Man hands over to court 280kg of coins for Rs 55,000 alimony - Sakshi
Sakshi News home page

చిల్లర భరణం.. కాయిన్స్‌తో భార్యకు  మెంటల్‌ టార్చర్‌ ప్లాన్‌.. షాక్‌ ఇచ్చిన కోర్టు

Published Wed, Jun 21 2023 7:14 AM | Last Updated on Wed, Jun 21 2023 9:23 AM

Man hands over to court 280kg of coins for Rs 55000 alimony - Sakshi

జైపూర్‌: భార్యకు భరణంగా ఇవ్వాల్సిన రూ.55 వేలను రూపాయి, రెండు రూపాయల నాణేల రూపంలో తెచ్చిన ఓ భర్తకు కోర్టు షాకిచ్చింది. వాటిని తీసుకోవాలని భార్యకు చెబుతూనే.. ఆ మొత్తాన్ని రూ.వెయ్యి వంతున స్వయంగా లెక్కించి ఇవ్వాలంటూ భర్తను ఆదేశించింది. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

హర్మదా ప్రాంతానికి చెందిన దశరథ్‌ కుమావత్, భార్య సీమ విభేదాలు రావడంతో విడాకుల కోసం కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడ ఈ కేసు పెండింగ్‌లో ఉంది. అప్పటి వరకు సీమకు నెలకు రూ.5 వేల చొప్పున నిర్వహణ ఖర్చుల కింద ఇవ్వాలని దశరథ్‌ను న్యాయస్థానం ఆదేశించింది. అయితే, అతడు 11 నెలలుగా ఆ సొమ్మును ఇవ్వడం లేదు. దీంతో, సీమ మళ్లీ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అతడిపై కోర్టు రికవరీ వారెంట్‌ జారీ చేసింది. డబ్బు చెల్లించేందుకు అతడు నిరాకరించడంతో పోలీసులు జూన్‌ 17న అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టు సెలవులో ఉండటంతో పోలీసులు దశరథ్‌ను అదనపు జిల్లా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

అయితే.. దశరథ్‌ అరెస్ట్‌ కావడంతో సీమకు చెల్లించాల్సిన డబ్బును అతడి కుటుంబసభ్యులు ఏడు బస్తాల్లో కోర్టుకు తీసుకువచ్చారు. రూ.55 వేలకు సమానమైన రూ.1, రూ.2 నాణేలు వాటిలో ఉన్నాయి. 280 కేజీల దాకా బరువులు ఉన్నాయి ఆ సంచులు. అయితే.. ఆ డబ్బును తీసుకునేందుకు సీమ నిరాకరించారు. తనను మానసికంగా వేధించాలని ఉద్దేశపూర్వకంగానే ఇలా తీసుకువచ్చారని ఆరోపించారు. న్యాయమూర్తి మాత్రం నాణేల రూపంలో దశరథ్‌ డబ్బు చెల్లించవచ్చని తెలిపారు. అయితే, ఆ నాణేలన్నిటినీ అతడే స్వయంగా లెక్కించాలని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు డబ్బు కోర్టు అధీనంలోనే ఉంటుందని తెలిపారు. విచారణ తేదీ రోజున డబ్బును దశరథ్‌ లెక్కించి రూ.వెయ్యి చొప్పున ప్యాకెట్‌లుగా విభజించి, కోర్టులో వాటిని భార్యకు అప్పగించాలని తేల్చి చెప్పారు.   

ఇదీ చదవండి: శివలింగంపై కరెన్సీ నోట్లు విసిరి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
 
Advertisement