భరణంపై ఎన్నదగిన తీర్పు | editorial On Supreme Court Gives Deserted Wife Alimony | Sakshi
Sakshi News home page

భరణంపై ఎన్నదగిన తీర్పు

Published Fri, Nov 6 2020 12:59 AM | Last Updated on Fri, Nov 6 2020 12:59 AM

editorial On Supreme Court Gives Deserted Wife Alimony - Sakshi

భర్త నుంచి వేరుపడి విడిగా వుంటున్న భార్యకు మనోవర్తి చెల్లింపుపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం వెలువరించిన తీర్పు హర్షించదగ్గది. హింస కారణంగానో, వేధింపుల కారణంగానో దంపతులు కలిసివుండటం అసాధ్యమైనప్పుడు...వారి మధ్య ఇతరేతర కారణాలవల్ల విభేదాలు ఏర్పడినప్పుడు విడాకుల వరకూ పోవడం సర్వసాధారణం. కానీ విడాకుల తర్వాత కూడా మన దేశంలో మహిళలకు సమస్యలు తప్పడం లేదు. ఆర్థికంగా స్థోమతవుండి, తమంత తాము స్వతంత్రంగా జీవించగలిగినవారికి ఇబ్బంది వుండదు. కానీ నిరాధార మహిళలకు, ముఖ్యంగా పిల్లలను కూడా పోషించుకోవాల్సిన బాధ్యత వున్నవారికి రోజు గడవటం జీవన్మరణ సమస్య. ఇలా దిక్కూ మొక్కూ లేని మహిళల సంఖ్య గణనీయంగా వుంటోంది.

తమకు న్యాయబద్ధంగా రావలసిన భరణం కోసం వారు న్యాయస్థానాలను ఆశ్రయించడం, అందుకోసం ఎన్నో వ్యయప్రయాసలకు సిద్ధపడటం తప్పడం లేదు. ఎప్పుడొస్తుందో...అసలు వస్తుందో రాదో తెలియని భరణం కోసం అప్పులు చేయడం, న్యాయవాదులను ఆశ్రయించడం ఒంటరి మహిళకు ప్రాణాంతకం. కూలీ పనులనో, చేస్తున్న చిరు ఉద్యోగాన్నో వదులుకుని కోర్టుల చుట్టూ తిరగడం వల్ల అటు ఉపాధి దెబ్బతింటుంది, ఇటు చేతి చమురు వదులుతుంది. మన దేశంలో మనోవర్తి కేసు తేలడానికి కనీసం 20 సంవత్సరాలు పడుతోందని ఒక అంచనా. పుట్టింటివారు సాయపడితే ఏమోగానీ...ఈలోగా పిల్లల్ని పెంచడం, వారిని ప్రయోజకుల్ని చేయడం ఎలాంటివారికైనా కష్టమే. పైగా తీర్పు వెలువరించే తేదీనుంచి మాత్రమే భరణం చెల్లింపు వర్తిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎన్నదగిన తీర్పునిచ్చింది. జస్టిస్‌ ఇందూ మల్హోత్రా, జస్టిస్‌ ఆర్‌. సుభాష్‌ రెడ్డిల ధర్మాసనం న్యాయస్థానంలో మహిళ పిటిషన్‌ వేసిన తేదీనుంచే మనోవర్తి చెల్లింపును వర్తింపజేయాలని స్పష్టం చేసింది. 

ఈ విషయంలో మన న్యాయస్థానాలు ఒక్కోటి ఒక్కో రకంగా వ్యవహరిస్తున్నాయి. ఇందుకు చట్టాల్లోని అస్పష్టత కూడా ఒక కారణం. మనోవర్తి చెల్లింపునకు సంబంధించి ఒక చట్టమంటూ లేదు. హిందూ వివాహ చట్టం, హిందూ దత్తత, మనోవర్తి చట్టం, గృహహింస చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, ఇవిగాక నేర శిక్షాస్మృతి(సీఆర్‌పీసీ)లోని సెక్షన్‌ 125 వగైరాల కింద భార్య మనోవర్తి కోరవచ్చు. భార్య దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి గానీ, లేదా న్యాయస్థానం చెల్లింపు కోసం ఆదేశాలిచ్చిన తేదీనుంచిగానీ మనోవర్తిని వర్తింపచేయొచ్చని సెక్షన్‌ 125 చెబుతోంది. మనోవర్తి కేసుల్ని పరిశీలించే న్యాయస్థానాలు మానవతా దృక్పథంతో ఆలోచిస్తే ఏమోగానీ...లేనిపక్షంలో తీర్పు వెలువరించిన తేదీనుంచే వర్తింపజేస్తాయి. వాస్తవానికి మనోవర్తి ఉద్దేశమే భర్త నుంచి విడివడిన భార్య మనుగడకు అవసరమైన మొత్తం అందుబాటులో వుండేలా చూడటం. తీర్పు వెలువరించిన తేదీనుంచి దాన్ని వర్తింపజేయడం ఆ ఉద్దేశాన్ని దెబ్బతీస్తోంది. ఒక స్వచ్ఛంద సంస్థ నిరుడు ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన సర్వే విడాకులు తీసుకుని వుంటున్న ఒంటరి మహిళల దుర్భర స్థితిగతులను వెల్లడించింది.

19 ఏళ్లక్రితం భర్తనుంచి విడిపోయిన ఒక మహిళకు అతగాడినుంచి ఒక్క పైసా కూడా భరణంగా రాలేదు. ఎన్నిసార్లు కోర్టుల చుట్టూ తిరిగినా, పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టినా ఫలితం లేకపోయిందని ఆమె వాపోయింది. ఆమెకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన భరణం సంగతలావుంచి, కనీసం ఆమె తాలూకు వస్తువుల్ని కూడా అతని నుంచి ఎవరూ ఇప్పించలేక పోయారు. ఇన్నేళ్లుగా పిల్లల్ని సాకడం తనకు శక్తికి మించిన పనైందని ఆ మహిళ తెలిపింది. బందా న్యాయస్థానంలో ఆ మహిళ మాదిరే భరణం కోరుతూ దాఖలైన కేసులు 700కు పైగా వున్నాయంటే ఈ సమస్య ఎంత జటిలంగా మారిందో అర్థమవుతుంది. భర్త హింసిస్తున్నప్పుడు, కనీసం మనిషిగా కూడా గుర్తించనప్పుడు ఆ దుర్భర పరిస్థితులను భరించలేక మహిళలు విడాకులు కోరుతారు. తీరా భరణం సాధించడం దానికదే హింసగా మారితే? వాస్తవానికి భరణం చెల్లించాలని తీర్పునిచ్చాక కూడా దాన్ని ఎగ్గొట్టడానికి చాలామంది చూస్తారు. తనకు ఇరవైయ్యేళ్లక్రితమే మనోవర్తి మంజూరైనా భర్త ఆచూకీ లేకుండా పోయాడని, ఇటీవల ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా పోలీసులను ఆశ్రయించాకే దారికొచ్చాడని మరో మహిళ తెలిపింది. 

ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకొచ్చిన కేసు కూడా మహిళల నిస్సహాయ స్థితిని వెల్లడిస్తోంది. ఈ కేసులో మహిళ ఏడేళ్లనుంచి మనోవర్తి కోసం వివిధ కోర్టుల్లో పోరాడుతోంది. న్యాయస్థానం మంజూరు చేసిన తాత్కాలిక భరణాన్ని కూడా భర్త చెల్లించడం లేదు. ఇలాంటి కేసుల్లో సివిల్‌ కోర్టులు జారీ చేసే డిక్రీల పద్ధతిలో... అంటే ఆస్తుల్ని స్వాధీనపరుచుకోవడంలాంటి చర్యలతో ఒత్తిడి తేవొచ్చని, అవసరమైతే కోర్టు ధిక్కార నేరంకింద చర్య తీసుకోవచ్చని ఇచ్చిన ఆదేశం నిస్సహాయ మహిళలకు ఊరటనిస్తుంది. భరణం కోసం దరఖాస్తు చేసినప్పుడే తన ఆర్థిక పరిస్థితేమిటో, తనకున్న ఆదాయవనరులేమిటో భార్య చెప్పాలని... భర్త సైతం తన ఆస్తిపాస్తుల వివరాలివ్వాలని చెప్పడం కూడా మంచిదే. ఎందుకంటే మనోవర్తి కేసులో తీర్పు వెలువడేలోగా ఆస్తుల్ని అమ్ముకునే ప్రబుద్ధులుంటున్నారు. తమ దగ్గరేమీ లేదని బుకాయిస్తున్నారు. ముందే ఆ వివరాలు దాఖలు తప్పనిసరి చేస్తే ఇలాంటివారి ఆటకడుతుంది. సుప్రీంకోర్టు తీర్పులో మరో ముఖ్యాంశం వుంది. ఉన్నత విద్యావంతురాలై, ఉద్యోగం చేసే మహిళ కుటుంబం కోసం దాన్ని వదులుకుని, తర్వాత కాలంలో విడాకులు కోరవలసి వచ్చినప్పుడు అలాంటివారికి భరణం మంజూరు చేసినప్పుడు అందుకనుగుణంగా దాన్ని నిర్ణయించాలని ధర్మాసనం తెలిపింది. తాజా తీర్పు నిస్సహాయ మహిళల వెతల్ని తీర్చడంలో తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. మనోవర్తి కేసుల్ని తేల్చడానికి నిర్దిష్ట గడువును కూడా విధించివుంటే మరింత బాగుండేది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement