
రాజ్యాంగాన్ని కాపాడండి: అరవింద్ కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంతో కయ్యానికి మరోసారి కాలుదువ్వారు. కాంగ్రెస్, కేంద్ర హోంశాఖ ప్రయోజనాలు కాపాడుతున్నారంటూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు ఘాటైన పదజాలంతో లేఖ రాశారు. అంతకుముందు కేంద్రం అనుమతి లేకుండా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందేమో తెలపాలంటూ సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ సలహా కోరారని, అది రాజ్యాంగ విరుద్ధమేనంటూ పరాశరన్ చెప్పారంటూ వార్తలు వచ్చాయి.
అసలు ఆ విషయం ఎలా బయటకు పొక్కిందంటూ కేజ్రీవాల్ ప్రశ్నించారు. బిల్లును పంపకమునుపే దాని రాజ్యంగబద్ధతపై న్యాయసలహా ఎందుకు తీసుకోవలసివచ్చిందంటూ తన మూడు పేజీల బహిరంగ లేఖలో నజీబ్ జంగ్‌ను నిలదీశారు. బిల్లు ఆమోదం పొందితే కాంగ్రెస్ నేతలు జైలుకు పోతారు కాబట్టి తనను, తన ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ద్వారా ఆ నేతలు మీడియాకు లీకులిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. పార్టీలను కాకుండా రాజ్యాంగాన్ని రక్షించాలని లేఖలో నజీబ్‌జంగ్‌ను కోరారు. రాజ్యాంగపరంగా అనుమతులు పొందకపోతే బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటామని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అర్విందర్ లవ్లీ చెప్పారు.
సీఎం కేజ్రీవాల్, ఆప్ నేతలు మనీష్ సిసోడియా, ప్రశాంత్‌భూషణ్, షాజియా ఇల్మిలకు సుప్రీంకోర్టు పరువునష్టం నోటీసులు జారీ చేసింది. కేంద్ర మంత్రి కపిల్‌సిబల్ కుమారుడు అమిత్ వేసిన పిటిషన్‌ను విచారించిన అనంతరం కోర్టు ఈ చర్య తీసుకుంది.