పదేళ్లుగా చేస్తున్న నిర్వాకం చాల్లేదేమో... దిగిపోయే ఘడియల్లో కూడా యూపీఏ తెంపరితనాన్నే ప్రదర్శిస్తోంది. సంప్రదాయాలకూ, విలువలకూ నీళ్లొదిలి అడ్డదారిలో లోక్‌పాల్ నియామకానికి అది తహతహలాడిపోతోంది. లోక్‌పాల్‌ను ఎలాగైనా ఈ వారంలో ప్రతిష్టించాలని తెగ హడావుడి చేస్తోంది. ఒకపక్క సార్వత్రిక ఎన్నికలు ముగియడానికి పక్షం రోజుల సమయం ఉంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ఈ తరుణంలో కీలకమైన నియామకాలు చేయకూడదన్నది సంప్రదాయం. కానీ, యూపీఏ సర్కారు వీటన్నిటినీ తోసిరాజంటున్నది. ఇలాంటి వ్యవస్థ కోసం గత నాలుగున్నర దశాబ్దాలుగా పార్లమెంటులో ఏవేవో ప్రయత్నాలు జరిగినట్టు కనబడటం, చివరకు ఏమీ కాకుండానే ముగిసిపోవడం ఈ దేశ ప్రజలు చూశారు.
మూడేళ్లక్రితం అన్నా హజారే ఆధ్వర్యంలో జరిగిన అవినీతి నిర్మూలన పోరాటానికి అనూహ్యమైన స్పందన లభించాక రాజకీయ పక్షాలన్నీ ఈ విషయంలో ఇక తప్పించుకోలేకపోయాయి. పర్యవసానంగా రెండేళ్లనాడు బిల్లు ప్రవేశపెట్టినా... అందులో లొసుగుల సంగతలా ఉంచి, దాని ఆమోదానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో యూపీఏ సర్కారు విఫలమైంది. చివరాఖరికి లోక్‌పాల్‌ను అయిందనిపించినా దానికి అనుబంధంగా ఆమోదం పొందాల్సిన సిటిజన్స్ ఛార్టర్ బిల్లువంటివి ముందుకు కదలనేలేదు. ఇక లోక్‌పాల్‌కు నేతృత్వంవహించగల వ్యక్తిని ఎంపిక చేసేందుకు ఉద్దేశించిన సెర్చ్ కమిటీ ఏర్పడలేదు. అందులో తాముండేది లేదని కమిటీ చైర్మన్‌గా నిర్ణయించిన జస్టిస్ కేటీ థామస్, సభ్యుడు ఫాలీ ఎస్. నారిమన్‌లు ముందే ప్రకటించారు. ఎంపిక ప్రక్రియ తీరుపై వారు అనేక ప్రశ్నలు లేవనెత్తారు. సమర్ధుడైన, నిజాయితీపరుడైన వ్యక్తిని లోక్‌పాల్‌కు ఎంపిక చేయడం ఇప్పుడున్న నిబంధనల చట్రంలో సాధ్యంకాదని ఇద్దరూ చెప్పారు. సెర్చ్ కమిటీ ఎంతో ప్రయాసపడి ఎంపిక చేసినా చివరకు ఆ సిఫార్సులను ఎంపిక కమిటీ ఎలాంటి కారణాలూ చెప్పకుండా తోసిపుచ్చవచ్చునని వారన్నారు. సుప్రసిద్ధ న్యాయకోవిదులు ఇలాంటివి ఎత్తిచూపినప్పుడు సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం ప్రభుత్వ బాధ్యత. కనీసం ఆ అభ్యంతరాలు సహేతుకమైనవి కాదని అయినా నిరూపించగలగాలి. కానీ, సర్కారు ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయింది. సరికదా ఇన్ని లోటుపాట్లు పెట్టుకుని అధికారం మెట్లు దిగే సమయంలో ఎక్కడలేని తొందరా ప్రదర్శిస్తోంది.
లోక్‌పాల్ ఎంపిక కమిటీలో ప్రధాని, లోక్‌సభ స్పీకర్, లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన సూచించిన మరో న్యాయమూర్తి, సుప్రసిద్ధ న్యాయకోవిదులొకరు ఉంటారు. కమిటీకి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సదాశివం నామినేట్ చేశారు. ఈ కమిటీ 27, 28 తేదీల్లో సమావేశమై లోక్‌పాల్‌ను ఎంపిక చేయాలని ప్రధాని భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సెర్చ్ కమిటీ పాత్ర ఏమిటో తెలియదు. అది లేకుండానే, ఏమీ చెప్పకుండానే ఎంపిక కమిటీ ఎలా సమావేశమవుతుందో, లోక్‌పాల్‌ను ఎలా ఎంపిక చేస్తుందో అనూహ్యం. అసలు లోక్‌పాల్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ జారీచేసిన వాణిజ్య ప్రకటనే వింతగా ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతోసహా ఎవరైనా ఈ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చట. కానీ, తాము ఎందుకు అర్హులమో 200 పదాలు మించకుండా రాయాలట. పైగా, అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖుడితో ఒక సిఫార్సు లేఖనూ జతచేయాలట. ఆత్మగౌరవమున్నవారెవరైనా ఈ నిబంధనలను అవమానంగానే భావిస్తారు. తమ పనితీరుపై సిఫార్సు లేఖ ఇవ్వమని బయటివారిని దేబిరించలేరు. సెర్చ్ కమిటీ వ్యవహారంపైనా, ఇలాంటి వెర్రిమొర్రి నిబంధనలపైనా సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలై ఉంది. ఒకపక్క దానిపై సుప్రీంకోర్టు అభిప్రాయమేమిటో తెలియాలి. ఇటు ఎన్నికలూ పూర్తవ్వాలి. కానీ, కేంద్రం మాత్రం తన దోవన తాను పోదల్చుకున్నది. అందుకు అది చూపుతున్న సాకు వింతగా ఉన్నది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం స్తంభించిపోనక్కరలేదన్న ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని తన వాదనకు అరువు తెచ్చుకుంటోంది.
లోక్‌పాల్ ఏర్పాటు మరో నెలరోజులు ఆగడంవల్ల కొంపలు మునిగేదేమీ లేదు. అది ఏర్పడకపోతే ప్రభుత్వం స్తంభించే పరిస్థితీ లేదు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుంది. ఈలోగా లోక్‌పాల్ అర్హతకు సంబంధించిన నిబంధనలు, లోక్‌పాల్ ఎంపికలో సెర్చ్ కమిటీ పాత్ర, ప్రాముఖ్యత వంటివన్నీ తేలతాయి. వీటిని పక్కనబెట్టి, సంప్రదాయాలనూ తోసిరాజని చేసే నియామకంవల్ల ఆ పదవికి ఉండే పవిత్రతా, దాని ప్రధాన ఉద్దేశమూ దెబ్బతింటాయి. విశ్వసనీయత సైతం ప్రశ్నార్ధకమవుతుంది. ఈ తరహా చర్యలు ప్రభుత్వంలో ఉన్నవారి అపరిపక్వతను తెలియజేస్తాయి. తమకు అనుకూలుడైన వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెట్టేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్న సంకేతాలు వెళ్తాయి. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ ప్రభుత్వానికి మెజారిటీ లేదని చాన్నాళ్లక్రితమే వెల్లడైంది. ముఖ్యమైన బిల్లులన్నీ ప్రధాన ప్రతిపక్షం సహకారంతో గట్టెక్కించింది. పైగా రాగల ఎన్నికల్లో యూపీఏ ఓటమి ఖాయమని సర్వేలన్నీ చెబుతు న్నాయి. బీజేపీ ఇప్పటికే లోక్‌పాల్ విషయంలో ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలుస్తామంటున్నది. ఈ ప్రక్రియను ఆపాలంటూ సుప్రీంకోర్టులో సైతం పిటిషన్ దాఖలైంది. ఇప్పటికైనా యూపీఏ పెద్దలు విజ్ఞతను ప్రదర్శించాలి. హుందాగా వ్యవహరించి ఈ వివాదానికి ముగింపు పలకాలి.
లోక్‌పాల్‌పై నీలినీడలు!
Published Tue, Apr 22 2014 1:12 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement