
‘లోక్‌పాల్’పై కేంద్రానిది ప్రజాస్వామ్య వంచన: అన్నా హజారే
రాలెగావ్ సిద్ధి (మహారాష్ట్ర): పటిష్ట లోక్‌పాల్ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని మోసం చేస్తోందని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే దుయ్యబట్టారు. కేంద్రం పార్లమెంటులో లోక్‌పాల్ బిల్లును వెంటనే ఆమోదించాలంటూ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన హజారే గురువారం తన దీక్ష మూడో రోజు ఈ అంశంపై ప్రధాని కార్యాలయానికి (పీఎంవో) లేఖ రాశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలైనా సమావేశాల ఎజెండాలో బిల్లు ప్రస్తావన లేదని, ఇది తనను, దేశ ప్రజలను వంచించడమేనంటూ పీఎంవోలో సహాయ మంత్రి వి. నారాయణసామికి పంపిన లేఖలో మండిపడ్డారు.
దీక్ష విరమించాలంటూ నారాయణసామి చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు. ప్రభుత్వం పార్లమెంటులో లోక్‌పాల్ బిల్లును ఆమోదించే వరకూ దీక్షను విరమించబోనని తేల్చిచెప్పారు. దేశం కోసం అత్యున్నత త్యాగం చేసేందుకు కూడా సిద్ధమన్నారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత కుమార్ విశ్వాస్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం గురువారం హజారేను కలిసి దీక్షకు మద్దతు తె లిపింది. ఆప్ అగ్ర నేత అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యం వల్ల హజారేను కలిసేందుకు రాలేకపోయారని విశ్వాస్ పేర్కొన్నారు.