న్యూఢిల్లీ: లోక్‌పాల్ బిల్లును ఈనెల 16న (సోమవారం) రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనిని ఆమోదించాలని ప్రభుత్వం మనస్ఫూర్తిగా కోరుకుంటోందని, ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అంశాల జాబితాలో దీనిని చేర్చడమే ఇందుకు నిదర్శనమని కేంద్ర మంత్రి హరీష్ రావత్ గురువారం మీడియాతో అన్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్, దీనిని శుక్రవారమే రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నామని, తర్వాత ఇది లోక్‌సభ ముందుకు వస్తుందని చెప్పారు. అయితే, శుక్రవారం ప్రైవేటు సభ్యుల చర్చల కోసం సమయాన్ని కేటాయించడం వల్ల లోక్‌పాల్ బిల్లును సోమవారం ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటు వర్గాలు తెలిపాయి. దీనిపై చర్చ కోసం ఆరు గంటల సమయాన్ని కేటాయించినట్లు తెలిపాయి. లోక్‌పాల్ సహా కీలకమైన బిల్లుల ఆమోదంపై ప్రభుత్వానికి ఆసక్తి లేదంటూ బీజేపీ నేత అరుణ్ జైట్లీ చేసిన ఆరోపణను కాంగ్రెస్ తోసిపుచ్చింది.
శాసన వ్యవహారాలను ముందుకు తీసుకుపోవడంపై ప్రభుత్వానికి ఆసక్తి లేదనే అభిప్రాయాన్ని కలిగించేందుకు విపక్షంలో కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని కమల్‌నాథ్ అన్నారు. సభ సజావుగా సాగేందుకు అధికార పార్టీతో పాటు విపక్షానికీ సమానమైన బాధ్యత ఉందని ఆయన అన్నారు. మరోవైపు, అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నా హజారే లోక్‌పాల్ బిల్లు కోసం మూడు రోజులుగా నిరవధిక దీక్ష కొనసాగిస్తున్నందున ప్రభుత్వం ఒత్తిడి ఎదుర్కొంటోంది. ప్రస్తుత సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెడతామని ప్రభుత్వం ఆయనకు హామీ ఇచ్చింది. అయితే, సమావేశాలను కుదించడం ద్వారా లోక్‌పాల్ బిల్లును ఆమోదానికి నోచుకోకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోందని బీజేపీ నేత సుష్మా స్వరాజ్ ఆరోపించారు. ఏమాత్రం జాప్యం లేకుండా, ఈ బిల్లును ప్రవేశపెట్టాలని తమ పార్టీ కోరుకుంటోందని ఆమె చెప్పారు.
ఇదిలా ఉండగా, లోక్‌పాల్ బిల్లుకు మద్దతు ప్రకటించనున్నట్లు జేడీయూ, ఎన్సీపీలు ప్రకటించగా, రాజ్యసభలో దీనిని వ్యతిరేకించనున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. లోక్‌పాల్ బిల్లుపై రాజ్యసభ సెలెక్ట్ కమిటీ 2012 డిసెంబర్ 23న నివేదిక సమర్పించినా, ఇంతవరకు దానిని ప్రవేశపెట్టకపోవడం వెనుక ప్రభుత్వానికి గల ఉద్దేశాలపై అనుమానాలు కలుగుతున్నాయని బీజేపీ నేత అరుణ్ జైట్లీ అన్నారు. అయితే, మంత్రి రావత్ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, లోక్‌పాల్ సహా అన్ని అంశాలపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.