Health Serious
-
సంగీత దర్శకుడు శ్రీ ఆరోగ్య పరిస్థితి విషమం
హైదరాబాద్: ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు చక్రవర్తి తనయుడు, యువ సంగీత దర్శకుడు శ్రీ అనారోగ్యంతో గురువారం రాత్రి కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. శ్రీ పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీ తెలుగులో 'గాయం, అమ్మోరు' తో పాటు దాదాపు 20 చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన పనిచేసిన చిత్రాల్లో అనగనగా ఒకరోజు, సింధూరం తదితర చిత్రాలు మంచి ప్రజాదరణ పొందాయి. శ్రీ సంగీతం అందించటంతో పాటు ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా పనిచేశారు. 2005లో విడుదలైన 'చక్రం' సినిమాలోని 'జగమంత కుటుంబం మాది..' పాటను పాడారు. శ్రీ ఎక్కువగా కృష్ణవంశీ చిత్రాలకు పనిచేశారు. ఈ యువ సంగీత దర్శకుడు తాజాగా గోపీచంద్ సాహసం చిత్రానికి పనిచేశారు. -
విషమించిన అన్నా హజారే ఆరోగ్యం!!
అన్నా హజారే ఆరోగ్యం విషమిస్తోంది. లోక్‌పాల్ బిల్లు కోసం పట్టుబడుతూ ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారంతో ఏడో రోజుకు చేరుకుంది. ఆయన బరువు 4.3 కిలోలు తగ్గిపోయారని అన్నా అనుచరుడు సురేష్ పఠారే తెలిపారు. అన్నా హజారే ఈనెల పదో తేదీ నుంచి నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం విషమించిందని జాతీయ వార్తా చానళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. లోక్‌పాల్ బిల్లుకు చేసిన సవరణలను అన్నా హజారే స్వాగతిస్తుండగా, ఒకప్పటి ఆయన అనుచరులు అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ లాంటివాళ్లు మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టినది లోక్‌పాల్ కాదు.. జోక్పాల్ అని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. అయితే, బిల్లు నచ్చకపోతే దానిపై నిరాహార దీక్ష చేపట్టాలంటూ ఆయనపై అన్నా హజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నాను కొందరు తప్పుదోవ పట్టించారని, అసలు ఈ బిల్లు ప్రతులన్నింటినీ అన్నా, ఆయన బృంద సభ్యులు ఎవరైనా చదివారా అని కిరణ్ బేడీ ట్వీట్ చేశారు. తాను నమ్మిన దాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా అన్నా ఆచరిస్తారని, మూడేళ్లుగా ఆయనను చూస్తూనే ఉన్నానని ఆమె చెప్పారు. అన్నా ఆరోగ్యం విషమించడంతో తాను ఢిల్లీ పర్యటనను మానుకుని అన్నాతోనే ఉన్నానని, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందేవరకు, అన్నా దీక్ష విరమించేవరకు ఇక్కడే ఉంటానని తెలిపారు. -
ఆందోళనకరంగా జగన్ ఆరోగ్యం
మూడు ప్రాంతాలకూ సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ ఆరు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరింత క్షీణించింది. చంచల్‌గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రి తరలించినా ఆయన దీక్ష వీడలేదు. వైద్యానికి ససేమిరా అంటున్నారు. ఆరు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో బాగా నిరసించిన జగన్ వెన్నునొప్పితో బాధపడుతున్నారని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. జగన్‌కు పల్స్ రేట్ గణనీయంగా తగ్గిందని, షుగర్ లెవల్స్ పడిపోయాయని వెల్లడించారు. దీక్ష కొనసాగిస్తే జగన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించే అవకాశముందని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసరంగా సమావేశమయింది. జగన్ దీక్ష విరమించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. జగన్ ఆరోగ్య పరిస్థితి పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని వైఎస్సార్ సీపీ నేత కొణతాల రామకృష్ణ తెలిపారు. జగన్ ఆరోగ్య పరిస్థితి పట్ల వైఎస్ విజయమ్మ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమారుడిని చూసేందుకు అనుమతించకపోవడం పట్ల ఆవేదన చెందారు. దీక్ష విరమించాలని జగన్‌ను కోరతానని చెప్పారు. మరోవైపు తమ అభిమాన నాయకుడిని చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు ఉస్మానియా ఆస్పత్రికి తరలివస్తున్నారు.