
నేటి నుంచి హజారే ఆమరణ దీక్ష
లోక్‌పాల్ బిల్లు కోసం డిమాండ్
సాక్షి, ముంబై: జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెడతామని చెప్పిన కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వం మోసం చేశాయని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ధ్వజమెత్తారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనట్లయితే 2014లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం మంగళవారం నుంచి ఆయన మరోసారి ఆమరణ నిరహార దీక్షకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్వగ్రామమైన అహ్మద్‌నగర్ జిల్లాలోని రాలేగావ్ సిద్ధి గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హజారే మాట్లాడుతూ... అపరిమితమైన అవినీతిని అదుపు చేయలేకపోయిన కాంగ్రెస్‌పై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెల్లడించాయన్నారు.
లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెడతామని సోనియాగాంధీ ఉత్తరం రాయడంతో విశ్వసించి గతంలో తాను చేపట్టిన ఆమరణ దీక్షను విరమించానని చెప్పారు. కానీ ఏడాదిగా రాజ్యసభలో బిల్లుపై చర్చను చేపట్టకుండా సోనియా, యూపీఏ ప్రభుత్వం తనను, ప్రజలను దారుణంగా మోసం చేశారన్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదంకోసం మంగళవారం నుంచి మరోసారి రాలేగావ్‌సిద్దిలోని యాదవ్‌బాబా మందిరంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నానని చెప్పారు. ఈ బిల్లు కోసం ప్రజలు అహింసమార్గంలో కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీపార్టీని అభినందించారు. ఆప్ విజయం దేశ రాజకీయాల్లో మార్పు తీసుకువస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.