ఆందోళనకరంగా జగన్ ఆరోగ్యం
మూడు ప్రాంతాలకూ సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ ఆరు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరింత క్షీణించింది. చంచల్గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రి తరలించినా ఆయన దీక్ష వీడలేదు. వైద్యానికి ససేమిరా అంటున్నారు.
ఆరు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో బాగా నిరసించిన జగన్ వెన్నునొప్పితో బాధపడుతున్నారని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. జగన్కు పల్స్ రేట్ గణనీయంగా తగ్గిందని, షుగర్ లెవల్స్ పడిపోయాయని వెల్లడించారు. దీక్ష కొనసాగిస్తే జగన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించే అవకాశముందని వైద్యులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసరంగా సమావేశమయింది. జగన్ దీక్ష విరమించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. జగన్ ఆరోగ్య పరిస్థితి పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని వైఎస్సార్ సీపీ నేత కొణతాల రామకృష్ణ తెలిపారు.
జగన్ ఆరోగ్య పరిస్థితి పట్ల వైఎస్ విజయమ్మ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమారుడిని చూసేందుకు అనుమతించకపోవడం పట్ల ఆవేదన చెందారు. దీక్ష విరమించాలని జగన్ను కోరతానని చెప్పారు. మరోవైపు తమ అభిమాన నాయకుడిని చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు ఉస్మానియా ఆస్పత్రికి తరలివస్తున్నారు.