సుప్రీం చురకలతో దిగొచ్చిన ఢిల్లీ సర్కార్
సుప్రీం చురకలతో దిగొచ్చిన ఢిల్లీ సర్కార్
Published Thu, Oct 6 2016 2:03 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు చురకలతో దిగొచ్చిన ఢిల్లీ సర్కార్ దేశ రాజధానిని పట్టిపీడిస్తున్న డెంగ్యూ, చికెన్గున్యా వ్యాధులపై పోరాటానికి సిద్ధమైంది. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆరోగ్య శాఖా మంత్రి సత్యేంద్రజైన్లు అధికారులతో జాయింట్ మీటింగ్ నిర్వహించారు. విజృంభిస్తున్న ఈ వ్యాధుల నిర్మూలనపై తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు. విస్తృతంగా ప్రబలుతున్న డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులను పట్టించుకోకుండా... ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వంపై మండిపడింది. వ్యాధుల నివారణపై తగిన చర్యలు తీసుకోవాలని ఎల్జీకి, సీఎంకు ఆదేశించింది.
సుప్రీం ఆదేశాలతో ఈ వ్యాధుల నిర్మూలనపై ప్రతీవారం ఆరోగ్యశాఖ మంత్రి సమీక్ష నిర్వహించాలని సత్యేంద్ర జైన్ను నజీబ్ జంగ్ ఆదేశించారు. మరికొన్ని రోజుల్లో జంగ్ ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు చెప్పారు. ఎల్జీ నజీబ్ జంగ్ ఆదేశాలతో డివిజనల్ కమిషనర్ల చేత కూడా అన్ని ప్రాంతాల్లో సందర్శించి, వ్యాధులను అరికట్టే చర్యలు తీసుకుంటున్నట్టు మున్సిపల్ కమిషనర్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా జ్వరాలతో ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య తగ్గిందని ఆరోగ్య శాఖ అధికారులు ఎల్జీకి తెలిపారు.
ఖాళీగా ఉన్న ప్రతి నాలుగు బెడ్స్లో ఒకటి కచ్చితంగా జ్వరంతో బాధపడే వారికి కేటాయించే విధంగా ఆరోగ్య కార్యదర్శి చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తుగా అనారోగ్యం ఉన్నట్టు గుర్తించినవారికి, గర్భవంతులైన మహిళలకు ఈ వ్యాధులను నిరోధించడానికి అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు డాక్టర్లు చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ తాజా డేటా ప్రకారం ఇప్పటివరకు 2100 మంది ప్రజలకు డెంగ్యూ పాజిటివ్గా నమోదకాగ, చికెన్గున్యా కేసులు 6000లు క్రాస్ చేశాయి.
Advertisement
Advertisement