లోక్‌పాల్ కు రాజ్యసభ ఆమోదం | lokpal bill approved by cabinet | Sakshi
Sakshi News home page

లోక్‌పాల్ కు రాజ్యసభ ఆమోదం

Published Wed, Dec 18 2013 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

లోక్‌పాల్ కు రాజ్యసభ ఆమోదం

లోక్‌పాల్ కు రాజ్యసభ ఆమోదం

ఐదు గంటల సుదీర్ఘ చర్చ తర్వాత మూజువాణి ఓటుతో పచ్చజెండా  
 నేడు లోక్‌సభకు బిల్లు
 
 లోక్‌పాల్ ప్రస్థానమిదీ..
     2011, డిసెంబర్ 11: బిల్లుకు లోక్‌సభ ఆమోదం
     డిసెంబర్ 29: రాజ్యసభ ముందుకు బిల్లు. అసంపూర్తిగా ముగిసిన చర్చ
     2012, మే 2: బిల్లును రాజ్యసభ ఎంపిక కమిటీకి పంపిన ప్రభుత్వం
     2012, నవంబర్ 23: నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన ఎంపిక కమిటీ
 
 న్యూఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది.. చరిత్రాత్మకమైన లోక్‌పాల్ బిల్లుకు రాజ్యసభ ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. సమాజ్‌వాది పార్టీ తప్ప పాలక, ప్రతిపక్షాలు ఒక్కతాటిపైకి రావడంతో బిల్లు గట్టెక్కింది. మంగళవారం ఏకధాటిగా ఐదు గంటలపాటు సాగిన చర్చ అనంతరం రాజ్యసభ మూజువాణి ఓటుతో ‘లోక్‌పాల్, లోకాయుక్తల ఏర్పాటు బిల్లు-2011’ను ఆమోదించింది. మూడు మినహా రాజ్యసభ ఎంపిక కమిటీ చేసిన సిఫారసులన్నింటికీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందులో ముఖ్యమైంది లోక్‌పాల్ నుంచి లోకాయుక్తలను విడదీయడం. కిందటేడాది బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చినప్పుడు ప్రతిపక్షాలు ప్రధానంగా దీనిపైనే అభ్యంతరం తెలిపాయి. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం లోక్‌పాల్ ఏర్పాటైన సంవత్సరం లోపు రాష్ట్రాలు.. లోకాయుక్తలను ఏర్పాటు చేస్తూ చట్టం తీసుకురావాల్సి ఉంటుంది. అవినీతిపై అంకుశంగా భావిస్తున్న ఈ బిల్లు గత రెండేళ్లుగా రాజ్యసభలోనే ఉంది. ప్రస్తుతం సభ ఆమోదించడంతో బిల్లు బుధవారమే లోక్‌సభ ముందుకు రానుంది. కొన్ని పరిమితులు మినహా ప్రధానమంత్రి, ఎంపీలు, ప్రభుత్వ అధికారులతోపాటు పలు సంస్థలు లోక్‌పాల్ పరిధిలోకి వస్తాయి.
 
 లోకాయుక్తలపై ఎలాంటి నిర్దేశాలు చేయబోం..
 రాజ్యసభ ప్రారంభం కాగానే కేంద్రమంత్రి కపిల్ సిబల్ బిల్లు ప్రవేశపెట్టి, చర్చను ప్రారంభించారు. అంతకుముందు బిల్లును వ్యతిరేకిస్తున్న ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్‌తో ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, హోంమంత్రి షిండే సమావేశమయ్యారు. బిల్లుకు మద్దతివ్వాల్సిందిగా కోరారు. బిల్లు ప్రవేశపెట్టగానే ఎస్పీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం చర్చ సజావుగా సాగింది. చర్చ సందర్భంగా మంత్రి సిబల్ మాట్లాడుతూ.. ‘‘ఇది చరిత్రాత్మకమైన రోజు. లోక్‌పాల్‌కు అనుగుణంగా రాష్ట్రాలన్నీ లోకాయుక్తల చట్టాలను తెస్తాయని ఆశిస్తున్నా. లోకాయుక్తల ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఎలాంటి నిర్దేశాలు చేయబోదు’’ అని చెప్పారు. చట్టం చేయడం వల్లే అవినీతిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని, అయితే అవినీతిపరులను కట్టడి చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సభలో ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. బిల్లుకు తాము మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రస్తుత  పరిస్థితులకు అనుగుణంగా బిల్లులో ప్రభుత్వం మార్పులు తేవడంపై హర్షం వ్యక్తంచేశారు. ఎలాంటి పరిమితులు లేకుండా ప్రధానమంత్రిని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావాలని బీజేపీ మరో సభ్యుడు రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. బిల్లును 2011లోనే తీసుకురావాల్సిందని అభిప్రాయపడ్డారు.
 
