కొలంబో: శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే(73) దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. గొటబయా రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకూ విక్రమసింఘే ఈ పదవిలో కొనసాగుతారు. మరోవైపు గొటబయా రాజీనామాను ఆమోదించినట్లు పార్లమెంట్ స్పీకర్ అబేయవర్దనే వెల్లడించారు. ప్రమాణ స్వీకారం అనంతరం విక్రమసింఘే పార్లమెంట్‌ను ఉద్దేశించి మాట్లాడారు.
దేశంలో శాంతి భద్రతలను కాపాడే విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. హింస, విధ్వంసాన్ని అరికట్టే అంశంలో సైనిక దళాలకు తగిన అధికారాలు, స్వేచ్ఛ కల్పించామన్నారు. దేశంలో హింసను ప్రేరేపించడానికి ఫాసిస్ట్ గ్రూప్‌లు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. తియుత ప్రదర్శనలు, నిరసనలకు తాను వంద శాతం మద్దతు ఇస్తానని అన్నారు. నిరసనకారులకు, విధ్వంసాలకు పాల్పడేవారికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని వ్యాఖ్యానించారు.
తాత్కాలిక అధ్యక్షుడిగా తన మొదటి కార్యాచరణ 19వ రాజ్యాంగ సవరణను పునరుద్ధరించడమేనని విక్రమసింఘే స్పష్టం చేశారు. ఇందుకోసం అతిత్వరలోనే ముసాయిదా సిద్ధం చేస్తామన్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడి అధికారాల్లో కోత విధించి, పార్లమెంట్‌కు ఎక్కువ అధికారాలు కల్పిస్తూ 2015లో 19వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఈ సవరణ వెనుక అప్పట్లో విక్రమసింఘే కీలకంగా వ్యవహరించారు. 2019 నవంబర్‌లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక గొటబయా రాజపక్స ఈ రాజ్యాంగ సవరణను రద్దు చేశారు.
తాత్కాలిక అధ్యక్షుడు విక్రమసింఘే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధ్యక్షుడిని ‘హిజ్ ఎక్సలెన్సీ’ అని గౌరవ సూచకంగా సంబోధించడాన్ని నిషేధించారు. ప్రెసిన్షియల్ జెండాను సైతం రద్దు చేశారు. దేశానికి జాతీయ జెండా ఒక్కటే ఉండాలన్నారు. అధ్యక్షుడి పేరిట మరో జెండా అక్కర్లేదన్నారు. నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం ఈ నెల 20న పార్లమెంట్‌లో ఓటింగ్ నిర్వహిస్తామని స్పీకర్ అబేయవర్దనే తెలియజేశారు. ఈ నెల 19న నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. అధ్యక్ష పదవి ఖాళీగా ఉందంటూ శనివారం పార్లమెంట్‌కు అధికారికంగా సమాచారం అందిస్తారు. శ్రీలంకలో పార్లమెంట్‌లో రహస్య ఓటింగ్ ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుంటుండడం 1978 తర్వాత ఇదే మొదటిసారి.
వచ్చే నెల 28 దాకా దేశం విడిచి వెళ్లొద్దు
శ్రీలంక మాజీ ప్రధానమంత్రి మహిందా రాజపక్స, ఆయన సోదరుడు, మాజీ ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్సకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జూలై 28వ తేదీ వరకూ దేశం విడిచివెళ్లొద్దని న్యాయస్థానం వారిని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment