
కొలంబో: శ్రీలంక రాజకీయాల్లో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రధానమంత్రిగా రణీల్ విక్రమసింఘేను తొలగించి.. ఆ స్థానంలో దేశ మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సేను నియమిస్తున్నట్టుగా సిరిసేన కార్యాలయం ప్రకటించింది. ఆ వెంటనే రాజపక్సే ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత కొంత కాలంగా సిరిసేన, విక్రమసింఘేల మధ్య కొనసాగుతున్న విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఈ నిర్ణయం వెలువడినట్టు తెలుస్తోంది.
గతంలో రాజపక్సే వద్ద మంత్రిగా పనిచేసిన సిరిసేన ఆయనతో విభేదించి 2015 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సిరిసేన పార్టీ మద్దతుతో యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) అధినేత రణీల్ విక్రమసింఘే 2015 జనవరిలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత విక్రమసింఘే తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు నుంచి ఆరోపణలు రావడంతో.. సిరిసేన అతని అధికారాలను తగ్గిస్తూ వచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో విక్రమసింఘే ఈ ఏడాది ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొవాల్సి వచ్చింది. బలపరీక్షలో విక్రమసింఘే విజయం సాధించినప్పటికీ.. సిరిసేన మాత్రం ఆయనతో విభేదిస్తూనే వస్తున్నారు. తాజాగా అధికార పార్టీకి మద్దతు ఉపసంహరించుకున్నట్టు సిరిసేన పార్టీ ప్రకటించింది.
కాగా, సిరిసేన నిర్ణయం రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీలంక రాజ్యాంగంలోని 19వ సవరణ ప్రకారం.. మెజారిటీ లేనిదే ప్రధానిని పదవి నుంచి తొలగించడానికి నిబంధనలు అంగీకరించవు. మరోవైపు 225 మంది సభ్యులన్న శ్రీలంక అసెంబ్లీలో యూఎన్‌పీకి 106 మంది, రాజపక్సే, సిరిసేనల పార్టీలకు కలిపి 95 మంది సభ్యులు ఉన్నారు.