ముంబై: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు. మచ్చ లేని వ్యక్తిత్వం కలిగిన వారు, దేశం కోసం త్యాగం చేయగలిగే వారికే ఓటేయాలని ఢిల్లీ పౌరులకు అన్నా హజారే విజ్ఞప్తి చేశారు. అలాగే, అప్రయోజకులకు ఓటు వేయవద్దని, అలాచేస్తే దేశం నాశనమవుతుందని హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
అన్నా హజారే శనివారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా అన్నా హజారే..‘త్వరలో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. స్వచ్ఛమైన వ్యక్తిత్వం, ఆలోచనలు కలిగిన వారు, సన్మార్గంలో నడిచేవారు, అవమానాలను దిగమింగి అవసరమైతే దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేవారికి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’అని పేర్కొన్నారు.
ఇదే సమయంలో ‘నేను తాగుతాను కాబట్టి, ఇది ఇతరులు కూడా తాగేందుకు అనుకూలంగా ఉంటుంది’ అనే వైఖరి ఎన్నికల ప్రక్రియలో పనికి రాదన్నారు. ఢిల్లీ కేంద్రంగా గతంలో అన్నా హజారే అవినీతి వ్యతిరేక ప్రచారం చేపట్టారు. ఆయనతో పోరాటంలో పాలుపంచుకున్న అరవింద్ కేజ్రీవాల్ అనంతర కాలంలో ఆప్‌ను స్థాపించి, ఢిల్లీ సీఎంగా ఎన్నికయ్యారు. అయితే, కేజ్రీవాల్ రాజకీయాల్లోకి ప్రవేశించడం హజారేకు ఇష్టంలేదు. ఆ తర్వాత పరిణామాల్లో ఇద్దరూ దూరమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment