‘టాయ్‌లెట్’తో భార్యకు టార్చర్.. విడాకులు
‘టాయ్‌లెట్’తో భార్యకు టార్చర్.. విడాకులు
Published Sat, Aug 19 2017 2:41 PM | Last Updated on Fri, Sep 28 2018 4:32 PM
జైపూర్ : రాజస్థాన్ లో ఓ భార్య తాను అనుభవిస్తున్న మానసిక క్షోభ నుంచి ఎట్టకేలకు విముక్తి పొందింది. మరుగుదొడ్డి కట్టించకుండా వేధిస్తున్న ఓ భర్త నుంచి విడాకులకు దరఖాస్తు చేసుకోగా, దానిని క్రూరత్వం కింద పరిగణించిన స్థానిక కుటుంబ న్యాయస్థానం ఆమెకు విడాకులు మంజూరు చేసింది.
వివరాల్లోకి వెళితే...బిలావర జిల్లా అటున్ గ్రామానికి చెందిన వ్యక్తితో 2011లో ఓ యువతికి వివాహం జరిగింది. అయితే అత్తారింటికి వెళ్లిన ఆమెకు ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవటం విస్మయాన్ని కలిగించింది. మరుగుదొడ్డి కట్టించాలని అప్పటి నుంచి ఇంట్లో ఆడపడుచులతో సహా భర్త పై ఒత్తిడి తేవటం ప్రారంభించింది. అలా నాలుగేళ్లు ఇంట్లో వాళ్లకి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోగా పైగా భర్త చేతిలో తరచు తన్నులు కూడా తిన్నది. చివరకు ఓపిక నశించటంతో ఆమె కన్నవారి ఇంటికి వెళ్లిపోయింది. మరుగుదొడ్డి ఉంటేనే తిరిగి కాపురానికి వస్తానని భర్తకు తేల్చి చెప్పింది. రెండేళ్లు గడుస్తున్నా భర్త ఆ పని చేయకపోవటంతో చివరకు ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుంది.
‘మన ఇంట్లో మహిళలకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుంది? వారిని బహిరంగ మలవిసర్జనకు ప్రోత్సహించటం సరైందేనా? చీకటి పడేంత వరకు ఆ బాధను ఓర్చుకుని మరీ వాళ్లు బయటికి వెళ్తున్న సంగతి తెలీదా? విలాసాలకు విచ్చల విడిగా ఖర్చుపెట్టే వాళ్లు ఇంట్లో మరుగుదొడ్లను మాత్రం నిర్మించలేకపోతున్నారు. ఇది సిగ్గు పడాల్సిన విషయం. ఆ మహిళ అనుభవించింది ముమ్మాటికీ మానసిక వేదనే. అందుకే క్రూరత్వం కింద పరిగణించి ఆమెకు విడాకులు మంజూరు చేస్తున్నా’. అంటూ న్యాయమూర్తి శర్మ తీర్పు వెలువరించే సమయంలో వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Advertisement