Family court
-
భార్య అలా బెదిరించినా సరే విడాకులు తీసుకోవచ్చు!
విడాకులు తీసుకోవడానికి సంబంధిత చట్టాలు.. అందులోని సెక్షన్లు కారణాలేంటన్నదానిపై స్పష్టత ఇచ్చాయి. అయితే సందర్భం దొరికినప్పుడల్లా ఆ సెక్షన్ల విస్తృత పరిధిపై తమ తీర్పులు.. ఆదేశాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుంటాయి న్యాయస్థానాలు. ఈ క్రమంలోనే తాజాగా విడాకులకు సంబంధించిన బాంబే హైకోర్టు ఓ సంచలన తీర్పు వెల్లడించింది.ముంబై: జీవిత భాగస్వామి ఇద్దరిలో ఎవరైనా సరే బలవన్మరణానికి పాల్పడతానని బెదిరించినా.. లేదంటే అలాంటి ప్రయత్నం చేసినా.. అది హింస కిందకే వస్తుందని, హిందూ వివాహ చట్టం, 1955 లోని సెక్షన్ 13(1)(ia) ప్రకారం విడాకులు మంజూరు చేయొచ్చని బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది.తన భార్య ఆత్మహత్య చేసుకుంటానంటోందని.. తనను,తన కుటుంబాన్ని జైలుకు పంపిస్తానని బెదిరిస్తోందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఇక ఆమెతో కలిసి కాపురం చేయలేనని.. తనకు విడాకులు మంజూరు చేయాలని ఫ్యామిలీ కోర్టును కోరాడు. అక్కడి అతనికి ఊరట దక్కగా.. ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది.ఆమె కేవలం తాను చనిపోయి భర్త కుటుంబాన్ని జైలుకు పంపిస్తానని మాత్రమే బెదిరించడం లేదు.. బలవన్మరణానికి పాల్పడతానని చెబుతోంది కూడా. జీవిత భాగస్వాముల్లో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే అది అవతలి వాళ్లను హింసించడమే అవుతుంది. కాబట్టి విడాకులు మంజూరు చేయొచ్చు అని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ న్యాయమూర్తి ఆర్ఎం జోషి తీర్పు వెల్లడించారు.మహారాష్ట్రకు చెందిన సదరు వ్యక్తికి 2009లో వివాహం జరిగింది. ఆ జంటకు ఓ పాప. అయితే భార్య తరఫు బంధువుల రాకతో తమ కాపురం కుప్పకూలిందని విడాకుల పిటిషన్లో పేర్కొన్నాడతను. గర్భంతో ఉన్న భార్య తనను వీడి వెళ్లిపోయిందని.. అప్పటి నుంచి తిరిగి రాలేదు. అయితే కొంతకాలం తర్వాత తప్పుడు కేసులతో ఆమె అతన్ని బెదిరించసాగింది. ఈ క్రమంలోనే సూసైడ్ చేసుకుని.. ఆ నేరాన్ని భర్త కుటుంబంపై నెట్టేస్తానని బెదిరించింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలను కోర్టుకు సమర్పించిన భర్త చివరకు ఫ్యామిలీ కోర్టు నుంచి కిందటి నెలలో విడాకులు పొందగలిగాడు. భార్య ఆ తీర్పును సవాల్ చేయగా.. బాంబే హైకోర్టు తాజాగా ఆ తీర్పును సమర్థించింది. -
వివాహ‘బంధం’ తెగతెంపులు!
సాక్షి, హైదరాబాద్: వివాహమైన ఏడాది, రెండేళ్లకే విడాకులకు సిద్ధమౌతున్న విచిత్రపరిస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొంది. గతంలో భారత సెలబ్రిటీల్లోనే (సినిమా, క్రీడలు, వ్యాపార, ఇతర రంగాల వారు) ఈ ట్రెండ్ అధికంగా కనిపించగా, రానురాను దాదాపు అన్ని వర్గాల్లో ఈ ధోరణి సాధారణంగా మారుతోంది. గతంతో పోల్చితే... గత రెండు దశాబ్దాల కాలంలో దేశంలో విడాకుల శాతం గణనీయంగా పెరిగినట్టుగా గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. విడాకులంటేనే ఏదో చేయరాని నేరం అని ఏళ్లుగా పేరుకుపోయిన భావన నుంచి నేటితరం బయటపడడంతో జీవితంలో నూతన అధ్యాయం కోసం యువతరం మొగ్గుచూపుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇవి పెరగడానికి వైవాహికపరమైన వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించే ప్రయత్నాలు జరగకపోవడం, ఇతర మార్గాలను అన్వేషించకుండానే కోర్టు మెట్లు ఎక్కడం కూడా ఒక కారణమనే అభిప్రాయం వినిపిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా దేశంలోని వివాహ వ్యవస్థ, కుటుంబ విలువలు ఒత్తిళ్లకు గురికావడం, సామాజిక–సంప్రదాయ విలువలు, పాత–ఆధునిక భావాల మధ్య సంఘర్షణ తదితర కారణాలతో విడాకులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న గణాంకాలను బట్టి చూస్తే (2022 సంవత్సరం చివర్లో) దేశంలో విడాకుల శాతంలో తెలంగాణ ఏడో స్థానంలో ఉంది. విడాకుల కోసం కోర్టులో కేసు ఫైల్ చేశాక వివిధ దశలు దాటి తీర్పు వెలువడే నాటికి పదేళ్లకుపైగా పడుతున్న సందర్భాలు కూడా ఉండటంతో... అనధికారికంగా విడిపోతున్న జంటలు పెద్ద సంఖ్యలో ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అత్యధికంగా ఇండోర్‌లో... 👉 2022 నాటికి దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల విడాకుల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 👉 దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 715 ఫ్యామిలీ కోర్టులున్నాయి. 👉 ఇండోర్ ఫ్యామిలీ కోర్టులో 8,400 కేసులు పెండింగ్‌లో ఉండగా వాటిలో 5,500 విడాకుల కోసమే కాగా... వాటిలో పెళ్లయిన ఏడాదిలో పెట్టిన కేసులు 3,000. 2018లో 2,250 కేసులు ఫైల్ కాగా, 2022లో 2,723 కేసులు నమోదయ్యాయి. 👉 గత పదేళ్లలో...అత్యధిక అక్షరాస్యత ఉన్న కేరళలో 350 శాతం పెరిగిన విడాకులు. ఇదే సమయంలో పంజాబ్, హరియాణాల్లో 150 శాతం ఈ కేసుల వృద్ధి 👉 గత ఐదేళ్లలో ఢిల్లీలో విడాకుల శాతం రెండింతలు పెరిగింది. 👉 ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర మెట్రో నగరాల్లో విడాకుల కేసులు అధికంగా ఉంటున్నాయి జాగ్రత్తలు తీసుకుంటే... ‘ఈ మధ్య వారానికి ఏడెనిమిది కేసులైనా విడాకుల కోసం మా దగ్గరకు వస్తున్నాయి. వీరిలో 30 శాతం దాకా తమ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గేందుకు మొగ్గుచూపుతుంటే, అధికశాతం మొండికేసి విడాకుల కోసం పట్టుపడుతున్నారు. తెగతెంపులకు 40 నుంచి 50 శాతం తల్లితండ్రుల పాత్ర ఎక్కువగా ఉంటోంది. విడాకులు తీసుకున్నామని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడడం లేదు. అదేదో డయోబెటిస్, థైరాయిడో వచ్చిందనేంత తేలికగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం దంపతుల మధ్య ఒకరిపట్ల ఒకరికి సరైన అవగాహన లేకపోవడం, చిన్న చిన్న విషయాలకు సర్దుబాటు చేసుకోలేక ఘర్షణ పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరిలోనూ స్వార్థం పెరిగిపోవడం, సహానుభూతి కొరవడడం, అనుమానాలు పెరగడం ప్రభావం చూపుతున్నాయి. తల్లితండ్రులు కూడా సర్దుబాటు అవగాహన కలి్పంచకపోగా, చదువుకున్నారు, సంపాదిస్తున్నారు మీకేమీ తక్కువ అనేలా రెచ్చగొడుతుండటంతో పరిస్థితులు తెగే దాకా వస్తున్నాయి. ఒకరి తప్పులను మరొకరు ఎత్తిచూపడం తగ్గిపోయి, పాత విషయాలను పదేపదే ప్రస్తావనకు తేవకపోవడం, గొడవలకు తల్లితండ్రులను మధ్యలోకి తెచ్చి బాధ్యులను చేయకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇద్దరి మధ్య సర్దుబాటుకు అవకాశాలుంటాయి. – అనిత, ఫ్యామిలీ కౌన్సెలర్, భాస్కర మెడికల్ కాలేజీ క్లినికల్ సైకాలజిస్ట్ వివాహబంధం అక్కర్లేదనే అంచనాకు.. ‘మన దగ్గరా విడాకులు అనేవి క్రమంగా పెరుగుతున్నాయి. 2000 సంవత్సరం తర్వాత నుంచి చూస్తే... దేశంలో అమ్మాయిలకు మంచి విద్యతోపాటు ఉద్యోగావకాశాలు పెరగడంతో ఆర్థిక స్వాతంత్య్రం పెరిగింది. యూఎస్, ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు వృద్ధికావడంతో గిల్లికజ్జాలు, చికాకులు, సమస్యలతో వివాహబంధాన్ని తప్పక కొనసాగించాల్సిన అవసరం లేదనే అంచనాకు ఇటు అమ్మాయిలు, అటు అబ్బాయిలు వస్తున్నారు. అటు ఆఫీసులో, ఇటు ఇంట్లో బాధ్యతలు పెరిగిపోవడంతో ఇంటాబయటా మహిళలపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. రోజూ సమస్యలు ఎదుర్కొంటూ బతకడం కంటే విడిపోయి సంతోషంగా జీవించవచ్చనే అభిప్రాయానికి అమ్మాయిలు వస్తున్నారు. మారుతున్న కాలాన్ని బట్టి ఇళ్లలోని పరిస్థితులు మారకుండా సంప్రదాయ పద్ధతుల్లోనే ఆలుమగల సంబంధాలు ఉండాలని పెద్దవాళ్లు కోరుకుంటున్న సందర్భాలున్నాయి. దీంతోపాటు వారిద్దరి మధ్య ప్రతీ చిన్న విషయంలో తల్లితండ్రులు కలగజేసుకోవడంతో ఘర్షణలు పెరుగుతున్నాయి. సమాజంలో ఇంకా పురుషాధిక్యత అనేది ఏదో ఒక రూపంలో కొనసాగడం, పిల్లలుంటే వారి భారమంతా తమపైనే పడుతుందని సంతానం వద్దనే నిర్ణయానికి 10 నుంచి 15 శాతం యువతులు వస్తున్నారు. ఈ మేరకు పెళ్లికి ముందే ఒప్పందం చేసుకుంటున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. తాము అబ్బాయిల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదనే భావన అమ్మాయిల్లో బలపడటం, దానిని అంగీకరించేందుకు అబ్బాయిలు సిద్ధంగా లేకపోవడంతో విడిపోవడానికి సిద్ధమవుతున్నారు. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
భరణం జీవనానికి మాత్రమే... విలాసాలకు కాదు!
జైపూర్ ఫ్యామిలీ కోర్ట్ మెయింటెనెన్స్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. విలాసవంతమైన జీవితం గడపడానికి భార్యకు భరణం ఇవ్వలేమంటూ మహిళ దాఖలు చేసుకున్న దరఖాస్తును తిరస్కరించింది. భార్య (దరఖాస్తు దారు)ఆదాయం, భర్త ఆదాయం కంటే ఎక్కువ అని ఈ నిర్ణయం తీసుకుంది.ఈ కేసులో ఫిర్యాది ఎస్బీఐలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తన భర్త నెలవారీ ఆదాయం సుమారు రూ.2.50 లక్షలనీ, తన పోషణ, కేసు ఖర్చులు, నెలకు మెయింటెనెన్స్ అలవెన్స్ కింద రూ.75వేలు, అడ్వకేట్ ఫీజు, లిటిగేషన్ ఖర్చులు రూ.50వేలు, ఒక్కో విచారణకు హాజరయ్యేందుకు రూ.3వేలు ఇవ్వాలని భార్య డిమాండ్ చేసింది. దీనికి సమాధానంగా తన భార్యనెలకు రూ. 1,09,258 జీతంతోపాటు అదనపు అలవెన్స్‌లు పొందుతోందని కౌంటర్ పిటిషన్ వేశాడు భర్త. వాస్తవాలను పరిశీలించిన తర్వాత, విలాసవంతమైన జీవనంకాదు భరణం అంటే అంటూ ప్రిసైడిరగ్ అధికారి గార్గ్ మహిళ పిటిషన్‌ను కొట్టి వేశారు.భార్యకు ఎలాంటి ఆదాయ వనరులు లేని పక్షంలో విడాకులు, విడాకుల కేసు విచారణలో ఉండగా, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం, భార్య తన భర్త నుండి నెలవారీ భరణాన్ని అభ్యర్థించవచ్చు. మెయింటెనెన్స్ అంటేభార్య భర్తలు విడిపోయినప్పుడు, లేదా విడాకుల ప్రక్రియ కోర్టులో కొనసాగుతున్నప్పుడు ఆదాయం లేని భార్య జీవితాన్ని గడిపేందుకు ఇవ్వవలసిన సొమ్మునే మెయింటెనెన్స్ అంటారు. భాగస్వామి ఆహారం, దుస్తులు, వసతితో పాటు పిల్లల విద్య ఇతర బాగోగులు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది భాగస్వామికి మాత్రమే కాకుండా పిల్లలకు, తల్లితండ్రులకు కూడా వర్తిస్తుంది. -
నటుడు పృథ్వీకి బిగ్ షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ..
‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఫేం, నటుడు పృథ్వీరాజ్‌కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు షాకిచ్చింది. ఆయనకు తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. తన భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల భరణం చెల్లించాలని కోర్టు గతంలోనే ఆదేశించింది. అయితే, కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన పాటించకపోవడంతో పాటు కోర్టుకు కూడా హాజరు కానందున నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను కోర్టు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.విజయవాడకు చెందిన శ్రీలక్ష్మి-పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌కు 1984లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్లుగా పృథ్వీ రాజ్ భార్యతో విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో శ్రీలక్ష్మీ పిల్లలతో కలిసి తన పుట్టింట్లో ఉంటుంది. అయితే, 2017లో శ్రీలక్ష్మి కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇప్పించాలని కోరింది.(ఇదీ చదవండి: దునియా విజయ్ కేసులో నేడు తుది తీర్పు.. ఫ్యాన్స్‌లో ఉత్కంఠ)పృథ్వీరాజ్ విజయవాడలో తన అమ్మవాళ్ల ఇంట్లో ఉంటూనే చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించేవాడని, ఆ ఖర్చులన్నీ తమ తల్లిదండ్రులే భరించారని ఆమె కోర్టుకు తెలిపింది. ఇక సినిమాల్లోకి వెళ్లాక ఆయన తరచూ తనని వేధించేవాడని, 2016 ఏప్రిల్ 5న ఇంట్లో నుంచి తనని బయటకు పంపించడంతో తన పుట్టింటికి వచ్చి ఉంటున్నానని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.(ఇదీ చదవండి: హత్య కోసం రూ. 30 లక్షలు సుపారీ ఇచ్చిన దర్శన్.. భర్త కోసం రోదిస్తున్న భార్య )అలాగే తన భర్త సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని, అతని నుంచి భరణం ఇప్పించాలని 2017 జనవరి 10న న్యాయస్థానంలో కేసు దాఖలు చేసింది. కేసు విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు.. పృథ్వీరాజ్ తన భార్యకు నెలకు 8 లక్షలు రూపాయలు, అంతేగాక ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి అయిన ఖర్చులు కూడా ఆయనే ఇవ్వాలని తీర్పునిచ్చింది. ప్రతి నెలా 10వ తేదీ నాటికి ఆమెకు భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే, శ్రీలక్ష్మీకి భరణం చెల్లించాల్సిన పృథ్వీరాజ్ విఫలం అయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన కోర్టుకు కూడా హాజరుకావడం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో పృథ్వీరాజ్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను విజయవాడ ఫ్యామిలీ కోర్టు జారీ చేసినట్లు సమాచారం. -
గోవా Vs అయోధ్య: హనీమూన్ రచ్చ.. చివరికి..?
అనివార్య పరిస్థితుల్లోనో లేదంటే విభేదాలు, తగాదాలు మితిమీరినా భార్యాభర్తల మధ్య విడాకులకు దారి తీస్తుంది. అయితే బోపాల్‌లో ఫ్యామిలీ కోర్టుకు చేరిన ఓ విడాకులు కేసు ఒకటి విచిత్రంగా నిలిచింది. గోవా, సౌత్ ఇండియా హనీమూన్ ట్రిప్‌కు తీసుకెళ్లానంటే భార్య ఎగిరి గంతేసింది. తీరా టూర్ అయిన తరువాత తనకు భర్త నుంచి విడాకులు ఇప్పించాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..? ఫ్రీ ప్రెస్ జర్నల్‌లోని ఒక నివేదిక ప్రకారం భోపాల్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. హనీమూన్‌కు గోవాకు తీసుకెళ్తానని మాట ఇచ్చాడు భర్త. గోవాకి బదులు అయోధ్య, వారణాసికి తీసుకెళ్లాడు అనేది భార్య ఆరోపణ. గోవా, సౌత్ ఇండియా పర్యటనకు భార్య అంగీకరించింది. అయితే ఆ తర్వాత భర్త ఆమెకు సమాచారం ఇవ్వకుండానే అయోధ్య, వారణాసికి విమాన టిక్కెట్లు బుక్ చేశాడు. జనవరి 22న జరిగే రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి తీసుకెళ్లమని తల్లి కోరిన నేపనథ్యంలో ఇలా చేశాడు. అయితే ఈ విషయాన్ని దాచి పెట్టి ట్రిప్‌కు ఒకరోజు ముందు తాము అయోధ్యకు వెళ్తున్నామని చెప్పాడు. దీంతో తన కంటే కుటుంబ సభ్యులే ఎక్కువ అంటూ ఆగ్రహించింది. అయినా గప్‌చుప్‌గా టూర్ కెళ్లి వచ్చింది. చివరికి ఈ కారణంతోనే తనకు విడాకులు కావాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ దంపతులు ఇద్దరూ హిందూ పుణ్యక్షేత్రాలను సందర్శించి, తిరిగి వచ్చిన 10 రోజుల తరువాత ఈ కేసు కోర్టుకు చేరింది. ప్రస్తుతం వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో ఉన్నారు అధికారులు. -
చిల్లర భరణం.. భర్తకు షాకిచ్చిన కోర్టు
జైపూర్: భార్యకు భరణంగా ఇవ్వాల్సిన రూ.55 వేలను రూపాయి, రెండు రూపాయల నాణేల రూపంలో తెచ్చిన ఓ భర్తకు కోర్టు షాకిచ్చింది. వాటిని తీసుకోవాలని భార్యకు చెబుతూనే.. ఆ మొత్తాన్ని రూ.వెయ్యి వంతున స్వయంగా లెక్కించి ఇవ్వాలంటూ భర్తను ఆదేశించింది. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హర్మదా ప్రాంతానికి చెందిన దశరథ్ కుమావత్, భార్య సీమ విభేదాలు రావడంతో విడాకుల కోసం కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడ ఈ కేసు పెండింగ్‌లో ఉంది. అప్పటి వరకు సీమకు నెలకు రూ.5 వేల చొప్పున నిర్వహణ ఖర్చుల కింద ఇవ్వాలని దశరథ్ను న్యాయస్థానం ఆదేశించింది. అయితే, అతడు 11 నెలలుగా ఆ సొమ్మును ఇవ్వడం లేదు. దీంతో, సీమ మళ్లీ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అతడిపై కోర్టు రికవరీ వారెంట్ జారీ చేసింది. డబ్బు చెల్లించేందుకు అతడు నిరాకరించడంతో పోలీసులు జూన్ 17న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టు సెలవులో ఉండటంతో పోలీసులు దశరథ్ను అదనపు జిల్లా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అయితే.. దశరథ్ అరెస్ట్ కావడంతో సీమకు చెల్లించాల్సిన డబ్బును అతడి కుటుంబసభ్యులు ఏడు బస్తాల్లో కోర్టుకు తీసుకువచ్చారు. రూ.55 వేలకు సమానమైన రూ.1, రూ.2 నాణేలు వాటిలో ఉన్నాయి. 280 కేజీల దాకా బరువులు ఉన్నాయి ఆ సంచులు. అయితే.. ఆ డబ్బును తీసుకునేందుకు సీమ నిరాకరించారు. తనను మానసికంగా వేధించాలని ఉద్దేశపూర్వకంగానే ఇలా తీసుకువచ్చారని ఆరోపించారు. న్యాయమూర్తి మాత్రం నాణేల రూపంలో దశరథ్ డబ్బు చెల్లించవచ్చని తెలిపారు. అయితే, ఆ నాణేలన్నిటినీ అతడే స్వయంగా లెక్కించాలని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు డబ్బు కోర్టు అధీనంలోనే ఉంటుందని తెలిపారు. విచారణ తేదీ రోజున డబ్బును దశరథ్ లెక్కించి రూ.వెయ్యి చొప్పున ప్యాకెట్లుగా విభజించి, కోర్టులో వాటిని భార్యకు అప్పగించాలని తేల్చి చెప్పారు. ఇదీ చదవండి: శివలింగంపై కరెన్సీ నోట్లు విసిరి.. -
హైదరాబాద్: కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టుకు నరేష్ మూడో భార్య
-
పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టు షాక్, భార్యకు ప్రతి నెల రూ. 8 లక్షలు చెల్లించాలి
‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఫేం, నటుడు పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టు షాకిచ్చింది. తన భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల రూ. 8 లక్షల భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వివరాలు.. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మి-పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌కు 1984లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే ఇటీవల పృథ్వీ రాజ్ భార్యతో విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో శ్రీలక్ష్మీ పిల్లలతో కలిసి తన పుట్టింట్లో ఉంటుంది. చదవండి: రాజమౌళి డైరెక్షన్లో నటించను: చిరంజీవి ఈ క్రమంలో 2017లో శ్రీలక్ష్మి కోర్టును ఆశ్రయిస్తూ.. భర్త నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇప్పించాలని కోరింది. కాగా పృథ్వీరాజ్ విజయవాడలో తన అమ్మవాళ్ల ఇంట్లో ఉంటూనే చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించేవాడని, ఆ ఖర్చులన్నీ తమ తల్లిదండ్రులే భరించారని ఆమె కోర్టుకు తెలిపింది. ఇక సినిమాల్లోకి వెళ్లాక ఆయన తరచూ తనని వేధించేవాడని, 2016 ఏప్రిల్ 5న ఇంట్లో నుంచి తనని బయటకు పంపించడంతో తన పుట్టింటికి వచ్చి ఉంటున్నానని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. చదవండి: మణిరత్నం కల నెరవేరిందా? అలాగే తన భర్త సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని, అతని నుంచి భరణం ఇప్పించాలని 2017 జనవరి 10న న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. కేసు విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు.. పృథ్వీరాజ్ తన భార్యకు నెలకు 8 లక్షలు రూపాయలు, అంతేగాక ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి అయిన ఖర్చులు కూడా ఆయనే ఇవ్వాలని తీర్పునిచ్చింది. ప్రతి నెలా 10వ తేదీ నాటికి ఆమెకు భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇక పృథ్వీరాజ్ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కమెడియన్‌గా చేస్తూ బిజీగా ఉన్నాడు. -
పుట్టినరోజే వివాహ బంధనం నుంచి రేఖకు విముక్తి
ఆ అమ్మాయి వయసు 21 ఏళ్లు. బాగా చదువుతుంది. నర్సు కావాలన్నది ఆమె కల. కానీ, ఊహ తెలియని వయసులో పెద్దలు చేసిన పనికి.. నరకంలో పడింది. మానసికంగా కుమిలిపోయింది. చివరికి.. ఓ ఉద్యమకారిణి సహకారం, కోర్టు తీర్పుతో మొత్తానికి ఆటంకాలు తొలగి ఆమెకు ఇష్టంలేని వివాహ బంధనం నుంచి విముక్తి లభించింది. రాజస్థాన్ జోధ్‌పూర్‌కు చెందిన రేఖ(21).. విచిత్రమైన పరిస్థితుల నడుమ జోధ్‌పూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. 2002లో అంటే.. ఏడాది వయసున్నప్పుడు రేఖను అదే ఊరికి చెందిన ఓ పిలగాడికి ఇచ్చి వివాహం చేశారు ఆమె తల్లిదండ్రులు. ఇంటి పెద్ద అనారోగ్యంతో.. బంధువుల ఒత్తిడి మేరకు ఈ చర్యకు ఉపక్రమించారు. అయితే.. ఆ తర్వాత ఆ పసికందు జీవితం సాఫీగానే సాగింది. ఈమధ్య.. కొన్నాళ్ల కిందట అత్తింటి వాళ్లమంటూ కొందరు రేఖ ఇంటికి రావడంతో.. ఆమె షాక్ తింది. ఇన్నాళ్లూ విషయం తెలియకుండానే పెంచారు ఆమెను. దీంతో తల్లిదండ్రులు, చుట్టాల ఒత్తిడి మేరకు ఆమె బలవంతంగానే మెడలో తాళిబొట్టు వేసుకుని.. ఆ ఇంట కోడలిగా అడుగుపెట్టింది. అయితే.. అక్కడికి వెళ్లాక చదువుకోనీయకుండా భర్త, అతని తల్లిదండ్రులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో మానసికంగా కుమిలిపోయింది. మరోవైపు ఇన్నాళ్లపాటు వివాహం అయ్యిందనే విషయం దాచినందుకు.. తమ దగ్గరికి పంపనందుకు కుల పరిహారం పేరిట రేఖ తల్లిదండ్రుల నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేయసాగారు. ఈ పరిస్థితుల్లో.. రేఖకు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కృతి భారతి గురించి తెలిసింది. కృతి భారతి.. ప్రముఖ ఉద్యమకారణి. అంతేకాదు.. బీబీసీ అత్యంత స్ఫూర్తిదాయకమైన 100 మహిళల్లో ఒకరిగా చోటు సంపాదించుకున్న వ్యక్తి కూడా. ఆమె సాయంతో జోధ్‌పూర్ ఫ్యామిలీకోర్టులో వివాహ రద్దు కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది రేఖ. ఆ కుటుంబం నుంచి విముక్తి కలిగిస్తూ.. చదువుకోవాలనే తన ఆశయానికి సాయపడాలంటూ కోర్టును వేడుకుంది. దీంతో.. బాల్యవివాహంగా పరిగణిస్తూ.. నేరంగా పేర్కొంటూ న్యాయమూర్తి ప్రదీప్ కుమార్ మోదీ వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. విశేషం ఏంటంటే.. ఆమె పుట్టినరోజు నాడే తీర్పు రావడం. దీంతో ఇష్టం లేకుండా.. అదీ తనకు ఊహతెలియని వయసులో జరిగిన వివాహ రద్దు తీర్పు కాపీలను ఆమె కానుకగా కృతి నుంచి అందుకుంది. ఇదీ చదవండి: ఇది కథ కాదు.. 75 ఏళ్లకు కలిసిన రక్తసంబంధం -
నాకు నా భార్యతో కలిసి జీవించాలని లేదు: హీరో పవన్
Bhojpuri Actor Pawan Singh Divorce Case: భోజ్‌పురి సూపర్ స్టార్ పవన్ సింగ్, ఆయన భార్య జ్యోతి సింగ్ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని అరా ఫ్యామిలీ కోర్టు తేల్చి చెప్పింది. అక్టోబర్ 9, 2021న పవన్ విడాకుల కోసం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన కోర్టు మే 26కు వాయిదా వేసింది. తదుపరి విచారణలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని సూచించింది. అయితే ఈ విచారణ ఏప్రిల్ 28న జరగాల్సింది. కానీ పలు కారణాల వల్ల పవన్ సింగ్ కోర్టుకు హాజరుకాకపోవడంతో మే 26కు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇంతకుముందు విడాకుల గురించి పవన్ మాట్లాడుతూ 'నాకు నా భార్యతో కలిసి జీవించాలని లేదు. నాకు తనతో జీవించడం ఇష్టం లేదు. డివోర్స్ కావాలి.' అని తెలిపాడు. దీతో అతడి భార్య జ్యోతిసింగ్ కూడా పవన్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక జ్యోతిసింగ్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ 'జ్యోతికి పవన్ సింగ్ రెండు సార్లు అబార్షన్ చేయించారు. పెళ్లయిన తర్వాత నిత్యం భార్యను కొట్టడంతోపాటు చిత్రహింసలు పెట్టేవాడు. అదితట్టుకోలేక గత కొన్ని నెలలుగా జ్యోతిసింగ్ తన తల్లి ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి పవన్ సింగ్ నుంచి విడాకులతోపాటు మధ్యంతర భరణం కూడా ఇప్పించాలి' అని కోర్టును కోరారు. చదవండి: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు ఎన్సీబీ క్లీన్ చిట్.. ఇదిలా ఉంటే పవన్ సింగ్ మొదటి భార్య నీలం సింగ్ మనస్పర్థల కారణంగా మార్చి 8, 2015న ముంబైలోని ఒక ఫ్లాట్‌లో ఆత్యహత్య చేసుకుంది. తర్వాత కొద్ది రోజులకు పాపులర్ నటి అక్షరా సింగ్‌తో పవన్ సింగ్ రిలేషన్లో ఉన్నట్లు వార్తలు హల్చల్ చేశాయి. మార్చి 7, 2018న ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన జ్యోతిసింగ్‌ను వివాహం చేసుకుని అందరిని షాక్‌కు గురి చేశాడు పవన్ సింగ్. చదవండి: 'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్ -
పెళ్లి చేసుకోకపోయినా ఖర్చులు రాబట్టుకోవచ్చు! హైకోర్టు కీలక తీర్పు
రాయ్‌పూర్: వివాహం కానప్పటికీ కుమార్తె తన తల్లిదండ్రుల నుంచి పెళ్లిఖర్చులను రాబట్టుకోవచ్చని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్, 1956లోని నిబంధనల ప్రకారం.. పెళ్లికాని కుమార్తె తన తల్లిదండ్రుల నుంచి వివాహ ఖర్చులను క్లెయిమ్ చేసుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన రాజేశ్వరి అనే 35 ఏళ్ల మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను బిలాస్‌పూర్‌లోని హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. తన తండ్రి నుంచి వివాహ ఖర్చులు ఇప్పించాలని ఆమె వేసిన పిటిషన్‌ను జస్టిస్ గౌతమ్ భాదురి, జస్టిస్ సంజయ్ ఎస్ అగర్వాల్‌లతో కూడిన ధర్మాసనం మార్చి 21న విచారణకు అనుమతించిందని పిటిషనర్ న్యాయవాది ఎకె తివారి తెలిపారు. బిలాయ్ స్టీల్ ప్లాంట్(బీఎస్పీ) ఉద్యోగి అయిన తన తండ్రి భాను రామ్ కు పదవీ విరమణ ద్వారా రూ.55 లక్షలు రానున్నాయని.. ఇందులో తనకు రూ. 20 లక్షలు ఇచ్చేలా బీఎస్పీని ఆదేశించాలని 2016, జనవరి 7న దుర్గ్ జిల్లా కుటుంబ న్యాయస్థానాన్ని రాజేశ్వరి ఆశ్రయించారు. అయితే ఆమె అభ్యర్థనను జిల్లా కోర్టు తిరస్కరించింది. కుటుంబ న్యాయస్థానం ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. చట్టం ప్రకారం.. పెళ్లికాని కుమార్తె తన తండ్రి నుంచి వివాహ ఖర్చులను డిమాండ్ చేయవచ్చని.. ఆ ఖర్చు మెయింటెనెన్స్ పరిధిలోకి వస్తుందని హైకోర్టుకు విన్నవించినట్టు రాజేశ్వరి తరపు న్యాయవాది తివారి తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు వెలువరించిందని ఆయన చెప్పారు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఈ తరహా తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. (క్లిక్: ఆ 72 మంది ఎంపీలతో ప్రధాని ఫొటో సెషన్) -
భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్ కాల్స్ రికార్డు చేయడం నేరం: హైకోర్టు
Recording wife’s telephonic call without her consent is a blatant violation of her privacy చండీఘడ్: భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్ కాల్స్‌ను భర్త రికార్డు చేయడం గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. జనవరి 20, 2020 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ లిసా గిల ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. పంజాబ్‌లోని భటిండాకు చెందిన ఓ వ్యక్తి భార్య వేదింపులకు గురిచేస్తోందని, విడాకులు ఇప్పించమని కోర్టును ఆశ్రయించాడు. అందుకు సాక్షంగా ఫోన్ సంభాషణలను సమర్పించాడు. దీంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఫిబ్రవరి 20, 2007లో సదరు భార్యభర్తలిరువురికీ వివాహం జరిగింది. 2011 మేలో వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. ఐతే మనస్పర్ధల కారణంగా 2017లో విడాకులు కోరుతూ భర్త పిటిషన్ దాఖలు చేశాడు. క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో జూలై 9, 2019న భార్య భర్తలిరువురి ఫోన్ సంభాషణకు సంబంధించిన సీడీ, సిమ్ కార్డులను సాక్షాలుగా సమర్పించాడు. దీన్ని సవాల్ చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించింది. తనకు తెలియకుండా తన సంభాషణలను రికార్డు చేయడం గోప్యతను ఉల్లంఘించడమేనని వాదించింది. ఐతే భార్య వేధింపులకు సాక్షాలుగా మాత్రమే వీటిని సమర్పించామని, ఆమె గోప్యతకు భంగం కలిగించాలనే ఉద్దేశ్యంతోకాదని భర్త తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఫోన్ రికార్డులను సాక్షాలుగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. అంతేకాకుండా భార్య అనుమతి లేకుండా, ఆమెకు తెలియకుండా ఫోన్ సంభాషణలు రికార్డు చేయడం నేరమని పంజాబ్- హర్యానా హైకోర్టు వెల్లడించింది. ఈ సందర్భంగా ఫోన్ రికార్డింగ్‌లను సాక్ష్యంగా పరిగణించకుండా విడాకుల కేసుపై ఆరు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని భటిండా ఫ్యామిలీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. చదవండి: అదిరిపోయే స్కీమ్! ఈ సేవింగ్ స్కీమ్‌లో పొదుపు చేసిన సొమ్ము 124 నెలల్లో రెట్టింపవుతుంది! -
అప్పట్లో సంచలనం రేపిన ఆ ఇద్దరు ఐఏఎస్‌లకు విడాకులు
జైపూర్: ఐఏఎస్ టాపర్లుగా నిలవడంతో పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం దేశవ్యాప్తంగా అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే వారి పెళ్లి తీవ్ర వివాదాస్పదమైంది. మతాలు వేరు కావడంతో ఆ పెళ్లిని పలు మత సంఘాలు తప్పుబట్టాయి. అయితే తాజాగా ఆ దంపతులు విడిపోయారు. అధికారికంగా న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేసింది. ఆ ఇద్దరే టినా దాబి, అథార్ ఖాన్. టినా దాబి 2015 సివిల్స్‌లో మొదటి ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించింది. అదే ఏడాది కశ్మీర్‌కు చెందిన అథార్ ఖాన్ రెండో ర్యాంక్ సాధించాడు. శిక్షణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అధికారులుగా మారిన అనంతరం వారిద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి రాజకీయ నాయకులు, సామాజిక ప్రముఖులు హాజరై అభినందించి ప్రశంసించారు. టినా ఢిల్లీలోని శ్రీరామ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. టీనా, అథార్ ఖాన్ తొలి ప్రయత్నంలోనే టాప్ ర్యాంక్‌లు సాధించి సంచలనం సృష్టించారు. రాజస్థాన్ కేడర్‌కు చెందిన వీరిద్దరూ జైపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రేమలోనూ.. పాలనలోనూ ఈ జంట విజయవంతంగా రాణించారు. అయితే ఏమైందో ఏమోగానీ ఇప్పుడు టినా, అథార్ విడాకుల కోసం జైపూర్‌లోని కుటుంబ (ఫ్యామిలీ) కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన అనంతరం న్యాయస్థానం వీరిద్దరికీ మంగళవారం విడాకులు మంజూరు చేసింది. మెరుగైన పాలన అందిస్తూ అందరి నోళ్లల్లో నానిన వీరు విడాకులు తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు రాజకీయ, ఇతర ప్రముఖుల శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేకార్షణగా నిలిచిన ఆ దంపతులు విడిపోవడం షాకిచ్చింది. అయితే ఈ విడాకుల వెనుక కొందరి బెదిరింపులు ఉన్నాయని సమాచారం. పెళ్లి వివాదాస్పదం కావడంతో విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది. -
బాల్య వివాహమైన 12 ఏళ్ల తర్వాత కోర్టుకు..
జైపూర్ : బాల్య వివాహం అయిన 12 ఏళ్ల తర్వాత తన వివాహాన్ని రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిందో యువతి. ఈ సంఘటన రాజస్తాన్‌లోని బిల్వారా జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బిల్వారా జిల్లా పలాడి గ్రామానికి చెందిన మన్షి అనే యువతికి 7 ఏళ్ల వయసున్నపుడు 2009లో బాల్య వివాహమైంది. ఆ తర్వాతినుంచి ఇంటి వద్దే ఉంటూ చదువు కొనసాగిస్తోంది. ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. ఈ నేపథ్యంలో అత్తంటి వారు కాపురానికి రావాలంటూ యువతిపై ఒత్తిడి తేసాగారు. సదరు యువతి ఇందుకు ఒప్పుకోలేదు. తనకు జరిగిన బాల్య వివాహం చెల్లదని తేల్చి చెప్పింది. కాపురానికి రాకపోతే పంచాయితీలో పెట్టి కుటుంబాన్ని సామాజికంగా వెలివేయిస్తామని బెదిరింపులకు దిగారు అత్తింటివారు. వారి వేధింపులు ఎక్కువవటంతో దాదాపు 12 ఏళ్ల తర్వాత సారథి ట్రస్ట్ సహకారంతో మన్షి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు జడ్జి ముకేశ్ భార్గవ.. మన్షి భర్తకు సమన్లు జారీ చేశారు. బాల్య వివాహాల విషయంలో కఠినమైన చర్యలుంటాయని స్పష్టం చేశారు. చదవండి : దుస్తులు విప్పేస్తే డబ్బుల వర్షం కురుస్తుంది -
వివాహేతర సంబంధం: కోటిన్నరకు భర్తను అమ్మేసింది!
భోపాల్: కుటుంబ కథా చిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన ‘శుభలగ్నం’ సినిమా మీకు గుర్తుంది కదా. ఇందులో ఆమని తన భర్త అయిన జగపతి బాబును రోజాకు కోటి రూపాయలకు అమ్మేస్తుంది. 90లలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా అచ్చం ఈ సినిమాను తలపించే ఓ సంఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. 1.5 కోట్ల రూపాయలు తీసుకుని తన భర్తను మరో మహిళకు సొంతం చేసిన ఈ సంఘటన మంగళవారం భోపాల్ ఫ్యామిలీ కోర్టులో జరిగింది. ఈ కేసు స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాలు.. తన తండ్రి ఆఫీసులో మరో మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకుని తరచూ తన తల్లితో గొడవ పడుతున్నాడంటూ ఓ బాలిక భోపాల్ పోలీసు స్టేషన్లో ఇటీవల ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులు తరచూ గొడవ పడటం వల్ల ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయిందని, దీని వల్ల తాను, తన చెల్లెలు చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నామంటూ బాలిక పోలీసుల ముందు వాపోయింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసు విచారణను భోపాల్ ఫ్యామిలీ కోర్టుకు తరలించారు. దీంతో దీనిపై విచారణ ప్రారంభించిన ఫ్యామిలీ కోర్టు బాలిక తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చింది. ఈ కౌన్సిలింగ్లో బాలిక తండ్రికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో కోర్టు ఆ వ్యక్తిని తన భార్యతోనే ఉండాలని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయితే అతడు తన ప్రియురాలితోనే ఉంటానని చెప్పాడు. అంతేగాక తన భార్య నుంచి విడాకులు కావాలని కోరాడు. దీనికి అతడి భార్య నిరాకరిస్తూ.. అతను మరో పెళ్లి చేసుకుని తన దారి తను చూసుకుంటూ తన పిల్లల భవిష్యత్తు ఏంటని ప్రశ్నించింది. అయినప్పటికి అతడు తన ప్రియురాలితోనే ఉంటానని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో కోర్టు వారికి పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చింది. అయినప్పటికి సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఈ క్రమంలో చివరకు అతడి భార్య ఓ షరతుపై విడాకులకు అంగీకరించింది. అదేంటంటే తన భర్త ఆమెతో ఉండాలంటే సదరు మహిళ తనకు డబ్బులు చెల్లించాలని చెప్పింది. దీనికి కూడా తన భర్త ప్రియురాలు అంగీకరించడంతో ఆ మహిళ తనకు ఖరీదైన ప్లాటుతో పాటు రూ. 1.5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీనికి ఆమె భర్త ప్రియురాలు తాను సెటిల్మెంట్ క్యాష్ కింద కేవలం రూ. 27 లక్షలు మాత్రమే ఇవ్వగలనని చెప్పింది. దీనికి సదరు మహిళ తాను అడిగింత డబ్బు చెల్లిస్తేనే విడాకులు ఇస్తానని స్పష్టం చేసింది. అయితే ఈ డబ్బును తన పిల్లల భవిష్యత్తు కోసమే తాను డిమాండ్ చేశానని, తనకు డబ్బు మీద ఆశతో కాదని పేర్కొంది. -
'నాన్నా'.. అని పిలవడమే మానేసింది
‘నాన్నా..’ అని పిలవడమే మానేసింది ఆ కూతురు తన తండ్రిని! ఇంట్లోని ముగ్గురు పిల్లల్లో చివరి అమ్మాయి. చివరి అమ్మాయి అంటే మరీ చిన్నమ్మాయి కూడా కాదు. ఇరవై నాలుగేళ్లు. ఒక తండ్రి తన కూతురికి పంచాల్సిన కనీస ప్రేమను కూడా పంచలేదని ఆ అమ్మాయి ఆవేదన. ‘ఆయన్ని నేనెంతో నమ్మాను. ఆయన్నుంచి ఎంతో ఆశించాను. కానీ నా నమ్మకాన్ని, ఆశను ఆయన అస్సలు పట్టించుకోలేదు‘ అని ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేసింది. లాక్డౌన్లో ఆ తండ్రీ కూతుళ్లు లూడో గేమ్ ఆడారు. ఆడిన ప్రతిసారీ కూతురు అని కూడా చూడకుండా ఆ తండ్రే గెలిచాడు. కూతురు కోసం కనీసం ఒక్కసారైనా ఆయన ఓడిపోలేదు. ఏ తండ్రయినా ఇలా చేస్తాడా.. అని మొదట ఆమె అలగడం వరకే చేసింది. తర్వాత ముభావంగా ఉండటం మొదలు పెట్టింది. చివరికి తండ్రితో మాట్లాడ్డమే మానేసింది. ఆమెకు కోపం రావడం సహజమే అనిపించేంతగా లూడో గేమ్‌లో ఆయన ఆమె టోకెన్స్‌ని కిల్ చేసేవారు. మిగతా ఇద్దరు పిల్లలు కూడా తండ్రి చేతిలో ఓడిపోయినా ఓటమిని మర్చిపోయారు. ఆమె మాత్రం ఓటమిని గుర్తుపెట్టుకొని తండ్రిపై కోపం పెంచుకుంటూ వచ్చింది. అలా ఫ్యామిలీ కోర్టు దాకా వచ్చింది. ఆమెను బయట కూర్చోబెట్టి ఫ్యామిలీ కోర్టు కౌన్సెలర్ సరితారజని తండ్రిని లోనికి పిలిచారు. ‘ఈకాలం పిల్లలు ఓటమిని అస్సలు తట్టుకోలేక పోతున్నారు. మీరు కనీసం ఒకసారైనా తన చేతిలో ఓడిపోవలసింది’ అన్నారు. ఆ తండ్రి తన ఉద్దేశం చెప్పాడు. ‘ఆటలో తండ్రీకూతుళ్లు ఉండరు. ప్రత్యర్ధులు మాత్రమే ఉంటారు. కూతురు కోసం తండ్రి ఓడిపోయి ఆమెను గెలిపించడమే ఆమెను నిజంగా ఓడించడం. ఆ ఓటమి కన్నా ఆమెను గెలిపించని ఓటమే ఆమెకు గౌరవం కదా’ అన్నారు. కూతురికి తగ్గ తండ్రి అనుకుని ఉండాలి ఆ కౌన్సెలింగ్ ఆఫీసర్. ఈ తండ్రీకూతుళ్ల సంవాదం భోపాల్‌లో జరుగుతోంది. -
లూడో గేమ్‌లో మోసం: తండ్రిపై కోర్టుకెక్కిన కుమార్తె
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ ప్రత్యేకమైన కేసు వెలుగులోకి వచ్చింది. లూడో ఆట ఆడే సమయంలో తన తండ్రి తనను మోసం చేశాడని 24ఏళ్ల యువతి తన తండ్రిపై ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేసింది. దీంతో ఫ్యామిలీ కోర్టు కౌన్సిలర్ ఆ యువతికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వివరాల్లోకెళ్తే.. ఖాళీ సమయాల్లో సదురు యవతి తన తండ్రితో లూడో గేమ్ ఆడుతూ ఉంటుంది. ఆమెకు తన తండ్రి మీద ఎంతో నమ్మకం. (కేంద్ర మాజీమంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత) అయితే అతడు కుమార్తెతో లూడో గేమ్ ఆడే సమయంలో మోసం చేయడాన్ని భరించలేకపోయింది. దీంతో ఆ యువతి ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కోర్టు కౌన్సిలర్ సరిత మీడియాతో మాట్లాడుతూ.. ఆ యువతికి తరచుగా కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఇప్పటివరకూ నాలుగుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చాము. తన తండ్రి ఆమె ఆనందం కోసం ఆటలో ఓడిపోవాలని ఆమె భావిస్తున్నది. నాలుగు రౌండ్ల కౌన్సిలింగ్ అనంతరం ఆ యువతి సానుకూలంగా స్పందిస్తున్నట్లు' కోర్టు కౌన్సిలర్ సరిత తెలిపారు. -
కరోనా ఎఫెక్ట్ : ఆ జంటకు డిజిటల్ విడాకులు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి ముందు విడాకుల పిటిషన్ దాఖలు చేసేందుకు జంటలు అడ్వకేట్ల చుట్టూ తిరగడంతో పాటు విడాకులు మంజూరయ్యే వరకూ నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉండేది. కరోనా మహమ్మారి విజృంభణతో ఢిల్లీలోని ఓ ఫ్యామిలీ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ జంటకు విడాకులు మంజూరు చేసింది. 2017 మేలో వివాహమైన జంట విభేదాలు తలెత్తడంతో ఏడాదికి పైగా విడివిడిగా ఉంటూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఏడాదికి పైగా వేర్వేరుగా ఉంటున్న జంటలు పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేయవచ్చని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా రోహిణీ కుటుంబ న్యాయస్ధానం ఈ తీర్పును వెలువరించింది. హిందూ వివాహ చట్టం, 1955 సెక్షన్ 13 బీ (2) కింద 2019లో విడాకుల పిటిషన్ దాఖలు చేసిన ఈ జంటకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. తమ వైవాహిక బంధం పునరుద్ధరణకు కోర్టు కొద్దినెలలు సమయం ఇచ్చినా వారు తిరిగి విడాకులకు దరఖాస్తు చేయడంతో వారికి విడాకులు మంజూరయ్యాయి. చదవండి : కరోనా ఆస్పత్రిగా మారిన స్టార్ హోటల్ -
నిర్భయ కేసు: 20న ఉరి; విడాకులు కోరిన అక్షయ్ భార్య
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఉరి నుంచి తప్పించుకునే మార్గాలు అన్నీ దాదాపుగా మూసుకుపోయాయి. ఈ సమయంలో నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ భార్య పునీత విడాకులు కావాలంటూ మరో పిటిషన్‌ను తెరపైకి తీసుకువచ్చారు. ఈ మేరకు మంగళవారం రోజున ఔరంగాబాద్ ప్యామిలీ కోర్టులో విడాకుల కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ‘‘అత్యాచారం కేసులో నా భర్తను దోషిగా తేల్చి అతనికి ఉరిశిక్ష విధించారు. కానీ నా భర్త నిర్దోషి. రేప్ కేసులో ఉరితీసిన దోషి భార్యగా నేను ఉండాలనుకోవడం లేదు’’ అంటూ ఆమె ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్ మార్చి 19న విచారణకు రానుంది. ఈ విషయం గురించి పునీత తరఫు న్యాయవాది ముకేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘హిందూ వివాహ చట్టం 13(2)(11) ప్రకారం కొన్ని ప్రత్యేక కేసుల్లో విడాకులు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ ప్రత్యేక కేసుల్లో అత్యాచారం కూడా ఉంది. తన భర్త అత్యాచారం కేసులో దోషి అని తేలితే భార్య విడాకులు తీసుకోవచ్చు’’ అని ఆయన తెలిపారు. అయితే కొందరు న్యాయనిపుణులు ఆమె పిటిషన్‌ను విమర్శిస్తున్నారు. నేరం జరిగిన 8 ఏళ్ల తర్వాత, శిక్ష పడిన చాలా రోజుల తర్వాత విడాకుల పిటిషన్ వేస్తే కోర్టు అక్షయ్ కుమార్‌కు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అన్నారు. చదవండి: నేనప్పుడు అసలు ఢిల్లీలో లేను: నిర్భయ దోషి కాగా, నిర్భయ కేసులో నలుగురు దోషులకు మార్చి 20వ తేదీన ఉరిశిక్ష అమలు చేయాలని పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2012లో వైద్య విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా అత్యాచారం చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఆరుగురు దోషుల్లో ఒకరు మైనర్ కావడంతో శిక్ష అనుభవించి విడుదల అయ్యాడు. ప్రధాన దోషి రామ్ సింగ్ జైలులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముఖేశ్ సింగ్ తల్లి విజ్ఞప్తిని తిరస్కరించిన ఎన్హెచ్ఆర్సీ నిర్భయ దోషుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ తల్లి ఉరిశిక్ష అమలుపై జోక్యం చేసుకోవాలని జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను తోసిపుచ్చినట్లు ఎన్హెచ్ఆర్సీ అధికారులు తెలిపారు. చదవండి: అంతర్జాతీయ కోర్టుకు నిర్భయ దోషులు -
ఛీ.. ఆమె నా కూతురేంటి: ప్రముఖ గాయని
న్యూఢిల్లీ : బాలీవుడ్ గాయని అనురాధ పౌడ్వాల్ తన తల్లి అంటూ కేరళకు చెందిన ఒక మహిళ చేసిన వ్యాఖ్యలపై అనురాధ స్పందించారు. ఆమె తన కూతురు కాదని.. అవన్నీ తప్పుడు ఆరోపణలంటూ తీవ్రంగా మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన 45 ఏళ్ల కర్మలా మోడెక్స్.. బాలీవుడ్ గాయని అనురాధ పౌడ్వాల్ తన తల్లి అంటూ శుక్రవారం ఉదయం తిరువనంతపురంలో ఉన్న ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అనురాధ, ఆమె భర్త తన తల్లిదండ్రులంటూ పిటిషన్లో పేర్కొంది. 1974లో తనకు నాలుగు రోజుల వయసు ఉన్నప్పుడు వేరే వాళ్లకి దత్తత ఇచ్చి వెళ్లిపోయారని, అనురాధ తన సింగింగ్ కెరీర్‌కు ఆటంకం కలగకూడదనే ఇలా చేసిందంటూ పిటిషన్లో పేర్కొంది. తనను వదిలివెళ్లినందుకు పౌడ్వాల్ దంపతులు రూ. 50 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని మోడెక్స్ పేర్కొనడం విశేషం. వీటిన్నింటికి తన దగ్గర ఆధారాలున్నాయని, తనను పెంచిన ఫాదర్ చనిపోయేముందు అన్ని విషయాలు తనకు చెప్పాడని కర్మలా వెల్లడించారు. అంతేకాదు తన తల్లిని కలిసేందుకు ప్రయత్నించి చాలాసార్లు విఫలమయ్యానని పేర్కొన్నారు. 'నేను ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలను పట్టించుకోను. అయినా ఇలాంటి వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆమె నా గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ' గాయని అనురాధ మండిపడ్డారు. ఇదే విషయమై అనురాధ పౌడ్వాల్ ప్రతినిధి మాట్లాడుతూ... కర్మలా ఒక సైకోలాగా ప్రవర్తిసుందని తెలిపారు. అనురాధకు కూతురు ఉన్న విషయం నిజమేనని అయితే ఆమె పేరు కవిత అని పేర్కొన్నారు. వాళ్లిద్దరు నా తల్లిదండ్రులు అని చెబుతున్న కర్మలాకు తండ్రి చనిపోయాడన్న విషయం తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని, ఒకవేళ ఆమె చేసిన ఆరోపణలు నిజమైతే రూ. 50 కోట్లు ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేస్తుందో చెప్పాలని మండిపడ్డారు. బాలీవుడ్ గాయనీగా ఎన్నో సినిమాల్లో పాటలు పాడిన అనురాధను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1969లో అరుణ్ పౌడ్వాల్‌ను ఆమె పెళ్లాడారు. వారికి కొడుకు ఆదిత్య, కూతురు కవితలు సంతానం. -
భర్త స్నానం చేయట్లేదని విడాకులు!
భోపాల్ : ఈ మధ్య విడాకులు అడగడానికి కారణాలు కూడా ఉండట్లేదు. అడిగింది కొనివ్వడం లేదని, బయటకు తీసుకెళ్లడం లేదని.. ఇలా ఏవేవో చిన్న కారణాలతో విడాకుల వరకు వెళ్తోంది వ్యవహారం. ఆన్లైన్ ఆర్డర్ చేసినంత ఈజీగా విడాకులు కావాలని అడిగేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే.. మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గతేడాది వివాహం చేసుకున్న ఓ జంట.. విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. ఆర్నేళ్ల పాటు విడిగా ఉండండి..ఆ తర్వాత విడాకులు మంజూరు చేస్తామని భోపాల్ ఫ్యామిలీ కోర్టు తెలిపింది. ఇంతకీ విడాకులు ఎందుకు కావాలని అడిగితే.. తన భర్త గడ్డం తీసేయడం లేదని, రోజుల తరబడి స్నానం చేయడం లేదని.. ఏదైనా అంటే పర్ఫ్యూమ్ కొట్టుకుంటాడనే కారణాలను చెప్పింది. ఇద్దరు కలిసి కోర్టును ఆశ్రయించగా.. పైవిధంగా తీర్పునిచ్చింది. గతంలో మీరట్‌కు చెందిన ఓ గృహిణి కూడా ఇలాగే.. గడ్డం తీసేస్తావా లేదంటే ఆత్మహత్య చేసుకోవాలా? అని తన భర్తను బెదిరించింది. -
నా నిర్ణయం తప్పా?
పాపాయి పుట్టినప్పుడు ఉద్యోగం మానేశాను. అప్పటికీ తొమ్మిదో నెల వరకు డ్యూటీకి వెళ్లాను. ఇప్పుడు పాపాయికి తొమ్మిది నెలలు. పాప కొంచెం పెద్దయిన తర్వాత మళ్లీ చేరవచ్చని అతడే చెప్పాడు కూడా. ఇప్పుడు నేరుగా ఏమీ అనరు. కానీ ‘ఒక్కడి జీతంతో ఎన్ని ఖర్చులని భరిస్తాడు’ అని అత్తగారు, ‘పాపాయి ఖర్చులు వచ్చాయిగా, అందరికీ అన్నీ అమరాలంటే మీ పుట్టింటిలో పోసిన రాశుల్లో ఒకటి తేవాల్సింది’ అని భర్త సూటిపోటి మాటలంటున్నారు. నా బర్త్‌డేకి డ్రస్ కొనడానికే ఇదంతా. తల్లీ కొడుకు ముఖాలు గుర్తుకు వస్తుంటే కొత్త డ్రస్ వేసుకోవాలనే కోరిక కూడా చచ్చిపోయింది. ‘నేను ఉద్యోగం మానేసి తప్పు చేశాను’ అనుకోని రోజు ఉండడం లేదు. – స్వాతి, చిత్తూరు ఫ్యామిలీ కోర్టుకు వచ్చే కేసుల్లో కొంతమంది వాదన విచిత్రంగా ఉంటుంది. పిల్లలను పెంచాల్సిన బాధ్యత పూర్తిగా ఆడవాళ్లదే అన్నట్లుంటారు భర్తలు. అదే వారి మధ్య వివాదానికి కారణమవుతుంటుంది. పిల్లల్ని పెంచడంలో ఈక్వల్షేరింగ్ ఉండాలనే అవగాహనకు తీసుకురావడానికి చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. పిల్లల పెంపకంలో మగవాళ్లు కూడా సమాన బాధ్యతను పంచుకోవాలి. ఇక ఆడవాళ్లు ఆర్థిక వెసులుబాటును కాపాడుకోవాలి. పిల్లల్ని కని, పెంచడానికి తల్లి ఉద్యోగంలో విరామం తీసుకోవాల్సిందే. అలాంటప్పుడు కొన్ని అన్ఆర్గనైజ్డ్ జాబ్స్‌లో ఆమెకి జీతం రాదు. అలాంటప్పుడు స్వాతి విషయంలో జరిగినట్లే డ్రెస్ కొనుక్కోవాలనిపించినా కూడా చేతిలో డబ్బు ఉండదు. తనకు జీతం వస్తున్న రోజుల్లో సొంతానికి సేవ్ చేసుకుంటే ఈ సమస్య ఉండదు. ఆర్థిక వెసులుబాటు ఉన్న అమ్మాయి చాలా సమస్యలను గోరంతలు కొండంతలు కాకముందే తనకు తానుగా చక్కదిద్దుకోగలుగుతుంది. కొన్ని సందర్భాలలో ఆర్థిక స్వావలంబన అవసరానికి మించి ఉండి, స్వీయ క్రమశిక్షణ లేకపోతే ఆ డబ్బే వివాదాలకు కారణమవుతుంటుంది. అలాంటిది ఒక్కటి కనిపిస్తే చాలు... ఇక ఆ అమ్మాయి వైపే వేలెత్తి చూపిస్తూ ‘అమ్మాయిల చేతిలో డబ్బుంటే ఇలాగే ఉంటుంది’ అనేస్తారు. ఆర్థిక స్వావలంబన కారణంగా ఎంత మంది మహిళలు కుటుంబాలను తీర్చి దిద్దుకుంటున్నారనే విషయాలను పట్టించుకోరు. ఆ వాస్తవాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు కూడా. - నిశ్చల సిద్ధారెడ్డి లాయర్, ఫ్యామిలీ కౌన్సెలర్ మాకు పంపండి: ఒక మహిళగా మీరు గృహహింస వంటి వేధింపులకు గానీ, సామాజికంగా వివక్షకుగానీ లేదా సంబంధిత ఇతర సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యను రాసి మాకు మెయిల్ ద్వారా పంపించండి.ఆయా రంగాలకు చెందిన నిపుణులతో మీకు తగిన సూచనలు / సలహాలు ఇప్పించే ఏర్పాటు చేస్తాం. మీరు మీ ప్రశ్నలను పంపాల్సిన మెయిల్ ఐడీ :nenusakthiquestions@gmail.com -
వంట సరిగా చేయడం లేదని విడాకులా..?
ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం లేదని, రుచికరంగా వంట చేయడం లేదని ఓ భర్త, తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నాడు. కానీ ఇది ఏ మాత్రం సబబు కాదని, ఆ ఆరోపణల్లో ఎలాంటి రుజువు లేదని ఆ విడాకుల పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. వివరాల్లోకి వెళ్తే.. శాంటాక్రూజ్కు చెందిన ఓ వ్యక్తి, ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేశాడు. అదీ కూడా భార్య సరిగ్గా వంట చేయడం లేదనే సిల్లీ కారణంతో. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు, భర్త వేసిన విడాకుల పిటిషన్‌ను కొట్టివేసింది. భార్య ఉద్యోగిని అని, ఆమె తన భర్త పట్ల ఎలాంటి క్రూరత్వం ప్రదర్శించడం లేదని ఫ్యామిలీ కోర్టు తేల్చింది. అంతేకాక ఆమె అన్ని రకాల పనులను తానే చేస్తుందని, సరుకులు కొనుగోలు చేయడం, ఫిర్యాదుదారునికి, వారి కుటుంబ సభ్యులకు వంట చేసి పెట్టడం, అన్ని ఇతర పనులు ఆమె నిర్వహిస్తుందని ఫ్యామిలీ కోర్టు విచారణలో తేలింది. కానీ ఫ్యామిలీ కోర్టు తీరును నిరసిస్తూ.. ఆ వ్యక్తి బాంబే హైకోర్టుకి వెళ్లాడు. జస్టిస్ కేకే టేటెడ్, సారాం కోట్వాల్ నేతృత్వంలోని బెంచ్ సైతం ఫ్యామిలీ కోర్టు తీర్పునే సమర్థించింది. రుచికరంగా భోజనం వండటం లేదనే ఆరోపణలతో ఫిర్యాదుదారుడు విడాకులు కోరడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని హైకోర్టు సైతం పేర్కొంది. అయితే ఆమెపై ఆ నిందలు మాత్రమే కాకుండా.. ఉదయాన్నే ఆమెను నిద్ర లేపితే, తమ కుటుంబ సభ్యులని, తనని తిడుతుందనీ ఆరోపించాడు. ఉద్యోగం నుంచి సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి తిరిగి వచ్చాక, నిద్ర పోతుందని, రాత్రి 8.30కు వంట చేస్తుందని, ఆ వంట కూడా రుచికరంగా చేయదంటూ ఆరోపణలు గుప్పించాడు. తనతో కాస్త సమయమైన గడపదంటూ చెప్పుకొచ్చాడు. ఏదైనా పని వల్ల ఇంటికి లేటుగా వస్తే, కనీసం ఒక్క గ్లాస్ మంచినీళ్లు కూడా ఇవ్వదని తెలిపాడు. ఈ ఆరోపణలన్నింటిన్నీ భార్య తోసిపుచ్చింది. ఉద్యోగానికి వెళ్లే ముందే తమ కుటుంబం మొత్తానికి వంట చేసి వెళతానని చెప్పింది. అన్ని సాక్ష్యాధారాలతో సహా కోర్టుకు సమర్పించింది. తన అత్తింటి వారే వేధిస్తున్నట్టు ఆమె తన పిటిషన్లో పేర్కొంది. ఫిర్యాదుదారుడి పేర్కొన్న విషయాలను నమ్మడం చాలా కష్టంగా ఉందని, తాను చెప్పే ఏ విషయంలోనూ భార్య క్రూరత్వం ప్రదర్శిస్తున్నట్టు లేదని బెంచ్ తేల్చింది. కేవలం ఉద్యోగం చేయడం మాత్రమే కాకుండా.. ఉదయం, సాయంత్రం తానే వంట చేయడం, కూరగాయలు, గ్రోసరీలు కొనుక్కోని రావడం అంతా తానే చేస్తుందని బెంచ్ తెలిపింది. ఈ మొత్తం వ్యవహారాన్నంతటిన్నీ పరిశీలించిన అనంతరం భర్త కోరినట్టు విడాకులు మంజూరు చేయలేమని ఆ విడాకుల పిటిషన్‌ను కొట్టిపారేసింది. -
‘టాయ్‌లెట్’తో భార్యకు టార్చర్.. విడాకులు
జైపూర్ : రాజస్థాన్ లో ఓ భార్య తాను అనుభవిస్తున్న మానసిక క్షోభ నుంచి ఎట్టకేలకు విముక్తి పొందింది. మరుగుదొడ్డి కట్టించకుండా వేధిస్తున్న ఓ భర్త నుంచి విడాకులకు దరఖాస్తు చేసుకోగా, దానిని క్రూరత్వం కింద పరిగణించిన స్థానిక కుటుంబ న్యాయస్థానం ఆమెకు విడాకులు మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే...బిలావర జిల్లా అటున్ గ్రామానికి చెందిన వ్యక్తితో 2011లో ఓ యువతికి వివాహం జరిగింది. అయితే అత్తారింటికి వెళ్లిన ఆమెకు ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవటం విస్మయాన్ని కలిగించింది. మరుగుదొడ్డి కట్టించాలని అప్పటి నుంచి ఇంట్లో ఆడపడుచులతో సహా భర్త పై ఒత్తిడి తేవటం ప్రారంభించింది. అలా నాలుగేళ్లు ఇంట్లో వాళ్లకి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోగా పైగా భర్త చేతిలో తరచు తన్నులు కూడా తిన్నది. చివరకు ఓపిక నశించటంతో ఆమె కన్నవారి ఇంటికి వెళ్లిపోయింది. మరుగుదొడ్డి ఉంటేనే తిరిగి కాపురానికి వస్తానని భర్తకు తేల్చి చెప్పింది. రెండేళ్లు గడుస్తున్నా భర్త ఆ పని చేయకపోవటంతో చివరకు ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ‘మన ఇంట్లో మహిళలకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుంది? వారిని బహిరంగ మలవిసర్జనకు ప్రోత్సహించటం సరైందేనా? చీకటి పడేంత వరకు ఆ బాధను ఓర్చుకుని మరీ వాళ్లు బయటికి వెళ్తున్న సంగతి తెలీదా? విలాసాలకు విచ్చల విడిగా ఖర్చుపెట్టే వాళ్లు ఇంట్లో మరుగుదొడ్లను మాత్రం నిర్మించలేకపోతున్నారు. ఇది సిగ్గు పడాల్సిన విషయం. ఆ మహిళ అనుభవించింది ముమ్మాటికీ మానసిక వేదనే. అందుకే క్రూరత్వం కింద పరిగణించి ఆమెకు విడాకులు మంజూరు చేస్తున్నా’. అంటూ న్యాయమూర్తి శర్మ తీర్పు వెలువరించే సమయంలో వ్యాఖ్యలు చేశారు. -
ఎవరో కావాలని చేయిస్తున్నారు
మనోవర్తి కేసుపై పృథ్వీరాజ్ సాక్షి, హైదరాబాద్: ఎవరో కావాలని తన కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారని, ఇది బాధాకరమని ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ అన్నారు. 2015లో తన కూతురు పెళ్లి జరిపించానని, కుటుంబాన్ని పట్టించుకోకపోతే పెళ్లి ఎలా చేస్తానని ప్రశ్నించారు. తమను పృథ్వీరాజ్ పట్టించుకోవడంలేదని ఆయన భార్య శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఫ్యామిలీ కోర్టు.. మనోవర్తి కింద శ్రీలక్ష్మికి నెలకు రూ. 8 లక్షలు చెల్లించాలని ఉత్తర్వులు జారీచేసింది. కేసు విషయమై విదేశాల్లో షూటింగ్లో ఉన్న పృథ్వీరాజ్‌తో ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ‘కేసు న్యాయస్థానంలో ఉన్నప్పుడు నేనేం మాట్లాడకూడదు. అడిగారు కాబట్టి చెబుతున్నా. నాకెలాంటి నోటీసులు రాలేదు. పైగా విడిపోవడానికి నేను సిద్ధంగా లేను’ అన్నారు. పృథ్వీరాజ్, శ్రీలక్ష్మిల తనయుడు సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అమ్మానాన్నల గొడవలు ఉన్న మాట నిజమేనని, అయితే అవి కోర్టు వరకు వెళ్తాయని అనుకోలేదన్నారు. అమ్మగారు చాలా అమాయకురాలని, ఎవరో తన వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారన్నారు. విదేశాల నుంచి నాన్న రాగానే పూర్తి వివరాలు తెలియజేస్తారని చెప్పారు. -
కోర్టులో నటుడు పృథ్వీరాజ్‌కు చుక్కెదురు!
విజయవాడ: విభేదాలతో వేరుగా ఉంటున్న తన భార్యకు నెలకు రూ. 8 లక్షల చొప్పున భరణం చెల్లించాలని ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీచేసింది. పృథ్వీరాజ్ తనను నిర్లక్ష్యం చేస్తూ మానసికంగా వేధిస్తున్నారంటూ సెక్షన్ 498 ఏ గృహహింస చట్టం కింద ఆయన భార్య శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత జనవరి నుంచి ఈ కేసును విజయవాడ ఫ్యామిలీ కోర్టు విచారణ నడుస్తున్నప్పటికీ, ఎన్నడూ పృథ్వీరాజ్ కోర్టు విచారణకు హాజరుకాలేదు. పృథ్వీరాజ్, శ్రీలక్ష్మికి 1984లో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పృథ్వీరాజ్ కుటుంబం మొదట విజయవాడలో నివసించేంది. పృథ్వీరాజ్ కు సినిమాల్లో బ్రేక్ వచ్చిన తర్వాత ఆయన కుటుంబం హైదరాబాద్‌కు తరలివచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్లో భారీ డిమాండ్ ఉన్న కమెడియన్లలో పృథ్వీరాజ్ ఒకరు. ముఖ్యంగా ’ఖడ్గం’ సినిమాలో ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ డైలాగ్‌తో పృథ్వీరాజ్ లైమ్‌లైటులోకి వచ్చారు. ఇటీవలికాలంలో పృథ్వీరాజ్ తనను నిర్లక్ష్యం చేస్తూ.. మనసిక క్షోభకు గురిచేస్తున్నారని, ఇక ఆయనతో కలిసి ఉండటం తనకు సాధ్యం కాదని శ్రీలక్ష్మి కోర్టుకు తెలిపారు. భర్త ఆదాయ వివరాలను కోర్టుకు సమర్పించిన ఆమె.. తనకు నెల రూ. 10 లక్షల భరణం ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. అయితే, పృథ్వీరాజ్ ఆదాయ మార్గాలను పరిశీలించిన కోర్టు నెలకు రూ. 8 లక్షలు భరణం చెల్లించాలని గురువారం ఆదేశాలు జారీచేసింది. -
ఆ వివాదాలు తేలకుండా విడాకులివ్వద్దు
- ఎన్ఆర్ఐ భర్తకు కుటుంబ న్యాయస్థానం ఆదేశం - అమెరికాలో విడాకుల కేసు విచారణ నిలిపివేస్తూ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: భారత్‌లో ఉంటున్న బిడ్డ సంరక్షణ, భార్యతో ఉన్న ఆస్తుల పంపకం వివాదాలు తేలకుండా అమెరికాలో విడాకుల కేసును కొనసాగించవద్దని ఓ ఎన్ఆర్ఐని హైదరాబాద్ నగర కుటుంబ న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 31 వరకు విడాకులు కేసు విచారణను ఆపాలంటూ న్యాయమూర్తి తిరుపతయ్య సదరు ఎన్ఆర్ఐని ఆదేశిస్తూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. అదనపు కట్నం కోసం భార్యను వేధించడంతోపాటు భార్య, పిల్లలను భారత్‌కు పంపించి అమెరికా న్యాయస్థానం ద్వారా విడాకులు పొందాలని ప్రయత్నించిన ఎన్ఆర్ఐ కొమ్మినేని సిద్దిజ్ఞానేశ్వరప్రసాద్కు ఇక్కడి న్యాయస్థానం ఆదేశాలు ప్రతిబంధకంగా మారాయి. ఇక్కడి కేసులు, సివిల్ వివాదాలు తేలకుండా అమెరికాలో తన భర్త ప్రసాద్ వేసిన విడాకుల కేసు విచారించకుండా ఆదేశించాలని కోరుతూ సోని ఓలేటి కొమ్మినేని అనే మహిళ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హిందూ సంప్రదాయం ప్రకారం భారత్‌లో పెళ్లైందని, ఇక్కడ క్రిమినల్, సివిల్ వివాదాలు పెండింగ్‌లో ఉండగా ఏకపక్షంగా అమెరికాలో విడాకుల కేసు కొనసాగితే సోనికి అన్యాయం జరుగుతుందని ఆమె తరఫు న్యాయవాది వై.బాలాజీ కోర్టుకు నివేదించారు. 2013 డిసెంబర్ 6న తిరుపతిలో సోనీని ప్రసాద్ వివాహం చేసుకున్నారని, అనంతరం కోటి రూపాయలు కట్నం తేవాలంటూ ఆమెను వేధింపులకు గురిచేశారని తెలిపారు. కాన్పు ఖర్చు తేవాలని వేధింపులు అమెరికా వెళ్లేందుకు విమాన ఖర్చుల కోసం రూ.3 లక్షలు తీసుకొని సోనీని అమెరికా తీసుకెళ్లార ని న్యాయవాది వివరించారు. అమెరికాలో ఉన్న సమయంలో ఓ సారి హత్యాయత్నంతోపాటు కాన్పు ఖర్చునూ పుట్టింటి నుంచి తేవాలని వేధించే వారన్నారు. 2015 నవంబర్ 15న నెలల బాబుతో భార్యను భారత్‌లో వదిలి, ఆమె పాస్‌పోర్టు లాక్కొని ప్రసాద్ అమెరికా వెళ్లిపోయాడని పేర్కొ న్నారు. ఈ క్రమంలోనే ప్రసాద్ అమెరికాలోని టెక్సాస్ డెన్టౌన్ కౌంటీ జిల్లా కోర్టులో విడాకుల కేసు దాఖలు చేశారన్నారు. సమన్లు అందుకున్న సోని తమ మధ్య వివాదాలు తేలేవరకూ విడాకుల కేసు విచారించవద్దని అభ్యంతరం వ్యక్తం చేశారని వివరించారు. అయితే ఆ వివాదాలను పరిష్కరించే పరిధి తమకు లేదని, విడాకుల కేసును మాత్రమే విచారించే అధికారం తమకుందని అక్కడి కోర్టు స్పష్టం చేసింది. అక్కడి విడాకులు కేసులో ముందుకు వెళ్లకుండా ప్రసాద్‌ను ఆదేశించాలని కోరుతూ సోని కుటుంబ కోర్టును ఆశ్రయించింది. -
న్యాయమూర్తి ప్రేమావతికి ఘన సన్మానం
కర్నూలు(లీగల్): బదిలీపై వెళ్తున్న మొదటి అదనపు జిల్లా జడ్జి ఎస్.ప్రేమావతిని మంగళవారం సాయంత్రం కర్నూలు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. గత మూడున్నర సంవత్సరాలుగా కర్నూలు ఫ్యామిలీ కోర్టు జడ్జిగా, మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తూ గత నెల 27న జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో ఆమెను గుంటూరు జిల్లా రెండో అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేశారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షులు ఎస్.చాంద్‌బాషా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి మాట్లాడారు. న్యాయమూర్తుల బదిలీలు అనేది సర్వసాధారణమన్నారు. బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తి ఎస్.ప్రేమావతి మాట్లాడుతూ.. తనకు అదనపు జిల్లా జడ్జిగా కర్నూలుకు ఇవ్వడంతో స్నేహితులు కర్నూలు ఫ్యాక్షన్ ఏరియా అని, రాయలసీమ అని భయపెట్టారని, కానీ తాను విన్నదానికి, ఇక్కడ ఉన్న వాతావరణానికి చాలా తేడా ఉందన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు టి.రఘురాం, ఎం.ఎ.సోమశేఖర్, సి.కె.గాయిత్రి దేవి, ఎస్.పద్మిని, ఎం.బాబు, పి.రాజు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సి.వి.శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు అనిల్‌కుమార్, తిరుపతయ్య, కరీం, గీతామాధురి, కోటేశ్వరరెడ్డి, రంగారవి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘గర్భవతి శృంగారాన్ని వద్దనడం క్రూరత్వంకాదు’
న్యూఢిల్లీ: గర్భవతి శృంగారానికి నిరాకరించడం క్రూరత్వం అనిపించుకోదని ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. గర్భవతిగా ఉన్నపుడు భార్య శృంగారానికి ఒప్పుకోవట్లేదంటూ ఆమె నుంచి విడాకులు కోరుతూ భర్త హైకోర్టును ఆశ్రయించిన కేసులో కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. భార్య ఉదయం త్వరగా నిద్రలేవకపోవడం, మంచం మీదకే టీ తెమ్మని కోరడం లాంటివి ఆమె బద్ధకాన్ని సూచిస్తాయేగానీ క్రూరత్వానికి ఉదాహరణలు కాలేవని కోర్టు అభిప్రాయపడింది. భర్త విడాకుల పిటిషన్‌ను ఓ ఫ్యామిలీ కోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించగా తాజాగా హైకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. -
ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన హీరోయిన్
చెన్నై: టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటి రంభ వైవాహిక జీవితం ప్రస్తుతం సందిగ్దంలో పడింది. గత కొన్ని నెలలుగా రంభ తన భర్త ఇంద్రన్ పద్మనాథన్ నుంచి విడిగా ఉంటోంది. రంభ దంపతులకు ఇద్దరు సంతానం అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తనకు భర్తతో కలిసి జీవితాన్ని మళ్లీ పంచుకోవాలని ఉందని, అందుకు అవకాశం కల్పించాలని కోరుతూ నటి రంభ చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో తాను భర్తతో కలిసి ఉండాలనుకున్నట్లు పేర్కొంది. హిందూ వివాహచట్టంలోని సెక్షన్ 9 ప్రకారం తనకు హక్కులు కల్పించాలని కోరింది. వచ్చే డిసెంబర్ 3న రంభ కేసు విచారణకు రానుంది. బాలీవుడ్ లో మొదలైన విడాకుల వ్యవహారాలు ఈ మధ్య దక్షిణాది ఇండస్ట్రీలలోనూ కనిపిస్తోంది. ఇటీవల అమలాపాల్, సౌందర్య రజనీకాంత్ తర్వాత ప్రస్తుతం రంభ వైవాహిక జీవితంలో సమస్య మొదలైంది. 2010 ఏప్రిల్‌లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రన్ పద్మనాథన్‌ను వివాహం చేసుకుంది. ఏవో సమస్యలు రావడంతో కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నారు. వివాహానికి ముందు టాలీవుడ్ లో 1990, 2000 దశకంలో అగ్రహీరోలతో నటించి రంభ తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మూవీలలోనూ తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. -
విడాకులివ్వండి: నటి ప్రేమ
= కోర్టును ఆశ్రయించిన బహుభాషా నటి ప్రేమ బెంగళూరు(బనశంకరి) : బహుభాషా నటి ప్రేమ తన భర్త జీవన్ అప్పచ్చు నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈమేరకు నగరంలోని ఫ్యామిలీ కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. కొడగు జిల్లాకు చెందిన ప్రేమ 2006లో కొడగు ప్రాంతానికి చెందిన జీవన్అప్పచ్చును వివాహమాడారు. 1995లో శివరాజ్‌కుమార్ నటించిన సవ్యసాచి అనే చిత్రం ద్వారా ప్రేమ కన్నడచిత్రరంగంలోకి అడుగుపెట్టారు. ఉపేంద్ర దర్శకత్వంలో నిర్మితమైన ఓం సినిమాలో మాధురి అనే పాత్రలో నటించి ప్రశంసలందుకున్నారు. తెలుగు, తమిళ భాష సినిమాల్లో కూడా ప్రేమ నటించారు. -
చేతులు కాలకముందే...
మ్యారేజ్ కౌన్సెలింగ్ దారం తెగిపోయాక ఎన్ని ముడులేసినా ప్రయోజనం లేదు. బంధం తెంపుకున్నాక తిరిగి అందులోకి ప్రవేశం లేదు. ప్రకృతి చెక్కిన అందమైన శిల్పం- కుటుంబం. తుదకంటా దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత భార్యాభర్తల మీదే ఉంది. సమస్య ఉందంటారా... అయితే పరిష్కారం ఉంది... మీనా తలిదండ్రులు దిగువ మధ్యతరగతికి చెందినవారు. కట్నమిచ్చి పెళ్లి చేసే స్తోమత లేదు. వీరి వద్దకు మధ్యవర్తుల ద్వారా ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి తలిదండ్రులు చాలా సంపన్నులనీ, అమ్మాయి బాగుంటే చాలనీ, కానీ కూడా కట్నం అక్కరలేదని చెప్పారు. దాంతో మీనా తలిదండ్రులు ఉబ్బితబ్బిబ్బయి, వెనకా ముందు విచారించకుండా పెళ్లి చేసేశారు. మీనా అత్తగారింటికి వెళ్లింది. మొదటి రాత్రి నుంచి, భర్త సందీప్ ఆమెతో ఎప్పుడూ మాట్లాడింది లేదు. సంసారం చేసిందీ లేదు. అత్తగారి పెత్తనంలో మీనా ఎప్పుడూ బిక్కుబిక్కుమంటూ గడిపేది. భర్తకు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం ఉండేది. ఒకరోజు మీనా అత్తమామలు ఏదో అర్జంటు పని మీద ఊరెళ్లారు. ఇంతలో మీనా భర్త సందీప్ కళ్లు తిరిగి పడిపోయాడు. మీనా పక్కింటి వారి సాయంతో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. ఆయన చెప్పిన అన్ని టెస్టులూ చేయించింది. వాటిలో అసలు బండారం బయటపడింది. సందీప్ చాలా కాలంగా ఎయిడ్స్‌తో బాధపడుతున్నాడని తెలిసింది. డాక్టర్ ముందు సందీప్ ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు. తనకు అంతకు ముందే పెళ్లయిందని, ఈ విషయం బయట పడటం వల్లే తాము విడిపోయామని, తల్లి బలవంతం వల్లే తాను ఈ పెళ్లికి ఒప్పుకోవలసి వచ్చిందని చెప్పాడు. విషయం తెలిసి మీనా, ఆమె తలిదండ్రులు అవాక్కయారు. తేరుకున్నాక సందీప్ తలిదండ్రులను పిలిపించి, బంధువుల ముందు పంచాయితీ పెట్టించారు. అబ్బాయికి ఎయిడ్స్ ఉన్న మాట నిజమేనని, అయితే తమ తదనంతరం అతన్ని చూసుకునే వారు ఉండరనే భయం వల్లనే ఈ విషయాన్ని దాచి ఈ పెళ్లి చేశామని ఒప్పుకున్నారు. మీనా తలిదండ్రులు, బంధువులు కలిసి వెంటనే దగ్గరలోని లాయర్‌ను కలిశారు. ఆయన సలహా మేరకు వారి పెళ్లయి ఆరునెలలే అయింది, వారి మధ్య వైవాహిక బంధం ఏమీ ఏర్పడలేదు కాబట్టి వారి వివాహాన్ని నల్ అండ్ వాయిడ్‌గా డిక్లేర్ చేసి, రద్దు చేయవలసిందిగా కోరుతూ కోర్టులో డైవోర్స్ పిటిషన్ వేశారు. దానికి తోడు అబ్బాయి స్థితిమంతుడు కాబట్టి మీనాకు పర్మనెంట్ ఎలిమనీ (శాశ్వత భరణం) కూడా ఇప్పించమని కోర్టు వారిని కోరారు. మీనా సమస్యను సానుభూతితో అర్థం చేసుకున్న కోర్టు వెంటనే వారి వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అమ్మాయి లేదా అబ్బాయి తలిదండ్రులు అవతలి వారి విద్యార్హతలు, ఉద్యోగం, కుటుంబ చరిత్ర, ఆర్థిక స్థితిగతులు, మెడికల్ రికార్డులు వంటి వాటిని కూడా పరిశీలించవలసిన అవసరాన్ని ఈ కేసు ద్వారా మనకు తెలుస్తోంది. ప్రశ్న - జవాబు మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను వదిలి, గత నాలుగేళ్లుగా వేరే స్త్రీతో కలిసి జీవిస్తున్నాడు. ఆవిడతో వివాహ బంధం లేకుండా సహజీవనం సాగిస్తున్నాడు. మాకు ఇద్దరు ఆడపిల్లలు. దురదృష్టవశాత్తూ నేను ఇంట్లో లేని సమయంలో నా చిన్న కూతుర్ని తీసుకుని ఆయన వెళ్లిపోయాడు. ప్రస్తుతం మా చిన్నపాప ఆయనతోనే ఉంటోంది. ఆ పాప అంటే నాకు చాలా ఇష్టం. తనని నా దగ్గరకు పంపమని ఎన్నిసార్లు బతిమాలుకున్నా పంపడం లేదు. పాప ఇప్పుడు 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. త్వరలో పెద్దపిల్ల కాబోయే ఆ పాపకు ఈ సమయంలో తల్లి అవసరం ఎంతో ఉంటుంది. పాప నా దగ్గరకు వచ్చేస్తానని ఏడ్చినా ఆయన పంపడం లేదు. నేను ఏం చేయాలి? - జమున, శంషాబాద్ మీరు వెంటనే కష్టడీ ఆఫ్ చైల్డ్ కోసం కేసు వేయండి. ఫ్యామిలీ కోర్టులో జడ్జిగారు మీ ఇద్దర్నీ, పాపను విడివిడిగా విచారించి పాప కష్టడీ ఎవరికి ఇవ్వాలో నిర్ణయించుకుంటారు. చట్టప్రకారం తండ్రే పిల్లలకు సహజమైన సంరక్షకుడు. అయినా గానీ, ఆడపిల్లకు ఈ వయసులో తల్లి అవసరం చాలా ఉంటుంది కాబట్టి, పాప అభిప్రాయానికి విలువ ఇచ్చి ఆమె ఎవరి దగ్గర ఉండాలనుకుంటే (తల్లి, తండ్రి ఇద్దరిలో) వారికి ఆ కష్టడీ ఇవ్వడం జరుగుతుంది. నాది క్యాంప్‌లు ఎక్కువ తిరిగే ఉద్యోగం. పెళ్లై 15 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల బాబు. నేను లేని సమయంలో నా భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. మా తలిదండ్రులు అదేమని ప్రశ్నిస్తే, అరిచి గొడవపెట్టి వారి నోరు మూయించేది. ఎంతోకాలం పాటు జరిగిన ఈ వ్యవహారాన్ని ఓ రోజు నా కళ్లతో చూశాక నమ్మక తప్పలేదు. ఆ రోజు పెద్దలందరి ముందు ఆమె తలిదండ్రులు, అన్నదమ్ములను పిలిచి పంచాయితీ పెట్టగా అది నిజమే అని ఒప్పుకుని క్షమాపణ వేడుకుంది. ఇంకెప్పుడూ అలా చెయ్యనని పెద్ద మనుషుల సమక్షంలో స్వయంగా కాగితంపై రాసి ఇచ్చింది. కానీ నా మనస్సు విరిగిపోయింది. నాకు ఇక ఆమెతో కలిసి జీవించాలనిపించడం లేదు. నేను ఏమి చేయాలి? - కరుణాకర్, చౌటుప్పల్ మీరు మీ జ్యూరిస్‌డిక్షన్‌లోని జిల్లా కోర్టులో వీటన్నింటినీ కూలంకషంగా వివరిస్తూ, ఇల్లిసిట్ ఇంటిమసీ గ్రౌండ్ చూపెడుతూ, క్రూయల్టీ కింద విడాకులకు కేసు ఫైల్ చేయండి. బాబును ఎలాగూ మీరు మీతోనే ఉంచుకోవడానికి సిద్ధమయ్యారు కాబట్టి, కష్టడీ మీకే వస్తుంది. మా వివాహమై పది సంవత్సరాలు అయింది. మేమిద్దరం అమెరికాలోనే ఉంటున్నాము. కొన్ని కారణాల వల్ల మేము ఇండియాలో డైవోర్స్ తీసుకోవాలనుకుంటున్నాము. నేను ఇండియాకు రాగలను కానీ, ఆరు నెలల వరకూ ఆయనకు తీరిక లేదు. నేనేం చేయాలి? - విద్య, కాలిఫోర్నియా మీరు ఇండియాలో డైవోర్స్ పిటిషన్ వేయాలంటే మీరు వివాహం చేసుకున్న ప్లేస్, చివరగా మీరు కలిసి జీవించిన ప్లేస్‌లో లేదా భార్య ఎక్కడ ఉంటోందో, అక్కడి జ్యూరిస్డిక్షన్లో కేసు ఫైల్ చేయవచ్చు. మీకు పెళ్లయినదీ, మీరిద్దరూ కలిసి చివరలో జీవించినదీ హైదరాబాద్‌లోనే కాబట్టి, మీరు హైదరాబాద్‌లోనే డైవోర్స్ అప్లికేషన్ ఫైల్ చేయవచ్చు. మీరు ఇద్దరూ పరస్పర అంగీకారంతో పిటిషన్ ఫైల్ చేస్తున్నారు కాబట్టి, పిటిషన్లో సంతకాలు పెట్టి మీ సమక్షంలో ఫైల్ చేయవచ్చు. మీ భర్త ఇక్కడకు రాలేరంటున్నారు కాబట్టి పిటిషన్ కాపీ ఆయనకు కొరియర్లో పంపి, ఆయన సంతకాలు అక్కడ లోకల్ అడ్వొకేట్‌తో అటెస్టేషన్ చేయించి. తెప్పించుకుని ఇక్కడ ఫైల్ చేయవచ్చు. ఆరునెలలు పూర్తి కాగానే మళ్లీ మరోసారి ఇద్దరూ కోర్టులో జడ్జిగారి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. అప్పుడు ఎవిడెన్స్ అఫిడవిట్ వేస్తే మీకు డైవోర్స్ గ్రాంట్ అవుతాయి. మీ సౌలభ్యాన్ని బట్టి అందుబాటులో ఉన్న అవకాశాన్ని వినియోగించుకోండి. నాకు పెళ్లయి ఆరు నెలలవుతోంది. నా భర్త స్క్రిజోఫీనియాతో బాధపడుతున్నారు. పెళ్లికి ముందు అది దాచి పెళ్లి చేశారు. నేను ఉన్నతోద్యోగంలో ఉన్నాను. నా జీవితం పాడయిందని నా తలిదండ్రులు, అన్నదమ్ములు బాధపడని క్షణం లేదు. ఆయన రోజూ మందులు వాడుతున్నారు. ప్రిస్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. ఎందుకు పెళ్లి చేశారని అత్తమామలని అడిగితే, పెళ్లి చేస్తే పిచ్చి తగ్గుతుందని ఎవరో చెబితే చేశామంటున్నారు. వ్యాధి మూడవ దశలో వుంది. అంత తొందరగా నయం కాదని డాక్టర్లు చెబుతున్నారు. నాకు అతనితో కలిసి జీవించాలని లేదు. నేను ఏం చేయాలి? - అరవింద, హైదరాబాద్ మీరు వెంటనే మెడికల్ గ్రౌండ్స్ అన్నీ జత చేస్తూ వ్యాధి విషయం దాచి, మోసపూరితంగా పెళ్లి చేశారని వివరించండి. మ్యారేజ్‌ను నల్ అండ్ వాయిడ్‌గా డిక్లేర్ చేయమని కోరుతూ ఒక సంవత్సరంలోపు డైవోర్స్ పిటిషన్ ఫైల్ చేయండి. అతని వ్యాధి వల్ల సంసారం చేయడం కష్టతరం కాబట్టి మీకు డైవోర్స్ గ్రాంట్ అవుతుంది. తర్వాత మీ జీవితాన్ని మీ ఇష్టం వచ్చినట్లు ప్లాన్ చేసుకోవచ్చు. నిశ్చల సిద్ధారెడ్డి అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ -
భర్త అయినా... మౌనం సమాధానం కాదు!
ఈ విషయం గురించి మాట్లాడాలంటేనే దిగులుగా ఉంటుంది... ఇంత సున్నితమైన విషయాన్ని బజార్లో పెట్టాలంటే ఆలోచించాల్సి వస్తోంది. మేలు చేయబోయి కీడు చేస్తామా? అన్న ప్రశ్న వేధిస్తోంది. కానీ, మౌనం సమాధానం కాదు. ఒక చెల్లి, అక్క, బిడ్డ పడుతున్న వేదనకు మౌనం సమాధానం కాదు. ఆడపిల్లను జాగృతం చెయ్యడం ఒక అవసరం అయితే, మగవారిని సెన్సిటైజ్ చెయ్యడం అత్యవసరం. భార్యాభర్త అన్యోన్యంగా ఉండడానికి ఈ చర్చ ఒక అవకాశం కావాలి. మన ఫ్యామిలీని నిండుగా నూరేళ్లు ఉంచే బాధ్యతను మనందరం తీసుకోవాలి! ‘‘విడాకుల కోసం మా దగ్గరకొచ్చే కేసుల్లో 50 శాతం కేసులు ఇలాంటివే’’ అంటున్నారు హైదరాబాద్‌లో ఉంటున్న ఫ్యామిలీ కోర్టు న్యాయవాది పార్వతి. వారిజ (పేరు మార్చాం) పెళ్లయి ఏడేళ్లు. ఇద్దరు పిల్లలు. ఆమె భర్త ప్రసాద్ (అసలు పేరు కాదు) కమర్షియల్‌టాక్స్ ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నాడు. అయిదేళ్లు బాగానే సాగింది వాళ్ల కాపురం. రెండేళ్ల నుంచే కలతలు మొదలయ్యాయి. అన్ని విషయాల్లో ఇద్దరూ బాగా ఉంటారు. ఆ ఒక్క విషయంలోనే ఇద్దరికీ పొసగడంలేదు. పిల్లల చదువు, ఇంటి బాధ్యతలతో వారిజ విపరీతంగా అలసిపోతోంది. దీంతో తనను పట్టించుకోవడంలేదనేది ప్రసాద్ కంప్లయింట్. విసిగిపోయి పిల్లలిద్దర్నీ తీసుకొని తల్లిగారింటికి వచ్చేసింది. ‘‘పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి నడుం వాల్చేదాకా క్షణం విశ్రాంతి ఉండట్లేదు. యంత్రంలా పనిచేస్తున్నాను. రాత్రిపూటైనా హాయిగా నిద్రపోతున్నానా అంటే అదీ లేదు. స్నేహితులు, సిట్టింగులు అంటూ అర్ధరాత్రి ఇంటికి చేరుతాడు. మంచి నిద్రను చెడగొడ్తాడు. అలసిపోయాను అన్నా వినడు. పైగా మొరటుగా ప్రవర్తిస్తున్నాడు. నావల్ల కావట్లేదమ్మా’’ అని తల్లి దగ్గర వాపోయింది. విషయం అర్థమైంది వారిజ తల్లికి. తన యవ్వనపు రోజులు గుర్తొచ్చాయి. తనూ తన తల్లి దగ్గర దిగాలు పడ్డ క్షణాలు మదిలో మెదిలాయి. అప్పుడు తన తల్లి తనకు చెప్పిన మాటల్నే ఇప్పుడు నా బిడ్డకు చెప్పాలా? ఆ మీమాంసతోనేవారిజ తల్లి నెమ్మదిగా గొంతు సవరించుకుంది.. ‘‘ఇంత చిన్న విషయానికే ఇక్కడికి వచ్చేయాలా? భర్త భార్య దగ్గరకి రాకపోతే ఎక్కడికి వెళ్తాడు? వల్లకాని పక్షంలో మెల్లగా సర్దిచెప్పుకోవాలి.. వినకపోతే నువ్వే ఓపిక పట్టాలి. తప్పదు. నువ్వు కాదంటే అతను వేరే దారి చూసుకుంటాడు. అప్పుడు నెత్తినోరు కొట్టుకున్నా ప్రయోజనం ఉండదు’’ అని చెప్పి కూతుర్ని అత్తారింటికి పంపింది కానీ.. ఇష్టంలేకుండా భర్తకైనా సరే తన శరీరాన్ని అప్పజెప్పడం ఎంత నరకమో తనకు తెలియదా? తప్పు చేశాననే భావన. నీ శరీరం మీద నీకు హక్కు ఉందని బిడ్డకెందుకు తను చెప్పలేకపోయింది? ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోయింది? కుటుంబం, సమాజం, పరువు, మర్యాద అని తన తల్లి భయపడ్డట్టే తనూ భయపడిందా? తన బిడ్డకు తాను సర్ది చెప్పినట్టే.. ఆడపిల్ల మనసు, సున్నితమైన ఆమె శరీరం గురించి అల్లుడికీ ఎవరైనా చెప్పగలిగితే ఎంత బాగుండు.. ఈరోజు నా కూతురికి ఈ సమస్య వచ్చేది కాదు కదా..! ఇవి వారిజ తల్లి ఆలోచనలు మాత్రమే కాదు.. ఇప్పుడు ఒక చర్చ కూడా. తన శరీరం మీద తనకు హక్కులేదా? భర్త అయినంత మాత్రాన బలవంత పెడితే భరించాలా? అన్న ప్రశ్న మ్యారిటల్ రేప్‌ను చట్టం కిందికి తేవాలి అన్నంత పదును తేలింది. ఇంకోవైపు భార్యాభర్తలకు చెందిన ఈ సమస్యను పరస్పర అవగాహన, సహనంతో నాలుగు గోడలమధ్యే పరిష్కరించుకోవాలి.. కుటుంబం కూలిపోకుండా కాపాడుకోవాలి అన్న అభిప్రాయమూ వినపడుతోంది. నేపథ్యం: నిర్భయ సంఘటన జరిగిన తర్వాత నిర్భయ యాక్ట్ సందర్భంలో జస్ట్టిస్ వర్మ కొన్ని మార్గదర్శకాలను సూచించారు. వాటిలో భార్యభర్తల మధ్య జరిగే బలవంతపు శృంగారాన్ని... అంటే భార్య అంగీకారం లేకుండా భర్త జరిపే శృంగారాన్నీ రేప్‌గానే పరిగణించాలని చెప్పారు. కానీ నాటి ప్రభుత్వం దీన్ని అంగీకరించలేదు. పార్లమెంటేరియన్లంతా దీనివల్ల వివాహ వ్యవస్థకున్న పవిత్రత పోతుందని, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందని వాటిని వ్యతిరేకించారు. ఇప్పుడు మళ్లీ ఈ అంశం వార్తల్లోకి వచ్చి జస్టిస్ వర్మ సూచన ప్రకారం దీన్ని వైవాహిక అత్యాచారంగా పరిగణించాలనే చర్చ మొదలైంది. భార్య, భర్త జ్యుడీషియల్ సపరేషన్లో ఉన్నా, విడాకులకు సంబంధించి కోర్టులో పెండింగ్‌లో ఉన్నా, ఒప్పందం ప్రకారం ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నా భర్త, భార్యతో బలవంతంగా శృంగారం జరిపితే దాన్ని రేప్‌గా పరిగణించాలనే క్లాజ్ 376బిలో ఇదివరకే ఉంది. భార్య ఫిర్యాదు చేస్తే ఆ క్లాజు ప్రకారం 2 నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధిస్తారు. బ్రూటాలిటీ... బీస్టాలిటీ... పెరిగిన ఒత్తిళ్లు, ఆర్థిక అవసరాలు, కుటుంబ బాధ్యతల దృష్ట్యా భార్యాభర్తల మధ్య సెక్స్ పరంగా సత్సంబంధాలు ఉండడం లేదు. భర్త సెన్సిటైజ్ కావాలి.. అవసరం కూడా. స్త్రీకి భద్రత, భరోసా అవసరం. కాబట్టి బ్రూటాలిటీ, బీస్టాలిటీ కింద పరిగణించి మ్యారిటల్ రేప్‌ను 376బిలో చేర్చాలి. - పార్వతి, ఫ్యామిలీ కోర్టు న్యాయవాది. ఎవరు చేసినా నేరమే! సెక్సువల్ అబ్యూజ్.. సెక్సువల్ అసాల్ట్.. సెక్సువల్ అటాక్.. ఎవరు చేసినా నేరమే. మహిళ సమ్మతి లేకుండా ఆమెను బలవంతం చేస్తే అది రేప్. భర్త చేస్తే మ్యారిటల్ రేప్. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. - సంధ్య, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు బలహీనుల పక్షానే... స్త్రీ్త్ర మానసికంగా బలవంతురాలైనప్పటికీ శారీరకంగా బలహీనురాలు. రాజ్యమెప్పుడూ బలహీనుల పక్షానే నిలబడాలి. వాళ్ల హక్కులకు రక్షణ కల్పించాలి. అందులో భాగంగానే మ్యారిటల్రేప్ను చట్టం కిందికి తీసుకురావాలి. - సామాన్య, రచయిత్రి ఇద్దరూ సమానమే... మన రాజ్యాంగం ప్రకారం మన న్యాయవ్యవస్థలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే. దీనిప్రకారం ఆమె శరీరం మీద ఆమెకు హక్కు ఉన్నట్టే! ఒక మనిషి హక్కును ఇంకో మనిషి బలవంతంగా లాక్కోవడం నేరం. దాన్నే ప్రశ్నిస్తోంది వివాహిత. తన శరీరం మీద తనకున్న హక్కును పరిరక్షించే చట్టం కావాలి. అలాగే పురుషుడినీ సెన్సిటైజ్ చేయాలి. - ప్రజ్ఞారశ్మి సైకాలజిస్ట్ అందుకే విముఖత! సహజంగా భార్య ఇంటిపనితో (ఉద్యోగి అయితే బయటపని కూడా) శారీరకంగా, మానసికంగా అలసిపోయినప్పుడు. హార్మోనల్ ఇమ్బ్యాలెన్స్ ఉన్నప్పుడు. ఎండోమెట్రియాసిస్ ప్రాబ్లమ్, పెల్విక్ ఇన్ఫామెట్రీడిసీస్ ఉన్నప్పుడు. భర్త మొరటు ప్రవర్తన వల్ల కలిగే భయం వల్ల సెక్స్ పట్ల విముఖతతో ఉంటుంది స్త్రీ. ఇలాంటప్పుడు భార్యాభర్తలిద్దరూ కౌన్సెలింగ్‌కు వచ్చి సమస్యను చక్కదిద్దుకోవచ్చు. - డాక్టర్ వి.శోభ, లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
హోటల్ రంగం వారికి... అవకాశాలు ఎక్కువే!
మేం అమెరికాలో ఉండేవాళ్లం. అయితే అక్టోబర్ 2014లో నా భర్త నన్ను, సంవత్సరం వయసున్న మా పాపతో పాటు ఇండియా పంపించేశారు. ఆయన వస్తానన్నారు కానీ రాలేదు. నిజానికి ఆయన నన్ను చాలా హింసించేవారు. ఓసారి నన్ను తీవ్రంగా కొడితే నేను కంప్లయింట్ కూడా ఇచ్చాను. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయలేదు కానీ మూడు నెలల పాటు ఇంటికి దూరంగా ఉండమని చెప్పారు. ఆ గ్యాప్‌లో మారినట్టు కనిపించడంతో నేను తనని నమ్మాను. పాపను తీసుకుని ఇండియా వెళ్లు, నేను వెనకే వస్తానని చెప్పి పంపించాడు. కానీ రాలేదు. మాకు రిటర్న్ టిక్కెట్స్ పంపమని అడిగితే పంపకుండా, విశాఖపట్నంలోని ఫ్యామిలీ కోర్టులో తన తండ్రి ద్వారా విడాకుల పిటిషన్ వేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? అమెరికా వెళ్లి తన మీద కేసు పెట్టమంటారా? - ఓ బాధితురాలు, విజయవాడ ఇలాంటి మెయిల్స్ వచ్చినప్పుడల్లా నాకు చాలా బాధనిపిస్తుంది. అమాయకంగా భర్తను నమ్మేసి, తను వెనకే వస్తాడులే అని వెళ్లిపోయి, ఇలా తర్వాత అష్టకష్టాలు పడుతున్నవాళ్లు చాలామంది ఉన్నారు. మీరూ వాళ్లలో ఒకరు కావడం నిజంగా దురదృష్టకరం. మీరు ఒక పని చేయండి. మీ కేసు ఎలాగూ ఇండియాలో ఫైల్ చేశారు కాబట్టి... మీరు ముందు అక్కడ ఎవరైనా మంచి న్యాయవాదితో మాట్లాడండి. కేసును అమెరికాలో కంటిన్యూ చేయాలి అనుకుంటే... ఆ దేశంలో ఉన్న ఎవరైనా న్యాయవాదిని సంప్రదించి, ఆయనకు కేసు అప్పగించమని చెప్పండి. అమెరికన్ కాన్సులేట్‌కి వెళ్లి, వీసా తీసుకోండి. అయితే అమెరికాలో ఉన్న న్యాయవాది సలహా తీసుకున్న తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోండి. నేనొక చెఫ్‌ని. పన్నెండేళ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం సౌదీ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్నాను. నాకు అమెరికాలో పని చేయాలని ఆశగా ఉంది. వీసా ఎలా పొందాలో తెలియజేయండి. - అమర్, రియాద్ హోటల్ ఫీల్డ్‌లో ఉన్నవారికి అమెరికాలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ పని చేయాలంటే ముందు మీకు ఎవరైనా ఎంప్లాయర్ ఉండాలి. వాళ్లు మీకు స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మొదట చేయాల్సింది... అవకాశాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసుకుని ఉద్యోగానికి అప్లై చేయడం. ఒక్కసారి ఉద్యోగం దొరికిందంటే ఆ సంస్థ వారే న్యాయవాది ద్వారా మీకు వీసా ఇప్పిస్తారు. మీ సందేహాలు, సమస్యలను తెలియజేయాల్సిన చిరునామా... గైడ్, సాక్షి దినపత్రిక, సాక్షి టవర్స్, రోడ్ నం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34 ఈ మెయిల్: guide.sakshi@gmail.com లక్ష్మీ దేవినేని, చైర్పర్సన్, ‘తానా’ ఇమిగ్రేషన్ కమిటీ -
'ఒక్కరే కాదు...ఇద్దరు భరించాలి'
ముంబై: ఇంటి కోసం ప్రతినెలా కట్టాల్సిన ఈఎంఐ మొత్తాన్ని తన భర్తే చెల్లించాలని ఓ భార్య వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. వివరాల్లోకి వెళితే నెల నెలా హోంలోన్ ఈఎంఐని తన భర్త ఒక్కరే చెల్లించాలని ఓ భార్య ముంబయి ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది. ఇంటి ఖర్చులకు నెలకు రూ. 90 వేలు భర్త చెల్లించాలని ఆమె అందులో పేర్కొంది. అయితే ఈ కేసును కోర్టు సోమవారం తిరస్కరించింది. భర్తకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కుటుంబంలోని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి డబ్బులు చెల్లించాలని, ఒక్కరిపైనే భారం పడకూడదని కోర్టు ఆదేశించింది. 'సాధారణంగా ఆస్తులు పురుషుల పేరిట ఉంటాయి. కానీ ప్రస్తుతం మహిళలకు కూడా సమాన ప్రాతినిధ్యం కావాలంటున్నారు. అందువల్ల ఇద్దరు చెల్లిస్తే ఎలాంటి సమస్య ఉండదు' జడ్జి తెలిపారు. కాగా కోర్టును ఆశ్రయించిన మహిళ తన కుమార్తెతో కలిసి భర్తలో కలిసి ఉంటుంది. -
నమస్తే లాయరమ్మా, బాగున్నారా?
తపాలా ఇది చాన్నాళ్ల క్రితం జరిగిన సంఘటన. నా జీవితంలో నేనెప్పటికీ మర్చిపోలేని సంఘటన.ఫ్యామిలీ కోర్టులో ఒకావిడకు నన్ను జడ్జిగారు, ‘అమికస్ క్యూరీ’గా అపాయింట్ చేయడం జరిగింది. అంటే ఫీజు ఇచ్చుకోలేనివారికి, ఫ్రీగా కేసు వాదించడానికి ఒప్పుకున్న అడ్వకేట్స్ను జడ్జి ‘అమికస్ క్యూరీ’గా నియమిస్తారన్నమాట. ఆ దిగువ మధ్యతరగతి ఇలాల్లిని చూసి జాలితో ఆ కేసు చేయడానికి ఒప్పుకున్నాను. భర్త విడాకుల కేసు ఫైల్ చేస్తే ఈవిడ, ఇద్దరు ఆడపిల్లలకి మెయింటెనెన్స్ కేసు అదే కోర్టులో వేసింది. ఆమె ప్రతి వాయిదాకు మాసిపోయిన అవే పాత బట్టలతో వచ్చేది. దాంతో ఆమె పట్ల జాలితో నా హృదయం నిండిపోయేది. ఇద్దరు బిడ్డలతో ఆమె ఎలా బతుకుతుందో ఏమోనని కేసు గట్టిగానే వాదించాను. మొత్తానికి న్యాయమూర్తి విడాకుల కేసు కొట్టేయడం, భార్య, ఇద్దరు పిల్లలకుగానూ భర్త మనోవర్తి ఇచ్చేలా ఆదేశించడం జరిగింది. ఆమె కళ్లనీళ్లతో నా చేతులు పట్టుకుని థాంక్స్ చెప్పి వెళ్లిపోయింది.అలాగే, అతడు చెల్లించకపోతే అరియర్స్ కోసం కేసు వేసేది. సంవత్సరానికి ఒకసారి మొత్తంగా ఆ డబ్బు వచ్చేది. ఆవిడ భర్త విమానాశ్రయ ఉద్యోగి కావడంతో తప్పించుకోలేకపోయేవాడు. అరెస్టుకు భయపడి, ఈవిడను తిట్టుకుంటూ అయినా ఒక మొత్తంగా కట్టేసేవాడు. అదలావుండగా- నాకు మా డాక్టర్ సుశీల ఆంటీ (వైజాగ్) వల్ల ఒక మంచి అలవాటు వచ్చింది. నాదైనా, మా వారిదైనా, మా అబ్బాయిదైనా ఎవరిపుట్టిన రోజుకైనా అనాథాశ్రమం, వృద్ధాశ్రమాల్లో డొనేషన్స్ ఇస్తుంటాం. ఆ యేడు కూడా అదే అలవాటుతో సికింద్రాబాద్‌లోని ఒక అనాథాశ్రమానికి వెళ్లాను. గేట్ దగ్గరే కారు ముందు ఒక అందమైన మధ్యవయసు స్త్రీ ఖరీదైన బట్టలతో నిలబడి ఉంది. ఎవరా అని పరికించి చూశానుగానీ గుర్తురాలేదు. నేను లోపలికి వెళ్లి విరాళం ఇచ్చాను. ఆమె కూడా విరాళం ఇవ్వడానికే వచ్చింది. నాకంటే ఎక్కువే పే చేసింది. బయటకు వస్తుండగా- ‘‘నమస్తే లాయరమ్మా! బాగున్నారా?’’ అన్నది. నేను గుర్తుపట్టలేకపోతే, తనే పేరు చెప్పి, గుర్తుచేసింది. నన్ను అమికస్ క్యూరీగా అపాయింట్ చేయించుకున్నది ఈమే! నేను విస్తుపోయాను, ఎప్పుడూ ఒకే చీర, జాకెట్‌తో వచ్చే ఆవిడ, ఖరీదైన బట్టలతో కారులో వచ్చిన ఈవిడా ఒకటేనా అని! కాస్త సంతోషంగా కూడా అనిపించింది.అప్పుడు చెప్పిందావిడ, ‘‘లాయరమ్మా! నేను మంచి ఉద్యోగంలో ఉన్నాను. నాకు, నా పిల్లల పోషణకెటువంటి కష్టం లేదు. కానీ నన్ను కట్టుకుని, బాధ్యత వదిలేసి, ఇద్దరు ఆడపిల్లల్ని కన్నాననే నెపంతో నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ, ఇంకొక స్త్రీతో రహస్య జీవనం గడుపుతున్న ఆ మగాడికి నాకు తెల్సినంతలో శిక్ష వేయగలిగాను కదా. కాకపోతే మీకు, కోర్టువారికి నేను పిల్లల్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నానని అబద్ధం చెప్పడం తప్పే. డైవోర్స్ గ్రాంట్ అయ్యుంటే అతన్ని పట్ట సాధ్యమయ్యేది కాదు. నేను మంచి ఉద్యోగంలో ఉన్నానని కోర్టుకు నిజం చెప్తే, నాకు, పిల్లలకు ఇంత మెయింటెనెన్స్ వచ్చేది కాదు. పిల్లల్ని కన్నందుకు, నన్ను కట్టుకున్నందుకు, మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత నా భర్తదే కదా! అందుకే అది తప్పని నాకనిపించడం లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ డబ్బంతా ఈ అనాథ శరణాలయానికి ప్రతిసారీ ఇచ్చేస్తాను. నా హక్కును, నా పిల్లల హక్కును చట్టపరంగా నా భర్త నుండి సాధించుకున్నాను. అందుకు సాయం చేసినందుకు మీకు వేనవేల కృతజ్ఞతలు. మిమ్మల్ని మోసం చేసినందుకు క్షమించండి’’ అని చెప్పింది. ఆ దివ్యమైన రోజు జీవితం నాకో కొత్త పాఠాన్ని నేర్పింది. ఆ పాఠాన్ని నేర్చుకునే అవకాశమిచ్చినందుకు నా వృత్తికి ధన్యవాదాలు. - నిశ్చల సిద్ధారెడ్డి,అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ -
విడాకుల బాటలో...
సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీ దంపతులు మనస్పర్థల కారణంగా విడిపోయారు. వివాహ రద్దు కోరుతూ సోమవారం చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నటి లిజీ ఒక ప్రకటన విడుదల చేశారు. 24 ఏళ్ల వైవాహిక జీవితం తరువాత తాను, ప్రియదర్శన్ విడిపోవాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇది ఇద్దరం సమష్టిగా తీసుకున్న నిర్ణయమేనని పేర్కొన్నారు. ఈ విషయం తమ పిల్లలకు, బంధుమిత్రులకు తెలుసని అన్నారు. ఇది ఇలా ఉంటే... తమిళం, తెలుగు, మలయాళం - ఇలా దక్షిణాదిన పలు చిత్రాల్లో లిజీ కథానాయికగా నటించారు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కూడా తమిళ, మలయాళ, తెలుగు, హిందీ తదితర భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. వీరి వివాహం 1990లో జరిగింది. ఈ దంపతులకు కూతురు కల్యాణి, కొడుకు సిద్ధార్థ్ ఉన్నారు. పిల్లలిద్దరూ విదేశాల్లో చదువుకుంటున్నారు. ప్రియదర్శన్, లిజీల మధ్య ఇంతకుముందు ఒకసారి మనస్పర్థలు తలెత్తి, విడిపోవడానికి సిద్ధమయ్యారు. అయితే అప్పుడు నటుడు కమలహాసన్, పలువురు సినీ ప్రముఖులు సర్దిచెప్పి పరిస్థితిని విడాకుల వరకు పోకుండా చక్కదిద్దారు. తాజాగా మళ్లీ ప్రియదర్శన్, లిజీల మధ్య బేధాభిప్రాయాలు తలెత్తడంతో వారు విడాకుల బాటలో నడుస్తున్నారు. -
పోలీసుల కళ్లుగప్పి.. ఖైదీ పరారీ
మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: హత్యకేసులో యావజ్జీవశిక్ష ఖరారైన ఓ ఖైదీ ఎస్కార్టు పోలీసుల కళ్లుగప్పి కోర్టు గోడదూకి పరారయ్యాడు. ఈ టన జిల్లాకేంద్రంలో సంచలనం రేకెత్తించింది. వివరాల్లోకెళ్తే.. మహబూబ్‌నగర్ మండలం పాలకొండ సమీపంలో 2012 మే 29న అమిస్తాపూర్ గ్రామానికి చెందిన బాలస్వామి దారుణహత్యకు గురయ్యాడు. ఈ కేసులో జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వడ్డె వెంకటేష్, అదేకేసులో ఉన్న మరో నిందితుడు చౌవుకుల నర్సింహ్మకు కోర్టు జీవితఖైదు విధించింది. పోలీసులు బందోబస్తు మధ్య వారిని సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని ఫ్యామిలీకోర్టుకు తీసుకొచ్చారు. ఇదేఅదనుగా భావించిన వెంకటేష్ కోర్డుగోడను దూకి పారిపోయాడు. దీంతో అప్రమత్తమైన ఎస్కార్ట్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ సెట్లో జిల్లా పోలీసు యంత్రంగాన్ని అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంలో విసృ్దతంగా గాలింపుచర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పిల్లలమర్రి వైపు ఓ ఆటోలో వెళ్తున్న నిందితుడిని గుర్తించిన స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ వెంకటేశ్వర్లు సూచనతో ఎస్ఐ అంజాద్‌అలీ, తన సిబ్బందితో కలిసి పిల్లలమర్రిలో దాగిఉన్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో పోలీసు అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. నిందితుడిని డీఎస్పీ కార్యాలయనికి తీసుకొచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ ఎదుట హాజరుపరిచారు. నిందితుడిని పట్టుకున్న పోలీసుల కృషి ఎస్పీ అభినందించారు. ఎస్ఐ అంజాద్‌అలీ, పీసీ అమర్‌సింగ్‌లను అభినందించి నగదు పారితోషికం అందజేశారు. ఎస్కార్ట్ సిబ్బందిపై విచారణకు ఆదేశించారు. పోలీసుల కళ్లుగప్పి పారిపోవడంతో నిందితుడిపై టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో మరోకేసు నమోదుచేశారు. కాగా, నిందితుడు వెంకటేష్ 2012లో షాషాబ్‌గుట్ట ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ యువకుడని అంతమొందించాడు. గతేడాది డిసెంబ ర్లో జిల్లా కేంద్రంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎదుట గద్వాలకు చెందిన ఇద్దరిని అతిదారుణంగా కొట్టిచంపాడు. ఈ కేసుల్లో నిందితుడు శిక్షను అనుభవిస్తున్నాడు. మద్యం మత్తులో ఎస్కార్ట్ సిబ్బంది కోర్టు నుంచి తప్పించుకున్న నిందితుడితో పాటు మరో నిందితుడిని ఎస్కార్ట్ పోలీసులు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు మోహన్‌రెడ్డి, మోహన్, పీసీ సురేష్‌లు తీసుకొచ్చారు. వీరిలో ఓ పోలీసు మద్యంమత్తులో ఉన్నట్లు తెలిసింది. ఆయన నిర్లక్ష్యం మూలంగానే ఖైదీ తప్పించుకునేందుకు అవకాశం దొరికినట్లు సమాచారం. ఏకే 47 నిందితులనుపట్టుకుంటాం జిల్లా కోర్టు ఆధీనంలో ఉన్న ఓ కేసుకు సంబంధించి ఆయుధం ఏకే 47 గల్లంతైన సంఘటనపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎస్పీ సమాధానమిస్తూ.. ఆయుధాన్ని దొంగిలించిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, అసలు నింది తులు ఎవరనే విషయాన్ని ఛేదిస్తామని చెప్పారు. -
ఫ్యామిలీ కోర్టులో బాలీవుడ్ నటుడికి ఎదురుదెబ్బ!
బాలీవుడ్ నటుడు ఓం పురికి ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గత కొద్దికాలంగా ఓంపురికి, ఆయన భార్య నందితకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నందితా ముంబైలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. నందితా పిటిషన్ విచారణ చేపట్టిన కోర్టు గత వారం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. నందితాకు మెయింటెనెన్స్ కింద ప్రతినెలకు 1.25 లక్షల రూపాయలు.. కుమారుడికి 50 వేల రూపాయలను చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా వైద్య, విద్య ఖర్చుల కోసం పత్రినెల 1.15 లక్షలు చెల్లించాలని ఓం పురికి ఆదేశించింది. ఆదాయ వనరుల లేమి ఉన్నందున్న.. నందితా లీగల్ ఖర్చుల కింద 25 వేల రూపాయలు కూడా ఓంపురి చెల్లించాలని తీర్పులో పేర్కోంది. ఇవియే కాకుండా నందితా కోసం చెల్లిస్తున్న ఇన్పూరెన్స్ ప్రీమియం, మెడిక్లెయిమ్ పాలసీలు, విద్యుత్, టెలిఫోన్ బిల్లులు, సొసైటీ మెయింటెనెన్స్ చార్జీలను ఓంపురి చెల్లిస్తున్నారు. వ్యక్తిగత విభేదాల కారణంగా తాము ఇద్దరం కలిసి జీవించడానికి వీలు లేనందున తమకు విడాకులు మంజూరు చేయాలని 2012 లో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో తాను గృహిణి అని.. తనకు జీవించనడానికి ఆదాయ వనరులు లేనందున ఇంటిరిమ్ మెయింటెనెన్స్ చెల్లించాలని నందిత పిటిషన్ దాఖలు చేశారు. ప్రతినెల ఓంపురికి 35 లక్షల నుంచి 45 లక్షల రూపాయల ఆదాయం ఉందిని కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ నందితా పేర్కొన్నారు. -
రోడ్డెక్కిన జీసీసీ ఎమ్డీ కుటుంబ వ్యవహారం
సాక్షి, విశాఖపట్నం, న్యూస్‌లైన్: జీసీసీ ఎమ్డీ రమేష్‌కుమార్ కుటుంబ వ్యవహారం రోడ్డున పడింది. దంపతుల మధ్య విభేదాల నేపథ్యంలో భార్యకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ అత్తింటి వారు, పలు మహిళా సంఘాలు గురువారం ఎంవీపీ కాలనీలోని సెక్టార్-3లో ఉన్న ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. వివరాలిలావున్నాయి. విశాఖ నగరానికి చెందిన జీసీసీ ఎమ్డీ ఈతకోట రమేష్‌కుమార్‌కి వరంగల్ జిల్లాకు చెందిన కూరగంటి స్వప్నతో 2001లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. విభేదాలు తలెత్తడంతో భార్య నుంచి విడాకులు కావాలంటూ రమేష్ కుమార్ 2013 మార్చి 12వ తేదీన విశాఖ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ స్వప్న వరంగల్ పోలీసులను ఆశ్రయించారు. భర్త తనను, పిల్లల్ని హింసిస్తున్నారంటూ గృహహింస చట్టం కింద మేలో ఫిర్యాదు చేశారు. పోలీసుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో అదే నెల 13వ తేదీన వరంగల్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు కేసుల నేపథ్యంలో అరెస్టు భయంతో రమేష్‌కుమార్ ముందస్తు బెయిలు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో స్వప్న ఖమ్మం నుంచి తన బంధువులు, సన్నిహితులతో గురువారం విశాఖ చేరుకుని రమేష్‌కుమార్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. బంధువులంతా బయట ఆందోళన చేస్తుంటే ఆమె నేరుగా రమేష్‌కుమార్ ఇంట్లోకి వెళ్లిపోయారు. ‘నేను నా భర్త ఇంట్లోనే ఉంటాను. అతను నన్ను, నా పిల్లలను సంరక్షించాల్సిందే’ అంటూ స్పష్టం చేశారు. పోలీసులకు ఫిర్యాదు : విషయం తెలుసుకున్న రమేష్‌కుమార్ ఎంవీపీ జోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యవహారం కోర్టులో ఉందని, ఈ పరిస్థితుల్లో రచ్చచెయ్యడం భావ్యం కాదని, స్వప్నను, ఆమె బంధువులను అక్కడి నుంచి పంపాల్సిందిగా కోరారు. వృద్ధులైన తన తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నందున ఈ వివాదం వల్ల వారికి ఇబ్బంది కలుగుతుందని పోలీసులను కోరడంతో ఈస్ట్ ఏసీపీ డి.ఎన్.మహేష్, సీఐ శ్రీనివాసరావు సిబ్బందితో రంగంలోకి దిగారు. ఇరువర్గాలతో సంప్రదింపులు జరిపారు. అయితే అటు రమేష్కుమార్గాని, ఇటు స్వప్న బంధువులుగాని దిగిరాక పోవడంతో సయోధ్య కుదర్చడం సాధ్యం కాలేదు. స్వప్న రమేష్‌కుమార్ ఇంట్లోకి వెళ్లిపోయి తాను బయటకు వెళ్లేది లేదని స్పష్టం చేయడంతో బంధువులు బయటే కాపలాగా ఉన్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుం దో అన్న ఆందోళనతో పోలీసులు ఇంటి ముందు పికెట్ ఏర్పాటు చేశారు. ఆడపిల్లలు పుట్టారనే...: ఇద్దరు ఆడపిల్లలు పుట్టారనే స్వప్నను వదిలించుకునేందుకు, మరో పెళ్లి చేసుకునేందుకు రమేష్‌కుమార్ చూస్తున్నారని మహిళా సంఘాల ప్రతినిధులు ధ్వజమెత్తారు. ఖమ్మం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అప్రోజ్ సమీనా, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గపేట సరళ, విశాఖ జిల్లా ఐద్వా అధ్యక్షురాలు సుజాత తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. ఒక ఉన్నతాధికారి అయ్యుండి భర్త తనను, పిల్లల్ని కొట్టేవారని, దీంతో ఢిల్లీలోని ఐఏఎస్‌లో ప్రజా ఫిర్యాదుల విభాగానికి ఫిర్యాదు చేసినట్లు స్వప్న తెలిపారు. తమది పూర్తిగా కుటుంబ వ్యవహారమని, ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తున్నందున స్వప్న కొంతమందితో కలిసి ఇంట్లోకి చొరబడడం అన్యాయమని జీసీసీ ఎమ్డీ ఇ.రమేష్‌కుమార్ వ్యాఖ్యానించారు.