డిప్యూటీ మేయర్‌కు సైతం..
బల్దియా పాలకమండలికి నాలుగేళ్లు
పూర్తి కానున్న నేపథ్యంలో..
వచ్చే నెల 10వ తేదీ తర్వాత అవిశ్వాసానికి అవకాశం
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్(BRS Party) నుంచి కార్పొరేటర్‌గా గెలిచి మేయర్‌గా ఎంపికైన (GadwalVijayalakshmi)గద్వాల్ విజయలక్ష్మిని.. అలాగే డిప్యూటీ మేయరైన శ్రీలతా శోభన్‌రెడ్డిని పదవుల నుంచి తప్పించేందుకు ఆ పార్టీ వ్యూహం పన్నుతోందా? అంటే కాదనలేని పరిస్థితి నెలకొంది. బల్దియాలో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన విజయలక్ష్మి, శ్రీలతలకు అప్పటి ప్రభుత్వ ఆశీస్సులతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కాయి. అప్పట్లో ఎంఐఎం బీఆర్‌ఎస్‌కు అండగా నిలిచింది.
ఏడాది క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వీరిద్దరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తమ పార్టీ వల్ల అధికారం దక్కించుకున్న వారు పార్టీపై విశ్వాసం చూపలేదనే తలంపుతో బీఆర్‌ఎస్ నాయకత్వం ఉంది. తమ పార్టీ వల్లే పదవులు పొందిన వారు, పార్టీ మారినా రాజీనామా చేయకుండా ఇంకా పదవుల్లో కొనసాగుతుండటాన్ని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ కార్పొరేటర్లు సైతం కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న తమకు దక్కని యోగం.. వారికి దక్కడంపై అంతర్గతంగా జీర్ణించుకోలేకపోతున్నారు.
పార్టీలోకి వారి రాకతో తమ ప్రాధాన్యం తగ్గిపోయిందనే తలంపులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా వారిని ఆ పదవుల నుంచి తప్పించాలనే యోచనలో పలువురు కార్పొరేటర్లున్నారు. జీహెచ్‌ఎంసీ యాక్ట్ మేరకు పదవీ బాధ్యతలు చేపట్టాక నాలుగేళ్ల వరకు వారిపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు. జీహెచ్‌ఎంసీ పాలకమండలి ఎన్నికలు 2020 డిసెంబర్‌లో జరిగినప్పటికీ, మేయర్, డిప్యూటీ మేయర్‌లు 2021 ఫిబ్రవరి 11వ తేదీన బాధ్యతలు చేపట్టారు. వచ్చే ఫిబ్రవరి 10వ తేదీతో వారి నాలుగేళ్ల కాలం పూర్తవుతున్నందున, అది ముగియగానే అవిశ్వాసం పెట్టేందుకు కార్పొరేటర్లు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే..
నిబంధనల మేరకు అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మొత్తం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల్లో (స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) సగం మంది నిర్ణీత ప్రొఫార్మాలో తీర్మానం చేసి సంతకాలు పెట్టి జిల్లా కలెక్టర్‌కు అందజేయాలి. జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు, 50 మంది ఎక్స్‌అఫీíÙయో సభ్యులు వెరసీ.. మొత్తం 196 మంది ఉన్నారు. వీరిలో సగం అంటే 98 మంది సభ్యుల సంతకాలు అవసరం. బీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం 42 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు వెరసీ.. 71 మంది సభ్యుల బలం ఉంది.
అవిశ్వాసం పెట్టాలంటే మరో 27 మంది సభ్యులు అవసరం. గతంలోవలే ఎంఐఎం పొత్తు ఉంటే సాధ్యమయ్యేదే కానీ ప్రస్తుతం అది కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండటం తెలిసిందే. ఎంఐఎం లేదా బీజేపీతో కలిస్తేనే అవిశ్వాసం పెట్టేందుకు వీలవుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎలాంటి వ్యూహం ఆచరించనుందన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమని, ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందో, ఎప్పుడు ఉపసంహరించుకుంటుందో చెప్పలేమంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏం జరిగేందుకైనా ఆస్కారం ఉందంటున్నారు. అందుకు రాజకీయాల్లో గతంలో జరిగిన కొన్ని సంఘటనల్ని వారు ఉదహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేయర్ కురీ్చకి గండం పొంచి ఉందని అంటున్నారు. డిప్యూటీ మేయర్‌కు సైతం అదే వర్తిస్తుందంటున్నారు.
పార్టీలు మారారు ఇలా..
⇒ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తొలుత రెండు సీట్లు మాత్రమే గెలిచినప్పటికీ, లింగోజిగూడ బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేశ్‌గౌడ్ మృతితో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచి ముగ్గురయ్యారు. తర్వాత పరిణామాలతో బీజేపీ నుంచి ముగ్గురు, బీఆర్‌ఎస్ నుంచి 18 మంది చేరడంతో ఆ పార్టీ బలం 24కు పెరిగింది.
⇒ ఎంఐఎం 44 స్థానాల్లో గెలవగా ఒకరు మరణించారు. ఇద్దరు రాజీనామాలు చేయడంతో ప్రస్తుతం 41 మంది ఉన్నారు.
⇒ బీజేపీ 48 స్థానాల్లో గెలవగా ఆదిలోనే ఒకరు మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో ఓటమితో 47 మంది అయ్యారు. అనంతరం గుడిమల్కాపూర్ కార్పొరేటర్ మృతి చెందడం, కొందరు పార్టీలు మారడంతో ప్రస్తుత బలం 39గా ఉంది.
⇒ బీఆర్‌ఎస్ వారు 56 సీట్లలో గెలిచారు. బీజేపీ నుంచి నలుగురు పార్టీలో చేరడంతో బలం 60కి పెరిగినప్పటికీ.. అనంతరం 18 మంది కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో ప్రస్తుతం 42 మంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment