బలం నిరూపించుకున్న ప్రధాని | Sri Lankan PM Ranil Wickremesinghe Easily Defeated No-Faith Vote | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 6 2018 8:24 AM | Last Updated on Wed, Oct 17 2018 6:18 PM

Sri Lankan PM Ranil Wickremesinghe Easily Defeated No-Faith Vote - Sakshi

శ్రీలంక ప్రధాని రణీల్‌ విక్రమసింఘే (ఫైల్‌ ఫొటో)

కొలంబో : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు అంటారు. ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణలు మారుతూనే ఉంటాయి. ఒక్కోసారి అంచనాలు తారుమారవుతాయి. శ్రీలంక ప్రధాని విషయంలో ఇదే జరిగింది. నిన్నటి వరకు సొంత పార్టీ నుంచి, మిత్ర పక్షాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్న రణిల్‌ విక్రమసింఘే.. రాజకీయ విశ్లేషకుల అంచనాలను తారుమారు చేస్తూ ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో అనూహ్య విజయం సాధించారు.

225 మంది సభ్యులున్న శ్రీలంక అసెంబ్లీలో 76 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా 122 మంది వ్యతిరేకించారు. 26 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అవిశ్వాసంలో నెగ్గాలంటే ప్రతిపక్షానికి కనీసం 96 నుంచి 101 ఓట్లు అవసరమైన నేపథ్యంలో కేవలం 76 ఓట్లే అనుకూలంగా రావడంతో ప్రధాని విక్రమసింఘే సునాయాసంగా విజయం సాధించారు. సొంత పార్టీ యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్న ప్రధాని.. పార్టీలో సంస్కరణలు చేపడతానని, యువతకు ప్రాధాన్యం కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఈవిధంగా ఆయన అవిశ్వాసం నుంచి తప్పించుకోగలిగారు.

ముందుంది అసలు సవాలు..
అవిశ్వాస తీర్మానంలో నెగ్గినప్పటికీ ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుతుందా లేదా అన్నది ప్రస్తుతం ప్రధాని ముందున్న అతిపెద్ద సవాలు. మిత్రపక్షమైన శ్రీలంక ఫ్రీడమ్‌ పార్టీకి చెందిన అధ్యక్షుడు సిరిసేన మైత్రిపాల ప్రధాని పట్ల వ్యవహరించిన తీరే ఇందుకు కారణం. ఆర్థిక మోసానికి పాల్పడ్డారనే ప్రతిపక్షాలు ఆరోపణల కారణంగా సిరిసేన ప్రధానికి ఉన్న అధికారాలను తగ్గించడంతో పాటు రాజీనామా చేయాల్సిందిగా ఆయనపై ఒత్తిడి పెంచారు. శ్రీలంక రాజ్యాంగంలోని 19వ సవరణ ప్రకారం.. ద్రవ్య బిల్లు, అవిశ్వాస తీర్మానాలపై జరిగే ఓటింగ్‌లో ప్రభుత్వంలో భాగమైన సభ్యులందరూ ఓటు హక్కు కోల్పోయినపుడు మాత్రమే ప్రధానిని తొలగించి ఆయన స్థానంలో కొత్తవారిని నియమించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. కేవలం ఈ కారణంగానే విక్రమసింఘేను పదవి నుంచి తొలగించలేకపోయారు. అయితే ఇపుడు  అధికార కూటమిలో భాగమైన అధ్యక్షుడు, ప్రధానులు తమ మధ్య తలెత్తిన విభేదాలు మర్చిపోయి కలిసి ముందుకు సాగితేనే ప్రభుత్వానికి ఏ ఢోకా ఉండదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
శ్రీలంక సెంట్రల్‌ బ్యాంకు(ఎస్‌సీబీ) బాండ్లకు సంబంధించిన అంశంలో ప్రధాని ఆర్థిక మోసానికి పాల్పడ్డారని, గత నెలలో సెంట్రల్‌ క్యాండీ జిల్లాలో జరిగిన ముస్లిం వ్యతిరేక అల్లర్లను నియంత్రించడంలో విఫలమయ్యారనే కారణంగా ప్రధాని రాజీనామా చేయాల్సిందిగా ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షమైన శ్రీలంక ఫ్రీడమ్‌ పార్టీ కూడా పట్టుబట్టింది. ఈ కారణంగానే అధ్యక్షుడు సిరిసేన మైత్రిపాల సిరిసేన ప్రధాని రణీల్‌ విక్రమ సింఘే బాధ్యతలను ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగా ప్రధాని ఆధీనంలో ఉండే సెక్యూరిటీ అండ్‌ ఎక్ఛ్సేంజ్‌ కమిషన్‌ను ఆర్థిక శాఖ పరిధిలోకి తీసుకురావడంతో పాటు శ్రీలంక సెంట్రల్‌ బ్యాంకుపై ప్రధానికి ఉన్న అధికారాలను కూడా తొలగించారు. ప్రధాని రాజీనామా చేయాల్సిందిగా కోరారు. కానీ ఆయన ఇందుకు నిరాకరించడంతో అధ్యక్షుడు కూడా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement