ఉన్నత స్థాయి అధికార వ్యవస్థల్లో అవినీతిని అంతమొందించేందుకు ఉద్దేశించిన లోక్‌పాల్ సుదీర్ఘ కాలం తర్వాత సాకారమైంది. తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్‌ను నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉత్తర్వులు వెలువరించారు. ఆయ నతోపాటు 8మంది సభ్యుల్ని కూడా నియమించారు. ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీలతో కూడిన ఎంపిక కమిటీ శుక్రవారం సమావేశమై వీరి పేర్లను ఖరారు చేసింది. అయితే ఎంపిక కమిటీ తొలి సమావేశం వివాదం లేకుండా ముగియలేదు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే తనను కమిటీ సభ్యుడిగా కాక ‘ప్రత్యేక ఆహ్వానితుడి’గా పిల వడంపై అభ్యంతర వ్యక్తం చేసి సమావేశాన్ని బహిష్కరించారు. ఆహ్వానితుడిగా హాజరైతే ఆయ నకు ఓటింగ్ హక్కు ఉండదు. ఆయన అభ్యంతరాలేవీ మినిట్స్‌లో నమోదు కావు. లోక్‌పాల్ ఎంపి కలో ఎలాంటి పాత్ర లేనప్పుడు తాను హాజరుకావడంలో అర్ధమేముందన్నది ఖర్గే ప్రశ్న. ఇది సహే తుకమైనదే.
ఈ దేశంలో లోక్‌పాల్ అవసరాన్ని గుర్తించి, దానికోసం ఉద్యమం ప్రారంభించి యాభైయ్యేళ్లు కావస్తోంది. ఆ తర్వాత అది క్రమేపీ నీరసించింది. దానికోసం ఎవరెన్నిసార్లు డిమాండ్ చేసినా ఏ ప్రభుత్వమూ పట్టించుకున్న దాఖలా లేదు. కానీ యూపీఏ ఏలుబడిలో వరసబెట్టి జరిగిన కుంభ కోణాల తర్వాత 2010లో అన్నా హజారే నాయకత్వంలో మొదలుపెట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం లోక్‌పాల్ కోసం గట్టిగా పట్టుబట్టింది. అది కూడా త్వరలోనే చల్లబడుతుందని వేసిన అంచనాలన్నీ తలకిందులై దేశవ్యాప్తంగా దాని ప్రభావం పెరుగుతుండటాన్ని గమనించాక యూపీఏ సర్కారు 2013 డిసెంబర్‌లో ఎట్టకేలకు లోక్‌పాల్ బిల్లు తీసుకొచ్చింది. ఉభయసభల్లోనూ అది ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత 2014 జనవరి 1న చట్టంగా కూడా మారింది. అయితే ఆనాటి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్న బీజేపీ కేంద్రంలో ఏర్పడ్డ ఎన్‌డీఏ ప్రభుత్వానికి నేతృత్వంవహించినా గత అయిదేళ్లుగా అనేక కారణాల వల్ల లోక్‌పాల్ వ్యవస్థ అమల్లోకి రాలేదు.
ముఖ్యంగా చట్టంలో పేర్కొన్నవిధంగా ప్రతిపక్ష నాయ కుడి హోదాలో ఎవరూ లేకపోవడం సాంకేతిక అవరోధంగా మారిందని కేంద్ర ప్రభుత్వం రెండేళ్లక్రితం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీన్ని అధిగమించడానికి చట్టాన్ని సవరిస్తామని, ఆ తర్వాత లోక్‌పాల్ ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించింది. అయితే ఈ వాదనను సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. లోక్‌పాల్ ఏర్పాటుకు అది తుది గడువు విధించడంతో కేంద్రానికి ఇక తప్ప నిసరైంది. కనుకనే ఇన్నాళ్లకైనా లోక్‌పాల్ ఏర్పడింది.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా అవినీతి తారస్థాయిలో పెరిగిపోయిన వర్తమాన తరుణంలో లోక్‌పాల్ ఏర్పాటు ఒక పెద్ద ముందడుగనే చెప్పాలి. రాష్ట్రాల్లో ఇప్పటికే లోకాయుక్తలు ఏర్పాటైతే సరేసరి. లేనట్టయితే ఈ చట్టంకింద వాటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దేశంలో తెలంగాణతో సహా డజను రాష్ట్రాలు ఇంకా లోకాయుక్తలు, ఉపలోకాయుక్తల నియామకాలు పూర్తి చేయాల్సి ఉంది. ప్రధాని పదవిలో ఉన్నవారి నుంచి మొదలుకొని కేంద్రమంత్రులు, ఎంపీలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు వగైరాలపై వచ్చే అవినీతి ఆరోపణలను లోక్‌పాల్ పరిశీలించి అవసరమైతే సీబీఐతోసహా వివిధ సంస్థలతో దర్యాప్తునకు ఆదేశించవచ్చు. అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై ప్రాసిక్యూషన్ చర్యకు అనుమతించవచ్చు.
పదవిలో కొనసాగుతున్నవారు మాత్రమే కాదు... మాజీ ప్రధానులు, మాజీ కేంద్రమంత్రులు, మాజీ ఎంపీలు, రిటైరైన కేంద్ర ప్రభుత్వ అధికారులపై సైతం వచ్చే ఆరోపణలను ఇది విచారిస్తుంది. అయితే అంతర్జాతీయ సంబంధాలతో ముడిపడి ఉండే అంశాల్లోనూ, విదేశాంగ, ఆంతరంగిక భద్రత, అణు శక్తి, అంతరిక్షం వగైరా రంగాలకు సంబం ధించిన అంశాల జోలికి ఇది పోదు. అలాగే పార్లమెంటులో లేదా సభా సంఘాల్లో ప్రస్తావనకొచ్చే అంశాల ఆధారంగా చేసే ఆరోపణల్లో ఇది జోక్యం చేసుకోదు. లోక్‌పాల్ ఏర్పాటుతో అవినీతి పూర్తిగా అంతమవుతుందనిగానీ, ప్రజాజీవన రంగం ప్రక్షాళన అవుతుందనిగానీ చెప్పడం కష్టం. అయితే అధికారంలో ఉన్నవారు ఒకటి రెండుసార్లు ఆలోచించి దేనిపైన అయినా నిర్ణయం తీసు కోవడానికి ఈ లోక్‌పాల్ దోహదపడుతుంది.
ఒకసారంటూ అధికారం వచ్చాక అయిదేళ్ల వరకూ తాము ఏం చేసినా చెల్లుతుందని, తమను అడిగేవారెవరూ లేరని ఈమధ్యకాలంలో రాజకీయ నాయకులు భావిస్తున్నారు. వేలకోట్లు రూపాయలు పోగేసుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీల్లోని ఎమ్మె ల్యేలను, ఎంపీలను కొనుగోలు చేయడం, ఎన్నికలొచ్చినప్పుడు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి విజయం సాధించడానికి ప్రయత్నించడం ఎక్కువైంది. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు చట్టం నిర్దేశిం చిన పరిమితులకు మించి అనేక వందల రెట్లు అధికంగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల వ్యవస్థ పైనే ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. లోక్‌పాల్ దీన్ని ఏమేరకు నియంత్రించగలదో చూడాలి.
అయితే లోక్‌పాల్, ఇతర సభ్యుల నియామకంతో అంతా ముగియలేదు. తనకొచ్చే ఆరోపణ లపై లోక్‌పాల్ ప్రాథమిక విచారణ జరపడానికి డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ విభాగం కావాలి. అలాగే ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవడానికి ప్రాసిక్యూషన్ డైరెక్టర్ ఉండాలి. ఈ రెండు విభా గాలూ పనిచేసేందుకు అవసరమైన సిబ్బంది నియామకం జరగాలి. వీటికి మరికొంత సమయం పడుతుంది. ఫిర్యాదు స్వీకరించిన 90 రోజుల్లో ప్రాథమిక విచారణ పూర్తికావాలి. ఆ నివేదిక వచ్చిన తర్వాత తగిన సంస్థతో దర్యాప్తునకు ఆదేశించవచ్చు. లేదా ఆరోపణలకు ఆధారాలు లేవనుకుంటే కేసును ముగించవచ్చు. దేశ ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్న లోక్‌పాల్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని, అవినీతిని ఏదోమేరకు అరికడుతుందని ఆశించాలి.
Comments
Please login to add a commentAdd a comment