 ప్రైవేటు సంస్థలపై ఓటింగ్: లోక్‌పాల్ పరిధిలోకి ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రైవేటు సంస్థలను కూడా తీసుకురావాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రతిపాదించారు. కాంట్రాక్టుల కోసం ప్రభుత్వ అధికారులకు ప్రైవేటు సంస్థలు లంచాలు ఇస్తున్నందున, దీన్ని కూడా లోక్‌పాల్‌కు అప్పగించాలని డిమాండ్ చేశా రు. లంచం డిమాండ్ చేసేవారితోపాటు ఇచ్చేవారి నుంచి కూడా దర్యాప్తు చేస్తే అవినీతికి అడ్డుకట్ట పడుతుందన్నారు. దీంతో ఆయన తీర్మానంపై సభలో ఓటింగ్ నిర్వహించారు. అయితే 151-19 ఓట్ల తేడాతో తీర్మానం వీగిపోయింది.
 
 బిల్లులో ముఖ్యమైన మార్పులివీ..
 
     లోక్‌పాల్‌తోపాటు అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా లోకాయుక్తాలను ఏర్పాటు చేయాలన్న నిబంధనను సడలించారు. లోక్‌పాల్ ఏర్పడిన ఏడాదిలోపు రాష్ట్రాలు అసెంబ్లీల్లో చట్టాల ద్వారా లోకాయుక్తాలను ఏర్పాటు చేసుకోవాలని రాజ్యసభ ఎంపిక కమిటీ సూచించింది. ప్రభుత్వం ఆమోదించింది.
 
     లోక్‌పాల్ ఏదైనా కేసును సీబీఐకి అప్పగిస్తే.. ఆ కేసులో లోక్‌పాల్ అనుమతి లేకుండా దర్యాప్తు అధికారిని బదిలీ చేయరాదన్న సిఫారసుకు సర్కారు ఒప్పుకుంది. ఇంతకుముందు ఈ సిఫారసును ప్రభుత్వం తోసిపుచ్చింది.
 
     ఆరోపణలు ఎదుర్కొనే అధికారిపై విచారణకు అనుమతిచ్చే అధికారాన్ని లోక్‌పాల్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం అప్పగించింది.
 
     లోక్‌పాల్‌ను ఏర్పాటు చేసే విధానంలో కూడా స్వల్ప మార్పులు చేశారు. ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన నలుగురు సభ్యుల కమిటీ లోక్‌పాల్ సభ్యులను ఎంపిక చేస్తారు. ఈ నలుగురు సూచించిన ఒక న్యాయ నిపుణుడు కూడా రాష్ట్రపతి ఆమోదంతో సెలక్ట్ కమిటీలో సభ్యుడిగా ఉంటారు.
 
     ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగిపై ప్రాథమిక దర్యాప్తు మొదలయ్యే వరకు.. ఆయన/ఆమెకు తన వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వరాదన్న ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది.  
     {పజల నుంచి విరాళాలు స్వీకరించే వివిధ సంస్థలను లోక్‌పాల్ నుంచి మినహాయించాలని సెలక్ట్ కమిటీ సిఫారసు చేయగా, ప్రభుత్వం తిరస్కరించింది. సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదైన సంస్థలకు మాత్రమే లోక్‌పాల్ నుంచి మినహాయింపును కల్పించింది.
 
 బిల్లులో మరిన్ని ముఖ్యాంశాలు: లోక్‌పాల్ సభ్యులు ఏ పార్టీకి చెందనివారై ఉండాలి. సుప్రీంకోర్టు మధ్యంత ఉత్తర్వులు లేదా సిఫారసు మేరకు రాష్ట్రపతి.. లోక్‌పాల్ సభ్యుడిని తొలగించవచ్చు. రాష్ట్రపతి సూచన మేరకు సుప్రీం దర్యాప్తు చేయవచ్చు. అయితే సదరు సభ్యుడిపై దర్యాప్తు చేయాలని కోరుతూ కనీసం 100 మంది ఎంపీల సంతకంతో కూడిన నివేదిక రాష్ట్రపతికి చేరాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement