పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసిన 211 మంది
టొరంటో: అవిశ్వాస తీర్మానంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం నెగ్గింది. దీంతో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ పార్లమెంటులో బుధవారం ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 211 మంది సభ్యులు ఓటేయడంతో తీర్మానం వీగిపోయింది.
తీర్మానానికి మద్దతుగా కేవలం 120 మంది సభ్యులు ఓటేశారు. దీంతో విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ట్రూడో గెలుపు సులువైంది. పెరుగుతున్న ధరలు, గృహ సంక్షోభంపై అసంతృప్తితో ప్రజాదరణ తగ్గిపోయింది. దీనికి తోడు మాంట్రియల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ ఓటమి పాలైంది. న్యూ డెమొక్రటిక్ పార్టీ 2022లో చేసుకున్న ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ట్రూడో ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో ట్రూడో ప్రభుత్వం మైనారిటీలో పడింది.
2025 అక్టోబర్ చివరిదాకా ప్రభుత్వానికి కాలపరిమితి ఉన్నా మైనారిటీ సర్కార్ కావడంతో అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ పట్టుబట్టడం తెల్సిందే. ‘‘ఈ రోజు దేశానికి మంచి రోజు. కెనడా ప్రజలు ఎన్నికలను కోరుకుంటున్నారని నేను అనుకోవడం లేదు’’ అని ప్రభుత్వ వ్యవహారాల ఇంచార్జ్, సీనియర్ లిబరల్ పార్టీ నేత కరీనా గౌల్డ్ అన్నారు. వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతూ, సమస్య వారీగా చట్టం చేయబోతున్నామని ఆయన తెలిపారు.
ముందున్న సవాళ్లు..
అవిశ్వాసం నుంచి గట్టెక్కినా ట్రూడోకు ఇతర సవాళ్లు ఎదురవుతున్నాయి. తమ డిమాండ్లకు అంగీకరించకపోతే ప్రభుత్వాన్ని కూలదోస్తామని బ్లాక్ నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు లిబరల్స్ త్వరలో బడ్జెట్‌పై రెండో ఓటింగ్‌ను ఎదుర్కోనున్నారు. 2025 అక్టోబర్ నెలాఖరులో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో రైట్ ఆఫ్ సెంటర్ కన్జర్వేటివ్ పారీ్టకి భారీ ఆధిక్యం లభించింది. దీంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని తాము కోరుకుంటున్నామని కన్జర్వేటివ్‌లు చెబుతున్నారు. లిబరల్స్ పాలనలో ఫెడరల్ ఖర్చులు, నేరాలు పెరిగాయని విమర్శిస్తున్నారు.
మరోవైపు సీనియర్లకు ఎక్కువ నిధులు ఇస్తే కనీసం డిసెంబర్ నెలాఖరు వరకు ట్రూడోను అధికారంలో ఉంచుతామని, లేదంటే గద్దె దించుతామని బ్లాక్ నాయకులు హెచ్చరిస్తున్నారు. క్యూబెక్‌లో నివసిస్తున్న పాడి రైతులను రక్షించే సుంకాలు, కోటాల వ్యవస్థను పరిరక్షిస్తామని బ్లాక్ నాయకుడు వైవ్స్ ఫ్రాంకోయిస్ బ్లాంచెట్ అన్నారు. అక్టోబర్ 29లోగా ప్రభుత్వం అధికారికంగా ఈ పని చేయకపోతే ట్రూడోను గద్దె దించేందుకు విపక్షాలతో చర్చిస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇందులోనూ ఆయన విజయం సాధించాలంటే అవిశ్వాస తీర్మానం సందర్భంగా ట్రూడోకు మద్దతిచ్చిన న్యూ డెమొక్రటిక్ పార్టీ మద్దతు అవసరం.
Comments
Please login to add a commentAdd a comment