సీబీఐ కేసులో సుప్రీం బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. విచారణ పేరిట నిందితులను సుదీర్ఘ కాలం పాటు జైల్లో ఉంచడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాయడమేనని ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయొద్దని కేజ్రీవాల్‌కు షరతు విధించింది. సీబీఐ తీరును ఈ సందర్భంగా తప్పుబట్టింది.
ఈ ఉదంతానికి సంబంధించి ఈడీ కేసులో బెయిల్ లభించగానే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడాన్ని ప్రశ్నించింది. పంజరంలో చిలుకలా ప్రవర్తించొద్దంటూ చీవాట్లు పెట్టింది. కోర్టు తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. దాదాపు ఆరు నెలల కారాగారవాసం అనంతరం కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. మద్యం విధానం కుంభకోణం కేసులో గత మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచార నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మే 10న విడుదలైన ఆయన జూన్ 2 తిరిగి జైలుకు వెళ్లారు. అనంతరం ఈడీ కేసులో బెయిల్ మంజూరైనా సీబీఐ తిరిగి అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. బెయిల్ కోసం ముందుగా ట్రయల్ కోర్టుకు వెళ్లాలన్న సీబీఐ వాదనను తోసిపుచి్చంది. అన్ని కేసులకూ ఒకే నియమాన్ని వర్తింపజేయలేమని స్పష్టం చేసింది.
కేజ్రీవాల్‌కు షరతులివే...
మద్యం కుంభకోణం ఉదంతంలో సీబీఐ కేసుపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయరాదు.
లెఫ్టినెంట్ గవర్నర్ సంతకం అవసరమైన ఫైళ్లు మినహా మిగతా వాటిపై సంతకాలు చేయరాదు.
సీఎం కార్యాలయానికి, సచివాలయానికి వెళ్లడానికి వీల్లేదు (ఈ షరతులను తాజా తీర్పులో ధర్మాసనం సడలించింది. కానీ మే 10, జూలై 12 నాటి తీర్పుల్లో సుప్రీంధర్మాసనం ఈ రెండు షరతులనూ విధించింది. వాటిని విస్తృత ధర్మాసనం మాత్రమే రద్దు చేయగలదని ఆ సందర్భంగా పేర్కొంది. దాంతో అవి అమల్లోనే ఉండనున్నాయి)
ట్రయల్ కోర్టు విచారణ అన్నింటికీ హాజరు కావాలి.
విచారణ త్వరగా పూర్తయేందుకు సహకరించాలి.
పంజరంలో చిలుక కావొద్దు
సీబీఐకి జస్టిస్ భూయాన్ హితవు
ఈడీ కేసులో బెయిల్ షరతులను
తప్పుబట్టిన న్యాయమూర్తి
విడిగా 33 పేజీల తీర్పు
కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరుపై న్యాయమూర్తులిద్దరూ ఏకాభిప్రాయం వెలిబుచి్చనా పలు ఇతర అంశాలపై జస్టిస్ భూయాన్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేయడంలో తనకెలాంటి అసంబద్ధతా కన్పించడం లేదని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొనగా జస్టిస్ భూయాన్ మాత్రం ఆ అభిప్రాయంతో తీవ్రంగా విభేదిస్తూ విడిగా 33 పేజీల తీర్పు రాశారు. కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన సమయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
ఇంకా ఏమన్నారంటే...
→ ఈ కేసులో 22 నెలలుగా ఊరికే ఉన్న సీబీఐకి, ఈడీ కేసులో బెయిల్ వచి్చన వెంటనే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచి్చంది?
→ బెయిల్‌ను అడ్డుకోవడమే దీని వెనక ఉద్దేశంగా కని్పస్తోంది.
→ ప్రశ్నలకు సమాధానం దాటవేస్తున్నారు గనుక నిర్బంధంలో ఉంచాల్సిందేనన్న వాదన సరికాదు.
→ సహాయనిరాకరణ చేసినంత మాత్రాన నిర్బంధం కూడదు. నిందితునికి మౌనంగా ఉండే హక్కుంటుంది.
→ బలవంతంగా నేరాంగీకారం రాబట్టే ప్రయత్నాలు
కచ్చితంగా చట్టవిరుద్ధమే.
→ ఇవే అభియోగాలపై ఈడీ కేసులో బెయిల్ మంజూరయ్యాక కూడా జైల్లోనే ఉంచజూడటం అక్రమం.
→ సీజర్ భార్య నిందలకు అతీతంగా ఉండాలన్న సామెత సీబీఐకి పూర్తిగా వర్తిస్తుంది. అత్యున్నత దర్యాప్తు సంస్థగా నిజాయితీగా వ్యవహరించడమే కాదు, అలా కని్పంచడం కూడా చాలా ముఖ్యం. ఏకపక్ష పోకడలు పోతోందన్న అభిప్రాయం కలగకుండా జాగ్రత్త పడాలి.
→ సీబీఐని పంజరంలో చిలుకగా ఇదే న్యాయస్థానం ఇటీవలే ఆక్షేపించింది. అది తప్పని, తాను స్వేచ్ఛాయుత చిలుకనని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థదే
→ సీఎం కార్యాలయంలోకి వెళ్లొద్దని, ఫైళ్లపై సంతకాలు చేయొద్దని ఈడీ కేసులో బెయిల్ సందర్భంగా కేజ్రీవాల్‌కు కోర్టు విధించిన షరతులపై నాకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. కాకపోతే న్యాయపరమైన క్రమశిక్షణను గౌరవిస్తూ వాటిపై నేను ఎలాంటి వ్యాఖ్యలూ
చేయదలచుకోలేదు!
నా పోరు ఆగదు
జైలు నా స్థైర్యాన్ని పెంచింది: కేజ్రీవాల్
‘‘జైల్లో పెట్టి నన్ను కుంగదీయాలని, నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చూశారు. కానీ జైలు గోడలు, ఊచలు నన్నేమీ చేయలేకపోగా నా మనోబలాన్ని వెయ్యి రెట్లు పెంచాయి. నా జీవితంలో ప్రతి క్షణం, ఒంట్లోని ప్రతి రక్తపు చుక్కా దేశసేవకే అంకితం. జాతి వ్యతిరేక శక్తులపై నా పోరు ఆగబోదు’’ అని కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం ఆయన తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఆప్ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.
అనంతరం భారీ వర్షంలోనే చండ్గీరాం అఖాడా నుంచి తన అధికారిక నివాసం దాకా కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు. ‘జైలు తాళాలు విరిగి పడ్డా యి. కేజ్రీవాల్ విడుదలయ్యారు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వారికి ఆయన అభివాదం చేశారు. వర్షంలో తడుస్తూనే వాహనం పై నుంచి వారినుద్దేశించి మాట్లాడారు. ‘‘జాతి వ్యతిరేక శక్తులతో తలపడ్డందుకే నన్ను జైల్లో పెట్టారు తప్ప తప్పు చేశానని కాదు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దేశాన్ని బలహీనపరిచేందుకు, విడదీసేందుకు జాతి వ్యతిరేక శక్తులు కుట్రలు చేస్తున్నాయి.
ఈసీని బలహీనపరిచేందుకు, ఈడీ, సీబీఐలను పూర్తిగా చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటిని పూర్తిస్థాయిలో ఎదుర్కొందాం. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. అయినా ప్రతి దశలోనూ దైవం నాకు దన్నుగా నిలిచింది. నేను సత్యమార్గంలో నడవడమే అందుకు కారణం’’ అన్నారు. అంతకుముందు కేజ్రీవాల్‌కు బెయిల్ లభించగానే ఆప్ ప్రధాన కార్యాలయం వద్ద, ఆయన నివాసం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. కేజ్రీ భార్య సునీత తదితరులు వాటిలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment