సాక్షి, నంద్యాల జిల్లా: దిశ యాప్‌తో తనకేమి ఉపయోగం ఉంటుందనుకున్న ఓ మహిళా రైతుకు అదే యాప్ రక్షణగా నిలబడింది. పొలం పనులు ముగించుకొని ఇంటికెళ్తున్న ఆమెపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి యత్నించగా, వెంటనే ఆ మహిళ దిశ SOS కు కాల్ చేసి సహాయం కోరింది. నిముషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన నంద్యాల జిల్లా రుద్రవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
రుద్రవరం మండలం పెద్ద కంబలూరుకు చెందిన మహిళ పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రసాద్ అనే వ్యక్తి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు వేసి ప్రసాద్ నుంచి తప్పించుకుంది. స్థానికులు రావడంతో ప్రసాద్ అక్కడ నుండి పారిపోయాడు. బాధిత మహిళ దిశ SOS కు కాల్ చేసి జరిగిన సంఘటనను వివరించింది.
చదవండి: పవన్‌పై క్రిమినల్ డిఫమేషన్ కేసు.. వలంటీర్ స్టేట్‌మెంట్ రికార్డ్
బాధిత మహిళ వుండే లోకేషన్‌కు దిశ పోలీసులు కేవలం పది నిముషాల వ్యవధిలో చేరుకున్నారు. సిరివెళ్ల వైపు పారిపోతున్న నిందితుడు ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసాద్ పై ఐపీసీ సెక్షన్ 354 ఏ, 354 బి, 506ల కింద రుద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
దిశ SOS కు కాల్ చేసిన పది నిముషాల వ్యవధిలో పోలీసులు వచ్చి సహాయం చేశారని బాధిత మహిళ సంతోషం వ్యక్తం చేసింది. రెండు నెలల క్రితం తన సెల్ ఫోన్‌లో గ్రామ సచివాలయ సిబ్బంది దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసి, ఎలా ఉపయోగించాలో వివరించినట్లు మహిళ తెలిపింది. ఆ సమయంలో దిశ యాప్ వలన తనకేమి ఉపయోగం ఉంటుందని సచివాలయ సిబ్బందితో వాదించిన విషయాన్ని మహిళ గుర్తు చేసింది.
కానీ అదే దిశ యాప్ ఈ రోజు తనకు రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని ఊహించలేదని పేర్కొంది. ఆపదలో ఉన్న తనకు దిశ పోలీసులు చేసిన సహాయం ఎప్పటికీ మరువలేనని చెప్పింది. మహిళల రక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పనిచేస్తున్నట్లు దిశ పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అమ్మాయిలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment