ఒకప్పుడు ఎవరికైనా బైక్, కారు ఉందంటే వాళ్లు ధనవంతులు అని గుర్తింపు ఉండేది. గ్రామాల్లోకి బైకుల్లో, కార్లలో ఎవరైనా వస్తే ప్రజలు ఆసక్తిగా చూస్తుండేవాళ్లు. ప్రస్తుతం ప్రతి ఇంట్లో బైక్ ఉండటం సర్వసాధారణంగా మారిపోయింది. మధ్య తరగతి ప్రజల్లో కార్ల వినియోగం కూడా పెరిగింది. మారిన జీవన శైలి.. ఉద్యోగ, ఉపాధి అవసరాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ మోటారు వాహనం తప్పనిసరి అయ్యింది.
నంద్యాల: ఇళ్ల ముందు, దుకాణాలు, షాపింగ్ మాళ్లు, హోటళ్లు, టీకొట్ల ఎదుట.. ఇలా ఎక్కడ చూసినా పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు పార్కింగ్ చేసి కనిపిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల వినియోగానికి ఈ దృశ్యాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జిల్లాలో దాదాపు ప్రతి ఇంటికి ఒక మోటారు వాహనం ఉందంటే అతిశయోక్తి కాదేమే. జిల్లాలో వివిధ రకాల వాహనాలు 3,45,884 ఉండగా.. వీటిలో అత్యధికంగా 3,12,613 ద్విచక్ర వాహనాలు ఉండటం విశేషం. అవసరాల నిమిత్తం ఒక్కొక్కరు ఒక బైక్ ఉపయోగిస్తున్నారు. సాధారణ కూలీ పనులకు వెళ్లే వారితో పాటు వ్యాపారులు, ఉద్యోగులు ఇలా అన్ని రకాల వర్గాల ప్రజలు ద్విచక్ర వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
జిల్లాలో రోజుకు సగటున 45–50 వాహనాల వరకు రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నాయి. ఈకోవలో నెలకు వెయ్యికి పైగానే వాహనాలు రిజి్రస్టేషన్‌లు అవుతున్నాయి. వాహనాల అమ్మకాలు, విక్రయాలు, రిజి్రస్టేషన్లతో రవాణా శాఖకు ఆదాయం పెరుగుతోంది. ప్రతి రోజూ బైక్‌లు, కార్లు, లారీలు, బస్సులు, ఆటోలు, అంబులెన్స్‌లు, స్కూల్ బస్సులు తదితర వాహనాలు అన్నీ కలిపి భారీ సంఖ్యలో రోడ్డెక్కుతున్నాయి. వ్యక్తిగత వాహనాలతో పాటు ప్రజారవాణా వాహనాలకు డిమాండ్ పెరిగింది.
మార్కెట్‌లోకి ఆధునిక మోడళ్లు..
వాహన తయారీ కంపెనీలు తరచూ మార్కెట్‌లోకి కొత్త ఫీచర్లతో ఆకట్టుకునే వాహనాల మోడళ్లను విడుదల చేస్తున్నారు. దీంతో వినియోగదారులు కొత్త వాటిపై ఆసక్తి చూపుతున్నారు. బీఎస్–4 తర్వాత మార్కెట్‌లోకి బీఎస్–6 వాహనాలు వచ్చాయి. వీటి కొనుగోలుకు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. నచ్చిన బైక్, కారు ముందుగానే బుకింగ్ చేసుకొని డెలివరీకి నెలల సమయం పడుతున్నా అంత వరకు వేచి చూస్తున్నారు. పురుషులతో పాటు మహిళలు సైతం డ్రైవింగ్‌లో శిక్షణ పొందుతున్నారు. ఫలితంగా స్కూటర్ల విక్రయాలకు డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రావడంతో ఇటీవల కాలంలో చాలా మంది వాటిపై మొగ్గు చూపుతున్నారు. ఇవి కాలుష్య రహితంగా ఉండటంతోపాటు పెట్రోల్ ఖర్చు లేకపోవడంతో ఈ వాహనాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
పెరుగుతున్న ట్రాక్టర్ల సంఖ్య..
జిల్లాలో వ్యవసాయంపైనే ఎక్కువ భాగం రైతులు ఆధారపడ్డారు. గతంలో ఎద్దులతో వ్యవసాయం, ఇతర పనులు చేసేవాళ్లు. కాలక్రమేణా వ్యవసాయంలో సాంకేతిక విప్లవం రావడంతో రైతులు ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారు. ట్రాక్టర్లతో తక్కువ సమయంలో ఎక్కువ పని చేసే వెసులుబాటు ఉంటుంది. పైగా కూలీల ఖర్చు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ట్రాక్టర్లతోనే సేద్యం, కలుపు మొక్కలు తొలగించడం తదితర పనులు చేస్తున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాలు ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తోంది.
కుటుంబాలతో ప్రయాణించేందుకు..
సాధారణ, మధ్య తరగతి వర్గాల నుంచి మొదలు కొని ప్రతి ఒక్కరికి బైక్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఇంట్లో బైక్ ఉంటే స్థానికంగా, ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేయడానికి ఉపయోగపడుతుందని కొనుగోలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలు, తీర్థయాత్రలు, ఇతర కార్యక్రమాలకు వెళ్లేందుకు ఎక్కువ మంది కార్లను కొనుగోలు చేస్తున్నారు. లేటెస్ట్ కార్లు మార్కెట్‌లోకి అడుగుపెట్టడమే ఆలస్యం పట్టణాలతో పాటు పల్లెల్లో సైతం వాలిపోతున్నాయి. వ్యాపారులు, రైతులు ఎక్కువ భాగం కార్లను ఉపయోగిస్తున్నారు. కార్లు కొనుగోలు చేయాలంటే గతంలో మాదిరిగా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కారు ధరలో కొంత మేర డౌన్‌పేమెంట్ చెల్లించి మిగిలిన సొమ్మును సులభ వాయిదా పద్ధతుల్లో చెల్లించే వెసులుబాటు ఉంది.
బైక్ తప్పనిసరి
ప్రస్తుతం బైక్‌లు, కార్లు ప్రతి ఒక్కరికీ అవసరమవుతున్నాయి. ఏచిన్న పనికి వెళ్లాలన్నా బైక్ లేనిదే బయటకు వెళ్లడం లేదు. మాకు గ్రామ సమీపంలో నాపరాతి గని ఉంది. అక్కడికి వెళ్లాలంటే తప్పక బైక్ అవసరం ఉంటుంది. అత్యవసర పనులతో పాటు కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లేందుకు జీపు కొనుగోలు చేశాం. – సుధాకర్, అంకిరెడ్డిపల్లె
వాహనాల సంఖ్య పెరుగుతోంది
జిల్లాలో రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి రోజు వివిధ రకాల కొత్త వాహనాలు 45 నుంచి 50 వరకు రిజి్రస్టేషన్‌లు జరుగుతుంటాయి. ఈ లెక్కన నెలకు 1200కు పైగానే ఉంటాయి. ఎక్కువ భాగం ద్విచక్రవాహనాలే రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నాయి.
– శివారెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment