హజారే ఉద్యమం వల్లే.. లోక్‌పాల్ చట్టం
న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకుడు అన్నా హజారేపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు కురిపించారు. హజారే నేతృత్వంలో పౌరసమాజం సాగించిన ఉద్యమం ఫలితంగానే లోక్‌పాల్ చట్టం వచ్చిందని ఆయన అన్నారు. దేశంలో ప్రజల భాగస్వామ్యంతో రూపొందిన తొలి చట్టం ఇదేనన్నారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీలో శనివారం ఏర్పాటైన 10వ నెహ్రూ స్మారకోపన్యాస కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ‘నెహ్రూ-పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే అంశంపై రాష్ట్రపతి మాట్లాడారు. లోక్‌పాల్ బిల్లు కోసం హజారే ఉద్యమం ప్రారంభించినప్పుడు పౌరసమాజం నుంచి ఆయనకు భారీ మద్దతు లభించిందని గుర్తు చేశారు.
ప్రణబ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
- చట్టాల రూపకల్పనలో పౌరసమాజం కీలక పాత్ర పోషించగలదని ‘లోక్‌పాల్’ ఉద్యమం చాటింది.
- {పజాస్వామిక వ్యవస్థలో ప్రజలే యజమానులు. రాజకీయ వ్యవస్థపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని ఎన్నికైన ప్రజాప్రతినిధులు వమ్ము చేయరాదు.
- రాజకీయాల్లోకి నేరచరితుల ప్రవేశం, అవినీతి ఆందోళనకరంగా మారాయి.
- సంచలన వార్తల కోసం పరుగులు తీసే మీడియా వ్యాప్తి, పౌరసమాజానికి చెందిన సంస్థల వంటి కొత్త శక్తులు రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయి.