మోడీ ప్రమాణస్వీకారానికి అమితాబ్, రజనీ
బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్, దక్షిణాది సూపర్స్టార్ రజనీకాంత్, కండలవీరుడు సల్మాన్ ఖాన్, సీనియర్ గాయని లతా మంగేష్కర్.. వీళ్లంతా ఈనెల 26వ తేదీన జరిగే నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారు. ఈ సంవత్సరం జనవరిలో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మోడీని లతామంగేష్కర్ ఆశీర్వదించి.. విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇక సల్మాన్ ఖాన్ అహ్మదాబాద్లో గాలిపటాల ఉత్సవం సందర్భంగా మోడీని కలిశారు. సల్మాన్ తండ్రి, బాలీవుడ్ కథారచయిత సలీంఖాన్ ఎప్పటినుంచో మోడీ అభిమాని. ఇక ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖ కూడా మోడీ ప్రమాణస్వీకారానికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
దాదాపు 2500 మంది అతిథులు పాల్గొనే ఈ కార్యక్రమం ఎప్పటిలా అశోకా హాల్లో కాకుండా.. రాష్ట్రపతి భవన్ ముందున్న మైదానంలో జరగబోతోంది. ఉభయ సభలకు చెందిన మొత్తం 777 మంది ఎంపీలను రాష్ట్రపతి భవన్ ఆహ్వానించింది. మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, ఏపీజే అబ్దుల్ కలాంలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. మోడీ తల్లి హీరాబెన్, ఆయన ముగ్గురు సోదరులు కూడా వస్తారని అనుకుంటున్నా, ఇంకా నిర్ధారణ కాలేదు. కొత్త ప్రధాని 20 మంది అతిథులను, కొత్త మంత్రులు ఒక్కొక్కరు నలుగురి చొప్పున అతిథులను పిలవచ్చు.
కాగా, ఎప్పటిలా అశోకా హాల్లో కాకుండా, రాష్ట్రపతి భవన్ వెలుపల బహిరంగ ప్రదేశంలో ప్రమాణస్వీకారం చేస్తున్న ప్రధానమంత్రుల్లో మోడీ మూడో వారు. ఇంతకుముందు చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఇలాగే చేశారు.