లోక్పాల్ బిల్లును రాజ్యసభలో వెంటనే చర్చిస్తాం: షిండే
అవినీతిని అంతం చేసే లోక్పాల్ బిల్లును రాజ్యసభలో వీలైనంత వెంటనే చర్చకు చేపడతామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. రాలెగావ్ సిద్ధి గ్రామంలో అన్నాహజారే ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకున్న నేపథ్యంలో షిండే హడావుడిగా ఈ ప్రకటన చేశారు. లోక్పాల్ బిల్లును వెనువెంటనే రాజ్యసభలో చర్చకు చేపట్టాలని సెలెక్ట్ కమిటీ ఇప్పటికే నోటీసు కూడా ఇచ్చిందన్నారు.
ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి వి.నారాయణ సామి నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ ఈ మేరకు నోటీసు పంపినట్లు షిండే చెప్పారు. లోక్పాల్ బిల్లును లోక్సభ ఇప్పటికే ఆమోదించి, రాజ్యసభకు పంపింది. రాజ్యసభలోని సెలెక్ట్ కమిటీ బిల్లుకు 13 సవరణలు సూచించింది. వాటిని ప్రభుత్వం పరిశీలిస్తోందని షిండే తెలిపారు. లోక్పాల్ బిల్లును వెంటనే అమలు చేయాలన్న ఏకైక డిమాండుతో అన్నా హజారే మళ్లీ ఆమరణ దీక్ష ప్రారంభించడం వల్లే సర్కారులో కదలిక వచ్చిందని అంటున్నారు.