతో యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) అధినేత రణీల్ విక్రమసింఘే 2015 జనవరిలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత విక్రమసింఘే తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు నుంచి ఆరోపణలు రావడంతో.. సిరిసేన అతని అధికారాలను తగ్గిస్తూ వచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో విక్రమసింఘే ఈ ఏడాది ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొవాల్సి వచ్చింది. బలపరీక్షలో విక్రమసింఘే విజయం సాధించినప్పటికీ.. సిరిసేన మాత్రం ఆయనతో విభేదిస్తూనే వస్తున్నారు. తాజాగా అధికార పార్టీకి మద్దతు ఉపసంహరించుకున్నట్టు సిరిసేన పార్టీ ప్రకటించింది. కాగా, సిరిసేన నిర్ణయం రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీలంక రాజ్యాంగంలోని 19వ సవరణ ప్రకారం.. మెజారిటీ లేనిదే ప్రధానిని పదవి నుంచి తొలగించడానికి నిబంధనలు అంగీకరించవు. మరోవైపు 225 మంది సభ్యులన్న శ్రీలంక అసెంబ్లీలో యూఎన్పీకి 106 మంది, రాజపక్సే, సిరిసేనల పార్టీలకు కలిపి 95 మంది సభ్యులు ఉన్నారు. -
బలం నిరూపించుకున్న ప్రధాని
కొలంబో : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు అంటారు. ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణలు మారుతూనే ఉంటాయి. ఒక్కోసారి అంచనాలు తారుమారవుతాయి. శ్రీలంక ప్రధాని విషయంలో ఇదే జరిగింది. నిన్నటి వరకు సొంత పార్టీ నుంచి, మిత్ర పక్షాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్న రణిల్ విక్రమసింఘే.. రాజకీయ విశ్లేషకుల అంచనాలను తారుమారు చేస్తూ ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో అనూహ్య విజయం సాధించారు. 225 మంది సభ్యులున్న శ్రీలంక అసెంబ్లీలో 76 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా 122 మంది వ్యతిరేకించారు. 26 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అవిశ్వాసంలో నెగ్గాలంటే ప్రతిపక్షానికి కనీసం 96 నుంచి 101 ఓట్లు అవసరమైన నేపథ్యంలో కేవలం 76 ఓట్లే అనుకూలంగా రావడంతో ప్రధాని విక్రమసింఘే సునాయాసంగా విజయం సాధించారు. సొంత పార్టీ యునైటెడ్ నేషనల్ పార్టీ నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్న ప్రధాని.. పార్టీలో సంస్కరణలు చేపడతానని, యువతకు ప్రాధాన్యం కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఈవిధంగా ఆయన అవిశ్వాసం నుంచి తప్పించుకోగలిగారు. ముందుంది అసలు సవాలు.. అవిశ్వాస తీర్మానంలో నెగ్గినప్పటికీ ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుతుందా లేదా అన్నది ప్రస్తుతం ప్రధాని ముందున్న అతిపెద్ద సవాలు. మిత్రపక్షమైన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందిన అధ్యక్షుడు సిరిసేన మైత్రిపాల ప్రధాని పట్ల వ్యవహరించిన తీరే ఇందుకు కారణం. ఆర్థిక మోసానికి పాల్పడ్డారనే ప్రతిపక్షాలు ఆరోపణల కారణంగా సిరిసేన ప్రధానికి ఉన్న అధికారాలను తగ్గించడంతో పాటు రాజీనామా చేయాల్సిందిగా ఆయనపై ఒత్తిడి పెంచారు. శ్రీలంక రాజ్యాంగంలోని 19వ సవరణ ప్రకారం.. ద్రవ్య బిల్లు, అవిశ్వాస తీర్మానాలపై జరిగే ఓటింగ్‌లో ప్రభుత్వంలో భాగమైన సభ్యులందరూ ఓటు హక్కు కోల్పోయినపుడు మాత్రమే ప్రధానిని తొలగించి ఆయన స్థానంలో కొత్తవారిని నియమించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. కేవలం ఈ కారణంగానే విక్రమసింఘేను పదవి నుంచి తొలగించలేకపోయారు. అయితే ఇపుడు అధికార కూటమిలో భాగమైన అధ్యక్షుడు, ప్రధానులు తమ మధ్య తలెత్తిన విభేదాలు మర్చిపోయి కలిసి ముందుకు సాగితేనే ప్రభుత్వానికి ఏ ఢోకా ఉండదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శ్రీలంక సెంట్రల్ బ్యాంకు(ఎస్సీబీ) బాండ్లకు సంబంధించిన అంశంలో ప్రధాని ఆర్థిక మోసానికి పాల్పడ్డారని, గత నెలలో సెంట్రల్ క్యాండీ జిల్లాలో జరిగిన ముస్లిం వ్యతిరేక అల్లర్లను నియంత్రించడంలో విఫలమయ్యారనే కారణంగా ప్రధాని రాజీనామా చేయాల్సిందిగా ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షమైన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ కూడా పట్టుబట్టింది. ఈ కారణంగానే అధ్యక్షుడు సిరిసేన మైత్రిపాల సిరిసేన ప్రధాని రణీల్ విక్రమ సింఘే బాధ్యతలను ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగా ప్రధాని ఆధీనంలో ఉండే సెక్యూరిటీ అండ్ ఎక్ఛ్సేంజ్ కమిషన్‌ను ఆర్థిక శాఖ పరిధిలోకి తీసుకురావడంతో పాటు శ్రీలంక సెంట్రల్ బ్యాంకుపై ప్రధానికి ఉన్న అధికారాలను కూడా తొలగించారు. ప్రధాని రాజీనామా చేయాల్సిందిగా కోరారు. కానీ ఆయన ఇందుకు నిరాకరించడంతో అధ్యక్షుడు కూడా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. -
అవిశ్వాసానికి అధ్యక్షుడి మద్దతు
కొలంబో : శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ముదిరింది. ఏప్రిల్ 4న అవిశ్వాస తీర్మానం ఎదుర్కోనున్న శ్రీలంక ప్రధానమంత్రి రణీల్ విక్రమసింఘేకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పార్టీ షాక్ ఇచ్చింది. సిరిసేన నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ (ఎస్ఎల్పీ) ప్రతిపక్షాలు ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికి రాజకీయ సంక్షోభానికి తెర తీసింది. శ్రీలంక సెంట్రల్ బ్యాంకు(ఎస్సీబీ) బాండ్లకు సంబంధించిన అంశంలో ప్రధాని ఆర్థిక మోసానికి పాల్పడ్డారని, గత నెలలో సెంట్రల్ క్యాండీ జిల్లాలో జరిగిన ముస్లిం వ్యతిరేక అల్లర్లను నియంత్రించడంలో విఫలమయ్యారనే కారణంగా ప్రధాని రాజీనామా చేయాల్సిందిగా సిరిసేన పార్టీ పట్టుబట్టింది. కానీ ప్రధాని ఇందుకు నిరాకరించడంతో అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైనట్లు పార్టీ సీనియర్ నేత, విమానయాన శాఖ మంత్రి నిమల్ సిరిపాల డి సిల్వా తెలిపారు. మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఎస్ఎల్పీ తీసుకున్న నిర్ణయంతో ప్రధాని చిక్కుల్లో పడ్డారు. అవిశ్వాసాన్ని దీటుగా ఎదుర్కొంటాం.. ప్రధాని విక్రమసింఘే పార్టీ యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) అధికార ప్రతినిధి, మంత్రి హర్ష డి సిల్వా మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటామని, వారిని ఓడించి తీరతామని విశ్వాసం వ్యక్తం చేశారు. సంఖ్యా బలం ఉన్నప్పటికీ... గత నెలలోనే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మనానికి సంబంధించిన నోటీసులు స్పీకర్ కరు జయసూర్యకు అందజేశాయి. 225 స్థానాలున్న శ్రీలంక అసెంబ్లీలో ప్రధాని పార్టీ యూఎన్‌పీ 106 మంది సభ్యులను కలిగి ఉంది. సిరిసేన ఎస్ఎల్పీ పార్టీతో పాటు, మాజీ అధ్యక్షుడు రాజపక్సే పార్టీల సంఖ్యా బలం 96. యూఎన్‌పీ మిత్రపక్షమైన శ్రీలంక ముస్లిం కాంగ్రెస్ కూడా యూఎన్‌పీ తీరు పట్ల అసంతృప్తిగానే ఉంది. సుమారు పన్నెండు మంది సొంత ఎంపీలు కూడా ప్రధానికి వ్యతిరేకంగానే ఓటు వేస్తారని సిరిసేన అభిప్రాయపడ్డారు. ఇక శ్రీలంకలోని ప్రధాన తమిళ పార్టీ కూడా అవిశ్వాసానికి సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అధ్యక్షునితో సమావేశమైన అనంతరం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆ పార్టీ నాయకుడు ఆర్ సంథన్ తెలిపారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు కావాల్సిన సంఖ్యా బలం ఉన్నప్పటికీ సొంత పార్టీలో ప్రధానికి పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంలో ప్రధాని ఓడిపోతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపించిన కారణంగా అధ్యక్షుడు సిరిసేన ప్రధాని బాధ్యతలను ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడే అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. -
శ్రీలంకలో రాజకీయ సంక్షోభం
కొలంబో : శ్రీలంక స్థానిక ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే స్థాపించిన నూతన పార్టీ అఖండ విజయం సాధించి అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. అంతేకాకుండా వచ్చే నెల 4వ తేదీన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్షం సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో అధికార కూటమి ఫ్రీడమ్, యునైటెడ్ నేషనల్ పార్టీల భవితవ్యం సందిగ్ధంలో పడింది. ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రధాని రణీల్ విక్రమ సింఘే బాధ్యతలను ఒక్కొక్కటిగా తగ్గిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధాని ఆధీనంలో ఉండే సెక్యూరిటీ అండ్ ఎక్ఛ్సేంజ్ కమిషన్‌ను ఆర్థిక శాఖ పరిధిలోకి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన మార్పులను గురువారం అధికారంగా గెజిట్ రూపంలో విడుదల చేయనున్నారు. అంతేకాకుండా శ్రీలంక సెంట్రల్ బ్యాంకుపై ప్రధానికి ఉన్న అధికారాలను కూడా తొలగించారు. ఏప్రిల్ 4న అవిశ్వాస తీర్మానం.. 2015లో శ్రీలంక సెంట్రల్ బ్యాంకు(ఎస్సీబీ) బాండ్లకు సంబంధించి జరిగిన మోసానికి ప్రధాని కారణం అంటూ ప్రతిపక్షం తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆయన ఉద్దేశపూర్వకంగానే మోసానికి పాల్పడ్డారని, అందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని తెలిపింది. -
శాంతి సందేశంతో వచ్చా: నవాజ్ షరీఫ్
న్యూఢిల్లీ : పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ భారత్ చేరుకున్నారు. భారత దౌత్య అధికారులు ఆయనకు ఢిల్లీ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన సతీమణి కుల్సుమ్ నవాజ్, కుమారుడు హుస్సేన్ నవాజ్ కూడా భారత్ విచ్చేశారు. ఈరోజు సాయంత్రం జరిగే నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి నవాజ్ షరీఫ్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌కు శాంతి సందేశంతో వచ్చినట్లు తెలిపారు. అంతకు ముందు ఇస్లామాబాద్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాక్ నుంచి శాంతి సందేశం తీసుకుని భారత్ బయల్దేరుతున్నట్లు తెలిపారు. భారత్‌తో స్నేహ సంబంధాలు కొనసాగాలని పాక్ కోరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. షరీఫ్ మంగళవారం మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే కూడా ఈరోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. రాజపక్సే రాకను తమిళ పార్టీలు నిరసిస్తున్న కారణంగా ఆయనకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. -
అతిథుల రాకపై మిత్రుల అలక
నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టకముందే.. బీజేపీ మిత్ర పక్షాల్లో లుకలుకలు మొదలయ్యాయి. మోడీ ప్రమాణ స్వీకారోత్సవ ఘట్టమే వారికి వేదిక కాబోతోంది. మోడీ తన ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలను ఆహ్వానించడమే మిత్రపక్షాల ఆగ్రహానికి కారణమైంది. ముఖ్యంగా శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్షే, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీప్లను పిలవడం రెండు పార్టీలకు సుతారమూ ఇష్టం లేదు. లంకతో తమిళులను అణచివేస్తున్న రాజపక్షేను ఆహ్వానించడమేంటంటూ తమిళనాడుకు చెందిన ఎండీఎంకే అధ్యక్షుడు వైకో ప్రశ్నించారు. ఢిల్లీలో మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా నల్ల బ్యాడ్జీ ధరించి రాజపక్షేకు నిరసన తెలియజేస్తానని ప్రకటించారు. ఇక పాక్ పేరెత్తితేనే అంతెత్తున ఎగిరిపడే శివసేనకు.. నవాజ్ షరీఫ్ రాక మింగుడుపడటం లేదు. మోడీ సర్కార్ పాక్‌పై దూకుడుగా వ్యవహరిస్తుందని శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే ఎన్నికల ఫలితాల అనంతరం వ్యాఖ్యానించారు. అయితే షరీఫ్ రాకపై స్పందించేందుకు శివసేన నిరాకరించింది. మీ పార్టీ వైఖరేంటన్న ప్రశ్నకు మౌనమే సమాధానమైంది. పాక్ ప్రధాని రాకను అడ్డుకోవాలంటూ సరభ్ జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ కూడా పిలుపునిచ్చారు. కొసమెరుపు ఏంటంటే.. బీజేపీ మిత్రపక్షాలు రాజకీయ కారణాల వల్లే తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయే తప్ప కాదు కూడదని చెప్పే సాహసం చేయలేదు. లంక, పాక్ అధినేతలకు ఆహ్మానం వద్దంటూ బీజేపీ, మోడీ ఎదుట డిమాండ్ చేయలేకపోయాయి. కారణమేంటంటే గతంలో మాదిరి బీజేపీని బెదిరించే పరిస్థితి లేకపోవడమే. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పరిపూర్ణమైన మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. మోడీ సునామీ ప్రభావంతో 282 ఎంపీ సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. దీంతో కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బీజేపీ మిత్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి లేదు. మంత్రి పదవులు మొదలు ఇతరత్రా పనుల కోసం మిత్రులే మోడీ ప్రాపకం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ కారణం వల్లే ఎన్డీయే మిత్రులు బెదిరింపులకు పోకుండా అసంతృప్తితో సరిపెట్టాయి.