దేశంలో నానాటికీ పెరుగుతున్న విడాకుల శాతం
గతంలో సెలబ్రిటీల్లోనే అధికంగా ఈ ట్రెండ్
ఇప్పుడు పెళ్లి అయిన ఏడాది, రెండేళ్లకే విడాకులకు సిద్ధమవుతున్న పలు జంటలు
మహారాష్ట్రలో అత్యధికంగా 18.7 శాతం.. 6.7 శాతంతో ఏడో స్థానంలో తెలంగాణ
వివాహ వ్యవస్థ ఒత్తిళ్లకు గురికావడం, పాత–«ఆధునిక భావాల మధ్య సంఘర్షణ తదితరాలు కారణాలు
సాక్షి, హైదరాబాద్: వివాహమైన ఏడాది, రెండేళ్లకే విడాకులకు సిద్ధమౌతున్న విచిత్రపరిస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొంది. గతంలో భారత సెలబ్రిటీల్లోనే (సినిమా, క్రీడలు, వ్యాపార, ఇతర రంగాల వారు) ఈ ట్రెండ్ అధికంగా కనిపించగా, రానురాను దాదాపు అన్ని వర్గాల్లో ఈ ధోరణి సాధారణంగా మారుతోంది.
గతంతో పోల్చితే... గత రెండు దశాబ్దాల కాలంలో దేశంలో విడాకుల శాతం గణనీయంగా పెరిగినట్టుగా గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. విడాకులంటేనే ఏదో చేయరాని నేరం అని ఏళ్లుగా పేరుకుపోయిన భావన నుంచి నేటితరం బయటపడడంతో జీవితంలో నూతన అధ్యాయం కోసం యువతరం మొగ్గుచూపుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇవి పెరగడానికి వైవాహికపరమైన వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించే ప్రయత్నాలు జరగకపోవడం, ఇతర మార్గాలను అన్వేషించకుండానే కోర్టు మెట్లు ఎక్కడం కూడా ఒక కారణమనే అభిప్రాయం వినిపిస్తోంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా దేశంలోని వివాహ వ్యవస్థ, కుటుంబ విలువలు ఒత్తిళ్లకు గురికావడం, సామాజిక–సంప్రదాయ విలువలు, పాత–ఆధునిక భావాల మధ్య సంఘర్షణ తదితర కారణాలతో విడాకులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న గణాంకాలను బట్టి చూస్తే (2022 సంవత్సరం చివర్లో) దేశంలో విడాకుల శాతంలో తెలంగాణ ఏడో స్థానంలో ఉంది. విడాకుల కోసం కోర్టులో కేసు ఫైల్ చేశాక వివిధ దశలు దాటి తీర్పు వెలువడే నాటికి పదేళ్లకుపైగా పడుతున్న సందర్భాలు కూడా ఉండటంతో... అనధికారికంగా విడిపోతున్న జంటలు పెద్ద సంఖ్యలో ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
అత్యధికంగా ఇండోర్‌లో...
👉 2022 నాటికి దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల విడాకుల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
👉 దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 715 ఫ్యామిలీ కోర్టులున్నాయి.
👉 ఇండోర్ ఫ్యామిలీ కోర్టులో 8,400 కేసులు పెండింగ్‌లో ఉండగా వాటిలో 5,500 విడాకుల కోసమే కాగా... వాటిలో పెళ్లయిన ఏడాదిలో పెట్టిన కేసులు 3,000. 2018లో 2,250 కేసులు ఫైల్ కాగా, 2022లో 2,723 కేసులు నమోదయ్యాయి.
👉 గత పదేళ్లలో...అత్యధిక అక్షరాస్యత ఉన్న కేరళలో 350 శాతం పెరిగిన విడాకులు. ఇదే సమయంలో పంజాబ్, హరియాణాల్లో 150 శాతం ఈ కేసుల వృద్ధి
👉 గత ఐదేళ్లలో ఢిల్లీలో విడాకుల శాతం రెండింతలు పెరిగింది.
👉 ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర మెట్రో నగరాల్లో విడాకుల కేసులు అధికంగా ఉంటున్నాయి
జాగ్రత్తలు తీసుకుంటే...
‘ఈ మధ్య వారానికి ఏడెనిమిది కేసులైనా విడాకుల కోసం మా దగ్గరకు వస్తున్నాయి. వీరిలో 30 శాతం దాకా తమ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గేందుకు మొగ్గుచూపుతుంటే, అధికశాతం మొండికేసి విడాకుల కోసం పట్టుపడుతున్నారు. తెగతెంపులకు 40 నుంచి 50 శాతం తల్లితండ్రుల పాత్ర ఎక్కువగా ఉంటోంది. విడాకులు తీసుకున్నామని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడడం లేదు. అదేదో డయోబెటిస్, థైరాయిడో వచ్చిందనేంత తేలికగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం దంపతుల మధ్య ఒకరిపట్ల ఒకరికి సరైన అవగాహన లేకపోవడం, చిన్న చిన్న విషయాలకు సర్దుబాటు చేసుకోలేక ఘర్షణ పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరిలోనూ స్వార్థం పెరిగిపోవడం, సహానుభూతి కొరవడడం, అనుమానాలు పెరగడం ప్రభావం చూపుతున్నాయి. తల్లితండ్రులు కూడా సర్దుబాటు అవగాహన కలి్పంచకపోగా, చదువుకున్నారు, సంపాదిస్తున్నారు మీకేమీ తక్కువ అనేలా రెచ్చగొడుతుండటంతో పరిస్థితులు తెగే దాకా వస్తున్నాయి. ఒకరి తప్పులను మరొకరు ఎత్తిచూపడం తగ్గిపోయి, పాత విషయాలను పదేపదే ప్రస్తావనకు తేవకపోవడం, గొడవలకు తల్లితండ్రులను మధ్యలోకి తెచ్చి బాధ్యులను చేయకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇద్దరి మధ్య సర్దుబాటుకు అవకాశాలుంటాయి.
– అనిత, ఫ్యామిలీ కౌన్సెలర్, భాస్కర మెడికల్ కాలేజీ క్లినికల్ సైకాలజిస్ట్
వివాహబంధం అక్కర్లేదనే అంచనాకు..
‘మన దగ్గరా విడాకులు అనేవి క్రమంగా పెరుగుతున్నాయి. 2000 సంవత్సరం తర్వాత నుంచి చూస్తే... దేశంలో అమ్మాయిలకు మంచి విద్యతోపాటు ఉద్యోగావకాశాలు పెరగడంతో ఆర్థిక స్వాతంత్య్రం పెరిగింది. యూఎస్, ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు వృద్ధికావడంతో గిల్లికజ్జాలు, చికాకులు, సమస్యలతో వివాహబంధాన్ని తప్పక కొనసాగించాల్సిన అవసరం లేదనే అంచనాకు ఇటు అమ్మాయిలు, అటు అబ్బాయిలు వస్తున్నారు. అటు ఆఫీసులో, ఇటు ఇంట్లో బాధ్యతలు పెరిగిపోవడంతో ఇంటాబయటా మహిళలపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. రోజూ సమస్యలు ఎదుర్కొంటూ బతకడం కంటే విడిపోయి సంతోషంగా జీవించవచ్చనే అభిప్రాయానికి అమ్మాయిలు వస్తున్నారు. మారుతున్న కాలాన్ని బట్టి ఇళ్లలోని పరిస్థితులు మారకుండా సంప్రదాయ పద్ధతుల్లోనే ఆలుమగల సంబంధాలు ఉండాలని పెద్దవాళ్లు కోరుకుంటున్న సందర్భాలున్నాయి. దీంతోపాటు వారిద్దరి మధ్య ప్రతీ చిన్న విషయంలో తల్లితండ్రులు కలగజేసుకోవడంతో ఘర్షణలు పెరుగుతున్నాయి. సమాజంలో ఇంకా పురుషాధిక్యత అనేది ఏదో ఒక రూపంలో కొనసాగడం, పిల్లలుంటే వారి భారమంతా తమపైనే పడుతుందని సంతానం వద్దనే నిర్ణయానికి 10 నుంచి 15 శాతం యువతులు వస్తున్నారు. ఈ మేరకు పెళ్లికి ముందే ఒప్పందం చేసుకుంటున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. తాము అబ్బాయిల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదనే భావన అమ్మాయిల్లో బలపడటం, దానిని అంగీకరించేందుకు అబ్బాయిలు సిద్ధంగా లేకపోవడంతో విడిపోవడానికి సిద్ధమవుతున్నారు.
– సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment