కేజ్రీవాల్ - జంగ్ భాయీ భాయీ!
కేజ్రీవాల్ - జంగ్ భాయీ భాయీ!
Published Fri, Dec 23 2016 11:01 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM
అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఇంటికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెళ్లారు. విషయం ఏమిటని అడిగితే.. తనను ఆయన బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి పిలిచారని చెప్పారు. జంగ్ నివాసమైన రాజ్‌నివాస్‌కు కేజ్రీవాల్ స్వయంగా వెళ్లి.. ఆయనకు శుభాభినందనలు తెలిపారు. తాను ఎందుకు రాజీనామా చేశానన్న విషయాన్ని నజీబ్ జంగ్ చెప్పకపోయినా.. ఆయన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని కేజ్రీవాల్ ఈరోజు అన్నారు.
నజీబ్‌జంగ్ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఆయనకు, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఏమాత్రం పడేది కాదు. ఇద్దరి మధ్య పరిస్థితి ఉప్పు-నిప్పు అన్నట్లు ఉండేది. కానీ ఒక్కసారిగా అనూహ్యంగా నజీబ్ జంగ్ రాజీనామా చేయడంతో ఒకింత షాకైనా, ఆ నిర్ణయాన్ని కేజ్రీవాల్ స్వాగతించినట్లే కనిపించింది. ఢిల్లీ దేశ రాజధానే అయినా, దానికి పూర్తి రాష్ట్రహోదా లేదు. కొన్ని అంశాల్లో కేంద్ర హోం మంత్రిత్వశాఖదే అధికారం ఉంటుంది. ప్రధానంగా భూ వ్యవహారాలు, శాంతిభద్రతలలో కేంద్రానిదే పైచేయి. లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడ పరిపాలనా బాధ్యతలను చూస్తుంటారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను నజీబ్ జంగ్ తిరస్కరించారు. ప్రభుత్వానికి ఆ అధికారం లేదని చెప్పారు. తన ప్రభుత్వాన్ని ఏపనీ చేయనివ్వకుండా జంగ్ అడ్డుకుంటున్నారని, కేంద్రమే అలా చేయిస్తోందని కేజ్రీవాల్ ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. కానీ అలాంటిది ఒక్కసారిగా ఆయన రాజీనామా చేసిన తర్వాత మాత్రం ఇప్పుడు ఇంటికి వెళ్లి టీ తాగి టిఫిన్ చేసి మరీ వచ్చారు!!
Advertisement
Advertisement