న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరితీత తేదీ సమీపిస్తున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను క్షమాభిక్ష కోరుతూ బుధవారం పిటిషన్ దాఖలు చేశాడు. తనకు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ విజ్ఞప్తి చేశాడు. ఈ కేసులో దోషి అయిన ముఖేష్ సింగ్ ఇప్పటికే రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరగా.. ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 32 కింద క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణపై న్యాయ విచారణ చేయాల్సిందిగా ముఖేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సర్వోన్నత న్యాయస్థానం అతడి పిటిషన్‌ను ఈరోజే కొట్టివేసింది. ఈ నేపథ్యంలో వినయ్ శర్మ రాష్ట్రపతి క్షమాభిక్ష కోరడంతో ఉరిశిక్ష అమలు తేదీ మరోసారి పొడిగిస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి. ('అతడికి స్లో పాయిజన్ ఇస్తున్నారు')
కాగా ఏడేళ్ల క్రితం దేశ రాజధానిలో చోటుచేసుకున్న నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులు( ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31)) దాదాపు రెండున్నరేళ్ల క్రితమే సుప్రీంకోర్టు మరణ శిక్ష ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిర్భయ దోషులను జనవరి 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసిన విషయం విదితమే. అయితే ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు చివరి ప్రయత్నంగా వినయ్ శర్మ, ముఖేష్ కుమార్ సర్వోన్నత న్యాయస్థానంలో క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు వీటిని కొట్టివేయడంతో ఇక ఉరి అమలు జరగడమే తరువాయి అని అంతా భావించారు. కానీ ముఖేష్ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకున్నాడు. అయితే అక్కడ కూడా అతడికి నిరాశే ఎదురైంది. ముఖేష్ అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. (జైల్లో లైంగికంగా వేధించారు)
ఈ పరిణామాల నేపథ్యంలో క్షమాభిక్ష తిరస్కరించిన 14 రోజుల లోపు ఉరిశిక్ష అమలు చేయాలనే నిబంధన కారణంగా మరోసారి తేదీ మారింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు దోషులను ఉరితీసేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఈ కేసులో మరో దోషి పవన్ గుప్తా... నిర్భయ ఘటన జరిగే నాటికి తాను మైనర్‌ను అంటూ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పవన్‌కుమార్ గుప్తా తరపు న్యాయవాది సమర్పించిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేయడంతో అతడి ప్రయత్నం బెడిసికొట్టింది. కాగా... సాధారణంగా ఒకే కేసులో ఉరిశిక్ష పడిన దోషులకు ఒకేసారి శిక్ష అమలు చేయడం పరిపాటి కాబట్టి.. పవన్, అక్షయ్ కుమార్ ఠాకూర్‌లకు మరో అవకాశం ఉన్నట్లుగా న్యాయ నిపుణులు భావిస్తున్నారు. వీరిద్దరు విడివిడిగా లేదా కలిసి క్యూరేటివ్ పిటిషన్లు, క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉండటం.. క్షమాభిక్ష తిరస్కరణను ముఖేష్ సవాలు చేయడం, అదే విధంగా వినయ్ శర్మ ప్రస్తుతం రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన నేపథ్యంలో మరోసారి శిక్ష అమలు తేదీ మారే పరిస్థితులు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment