woman farmer
-
మహిళా రైతును కాపాడిన దిశ యాప్
సాక్షి, నంద్యాల జిల్లా: దిశ యాప్‌తో తనకేమి ఉపయోగం ఉంటుందనుకున్న ఓ మహిళా రైతుకు అదే యాప్ రక్షణగా నిలబడింది. పొలం పనులు ముగించుకొని ఇంటికెళ్తున్న ఆమెపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి యత్నించగా, వెంటనే ఆ మహిళ దిశ SOS కు కాల్ చేసి సహాయం కోరింది. నిముషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన నంద్యాల జిల్లా రుద్రవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రుద్రవరం మండలం పెద్ద కంబలూరుకు చెందిన మహిళ పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రసాద్ అనే వ్యక్తి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు వేసి ప్రసాద్ నుంచి తప్పించుకుంది. స్థానికులు రావడంతో ప్రసాద్ అక్కడ నుండి పారిపోయాడు. బాధిత మహిళ దిశ SOS కు కాల్ చేసి జరిగిన సంఘటనను వివరించింది. చదవండి: పవన్‌పై క్రిమినల్ డిఫమేషన్ కేసు.. వలంటీర్ స్టేట్మెంట్ రికార్డ్ బాధిత మహిళ వుండే లోకేషన్‌కు దిశ పోలీసులు కేవలం పది నిముషాల వ్యవధిలో చేరుకున్నారు. సిరివెళ్ల వైపు పారిపోతున్న నిందితుడు ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసాద్ పై ఐపీసీ సెక్షన్ 354 ఏ, 354 బి, 506ల కింద రుద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు. దిశ SOS కు కాల్ చేసిన పది నిముషాల వ్యవధిలో పోలీసులు వచ్చి సహాయం చేశారని బాధిత మహిళ సంతోషం వ్యక్తం చేసింది. రెండు నెలల క్రితం తన సెల్ ఫోన్లో గ్రామ సచివాలయ సిబ్బంది దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసి, ఎలా ఉపయోగించాలో వివరించినట్లు మహిళ తెలిపింది. ఆ సమయంలో దిశ యాప్ వలన తనకేమి ఉపయోగం ఉంటుందని సచివాలయ సిబ్బందితో వాదించిన విషయాన్ని మహిళ గుర్తు చేసింది. కానీ అదే దిశ యాప్ ఈ రోజు తనకు రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని ఊహించలేదని పేర్కొంది. ఆపదలో ఉన్న తనకు దిశ పోలీసులు చేసిన సహాయం ఎప్పటికీ మరువలేనని చెప్పింది. మహిళల రక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పనిచేస్తున్నట్లు దిశ పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అమ్మాయిలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న మహిళా రైతు ఓబులమ్మ
తలకు మించిన భారంగా, నష్టదాయకంగా మారిన రసాయనిక వ్యవసాయంతో విసిగి వేసారి ఆరేళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయం చేపట్టిన మహిళా రైతు కుటుంబం రైతు లోకానికే ఆదర్శంగా నిలిచింది. అంతేకాదు, జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జైవిక్ ఇండియా జాతీయ ఉత్తమ రైతు పురస్కారాన్ని గెల్చుకోవటం విశేషం. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం టి. కొత్తపల్లెకు చెందిన బండి ఓబులమ్మ, తిరుమలయ్య దంపతులు 2016 నుంచి కొద్ది విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించి.. తదనంతరం పదెకరాలకు ప్రకృతి సేద్యాన్ని విస్తరించారు. నిమ్మ తోటలో అంతర పంటలు సాగు చేస్తున్నారు. దేశీ వరిని సాగు చేస్తున్నారు. కొంత విస్తీర్ణంలో ఏడాది పొడవునా కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ.. స్వయంగా నేరుగా వినియోగదారులకు విక్రయిస్తూ నిరంతర ఆదాయం గడిస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం పూర్తిగా నిలిపివేశారు. మూడు ఆవులను కొనుగోలు చేసి, పేడ, మూత్రంతో ఘనజీవామృతం, జీవామృతం స్వయంగా తయారు చేసి వాడుతున్నారు. అవసరం మేరకు కషాయాలు వాడి పంటలు పండిస్తున్నారు. తొలుత యూట్యూబ్‌లో ప్రకృతి సేద్యపు విజయగాథలు చూసి స్ఫూర్తి పొంది శ్రీకారం చుట్టారు. తదనంతరం గ్రామ స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఏపీ ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది సూచనలు, సలహాలు పాటిస్తూ.. పర్యావరణానికి, ప్రజలకు ఆరోగ్యదాయకమైన సేద్య రీతిలో తిరుగులేని పట్టు సంపాదించారు. అంతేకాదు, సొంతంగా ప్రజలకు అమ్ముకోవటంలోనూ విజయం సాధించారు. కలిసొచ్చిన నోటి ప్రచారం పండించిన కూరగాయలు, ఆకుకూరలను తాము తినటంతో పాటు ఓబులమ్మ స్వయంగా ఇంటింటికీ వెళ్లి అమ్ముతుండటం విశేషం. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆరోగ్యదాయక ఉత్పత్తుల విశిష్టత గురించి గ్రామాల్లో ఆయమ్మకు ఈయమ్మకు చెప్పడం మొదలు పెట్టారు. వీటిని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని తెలియజెప్తూ అమ్మేవారు. ఈ విషయం ఆ నోట ఈ నోట తామర తంపరగా పాకిపోయింది. వారి గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే మైదుకూరు పట్టణంలోని కూరగాయల వ్యాపారులకూ ఈ విషయం తెలిసింది. వారి నుంచి కడప, పొద్దుటూరులో కూరగాయల వ్యాపారులకు కూడా తెలిసింది. వారు నేరుగా ఓబులమ్మ తోట దగ్గరకు వచ్చి కూరగాయలు కొనుక్కెళ్లటం అలవాటైంది. దీంతో ఓబులమ్మ పండించే ప్రకృతి వ్యవసాయ పంట దిగుబడులకు మార్కెటింగ్ సమస్యతో పాటు రవాణా ఖర్చు కూడా మిగిలింది. ఖర్చు తగ్గడంతో మంచి రాబడి ప్రారంభమైంది. దీంతో ఓబులమ్మ తన భర్త తిరుమలయ్యతో కలిసి క్రమంగా ప్రకృతి వ్యవసాయ విస్తీర్ణం పెంచుతూ వచ్చారు. 2018 నుంచి తమకున్న మొత్తం 10 ఎకరాల్లోనూ ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. అల్లుడు శివరామయ్య, కుమార్తె ఆదిలక్ష్మిల సహకారంతో ప్రకృతి వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలను పాటిస్తూ దిగ్విజయంగా ఓబులమ్మ, తిరుమలయ్య దంపతులు ప్రకృతి వ్యవసాయంలో ముందుడుగు వేస్తున్నారు. నిమ్మ తోటలో అంతర పంటలు మొదల్లో 2 ఎకరాల్లో నిమ్మ మొక్కలు నాటి.. అంతరపంటలుగా వంగ, మిరప, ఆరటి, బొప్పాయి వంటి తదితర పంటలను సాగు చేశారు. నిమ్మ, అరటి, బొప్పాయి పండ్లను పొలం వద్దనే వ్యాపారులకు అమ్మేవారు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన కూరగాయలు, ఆకుకూరలను మాత్రం ఆలవాటు కొద్దీ ఉదయాన్నే గ్రామాగ్రామానికి తిరిగి అమ్మడం నేటికీ కొనసాగిస్తున్నారు ఓబులమ్మ. 2020లో మరో 6 ఎకరాల్లో నిమ్మ మొక్కలు నాటారు. ఈ ఆరు ఎకరాల్లో కూడా అంతర్ పంటగా ప్రతి 50 సెంట్లలో టమోటా, మిరప, వంగ, గోంగూర, పాలకూర, చుక్కాకు వంటివి సాగు చేశారు. పండ్లు, కూరగాయలను పొలం వద్దే కొనుగోలు చేసుకొని తీసుకు వెళ్తుండటంతో ఓబులమ్మకు మార్కెటింగ్ సమస్య లేకుండా పోయింది. (క్లిక్: ఎకరాకు 8 లక్షల పెట్టుబడి! రెండో ఏడాదే అధికాదాయం.. 50 లక్షలకు పైగా!) అధిక ధరకే అమ్మకాలు గతేడాది 10 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా రూ. 6.99 లక్షల నికరాదాయం వచ్చిందని ఓబులమ్మ తెలిపారు. రూ. 4.8 లక్షలు ఖర్చవ్వగా వివిధ పంటల అమ్మకం ద్వారా రూ. 11,79 లక్షల ఆదాయం వచ్చింది. 3 ఎకరాల్లో నువ్వులు, 2 ఎకరాల్లో కొర్రలు, 2 ఎకరాల్లో మైసూరు మల్లిక, బహురూపి దేశీ వరిని ఓబులమ్మ సాగు చేశారు. మిగతా 3 ఎకరాల్లో పలు రకాల కూరగాయలు, ఆకుకూరలను సాగు చేశారు. నువ్వుల ద్వారా రూ. లక్ష, నిమ్మకాయల ద్వారా రూ.4.70 లక్షలు, మైసూరు మల్లిక, బహురూపి బియ్యం ద్వారా 1.13 లక్షలు, కొర్ర ధాన్యం ద్వారా రూ. 56 వేలు, మిర్చి ద్వారా రూ. 2.78 లక్షలు, టమాటోలు తదితర కూరగాయల ద్వారా రూ. 1.62 లక్షల ఆదాయం వచ్చింది. కూరగాయలు, ఆకుకూరల అమ్మకం ద్వారా ప్రతి రోజూ కొంత రాబడి వస్తున్నది. మార్కెట్లో సాధారణ కూరగాయల చిల్లర కన్నా కిలోకు 2–3 రూపాయల అధిక ధరకు విక్రయిస్తున్నట్లు ఓబులమ్మ వివరించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో నిమ్మ తోటలో అంతరపంటలుగా 2 ఎకరాల్లో ఉల్లి, 1.5 ఎకరాల్లో కొత్తిమీర, 50 సెంట్లలో వరి పంటలను సాగు చేస్తున్నారు. ఇతర వివరాలకు ఓబులమ్మ అల్లుడు శివరామయ్య (98485 58193)ను సంప్రదించవచ్చు. – గోసుల ఎల్లారెడ్డి, సాక్షి, కడప అగ్రికల్చర్ మా కష్టాన్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టినప్పటి నుంచి సాగు ఖర్చు భారీగా తగ్గింది. నా భర్త తిరుమలయ్యతోపాటు అల్లుడు శివరామయ్య, కుమార్తె ఆదిలక్ష్మితో కలిసి వివిధ పంటలను సాగు చేస్తున్నాను. పురుగు మందులకు బదులు నీమాస్త్రం, దశపర్ణి కషాయం, వేపనూనె, కానుగ నూనెలను వాడతాం. ఎరువులకు బదులుగా జీవామృతం, ఘనజీవామృతం వేసుకుంటాం. వీటిని మేమే తయారు చేసుకుంటాం, పంటల సాగుకు ముందు నవధాన్యాలను విత్తి, ఎదిగిన తర్వాత పొలంలో కలియదున్నుతాం. తర్వాత వేసే పంటలకు అది సత్తువగా పనికొస్తుంది. పండ్లను వ్యాపారులే వచ్చి కొనుక్కుంటున్నారు. కూరగాయలను ఇంటింటికీ తీసుకెళ్లి అమ్ముతున్నా. మా కష్టాన్ని గుర్తించిన ప్రకృతి వ్యవసాయ అధికారులు అవార్డుకు దరఖాస్తు చేయించారు. జైవిక్ ఇండియా అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. – బండి ఓబులమ్మ, ప్రకృతి వ్యవసాయదారు, టి. కొత్తపల్లె, మైదుకూరు మం., వైఎస్సార్ జిల్లా -
భర్త మరణించాడని కుంగిపోలేదు.. తానే ముందుండి..
కుటుంబానికి ఆధారమైన భర్త స్వర్గస్తుడయ్యాడని కుంగిపోలేదు. కుటుంబాన్ని ఎలా ఈడ్చాలా అని దిగులు చెందలేదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తలుచుకుని భయాందోళనకు గురికాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో పట్టణంలో పుట్టి చదువుకున్న ఓ మహిళ కుటుంబ పోషణకు వ్యవసాయాన్ని ఆధారంగా ఎంచుకుంది. సొంత భూమి లేకపోయినా కౌలుకు తీసుకుని వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయంలో ఒడిదుడుకులు చవిచూస్తూ ఆదర్శ వ్యవసాయ మహిళగా ప్రజలు, పాలకులతో ప్రశంసలు అందుకుంటోంది నవరంగపూర్ పట్టణానికి చెందిన సీత. –జయపురం నవరంగపూర్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు సీహెచ్ నారాయణ రావు కుమార్తె సీత ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తోంది. దీంతో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు జిల్లా యంత్రాంగం ఆదర్శ మహిళగా గుర్తించి సన్మానించింది. పట్టభధ్రురాలైన ఆమెకు 22 ఏళ్ల వయసులో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన రవికుమార్‌తో వివాహం జరిగింది. ఒక కుమారుడు, కుమార్తె పుట్టిన తరువాత 18 ఏళ్ల క్రితం భర్త స్వర్గస్తుడయ్యాడు. దీంతో కుటుంబ జీవనోపాధికి నవరంగపూర్ నుంచి విశాఖపట్నానికి చింతపండు, అల్లం తీసుకువెళ్లి విక్రయిస్తుండేది. వ్యవసాయ జిల్లా అయిన నవరంగపూర్‌లో పుట్టి పెరగడంతో వ్యవసాయంపై మక్కువ ఉన్నా తగిన అవకాశం, ప్రోత్సాహం లేక వ్యాపారం చేస్తుండేది. అయితే ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తున్న వారిని చూసి ప్రభావితురాలై తాను కూడా వ్యవసాయం చేయాలని నిర్ణయించింది. ఉత్సాహం అయితే ఉంది కానీ వ్యవసాయానికి అవసరమైన పంట భూమిలేదు. ఈ క్రమంలోభూమికోసం ప్రయత్నించి చివరికి నందాహండి సమితి దహనహండి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి 6 ఎకరాల కొండ ప్రాంత మెట్ట భూమిని కౌలుకు తీసుకుంది. ఆ భూమిని బాగు చేసి వ్యవసాయానికి అనువుగా తయారు చేసి మొదటి సారిగా 6 ఎకరాలలో అల్లం పంట వేసింది. మొదటి సారి కావడం, వర్షాలు సహకరించక పోవడంతో దాదాపు 40 శాతం పంట కుళ్లిపోవడంతో నష్టం వచ్చింది. అయినా ఆమె వెనుకంజ వేయకుండా రుణాలు తెచ్చి మళ్లీ అల్లం పంట వేసింది. అల్లంతో పాటు పలు మిశ్రమ పంటలను పండించింది. వ్యవసాయ రంగంలో అడుగుపెట్టిన తరువాత పాత పద్ధతుల్లో సాగు చేస్తే అంతగా లాభాలు రావన్న విషయం గ్రహించి ఆధునిక పద్ధతులు తెలుసుకోవాలని ప్రయత్నించింది. ఇందుకోసం పలు ప్రాంతాల్లో వ్యవసాయ వైజ్ఞానికులను కలిసి ఆధునిక పరిజ్ఞానం సంపాదించింది. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అల్లం, ఇతర పంటలకు శ్రీకారం చుట్టింది. ఆధునిక పద్ధతిలో పండించిన అల్లం ఒక మొక్కకు కేజీన్నర నుంచి రెండు కేజీల అల్లం ఉత్పత్తి కావడం ఆమె సాధించిన విజయమనే చెప్పవచ్చు. ఇలా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ లాభాలు ఆర్జిస్తూ మరో పదిమందికి ఆదర్శంగా నిలుస్తోంది. సహాయ సహకారాల్లేవు వ్యవసాయానికి అన్ని విధాలా సహాయం అందిస్తామని రైతులకు హామీలు ఇస్తున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు. కనీసం వ్యవసాయ వైజ్ఞానిక సహాయం కూడా లేదు. అందువల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లి వైజ్ఞానిక పద్ధతులు తెలుసుకోవలసి వచ్చింది. నాలాంటి వారికి ప్రభుత్వం సహాయం అందజేస్తే మెరుగ్గా ఉంటుంది. -
కష్టమే ఇష్టంగా.. ఓ మట్టిమనిషి
గాలికి గలగలా నవ్వుతున్నట్లు ఊగుతున్న ఆ పసుపు పంటను అలా చూస్తూ నర్సవ్వ మురిసిపోతోంది. ‘ఏందవ్వ.. అట్ల చూస్తున్నవ్’ అని అడిగితే.. ‘తొమ్మిది నెలలు కడుపుల బిడ్డను మోసినట్లే.. ఈ పంటనూ కాపాడాలే బిడ్డా..’ అని చెబుతూనే పొలంగట్టు మీద వడివడిగా ముందుకు నడుస్తోంది. పక్కన మడిలో విరిసిన గులాబీలు తల్లి తమ చెంతకు వస్తోందన్న ఆనందంతో ఆమెనే చూస్తున్నట్టు కనిపించాయి. వాటిని ఆమె చేతితో తడుముతుంటే అవి మరింత విచ్చుకున్నట్లు అనిపించాయి. వాటిని దాటుకుంటూ నల్లని భూమిలో నుంచి వెలికి వచ్చిన ఉల్లి నారు, పచ్చగా విచ్చుకున్న గోబీపువ్వు, వాసన చూడు తల్లీ.. అని పిలుస్తున్నట్లున్న పుదీనా కనిపించింది. గాలికి ఎగురుతున్న తన వెండి వెంట్రుకలను వెనక్కి తోసుకుంటూ.. కంటి అద్దాలను సరిచేసుకుంటూ.. ‘కూసో బిడ్డ..’ అని పంపుసెట్టు మూలమలుపు ఒడ్డుమీద కూర్చుంది. ‘చెప్పు బిడ్డా ఎటచ్చిండ్రు..’ అని ఆప్యాయంగా అడిగింది. ‘ఏం లేదవ్వ..’ అంటూనే ఒక్కో ప్రశ్న అడుగుతూ పోతుంటే.. గలగలా మాట్లాడుతూ.. తన కథను కళ్లకు కట్టించింది. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి సోపతి (దోస్తానా) చేస్తున్న ఆ భూమాతకున్నంత ఓపిక నర్సవ్వలోనూ కనిపించింది. అరవైమూడేళ్లు ఉన్న ఆమెలో కష్టం తాలూకు చాయలు ఇసుమంతైనా కనిపించలేదు. ఆ మట్టిమనిషి చెప్పిన కథలో కష్టాలున్నయ్.. కన్నీళ్లున్నయ్.. కొండంత బాధ్యతలున్నయ్.. నాయకత్వ లక్షణాలున్నయ్.. ఈ తరానికి కావల్సినన్ని ఆదర్శాలూ ఉన్నయ్. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామానికి చెందిన కొప్పుల లక్ష్మీబాయి, నర్సారెడ్డికి ఇద్దరు కూతుళ్లు, నలుగురు కుమారులు. ఆరుగురిలో నర్సవ్వ పెద్దది. నర్సారెడ్డి సొంతూరు శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టులో ముంపునకు గురైన పాత బొప్పారం. ఊరు మునిగిపోతే నర్సారెడ్డి తన కుటుంబంతో సిర్గాపూర్ వచ్చాడు. ఇక్కడ భూమి కొని సాగు మొదలుపెట్టాడు. అలా తెలిసీ తెలియని వయసులో తండ్రి వెంట వచ్చిన నర్సవ్వ కష్టాలను చూస్తూ పెరిగింది. ఆ జమానాలోనే ఐదో తరగతి వరకు చదివింది. చిన్నతనంలోనే పెళ్లి ఇంటికి పెద్దదైన నర్సవ్వకు తండ్రి నర్సారెడ్డి అప్పటి ఆచారాలకు తగ్గట్లు బాల్య వివాహం చేశాడు. కొన్ని కారణాంతరాల వల్ల పెరిగి పెద్దదైనా నర్సవ్వ తన అత్తారింటికి వెళ్లలేదు. తండ్రితోనే పొలం పనులకు వెళ్లడం ప్రారంభించింది. నాన్నకు నడకగా మారింది. ఇంటికి పెద్దదిక్కుగా.. తండ్రి నర్సారెడ్డి కాలంచేయడంతో నర్సవ్వే ఇంటికి పెద్దదిక్కయ్యింది. తానే ముందుండి తమ్ముళ్లు, చెల్లెళ్లకు పెళ్లి చేసింది. శ్రీరాంసాగర్‌లో ముంపునకు గురైన పాతబొప్పారం గ్రామస్తులకు సోన్ మండలంలోని కొత్త బొప్పారంలో భూములు ఇచ్చారు. అక్కడ వచ్చిన భూమిని ఇద్దరు తమ్ముళ్లకు.. సిర్గాపూర్‌లోని భూమిని మరో ఇద్దరికి ఇచ్చింది. నర్సవ్వ కాయకష్టం చేసి సొంతంగా నాలుగున్నర ఎకరాలు కొనుక్కుని అందులోనే పంటలు పండించుకుంటూ.. ఎనభయ్యేళ్లు దాటిన తల్లి లక్ష్మీబాయి, తమ్ముడి కొడుకు నర్సన్న బాగోగులు చూస్తోంది. పొద్దుపొడవక ముందే.. బారెడు పొద్దెక్కేదాకా లేవని ఈ జమానాలోనూ సూరీడు రాకముందే నర్సవ్వ దినచర్య ప్రారంభమవుతుంది. ముందురోజే కోసి, కట్టలు కట్టిన కూరగాయల మూటలను తానే ఆటో లేదా బస్సులో వేసుకుని ఆరుగంటలకే నిర్మల్ జిల్లాకేంద్రంలోని కూరగాయల మార్కెట్‌కు చేరుతుంది. వాటిని హోల్‌సేల్‌గా అమ్ముకుని ఎనిమిది గంటలకల్లా ఇంటికి చేరుతుంది. తొమ్మిదింటికల్లా మళ్లీ చేలోకి వెళ్తుంది. రోజంతా భూమితోనే ఆమె దోస్తానా. అక్కడి పంటలే ఆమె ఆత్మీయనేస్తాలు. ఎరువులు, మందులు, ఇతర విత్తనాలు ఇలా ఏది అవసరం పడినా తానే స్వయంగా వెళ్లి తెచ్చుకుంటుంది. సొంత బిడ్డల్లా చూసుకుంటున్నందుకేనేమో.. ఆ పంటలూ మంచి దిగుబడిని ఇస్తున్నాయి. అసలు.. నర్సవ్వ చేసే పని, ఆమె పాజిటివ్ థింకింగ్, చలాకీ మాటలు చూస్తుంటే.. ఆమె అరవయేళ్లు దాటిన అవ్వేనా.. అనిపించకమానదు. అరగంట కష్టపడకుండా.. అరక్షణమైనా ఆలోచించే తీరికలేని నేటితరం నర్సవ్వను చూసి నేర్చుకోవలసింది చాలానే ఉందనిపిస్తుంది. కష్టాన్నే నమ్ముకున్న చిన్నప్పటి నుంచి కష్టం చూసుకుంటనే పెరిగిన. నాన్నపోయిన తర్వాత ఇల్లు చూసుకుంట.. తోడబుట్టినోళ్ల పెళ్లిళ్లు చేసుకుంట వచ్చిన. నాలుగున్నర ఎకరాలను నమ్ముకుంటేనే ఇయ్యాల రోజులు గడుస్తున్నయ్. సొంతంగా ఇల్లు కట్టుకున్న. తల్లి లక్ష్మీబాయి, అల్లుడు నర్సారెడ్డిని చూసుకుంటున్న. పంట భూమి తప్ప వేరే సోపతి నాకు లేదు. – కొప్పుల నర్సవ్వ – రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్ ఫొటోలు: బాతూరి కైలాష్ -
కోదాడలో మహిళా రైతు ఆత్మహత్య యత్నం
సూర్యాపేట : జిల్లాలోని కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలో ఓ మహిళా రైతు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. తన వ్యవసాయ భూమి కబ్జాకు గురికావడంతో ఆమె పురుగుల మందు తాగినట్టుగా తెలుస్తోంది. ఇది గమనించిన బాధితురాలి బంధువులు ఆమె చర్యను నిలువరించే ప్రయత్నం చేశారు. వెంటనే మహిళా రైతును స్థానిక ఆస్పత్రికి తరలించారు. గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు బాధితురాలి భూమిని కబ్జా చేసినట్టు ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు రక్షణగా ఉండాల్సిన సర్పంచే తన భూమిని కబ్జా చేయడంతో తీవ్ర మనస్తాపానికి లోనైనట్టుగా సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చంద్రబాబు తీరుపై మహిళా రైతు ఆగ్రహం
పెదవాల్తేరు (విశాఖతూర్పు): రైతుల విషయంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతానికి చెందిన రైతు దాట్ల శ్రీదేవి ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. రాజధాని తరలింపు విషయమై అమరావతిలో రైతులచే ఆందోళన చేయిస్తున్నారని.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టుకు భూసేకరణ సమయంలో ఆ ప్రాంత రైతులు చేసిన ఆందోళనలను పట్టించుకోకుండా.. వారిని అష్టకష్టాల పాల్జేశారని మండిపడ్డారు. అప్పట్లో ఎంతోమందిపై క్రిమినల్ కేసులు పెట్టారని, తనపై నాలుగు కేసులు పెట్టి.. పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి.. రైతులపై దౌర్జన్యం చేయించారని తెలిపారు. మహిళలు, వృద్ధులు, పిల్లలని కూడా చూడకుండా పోలీసు, రెవెన్యూ అధికారులు దమనకాండ సాగించారని పేర్కొన్నారు. ఊర్లకు ఊర్లు ఖాళీ చేయించి స్టేషన్లకు తరలించి భూ సేకరణకు సర్వే చేశారని తెలిపారు. భూములపై హక్కులను కాపాడుకునేందుకే నాడు ఆందోళన చేశామని.. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు సంఘీభావం ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అమరావతి రైతులు రూ.4 లక్షల విలువైన ఎకరం భూమిని రూ.కోట్లకు అమ్ముకున్నారని, కానీ భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణ విషయంలో మాత్రం నాటి టీడీపీ ప్రభుత్వం ఎకరానికి కేవలం రూ.18 లక్షల నుంచి 33 లక్షల చొప్పున రేటు నిర్ణయించిందని.. కానీ ఇక్కడ ఎకరం రూ.3 కోట్లు ఉందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో భూసేకరణ కారణంగా ఎన్నో కుటుంబాల్లో వివాహాలు ఆగిపోయాయని.. అప్పుడు ఒక మంత్రిగానీ, ఎమ్మెల్యేగానీ తమను పరామర్శించిన పాపాన పోలేదని పేర్కొన్నారు. -
రైతు గొంతుక
వైశాలి సుధాకర్ ఎడె 28 ఏళ్ల యువతి. మహారాష్ట్ర మహిళ. రైతుల కోసం గళమెత్తిన రైతు భార్య. యావత్మల్– వాశిమ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన నేల తల్లి బిడ్డ. ‘ఫైట్ ఫర్ కాజ్’ అంటూ ఎన్నికల బరిలో దిగిన ధీశాలి గురించి... ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసిన సందర్భంగా చెప్పుకోవలసిన విశేషాలు చాలానే ఉన్నాయి. వైశాలిది యావత్మల్ జిల్లాలోని రాజూర్ గ్రామం. అది విదర్భ రీజియన్‌లో ఉంది. ఏ శాపం పీడిస్తుందో తెలియదు కానీ అక్కడి మహిళల్లో ఎక్కువ మంది భర్తను భూమాతకు అప్పగించి ఒంటరిగా బతుకీడుస్తున్నవాళ్లే. పుట్టెడు ధాన్యమిచ్చి బతుకును పండించాల్సిన భూమి తల్లి.. బతుకును బలి కోరుతుంటే ఆపగలిగిన శక్తి ఎవరికుంటుంది? ‘అంతా విధి రాత’ అని నుదురు కొట్టుకుంటూ బీడు వారిన భూమిలో భర్త వదిలి వెళ్లిన వ్యవసాయాన్ని గట్టెక్కించడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్న మహిళలే కనిపిస్తారు... అక్కడ ఎటు చూసినా. దాదాపు రెండు దశాబ్దాలుగా రైతుల ఆత్మహత్యలతో అతలాకుతలమై పోయింది యావత్మల్ జిల్లా. సరాసరిన రోజుకో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు! అలాంటి క్లిష్టమైన సమయంలోనే వైశాలికి పెళ్లయింది. సినిమా కథలాగ పెళ్లితో సుఖాంతం అయిన జీవితం కాదామెది. తన జీవితం కష్టాల కడలిగా మారిందని పెళ్లి తర్వాతే తెలిసిందామెకి. కొండంత అప్పు ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో 92వ మరాఠీ లిటరరీ మీట్ ‘అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్’ జరిగింది. జనవరి 11వ తేదీన మొదలైన మూడు రోజుల సదస్సును ప్రారంభించడానికి వైశాలికి ఒక ఆదర్శ మహిళగా ఆహ్వానం వచ్చింది. సదస్సులో ఆమె ప్రసంగం ఇలా సాగింది.‘‘మా సొంతూరు దోంగార్ ఖర్దా. మా తల్లిదండ్రులు వ్యవసాయకూలీలు. నాకు పద్దెనిమిదేళ్లకు పెళ్లయింది. టెన్త్ క్లాస్ చదివానంతే. అత్తగారిల్లు పెద్ద ఉమ్మడి కుటుంబం. మొత్తం పద్నాలుగు మంది ఉండేవారు. తొమ్మిదెకరాల పొలం ఉంది. రైతు కుటుంబంలోకి కోడలిగా అడుగు పెట్టడం నా అదృష్టం అని మురిసిపోయారు మా అమ్మానాన్న. మా అత్తగారింట్లో అందరూ పొలం పనులు చేసేవాళ్లు. నా భర్త కూడా వ్యవసాయం చేసేవాడు. పెళ్లయిన ఏడాదికి బాబు పుట్టాడు. వ్యవసాయం యేటికేడాది కష్టంగా మారిపోయింది. పత్తి, చెరకు పంటలు చేతికి రాలేదు. వరుసగా రెండేళ్లు పంట దిగుబడి లేదు. పంటలు వేయడానికి తెచ్చిన అప్పులు కొండలా పెరిగిపోయాయి. బ్యాంకు అప్పు అలాగే ఉంది. రెండోసారి షావుకారు నుంచి అప్పు తెచ్చి పంట వేశారు. వడ్డీతో కలుపుకుని అప్పు పెరిగిపోతోంది. షావుకారు నుంచి ఒత్తిడి కూడా పెరిగింది. ఇంట్లో అందరి ముఖాల్లో ఒకటే దిగులు. బాబు పుట్టిన తర్వాత రెండేళ్లకు.. అంటే 2011లో నాకు మళ్లీ గర్భం వచ్చింది. నేను మా పుట్టింటికి వెళ్లాను. ఓ రోజు మా వారు నన్ను చూడడానికి మా పుట్టింటికి వచ్చారు. ఆ ఏడాది కూడా పంట వస్తుందన్న ఆశలేదని బాధగా చెప్పాడు. కానీ ఆ రోజు నాతో చాలా బాగున్నాడు. బాబు జాగ్రత్త, అని నా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని మళ్లీ మళ్లీ చెప్పి ఊరికెళ్లాడు. ఆ మరుసటి రోజే వినరాని వార్త... ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు’’ అని వైశాలి మాట్లాడుతుంటే.. సాహిత్య సదస్సుకు హాజరైన అతిథుల గుండె బరువెక్కింది. ప్రాంగణం అంతా నిశ్శబ్దం ఆవరించింది. భర్త పోయిన తర్వాత ఇద్దరు పిల్లలతో బతుకు పోరాటం చేస్తున్న ఒక యోధను చూస్తున్నారు వాళ్లంతా. ఆమె ప్రసంగం పూర్తి కాగానే సభికులంతా కన్నీళ్లు తుడుచుకుంటూ చప్పట్లతో ఆమెను అభినందించారు. భర్త అప్పగించిన బాధ్యత ఇరవై రెండేళ్లలోపే భర్త పోయాడు. ఇద్దరు పిల్లలను (కునాల్, జాహ్నవి) పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత కళ్ల ముందు కనిపిస్తోంది వైశాలికి. అంతకంటే ముందు మా అప్పు సంగతేంటని షావుకారు మనుషులు వచ్చి గుర్తు చేసి పోతున్నారు. కుటుంబ యజమాని మరణిస్తే ప్రభుత్వం సహాయంగా ఇచ్చే లక్షరూపాయలను అప్పులోకి జమ చేసింది. అయినా తీరలేదు, ఇంకా మిగిలే ఉన్నాయి. తన బంగారు అమ్మేసి మిగిలిన అప్పులు తీర్చింది. టైలరింగ్ నేర్చుకుంది. పంటలు లేక పేదరికం తాండవిస్తున్న ఊర్లో ఎంత మంది కొత్త దుస్తులు కుట్టించుకోగలుగుతారు, పగలు రాత్రి కష్టపడాలని వైశాలికి ఉన్నా చేతి నిండా పని దొరకడమూ కష్టమే. ఆ ఊరికి అంగన్వాడీ సెంటర్ వచ్చింది. 2013లో అంగన్వాడీ వర్కర్‌గా చేరింది. అప్పట్లో నెలకు రెండు వేలిచ్చేవాళ్లు. ఇప్పుడు మూడున్నర వేలు చేశారు. బతుకు బండి అయితే ఎలాగోలా సాగిపోతోంది. అంగన్వాడీ సెంటర్ చూసుకుంటూ, తన పిల్లలను పోషించడంతోపాటు ఆత్మహత్య చేసుకున్న రైతుల భార్యలకు మాట సాయం చేయడం, వాళ్లను గవర్నమెంట్ ఆఫీసుకు తీసుకెళ్లి రావాల్సిన డబ్బు ఇప్పించడం వంటి సహాయం చేస్తోంది వైశాలి. ఆ చుట్టు పక్కల గ్రామాలకు ఆమె ఒక రోల్ మోడల్‌గా మారింది. ఆమెకి సాహిత్య సదస్సులో ప్రసంగించడానికి ఆహ్వానం కూడా అప్పుడే వచ్చింది. ఆ ప్రసంగం అంతా ఆమె పదేళ్ల జీవితమే. పద్దెనిమిదేళ్లకు పెళ్లయితే ఇరవై ఎనిమిదేళ్ల లోపు ఆమె పడిన కష్టాలే ఆమె ప్రసంగం. ఎదురీదుతూ నిలిచిన తీరే ఆమెలో రగులుతున్న స్ఫూర్తికి నిదర్శనం. ఇంతలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. కష్టాలే అనుభవాలు ఓ రోజు ప్రహర్ జన్‌శక్తి పక్ష (పి.జె.పి.) అధ్యక్షుడు ఓమ్ ప్రకాశ్ బాబారావ్, మరికొందరు నాయకులతో కలిసి వైశాలి ఇంటికి వచ్చారు. యావత్మల్ వాశిమ్ లోక్‌సభ స్థానానికి పోటీ చేయమని వాళ్ల ప్రతిపాదన. ఆమె మొదట ఆశ్చర్యపోయింది. ‘‘నాకు రాజకీయాలు తెలియవు, పంచాయితీ సర్పంచ్ కాదు కదా కనీసం వార్డు మెంబర్‌గా కూడా చేయలేదు. ఏకంగా లోక్‌సభ సభ్యత్వానికి పోటీ చేయమంటున్నారు’’ అని సందేహం వ్యక్తం చేసిందామె. ‘‘మన కష్టాలే మన అనుభవాలు. అంతకంటే పెద్ద పాఠం ఏముంటుంది నేర్చుకోవడానికి’’ అని ఒప్పించారామెని బాబారావు. ‘‘ప్రజలకు రైతుల కష్టాలను విడమరిచి చెప్పడానికి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదు. రైతుల అవసరాలను తీర్చడానికి ఉద్యమించాల్సిన రాజకీయ పార్టీలు ఆ పని చేయకపోతే మనలాంటి సామాన్యులే ఉద్యమిస్తారని రాజకీయ పార్టీలకు తెలియాలి’’ అని ప్రోత్సహించారాయన. ‘రైతు కుటుంబంలో పెరిగిన వాళ్లకు రైతుల స్థితిగతులు, రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి ఎదురయ్యే దుర్భరమైన పరిస్థితుల గురించి ఒకరు చెప్పాల్సిన పని లేదు. వాటినే చట్టసభలో మాట్లాడాలి. ఇందుకు నాకున్న అనుభవం నా జీవితమే. రైతుల కష్టాలను పెద్ద సభలు గుర్తించి పరిష్కరించడం కోసమే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నా పోరాటంలో నేను విజయవంతమవుతాను’ అని తన తొలి ఎన్నికల సభలో అన్నారు వైశాలి. ఓటర్లే విరాళాలిచ్చారు వైశాలి ఎన్నికల ప్రచారం మార్చి 28వ తేదీన మొదలైంది. బస్సు, ఆటో రిక్షా, కాలి నడకన గ్రామాలను చుట్టేస్తోంది. గ్రామసభల్లో మాట్లాడుతోంది. ‘‘నాకు అవకాశం వస్తే... రైతుల ఆత్మహత్యలకు కారణాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తాను. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఒక నిధిని ఏర్పాటు చేసి ఆదుకోవాలని, అందుకోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని కోరతాను. చట్టం వచ్చే వరకు పోరాడతాను’’ అని భరోసా ఇస్తోంది. భర్తను కోల్పోయిన మహిళలతోపాటు అనేక రైతు కుటుంబాలు కూడా వైశాలికి మద్దతిచ్చాయి. పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆమె ఎన్నికల ఖర్చు కోసం విరాళాలిచ్చారు. రూపాయి నుంచి యాభై వేల రూపాయల వరకు విరాళాలు వచ్చాయి. రూపాయి, ఐదు, పది రూపాయలు ఎవరికి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత విరాళాల డబ్బాలో వేశారు. దుబాయ్ నుంచి ఒక దాత ఐదు వేలిచ్చాడు. నాసిక్ నుంచి రైతులు యాభై ఒక్క వేల రూపాయలు సమీకరించి, ఆ మొత్తాన్ని పంపించారు. షోలాపూర్ నుంచి ఒక రైతు పది బస్తాల ధాన్యం, గోధుమలు ఇచ్చాడు. గుజరాత్ నుంచి ఇంకో రైతు ప్రహర్ జన్‌శక్తి పక్ష పార్టీ ఆఫీసుకు ఫోన్ చేసి వైశాలి బ్యాంకు అకౌంటు వివరాలు తెలుసుకుని నగదు జమ చేశాడు. అలా మొత్తం ఐదు లక్షల రూపాయలు సమాకూరాయి. మీడియా వెతుక్కుంటూ వచ్చింది వైశాలి తన ప్రచారంలో ఎప్పుడూ మీడియా సహాయం కోరలేదు. గ్రామాలు తిరుగుతూ రైతు కుటుంబాలను కలవడమే తప్ప మీడియాలో ప్రకటనలు కూడా ఇవ్వనే లేదు. అలాగని మీడియా మిన్నకుండిపోలేదు. ఆమె ఎప్పుడు ఎక్కడ ఉంటారో వెతికి పట్టుకునే పనిలో పడింది. స్థానిక, జాతీయ మీడియా సంస్థలు ఆమె ప్రచారంలో ఉంటే ఎప్పుడు ఏ గ్రామంలో దొరుకుతారో తెలుసుకుని మరీ ఆమె ఇంటర్వ్యూ కోసం క్యూ కట్టాయి. వాళ్లకు ఆమె చెప్పిన మాట ఒకటే... ‘‘2001 నుంచి ఇప్పటి వరకు యావత్మల్ జిల్లాలో 4,265 మంది, వాసిమ్ జిల్లాలో 1,523 మంది రైతులు మరణించారు. మరణించిన వాళ్లకు లక్ష పరిహారం ఇవ్వడంతో ప్రభుత్వం బాధ్యత తీరిపోతుందా? మన వ్యవసాయ దేశంలో రైతు జాతికి అన్నం పెట్టాలి తప్ప రైతు అన్నం లేక చచ్చిపోకూడదు. మేము పోరాడుతున్నాం, ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్లో అడుగు పెడతామా లేదా అనేది కాదు. మా పోరాటం ఒక మంచి సామాజిక అవసరం కోసం. ఆ అవసరాన్ని దేశం గుర్తించే వరకు పోరాటం చేస్తాం. ఈ పోరాటంలో మేము విజయం సాధిస్తాం. మా పోరాటం పార్లమెంటు స్థానం కాదు, ఒక సామాజిక అవసరత’’ అని! కొత్త నాయకత్వానికి స్వాగతం యావత్మల్– వాశిమ్ సిట్టింగ్ ఎంపీ శివసేన అభ్యర్థి భావనా గవాలి. ఆమె 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు మూడోసారి బరిలో నిలిచారు. ఆమెకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాణిక్ రావు ఠాక్రే. ఇద్దరూ కుంబి సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 19 లక్షల ఓటర్లుండగా వారిలో ఆరు లక్షలకు పైగా ఓటర్లు కుంబి సామాజిక వర్గానికి చెందిన వారే. అందుకే గతంలో శివసేన ఆ సామాజిక వర్గం నుంచి భావనా గవాలిని నిలబెట్టి రెండుసార్లు గెలిపించుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసి కుంబి సామాజికవర్గంలోని ఉపవర్గం మీద దృష్టి పెట్టింది. కుంబిలోని తిరాలే ఉపవర్గానికి చెందిన ఠాక్రేకి టికెట్ ఇచ్చింది. ఎందుకంటే భావన గవాలి కుంబిలోని ఘటోలే ఉపవర్గానికి చెందిన వ్యక్తి. ఆ ఉపవర్గానికంటే తిరాలే ఉపవర్గం వాళ్లే ఎక్కువ. గతంలో కాంగ్రెస్ ఆ స్థానం నుంచి శివాజీ రావు మోఘేను నిలబెట్టింది. అతడు కుంబి కులస్థుడు కాదు. దాంతో కుంబి సామాజికవర్గం ఓట్లు గంపగుత్తగా భావనకు పడ్డాయి. ఇప్పుడు కుంబిలో ఉన్న రెండు ఉపవర్గాలతో కొత్త సమీకరణకు తెర తీసింది కాంగ్రెస్ పార్టీ. ప్రధాన పార్టీలు ఇలా కుల సమీకరణల లెక్క చూసుకుంటున్నాయి తప్ప రైతుల సమస్యలను, ఆత్మహత్యలను పట్టించుకోవడం లేదు. ఒక నాయకుడు విఫలమైనప్పుడే సమాజం మరో నాయకుడిని స్వాగతిస్తుంది. అది మరోసారి ఇప్పుడు వైశాలి విషయంలో నిజమైంది. ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో ఈ స్థానంలో 61.07 శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రజలు రైతు పక్షాన ఉన్నారా లేక కుల సమీకరణల వ్యూహాల్లో కొట్టుమిట్టాడుతున్నారా? ఈ సందేహానికి సమాధానం... మే నెల 23 మాత్రమే చెప్పగలుగుతుంది. – వాకా మంజులారెడ్డి మాకు మేమే ఓడిపోతాననే భయం లేదు. పోరాడుతున్నాను, పోరాడడానికి ధైర్యం ఉంది. ఎవరి కష్టం వాళ్లకే బాగా తెలుస్తుంది. మా కష్టం ఏమిటో, అదెంత తీవ్రంగా ఉంటుందో మాకంటే బాగా మరెవ్వరూ చెప్పలేరు. చెప్పడానికి ఎవరైనా పెద్ద మనసుతో ముందుకు వచ్చినా... నేలలో గింజలు వేసి అవి మొలకెత్తకపోతే మనసు ఎంత తల్లడిల్లుతుందో డబ్బున్న పెద్ద పెద్ద వాళ్లకెవ్వరికీ అర్థం కాదు. మొలకెత్తిన మొక్క వెన్ను తీయకుండా వడలిపోతే ఊపిరాడక ఛాతీ ఎలా పట్టేస్తుందో వాళ్లకు అనుభవంలోకి వచ్చి ఉండదు. నీళ్లు లేక ఎండిన భూమి నెర్రలు బారుతుంటే మా గుండెలు నిలువునా చీలిపోతాయి, విచ్చిన పత్తి రాలిపోయి నేల పగుళ్లలోకి జారిపోతుంటే అరచేతులు అడ్డు పెట్టి ఆపుదామన్నంత ఆర్తి కలుగుతుంది. బతుకంతా తోడుగా ఉంటాడనుకున్న భర్త... ప్రకృతి మాత పెట్టిన పరీక్షలో ఓడిపోతే... ఇల్లాలు పడే ఆవేదన ఎవరికి అర్థమవుతుంది? ఆ కష్టాన్ని అనుభవించిన మాకు మాత్రమే ఆ కష్టాన్ని చెప్పడానికి మాటలు వస్తాయి. చట్టసభలో దేశమంతటికీ వినిపించేలా చెప్పగలిగిన స్వరం మా గొంతులకే ఉంటుంది. అందుకే ఈ పోరాటం. రైతుల శక్తి ఏమిటో దేశానికి చాటుతాం. వైశాలి ఎడె, యావత్మల్– వాశిమ్ లోక్‌సభ అభ్యర్థి, ప్రహర్ జన్‌శక్తి పక్ష పార్టీ యావత్మల్– వాశిమ్ లోక్‌సభ స్థానంలో శివసేన– కాంగ్రెస్‌ల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. జనతాదళ్ (ఎస్), రాష్ట్రీయ బహుజన్ కాంగ్రెస్‌పార్టీ, గోండ్వానా గణతంత్ర పార్టీ, ప్రబుద్ధ రిపబ్లిక్ పార్టీ, వాంఛిత్ బహుజన్ ఆఘాదీ, బహుజన్ ముక్తి పార్టీ, సన్మాన్ రాజ్కీయ పక్ష, బహుజన్ సమాజ్ పార్టీ, ప్రహార్ జన్‌శక్తి పార్టీలతోపాటు ఇండిపెండెంట్లు రంగంలో ఉన్నారు. మొత్తం 28 మంది అభ్యర్థులు. -
సేంద్రియ గుడ్లు!
‘ఆహారం సరైనదైతే ఏ ఔషధమూ అవసరం లేదు.. ఆహారం సరైనది కాకపోతే ఏ ఔషధమూ పనిచేయదు’... ఈ సూత్రాన్ని మనుషులకే కాదు ఫారం కోళ్లక్కూడా విజయవంతంగా వర్తింపజే యవచ్చని రుజువు చేస్తున్నారు ఓ మహిళా రైతు. గత రెండేళ్లుగా రసాయనిక ఔషధాలు, వాక్సిన్లు మచ్చుకి కూడా వాడకుండా 15 వేల లేయర్ కోళ్లను ఆరోగ్యదాయకంగా పెంచుతున్నారు జయప్రదారెడ్డి. చిరుధాన్యాలతో తయారు చేసుకునే దాణాలో 15% మేరకు కూరగాయలు, ఆకులు అలములు కలిపి కోళ్లకు మేపుతున్నారు. ఇందుకోసం రెండున్నర ఎకరాల్లో ఔషధ మొక్కలు, చెట్లు, పందిరి కూరగాయలు పెంచుతున్నారు. అత్యంత నాణ్యమైన ‘సేంద్రియ గుడ్ల’ను ఉత్పత్తి చేస్తూ గణనీయమైన లాభాలు గడిస్తున్నారు. పట్టుదలకు మారుపేరుగా నిలిచిన ఆ మహిళా రైతు జయప్రదా రెడ్డి అభినందనీయురాలు. సాధారణ పౌల్ట్రీ రైతుగా జీవనం ప్రారంభించి సొంత ఆలోచనతో సేంద్రియ రైతుగా ఎదిగారు. ఏదైనా రంగంలో కృషి చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్న తపన జయప్రదారెడ్డి(53)ని సేంద్రియ కోళ్ల రైతుగా మార్చింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని రాణిపేట ఆమె స్వగ్రామం. నిజాం సర్కారులో కొత్వాల్‌గా పని చేసిన రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి వంశంలోని కుటుంబానికి కోడలిగా వచ్చిన జయప్రదారెడ్డి పెళ్లి తర్వాత హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో ఉండి డిగ్రీ పూర్తి చేశారు. భర్త జనార్దన్‌రెడ్డి గతంలో జైళ్లవిభాగంలో హైదరాబాద్‌లో పనిచేసి డీఎస్పీగా రిటైరయ్యారు. ఆ తర్వాత రాణిపేటకు మకాం మారింది. ఆ దశలో ఏడేళ్ల క్రితం భర్త ప్రోత్సాహంతో జయప్రదారెడ్డి రాణిపేటలోని తమ ఇంటి దగ్గర్లోని సొంత భూమిలో షెడ్లు నిర్మించి లేయర్ (గుడ్లు పెట్టే) కోళ్ల ఫారాన్ని ప్రారంభించారు. దాణా గోదాము నిర్మించారు. ఇందుకోసం రూ. 45 లక్షల బ్యాంకు రుణం తీసుకున్నారు. లేయర్కోళ్ల పెంపకంలో ఒక పంట కాలం వంద వారాలు. ఒకరోజు వయసున్న కోడి పిల్లలను హేచరీ నుంచి తెచ్చి ఫారంలో పెంచుతారు. అయితే, కోళ్ల ఫారం నిర్వహణలో అనుభవరాహిత్యం వల్ల మొదటి పంట కాలంలో ఎదిగిన కోళ్లను కొన్నారు. నిపుణుల సూచన మేరకు ఔషధాలు, వాక్సిన్లు వాడినప్పటికీ జబ్బు పడి కోళ్లు చనిపోయాయి. 60వ వారానికే ఆ బ్యాచ్ మొత్తాన్నీ తీసేయాల్సి వచ్చింది. రూ. లక్షల్లో నష్టం వచ్చింది. అయినా, అధైర్యపడకుండా, సొంత భూమి తనఖా పెట్టి వర్కింగ్ క్యాపిటల్‌గా రూ. 30 లక్షలు రుణం తీసుకొని రెండో బ్యాచ్ కోడిపిల్లల పెంపకం చేపట్టారు. మొక్కజొన్న, జొన్న, రాగులు, సజ్జలు తదితరాలతో కూడిన దాణా ఇచ్చే వారు. 45 రోజులకోసారి వ్యాక్సిన్ వేయడంతోబాటు ఔషధాలూ వాడేవారు. తరచూ జబ్బులు వచ్చేవి. రెండో బ్యాచ్‌ను 82 వారాల్లో తీసేయాల్సి వచ్చింది. ఆరుబయట గరికను కొరుక్కు తినే నాటు కోళ్లు ఆరోగ్యంగా ఉండటం గమనించిన జయప్రదారెడ్డికి, తన ఫారం కోళ్లకు పెట్టే దాణాలో డ్రై ఫీడ్తోపాటు గరికను, మేకలు తినే రకరకాల ఆకులను కలిపి పెడితే రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న ఆలోచన వచ్చింది. ప్రయోగాత్మకంగా గరికను దాణాలో కలపడం ప్రారంభించగా కొద్ది రోజుల్లోనే మంచి మార్పు వచ్చింది. ఆ మార్పు ఆమెను ఉత్సాహపరచింది. 15% మేరకు ఆకులు, కూరగాయలు మూడో బ్యాచ్ కోడి పిల్లల పెంపకం ప్రారంభించిన తొలిదశ నుంచే దాణాలో పూర్తిస్థాయి మార్పులు చేశారు. గరిక, ఆకులతోపాటు టమాటా, సొర వంటి కూరగాయలను సైతం ముక్కలుగా తరిగి ప్రయోగాత్మకంగా దాణాలో కలిపి కోళ్లకు మేపడం మొదలు పెట్టారు. ఆహారంలో చేసిన మార్పులు మంచి ఫలితాలిస్తున్నట్లు గమనించిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడలేదు. వివిధ ధాన్యాలు(డ్రై ఫీడ్) 85%, ఆకులు–కూరగాయలు కలిపి 15% మేరకు దాణాలో కలపడం ప్రారంభించారు. డ్రై ఫీడ్‌లో సగం మేరకు ధాన్యాలు, సగం మేరకు నూనె తీసిన తెలగపిండి ఉండేలా చూస్తున్నారు. మొక్కజొన్న(45%), సజ్జలు, జొన్నలు, కొర్రలు (తలా ఒక 10%)తో పాటు తవుడు, నూకలు, గడ్డిగింజల(మిగతా 25%)తో పాటు ఇదే మోతాదులో తెలగపిండులు కలిపి మరపట్టించి దాణాగా వాడుతున్నారు. ఎకరం భూమిలో పెరుగుతున్న గరిక, కరివేపాకు, సొర ఆకు, కానుగ చిగుర్లు, బాదం ఆకులు, కొబ్బరి ఆకులు, మునగాకు, సపోటా ఆకులు, చింత ఆకులు, వేపాకులు, నేరేడాకులు, మామిడి ఆకులు వేస్తున్నారు. ఎండాకుల పొడిని కూడా వేస్తున్నారు. అల్లం వెల్లుల్లి గుజ్జు కూడా అడపా దడపా వేస్తున్నారు. ధర తక్కువగా ఉన్నప్పుడు టమాటా, ఉల్లిపాయలు, సొరకాయలు వంటి కూరగాయలను రోజూ ఉదయం చాఫ్ కట్టర్‌తో ముక్కలు చేసి.. గ్రైండర్లో వేసి డ్రైఫీడ్తో కలగలిపి.. రోజుకు రెండు సార్లు కోళ్లకు మేపుతున్నారు. ఎకరంన్నర భూమిలో ప్రత్యేకంగా సొర పాదులు పెంచి.. ఆ కాయలను కోళ్లకు వినియోగిస్తున్నారు. మూడో బ్యాచ్ నుంచి హెర్బల్ ఎగ్స్ మూడో బ్యాచ్‌లో పూర్తి సేంద్రియంగా హెర్బల్ గుడ్ల ఉత్పత్తి చేపట్టడంతో అంతకుముందు చేసిన అప్పులన్నీ తిరిపోయాయని, 90వారాలు అనుకుంటే 98 వారాల వరకు 85% గుడ్ల ఉత్పత్తితో కొనసాగించానని, కల్ బర్డ్స్ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయని జయప్రదారెడ్డి ఎంతో సంతోషంగా చెప్పారు. ప్రస్తుతం నాలుగో బ్యాచ్ సగంలో ఉంది. గుడ్ల ఉత్పాదకత బాగుంది. ఎండాకాలం కాబట్టి రోజుకు 150 నిమ్మకాయల రసం దాణాలో కలుపుతున్నారు. గుడ్డు సాఫ్ట్‌గా, నీచు వాసన లేకుండా, రుచి నాటు గుడ్ల మాదిరిగా ఉంటున్నదని ఆమె తెలిపారు. కుంటుతున్న కోళ్లకు చింత గింజలు, చింతాకు, చింతపండు దాణాలో కలిపి 15 రోజులు ఇస్తే సమస్య తగ్గిందని జయప్రదారెడ్డి తెలిపారు. కోళ్లు రొప్పుతూ ఉంటే (దగ తీయటం) మొదట్లో వంట సోడా ఫీడ్‌లో కలిపి ఇచ్చేవాళ్లం. 3 ఏళ్ల నుంచి వాడటం లేదు. ప్రతి 45 రోజులకోసారి రోగనిరోధక శక్తి పెంచడానికి వాక్సిన్ ఇచ్చే వాళ్లం అది కూడా ఇవ్వడం లేదు. రోజుకు ఐదారు గంటల పాటు విద్యుత్ లైట్లు వేసేవాళ్లం. ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది. గతంలో రెండు, మూడు రోజులకోసారి ఏదో ఒక మందు వేయాల్సి వచ్చేది. దాణాలో మార్పులు చేసి ఆకులు, కూరగాయలు వాడుతున్న తర్వాత గత రెండేళ్లుగా ఎటువంటి రసాయనిక వ్యాక్సిన్లు గాని, యాంటిబయాటిక్స్ గాని, ఇతర రసాయనిక ఔషధాలు గానీ కోళ్లకు వాడాల్సిన అవసరమే రాలేదని జయప్రదారెడ్డి అన్నారు. ‘జయ హెర్బల్ ఎగ్స్’ బ్రాండ్ పేరుతో ఆమె గుడ్లను విక్రయిస్తున్నారు. హైదరాబాద్, కర్నూలులోని అనేక మాల్స్ వారు వచ్చి తీసుకెళ్తున్నారు. ఈ గుడ్లు 20 రోజుల వరకు నిల్వ∙ఉంటున్నాయన్నారు. గతంలో షెడ్ నుంచి వంద మీటర్ల దూరం వరకు దుర్వాసన వచ్చేది. ఈగలు, దోమల బెడద బాగా ఉండేదని, కోళ్ల పెంట బాగా దుర్వాసన వచ్చేది. ఇప్పుడు వాసన బాగా తగ్గిపోయింది. జర్మనీ శాస్త్రవేత్తలు అభినందించడం సంతోషాన్నిచ్చిందన్నారు. రసాయన రహితంగా గుడ్లను ఉత్పత్తి చేస్తున్న ఆమె ఆదర్శప్రాయురాలు. కోడిలా జీవించాలి! కోళ్లను పెంచే రైతులు తామే కోడిలా జీవించాలి. 24 గంటలూ వాటికి ఏమేమి అవసరమో శ్రద్ధగా గమనిస్తూ ఏ లోటూ రాకుండా చూసుకోవాలి. పని వాళ్లు చేస్తారులే అని వదిలేసి ఊరుకుంటే జరగదు. ఇంట్రెస్టుగా చెయ్యటం ముఖ్యం. కూర చేసినా మనసుపెట్టి ఇంట్రెస్టుగా చెయ్యాలి. అలాగే కోళ్లను కూడా ఇష్టంగా చూసుకోవాలి. నేను ఉదయం 5.30 గంటలకే షెడ్ దగ్గరకు వెళ్లి ఫీడ్ మిక్సింగ్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నా. ఇష్టంగా పనులు చేసుకుంటూ ఉంటే కోళ్ల ఫారంలో పెట్టుబడి ఆరేళ్లలో తిరిగి వచ్చేస్తుంది. – జయప్రదారెడ్డి (86394 21276), రాణిపేట, కొత్తకోట మండలం, వనపర్తి జిల్లా, తెలంగాణ ∙కోళ్ల కోసం సొరకాయలు కోస్తున్న జయప్రదారెడ్డి కొర్రలు, సొర ముక్కలు, ఎండాకులతో తయారవుతున్న దాణా అమ్మకానికి సిద్ధం దాణాలో కలిపేందుకు సొరకాయలను కట్ చేస్తూ... – బొలెమోని రమేష్, సాక్షి, వనపర్తి ఫొటోలు: ఎం.యాదిరెడ్డి -
కాళేశ్వరం కాలువ నిర్మిస్తే భూమి పోతుందని..
-
భూమి పోతుందనే ఆందోళనతో మహిళారైతు మృతి
రామాయంపేట (మెదక్): కాళేశ్వరం కాలువ నిర్మిస్తే తనకు ఉన్న కొద్దిపాటి భూమి పోతుందనే ఆందోళనతో గుండెపోటుకు గురై ఓ మహిళా రైతు మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్‌లో చోటుచేసుకుంది. కాళేశ్వరం కాలువల కోసం రాయిలాపూర్ శివారు నుంచి సర్వే నిర్వహిస్తున్నారు. మూడ్రోజుల క్రితం హద్దులను నిర్ణయిస్తున్న అధికారుల వద్దకు వెళ్లిన మహిళా రైతు పోచమైన భూదవ్వ (65).. కాలువ నిర్మాణంతో తనకు ఉన్న 18 గుంటల భూమి పోతుందని అధికారుల వద్ద విలపిస్తూ తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ క్రమంలో ఆదివారం సర్వే పనులు జరుగుతున్న ప్రాంతానికి భూదవ్వ వెళ్తుండగా గుండెపోటుకు గురై రోడ్డుపై కుప్పకూలింది. దీంతో గ్రామస్తులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందింది. భూదవ్వ భర్త గతంలోనే ఆమెను విడిచి వెళ్లిపోయాడు. 15 ఏళ్ల క్రితం ఉన్న ఒక్కగానొక్క కొడుకు కూడా మృతి చెందాడు. దీంతో మనువడు, మనువరాలు ఆమెపై ఆధారపడి బతుకుతున్నారు. నానమ్మ మృతితో విలపిస్తున్న ఆ చిన్నారులను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. -
కడుపు మండింది.. పంటను తొక్కించింది
దొడ్డబళ్లాపురం: అన్నదాతకు అన్నీ కష్టాలే. భూమి దున్ని, విత్తనాలు చల్లి, నీరుకట్టి, ఎరువులు వేసి పగలు,రాత్రి కంటిపాపలా కాపాడుకున్న పంటకు గిట్టుబాటు ఉండదు. చేతుల కష్టానికి చిల్విగవ్వకూడా దక్కదు. ఇలాంటి పరిస్థితే ఓ మహిళా రైతుకు ఎదురైంది. ధరలేని పంటను తానే ట్రాక్టర్‌తో పొలంలోనే తొక్కించి తన ఆక్రోశాన్ని వెల్లగక్కింది. తాలూకాలోని ఆలహళ్లి గ్రామానికి చెందిన రైతు మహిళ ఉమ మూడు నెలల క్రితం తన రెండెకరాల భూమిలో రెండు లక్షలు ఖర్చు చేసి సాంబార్ దోసకాయ సాగు చేసింది. సాధారణంగా ఈ పంటకు మంచి డిమాండ్ ఉండేది. కేజీ కనీసం రూ.20లు పలికేది. అయితే ఉన్నఫలంగా ధరలు పడిపోయాయి. రైతు మహిళ ఉమ మొదటి కోతలో పంటకోసి చిక్కబళ్లాపురం, బెంగళూరు పెద్ద మార్కెట్లకు తీసికెళ్లగా కూలీ డబ్బులు కూడా గిట్టుబాటు కాలేదు. రెండో కోతకు ధర వస్తుందని భావించి లోడ్ తెస్తున్నా మని వ్యాపారికి ఫోన్ చేసింది.అయితే సాంబార్ దోసకాయకు డిమాండు లేదని, పంటను తేవద్దని చెప్పారు. దీంతో ఉమ తీవ్ర నిర్వేదానికి గురైంది. ఆరుగాలం పడిన శ్రమంతా వృథా అయిందని మనో వేదనకు గురైంది. ఆక్రోశం తట్టుకోలేక పంటను తనే ట్రాక్టర్‌తో తొక్కించి నాశనం చేసింది. ఆమె మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధర,తగిన మార్కెట్టు వ్యవస్థ కల్పించాలని ఉమ అభిప్రాయపడ్డారు. ఉమ భర్త కృష్ణేగౌడ మాట్లాడుతూ రైతుకు దెబ్బమీద దెబ్బ తగిలితే బతికేది ఎలా అని ఆవేదన వ్యక్తం చేశాడు. -
కోరిక తీరిస్తే రుణం ఇస్తా..
బుల్దానా: రుణం మంజూరు కావాలంటే తన కోరిక తీర్చాలంటూ ఓ మహిళారైతును బ్యాంక్ మేనేజర్ కోరారు. ఈ ఫోన్ సంభాషణను రికార్డు చేసిన ఆ మహిళ, భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్రలోని దతాలా గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు పంట రుణం కోసం ఈ నెల 18వ తేదీన స్థానిక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ మేనేజర్ రాజేశ్ హివాసేను సంప్రదించారు. ఆమె దరఖాస్తును పరిశీలించిన మేనేజర్, ఫోన్ నంబర్‌ను అడిగి తీసుకుని తనతో ‘టచ్’లో ఉండాల్సిందిగా కోరారు. అనంతరం ఆమెకు ఫోన్ చేసి అభ్యంతరకరంగా మాట్లాడారు. 22వ తేదీన బ్యాంక్ ప్యూన్ మనోజ్ చవాన్ ఆమెకు ఫోన్ చేసి.. మేనేజర్ కోరిక తీరిస్తే రుణం ఎక్కువ మంజూరవుతుందంటూ మాట్లాడాడు. అయితే, ఆ మహిళ వీరిద్దరి ఫోన్ సంభాషణలను రికార్డు చేశారు. ఈ సంభాషణలతో కలిపి ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు బ్యాంకుకు వెళ్లగా మేనేజర్‌తోపాటు ప్యూను వారిని చూసి పరారయ్యారు. అయితే, ఈ విషయం తెలిసిన గ్రామస్తులు వందలాది మంది బ్యాంకుకు చేరుకుని ఆందోళన చేపట్టారు. బ్యాంక్ మేనేజర్ కనిపిస్తే చంపేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, బ్యాంక్ మేనేజర్‌తోపాటు ప్యూన్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న మేనేజర్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసును జిల్లా కలెక్టర్ నిరుపమా దాంగే ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారని ప్రభుత్వం తెలిపింది. -
అప్పులబాధతో మహిళా రైతు
నార్పల (బుక్కరాయసముద్రం): నార్పల మండలం బి.పప్పూరులో అప్పుల బాధతో ఓ మహిళా రైతు సోమవారం ఆత్మహత్యకు పాల్పంది. స్థానికులు తెలిపిన మేరకు.. బి. పప్పూరుకు చెందిన తులశమ్మ (25), రంగారెడ్డి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మార్చి నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి మృతి చెందాడు. వైద్యం కోసం రూ.4లక్షల దాకా వెచ్చించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటి నుంచి కుటుంబ భారం తులశమ్మపై పడింది. తమకున్న ఐదు ఎకరాల్లో రూ.5లక్షల పెట్టుబడి పెట్టి అరటి సాగు చేసింది. ఇటీవల గాలీవానకు పంటమొత్తం నేలకొరిగింది. దీంతో భారీగా నష్టం వాటిల్లింది. రంగారెడ్డి పేరుపై బి.పప్పూరులోని ఆంధ్రాప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ.4లక్షలు, నార్పల స్టేట్‌బ్యాంకులో రూ.లక్ష మేర రుణాలు ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.6 లక్షల మేర అప్పులు చేశాడు. తోడుంటాడనుకున్న భర్త కానరానిలోకాలకు వెళ్లిపోయాడు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు భారీగా పెరిగిపోయాయి. వాటిని ఎలా తీర్చాలో దిక్కుతోచని స్థితిలో తులశమ్మ సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పంటతోపాటు ప్రాణం పోయింది
రాయికల్(జగిత్యాల): ప్రకృతి కన్నెర్రజేసింది. చేతికందే సమయంలో తాను సాగుచేసిన ఆరు ఎకరాల వరిపంట దెబ్బతినడంతో ఆ పంటను చూసిన మహిళారైతు గుండె ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలోని లాల్నాయక్ తండాకు చెందిన మహిళా రైతు నునావత్ కైక (55) గ్రామంలోని ఆరు ఎకరాల పొలంలో వరిపంట సాగుచేసింది. మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన రాళ్లవాన కురవడంతో చేతికొచ్చిన పంట పూర్తిగా దెబ్బతినడంతో ఆ మహిళ రైతు గుండె తల్లడిల్లింది. ఏడుస్తూ ఇంటికి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన రాయికల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. మృతురాలికి భర్త పర్శరాం, ఇద్దరు కూతుళ్లు, కొడుకులు ఉన్నారు. ఇటీవలే కొడుకు పెళ్లి కుదిరింది. వడగండ్ల వానతో పంటనష్టం రాయికల్ మండలం తాట్లవాయి ధర్మాజీపేట, కట్కాపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో గ్రామంలోని వేలాది ఎకరాల్లో వరిపంటకు నష్టం జరిగింది. వరి చేలు నేలవాలగా, మామిడి కాయలు రాలిపోయాయి. తాట్లవాయి గ్రామంలో లావుడ్య కిషన్, భూక్యానాయక్, ధర్మాజీపేటలోని సురేశ్‌నాయక్ ఇళ్ల పైకప్పు లేచిపోవడంతో నిత్యావసర వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకునేలా చూడాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. -
‘ఆమె’కు ఉండడానికి ఇల్లు లేదు
ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు, సొంత గడ్డకే ప్రతిష్టను తీసుకువచ్చే అంతర్జాతీయ పురస్కారాలు, ఆమె పేరుతో యూనివర్సిటీలో హాస్టల్ భవనాలు, తాజాగా ఒడిశా రాష్ట్ర ప్రణాళిక బోర్డు సభ్యత్వం... అన్నీ ఉన్నాయి. కానీ తలదాచుకోవడానికి మాత్రం గూడు లేదు. పూరి గుడిసెలోనే బతుకు ఈడ్చాల్సిన పరిస్థితి. నీతి, నిజాయితీ, కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవారి దుస్థితి మన దేశంలో ఇంతేనని కమలా పూజారి కథతో మరోసారి కళ్లెదుట నిలుస్తోంది. 68 ఏళ్ల వయసున్న కమలా పూజారి ఒడిశాలో కోరాపుట్ జిల్లాకు చెందిన పత్రపుట్ నివాసి. వ్యవసాయ రంగంలో ఆమె చేసిన కృషి అనన్య సామాన్యమైనది. కోరాపుట్ జిల్లాలో ఆమె పేరు తెలీని వారు లేరంటే అతిశయోక్తి కాదు. జిల్లాలో గ్రామం గ్రామం తిరుగుతూ రసాయన ఎరువుల వాడొద్దంటూ ప్రచారం చేసింది. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై రైతుల్లో అవగాహన పెంచింది. వ్యవసాయదారులతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి తమ నేలలో ఎలాంటి పంటలు పండించాలో వివరించింది. అంతే కాదు స్థానికంగా పండే వందలాది రకాల సంప్రదాయ వరిధాన్యాలను పరిరక్షించి ఒడిశా సర్కార్ ప్రశంసలు పొందింది. 2002 సంవత్సరంలో దక్షిణాఫ్రికా ఇచ్చే ఈక్వేటర్ ఇనీషియేటివ్ అవార్డుని గెలుచుకొని సొంత రాష్ట్రానికి గుర్తింపు తీసుకువచ్చింది. ఇన్ని చేసినా ఇప్పుడు ఆమె నివాసం ఉంటున్నది ఒక పూరిగుడిసె. కనీసం పక్కా ఇల్లు కూడా లేదు. ప్రభుత్వ పథకం కింద పక్కా ఇల్లు కేటాయించాలంటూ ఆమె అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఇందిరా ఆవాస్ యోజన కింద సొంతింటి కోసం కమల పూజారి చేసుకున్న దరఖాస్తును కూడా ప్రభుత్వం తిరస్కరించింది . ఇప్పుడు పిలిచి మరీ రాష్ట్ర ప్రణాళిక బోర్డు సభ్యురాలిని చేసింది. ప్రభుత్వ నిర్ణయం ఆమెకు కాస్త సంతోషాన్నే తీసుకువచ్చినా కమలా పూజారి కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ ఈ పదవులు మాకెందుకు ? దానికి బదులుగా ప్రభుత్వం ఇల్లు ఇవ్వొచ్చు కదా. భువనేశ్వర్‌లో వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం హాస్టల్ భవన్‌కి మా నాన్నమ్మ పేరు పెట్టారు. ఈ గౌరవాలకి బదులుగా గౌరవంగా జీవించడానికి ఒక ఇల్లు ఇస్తే ఎంతో సంతోషించే వాళ్లం ‘ అని ఆమె మనవడు సుదామ్ పూజారి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వాస్తవానికి ఒడిశాలో ప్రణాళిక బోర్డు చాలా ఏళ్లుగా నిస్తేజంగా మారింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 18 ఏళ్ల పదవీకాలంలో మూడు సార్లు మాత్రమే సమావేశమైంది. అందుకే ప్రణాళిక బోర్డుని ప్రక్షాళన చేసిన ప్రభుత్వం కమలాపూజారి వంటి సమర్థులకు చోటు కల్పించి రాష్ట్ర పురోగతి బాధ్యతలు అప్పగించింది కానీ, ఆమెకి ఒక గూడు ఇవ్వడంలో మాత్రం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం విఫలమైంది. -
బైక్ నడుపుతుంటేవింతగా చూసేవారు
కష్టసుఖాల్లో తోడుగా ఉండాల్సిన భర్త.. కుటుంబ పోషణను భారంగా తలచి పిరికి వాడిలా పారిపోయాడు.. ఆమె ఆశలపై దాయాదులూ నీళ్లు చల్లారు. అయినా జీవితంలోని ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంది. తండ్రి కష్టాన్ని పంచుకుని కుటుంబ బాధ్యతలు భుజానికెత్తుకుంది. ఐదుగురు చెల్లెళ్లను, తమ్ముడిని చదివించడమే కాదు... నలుగురు చెల్లెళ్లకు పెళ్లి చేసి అత్తింటికి సాగనంపింది. వ్యవసాయంపై మక్కువ పెంచుకుని సాగులో రాణిస్తూ.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన అనిత విజయగాథ నేటి ‘నేను శక్తి’లో మీ కోసం.. అందరిలాగే ఆమెలో కూడా ఎన్నో ఆశలు. బాగా చదువుకోవాలని, ఉన్నతస్థాయి కొలువులు చేపట్టాలని భావించింది. అయితే అయిన వాళ్లే కాదన్నారు. అండగా నిలుస్తారనుకున్న బంధువులు ఛీదరించుకుని దూరమై పోయారు. వ్యవసాయం తప్ప అన్యమెరుగని తండ్రికి ఆరుగురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేయడం తలకు మించిన భారమే అయింది. ఇలాంటి తరుణంలో ఆ ఇంటి బరువు బాధ్యతలను ఆమె భుజాలకెత్తుకుంది. ‘నాన్నా.. నువ్వు భయపడొద్దు! నీకు తోడుగా నేనుంటాను’ అంటూ పలుగుపార చేతపట్టి పొలం పనుల్లోకి దిగింది. పంట సాగులోని మెలకువలను అవపోశన పట్టింది. తిరుగులేని మహిళా రైతుగా అతి చిన్న వయసులోనే గుర్తింపు తెచ్చుకుని ‘నేను శక్తి’ అని నిరూపించుకున్న అనిత విజయగాథ మీ కోసం.. అనంతపురం , గుమ్మఘట్ట :మాదీ పెద్ద కుటుంబమే మాది గుమ్మఘట్ట మండలంలోని మారెంపల్లి గ్రామం. మా తల్లిదండ్రులు కురుబ మహదేవమ్మ, హనుమంతప్ప.మా నాన్న వాళ్లు ఐదుగురు అన్నతమ్ముళ్లు. మా నాన్నకు మేము మేము ఆరుగురం ఆడపిల్లలం. మాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. మేమంతా కలిసిమెలిసి ఉండేవాళ్లం. నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా మారెంపల్లిలోనే కొనసాగింది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆవులదట్లలో చదువుకున్నాను. రోజూ మా ఊరి నుంచి మిగిలిన అమ్మాయిలతో కలిసి సైకిల్‌పై స్కూల్‌కు వెళ్లి వచ్చేదాన్ని. బైక్ నడుపుతుంటేవింతగా చూసేవారు పొలానికి అవసరమైన మందులు, ఇతర పనులకు గ్రామంలోకి వెళ్లి రావాలంటే రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాల్సి వచ్చేది. ఆ సమయంలోనే మా నాన్న వద్ద ఉన్న బైక్‌ను నడపడం నేర్చుకోవాలని అనుకున్నాను. ఖాళీ సమయంలో దాన్ని నడిపేందుకు ప్రయత్నించి కిందపడి గాయపడేదాన్ని. అయినా అవసరం అన్నీ నేర్పించింది. కొన్ని రోజుల తర్వాత బైక్‌ను సులువగా నడపసాగాను. మా ఊళ్లో ఆడపిల్లలు బైక్ నడిపేవారు కాదు. నేను బైక్ తోలుతుంటే అందరూ ఆశ్చర్యంగా చేసేవారు. దీనిపై చాలా కామెంట్లు కూడా వచ్చాయి. అవి నన్ను కాస్త బాధపెట్టినా.. తర్వాత మెల్లిగా అలవాటైపోయింది. ఇప్పుడు మా అమ్మనాన్ననే కాదు. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వారిని దిగబెట్టి వచ్చేంందుకు బైక్‌పైనే తీసుకెళుతుంటాను. ఉండేందుకు ఇల్లు కూడా లేదు ఉమ్మడి కుటుంబంగా ఉంటూ వచ్చిన మేము విడిపోయిన తర్వాత ఒంటరితనం భయపెడుతూ వచ్చింది. ఆ సమయంలో మేము ఉండేందుకు ఇల్లు కూడా లేకుండా పోయింది. భాగ పరిష్కారం కింద మా నాన్నకు వచ్చిన తొమ్మిది ఎకరాల పొలంలో రెండు చిన్న గదులు ఉన్న ఇల్లు ఉండేది. దాంట్లోకి మా నాన్న మకాం మార్చాడు. నిర్జన ప్రదేశంలో ఎప్పడు ఏం జరుగుతుందోననే భయం. ఆయన కష్టం చూస్తున్నప్పుడు లోలోన కుమిలిపోయేదాన్ని. ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారనే ఒకేఒక్క కారణంతోనే కదా మా తల్లిదండ్రులకు ఈ కష్టాలు అని తలుచుకుని కన్నీరు పెట్టేవాళ్లం. ఆ సమయంలోనే మా చెల్లెళ్లు నాకు సపోర్ట్‌గా నిలిచారు. ‘అక్క నీవే ఏదైనా చేయగలవు. మేమింకా చిన్న పిల్లలం. మా వంతు సాయం మేమూ చేస్తాం. ఎలాగైనా ఈ కష్టాల నుంచి మనం బయటపడాలి’ అంటూ వారు అన్న మాటలు నేను ఇప్పటికీ మరిచిపోలేకున్నాను. రాత్రిళ్లు నాన్నకు తోడుగా.. కొన్ని నెలల తర్వాత ఓ అమ్మాయికి నేను జన్మనిచ్చాను. పేదరికం కారణంగా సరైన ఆహారం లేక చాలా నీరసించిపోయాను. ఆ సమయంలోనే నా ఆరోగ్యంతో పాటు పసిగుడ్డు బాగోగులు చూసుకునేందుకు మా తల్లిదండ్రులు మరింత శ్రమిస్తూ వచ్చారు. వారి కష్టాన్ని అతి దగ్గరగా చూసిన దాన్ని నేనే. దీంతో నేను కొంచెం కోలుకున్న తర్వాత నాన్నకు తోడుగా పంటకు నీరు పెట్టేందుకు రాత్రిళ్లు వెళ్లేదాన్ని. అమ్మానాన్న వద్దని వారించేవారు. అయినా నేను వినలేదు. ‘ఎలాగైనా ఈ కష్టాల నుంచి బయటపడాలి నాన్నా.. మనల్ని కాదని ఒంటరిగా వదిలేసి వెళ్లిన వారి ముందు సగర్వంగా మనం తలెత్తుకుని తిరగాలి’ అంటూ ధైర్యం చెబుతూ వచ్చాను. ఆడపిల్లలు ఉన్నారంటూ.. నేను పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత పెద్ద చదువులు అక్కరలేదని మా నాన్నపై ఆయన అన్నతమ్ముళ్లు ఒత్తిడి చేస్తూ వచ్చారు. ఆడపిల్లకు వెంటనే పెళ్లి చేసి పంపిస్తే మేలని చెబుతూ వచ్చారు. అయినా మా నాన్న వారి మాటలను వినేవారు కాదు. మా నాన్న అన్నతమ్ముళ్లందరి భయం ఒక్కటే. మా నాన్నకు ఆరుగురు ఆడపిల్లలు. వారందరికీ చదువులు చెప్పించి, పెళ్లి చేసి ఇస్తే ఇక ఆస్తులు ఏమీ మిగలవని భావించేవారు. దీంతో ఏదో ఒక విషయంపై ఘర్షణ పడేవారు. ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయేందుకు అవకాశం కోసం ఎదురు చూసేవారు. భూమిని నమ్ముకుంటే బువ్వపెడుతుంది వ్యవసాయం దండుగని ఎవరన్నారో గాని వారు నిజంగా మూర్ఖులే. మనసుపెట్టి పంట సాగు చేస్తే కాసుల వర్షం కురుస్తుంది. భూమిని నమ్ముకుంటే బువ్వ దొరుకుతుంది. ఒక పంట పోయినా.. మరో పంట ఆదుకుంటుంది. ఆధారం కోల్పోయామనుకుని బాధపడుతూ కూర్చొంటే ఫలితం లేదు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించగలగాలి. వ్యవసాయం ద్వారానే ఇంత మందిని నాన్న బతికించాడు. అంగన్వాడీ కార్యకర్తగా.. మా ఊళ్లోని అంగన్వాడీ సెంటర్‌కు కార్యకర్త పోస్టు ఖాళీగా ఉందని తెలుసుకుని దరఖాస్తు చేసుకున్నాను. అన్నీ అర్హతలూ ఉండడంతో 2015లో ఉద్యోగం వచ్చింది. ఓ వైపు పొలం పనులు చూసుకుంటూనే అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తూ వచ్చాను. ప్రస్తుతం నాలుగు ఎకరాల్లో దానిమ్మ, ఆరు ఎకరాల్లో వేరుశనగ, ఐదు ఎకరాల్లో వర్షాధారంగా వేరుశనగ సాగు చేస్తున్నాం. పదేళ్ల క్రితం ఒంటరిని చేసి.. నాకు 20వ ఏటా మేనమామతో పెళ్లి చేశారు. పట్టుమని మూడు నెలలు కూడా కాపురం చేయలేదు. ఏవో కారణాలు చూపుతూ మా మామ (భర్త) మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. చాలా కాలం ఎదురు చూశాం. ఆయన రాలేదు. అప్పటికే నేను గర్భవతిని. ఈ విషయం మరింత నాతో పాటు అమ్మనాన్నను మరింత కుంగదీసింది. దీనినే అవకాశంగా తీసుకుని ఒక్కసారిగా మా దాయాదులు చెలరేగిపోయారు. ఆస్తుల భాగ పరిష్కారమంటూ తొమ్మిది ఎకరాలను మా నాన్న పరం చేసి, మమ్మల్ని ఒంటరివాళ్లను చేసి పదేళ్ల క్రితం వెళ్లిపోయారు. మొదట్లో ఇబ్బంది పడ్డా.. మా నాన్నకు ధైర్యం కలిగించేందుకు ఏవో నాలుగు మాటలైతే చెప్పాను. కానీ, నిజానికి పార చేత పట్టుకుని రాత్రిళ్లు పంట పొలంలో నీళ్లు పెట్టడమంటే చిన్న విషయమేమీ కాదు. పురుగు పుట్ర తిరుగుతుంటాయి. దీనికి తోడు చీకటి. బ్యాటరీ వెలుగులోనే పనులన్నీ చక్కబెట్టుకోవాల్సి వస్తోంది. విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతు కష్టం మాటల్లో చెప్పలేను. ఆ కష్టాలన్నీ అనుభవించాను. అయితే ఇష్టపడి చేస్తుండడంతో వాటిని ఏనాడూ నేను కష్టంగా భావించలేదు. మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డాను. తోబుట్టువులను కాపాడుకుంటూ వ్యవసాయ పనులపై నెమ్మదిగా నేను పట్టు సాధించాను. అనుకున్నట్లుగానే మా జీవితాల్లో మార్పులు రాసాగాయి. చెల్లెళ్లు కూడా వారికి చేతనైనా సాయం చేస్తూ వచ్చారు. నాల్గో చెల్లెలు నాతో సమానంగా పొలం పనుల్లో పాల్గొంటూ వచ్చింది. మిగిలిన వారిని చదువులపై దృష్టి మళ్లించేలా చేశాను. ఇక మా అందరిలోనూ చిన్నోడు మా తమ్ముడు. వాడు ఇక్కడే ఉంటే మా లాగే పొలం పనులు అంటూ వ్యవసాయంలో దిగుతాడని భావించి, దూరంగా హాస్టల్లో ఉంచి చదివిస్తూ వచ్చాను. ప్రస్తుతం వాడు చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఇంజినీరింగ్ చేస్తున్నాడు. చిన్న చెల్లెలు అనంతపురంలో ఉంటూ డిగ్రీ చేస్తోంది. ఇక మిగిలిన చెల్లెళ్లకు పెళ్లి చేసి ఇచ్చాను. ఇవన్నీ చేస్తూనే ఇల్లు కూడా కట్టుకున్నాం. దీంతో పాటు మరో ఆరు ఎకరాల పొలాన్ని కూడా కొనుగోలు చేశాం. -
మాగాణికి మహారాణి
ఆమె స్పర్శిస్తే భూమి పులకరించిపోతుంది. పలకరిస్తే చేను పరవశించిపోతుంది. పంట చెప్పినట్టు వింటుంది. పసిడి పంటను చేతికందిస్తుంది. భూమితోనే సహవాసం. భూదేవి అంత సహనం. ఆమె ఇప్పుడు.. ఇంటికే కాదు.. మాగాణికి కూడా మహారాణి. శక్తియుక్తులతో జీవితాన్ని తీర్చిదిద్దుకున్న ధీశాలి. అలాంటి మగ‘ధీర’ల విజయగాథలకు అక్షర రూపమిది. సాలూరు రూరల్ (పాచిపెంట): కొండకొనలే ఆమె ప్రపంచం. ప్రకృతితోనే సహవాసం. పంట పొలాలతోనే జీవితం. అధిక దిగుబడులు సాధించడంలో అద్భుతమైన నైపుణ్యం. అవే ఆమెను దేశాధ్యక్షుని ప్రశంసలు అందుకునేలా చేశాయి. ఆ ఆదర్శ గిరిజన మహిళా రైతు పాచిపెంట మండలం పణుకువలస గ్రామానికి చెందిన మంచాల పారమ్మ. ప్రయోగాలకు పెట్టింది పేరు వ్యవసాయంలో కొత్త ప్రయోగాలకు పెట్టింది పేరు పారమ్మ. ఆమె సేంద్రియ ఎరువుల వినియోగానికే అధిక ప్రాధాన్యం ఇస్తుంది. వ్యవసాయాధికారులు చెప్పే సూచనలు, సలహాలను తూచా తప్పకుండా పాటించింది. భూమి సారాన్ని బట్టి పంటను సాగు చేస్తూ మెలకువలతో మంచి ఫలితాలు సాధిస్తోంది. పంటల సాగులో ప్రయోగాల వల్లే ఎకరాకు పది క్వింటాళ్లు కూడా రాని రాగులు.. ఎకరాకు 26 క్వింటాళ్ల దిగుబడిని సాధించి రైతులందరికి ఎంతో ఆదర్శంగా నిలిచింది. జాతీయ ఉత్తమ రైతు పురస్కారాన్ని అప్పటి రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అందుకుంది. ఓల్డ్ఈజ్ గోల్డ్ అధిక దిగుబడులు సాధించడం వెనుక విజయ రహస్యం ఏమిటని రైతులంతా పారమ్మను ఆసక్తిగా అడుగుతారు. ‘నాకు తెలిసిన పాత విధానాలే అమలు చేస్తున్నాను. వ్యవసాయాధికారులు చెప్పిన సూచనలు, సలహాలను తూచా తప్పకుండా పాటిస్తాను. తోటి రైతులతో కలిసి పొలంలో పనులు చేస్తాను. ఇది ఆరోగ్యానికి మంచిది’.. అని వినయంగా పారమ్మ సమాధానమిస్తుంది. కిచెన్ గార్డెన్లో భాగంగా కూరగాయలను అంగన్వాడీలు, పాఠశాలలకు గతేడాది వరకూ సరఫరా చేసింది. వ్యవసాయంతో పాటు చికెన్మదర్ పౌల్ట్రీ యూనిట్ నిర్వహణ వైపు దృష్టి సారించింది. ధృడమైన సంకల్పం ఉంటే ఏ పనిలోనైనా విజయం సాధించగలమని చెబుతోంది. శభాష్ ఎల్లమ్మా.. గరుగుబిల్లి: అందరూ పంటలు పండిస్తారు. కానీ మిరియాల ఎల్లమ్మ కాస్త భిన్నం. రసాయనాల జోలికెళ్లదు. సేంద్రియ ఎరువులతోనే సాగు చేస్తోంది. అధిక దిగుబడులతో ఆదర్శంగా నిలుస్తోంది. సంతోషపురం పంచాయతీ ఖడ్గవలస గ్రామానికి చెందిన మిరియాల ఎల్లమ్మకు మూడెకరాల పొలం ఉంది. భర్త గుంపస్వామి, కుమారుడు సహకారంతో ఎకరాలో అరటి పంట, 1.5 ఎకరాల్లో వరి, 0.50ò సెంట్లలో అన్నపూర్ణ పంటల నమూనాలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలు సేద్యం చేస్తున్నారు. ద్రవజీవామృతం, ఘన జీవామృతం, నీమాస్త్రం తదితర కషాయాలతోనే తెగుళ్లు అదుపు చేస్తోంది. ఎరలు, రంగుపళ్ళాలు వినియోగించి మంచి దిగుబడి సాధిస్తోంది. ఏటా రూ.1.3 లక్షల ఆదాయం కుటుంబంలో ఇద్దరు పనిచేస్తే ఖర్చులు పోను ఏడాదికి రూ.లక్షా 30 వేల వరకు ఆదాయం వస్తుందని ఎల్లమ్మ అంటోంది. జట్టు సంస్థ క్లస్టర్ కో–ఆర్డినేటర్ అన్నపూర్ణమ్మ సూచనల మేరకు మెలకువలు పాటిస్తోంది. -
పాముకాటుతో మహిళా రైతు మృతి
ముదిగుబ్బ : మండల పరిధిలోని నలాయకుంటపల్లిలో శనివారం సుజాత(38) అనే మహిళ పాముకాటుకు గురై మృతి చెందారు. వ్యవసాయ బోరుబావి కింద సాగుచేసిన కాయగూరల తోటలో కూలీలతో పని చేయిస్తుండగా ఆమెను పాము కరిచింది. చికిత్స కోసం హుటాహుటిన మండల కేంద్రంలోని ముదిగుబ్బకు తీసుకొచ్చారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మరణించారు. మృతురాలికి భర్త చెన్నప్ప, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
మహిళా రైతు ఆత్మహత్య
పావగడ : పావగడ తాలూకాలోని అరసికెర పోలీస్ స్టేషన్ పరిధిలోని కేటీ హళ్లి గ్రామానికి చెందిన పుట్ట నర్సమ్మ (60) అనే మహిళా రైతు అప్పుల బాధ భరించలేక ఆదివారం సాయంత్రం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు రూ.2.50 లక్షలు ఉన్నాయి. పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక బలవన్మరణానికి పాల్పడింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మీకాంత్ తెలిపారు. -
మహిళా రైతు ఆత్మహత్య
వరంగల్ రూరల్ జిల్లా: అప్పుల బాధతో ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్లో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన గుండెబోయిన సుధ(40)కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్త ఏ పనీ చేయకపోవడంతో కుటుంబ భారం ఆమెపై పడింది. తమకున్న ఎకరం పొలానికి తోడు మరో ఎకరం పొలాన్ని కౌలుకు తీసుకున్నది. ఈ నేపథ్యంలో పంట కోసం, గత ఏడాది పెద్ద కుమార్తె పెళ్లి చేసేందుకు అప్పులు చేసింది. ఆమె మహిళా సంఘంలో సభ్యురాలు కూడా కావడంతో సంఘానికి కిస్తీలు చెల్లించాల్సి ఉంది. దీంతో అప్పుల బాధతో ఆమె మంగళవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగగా కుటుంబీకులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుధ మృతిచెందింది. -
మహిళా రైతు ఆత్మహత్యా యత్నం
పెద్దపల్లిరూరల్ : పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో విలువైన తన భూమి ఆక్రమణకు గురైందని, పోలీసులు కూడా ఆక్రమణ దారులకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ ఎర్రోజు వరలక్ష్మి అనే మహిళ గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అప్పన్నపేటలో రాజీవ్ రహదారిని ఆనుకుని వారసత్వంగా తనకు వచ్చిన ఎకరం భూమి (సర్వేనెంబర్ 134)లో షెడ్డును కూల్చివేసి గ్రామానికి చెందిన పిడుగు నర్సయ్య, దేవయ్య స్థలాన్ని ఆక్రమించుకున్నారని వరలక్ష్మి కుటుంబ సభ్యులు తెలిపారు. రెవెన్యూ రికార్డుల్లోనూ వారసత్వంగా వచ్చిన వారి పేర్లు తొలగించి కబ్జాలో వారి పేర్లను అక్రమంగా రాయించుకున్నారని ఆరోపించారు. జీవనాధారమైన భూమిని అక్రమంగా లాక్కునేందుకు తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ ఆమె భర్త ఎర్రోజు మల్లయ్య, కుమారుడు సత్యంతో కలసి బసంత్‌నగర్ ఎస్సై విజయేందర్‌ను ఆశ్రయించారని గ్రామస్తులు చెప్పారు. అయితే పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతూ ఆ భూమిలో అడుగు పెట్టొద్దంటూ హెచ్చరించారని, దీంతో ఆందోళనకు గురైన వరలక్ష్మి అప్పన్నపేటలోని తమ భూమి వద్ద క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. స్థానికంగా ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌కు తరలించారు. ఈ విషయమై ఎస్సై విజయేందర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు. -
మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
మదనపల్లి రూరల్ : చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండల కేంద్రంలో ఓ మహిళా రైతు సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింది. రాచపాటివారిపల్లికి చెందిన గాదె రాజమ్మ (40) సాగు కోసం సుమారు రూ.3 లక్షల మేర అప్పులు చేసింది. రుణదాతల నుంచి ఒత్తిడి అధికం కావడంతో మనస్తాపం చెందిన ఆమె పురుగుల ముందు సేవించింది. పరిస్థితి విషమంగా ఉండడంతో మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మహిళా రైతు ఆత్మహత్య
కౌటాలం (కర్నూలు) : అప్పుల బాధ భరించలేక మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లా కౌటాలం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రంజానమ్మ(46) తనకున్న ఏడెకరాల భూమిలో ఐదెకరాలలో పత్తి, మరో రెండెకరాలలో మిర్చి సాగు చేసింది. ఈ క్రమంలో పంటల పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ రైతు ఆత్మహత్య
అప్పుల బాధతాళలేక మహిళా రైతు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం మాదాపురంలో బుధవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రామవాత్ ద్వాలి(44) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో పంట కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. అవి తీర్చే దారి కానరాక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా రైతు బలవన్మరణం
నల్గొండ : వర్షాభావం, అప్పుల బాధతో ఓ మహిళా బలవన్మరణానికి పాల్పడింది. నల్లగొండ జిల్లా చివ్వెంల మండలంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని తుల్జారావుపేట్కు చెందిన గుగులోత్ లింగ, జ్యోతి(25) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న లింగ రెండేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో జ్యోతి వ్యవసాయ పనులు చూసుకుంటోంది. ఈ ఏడాది ఆరెకరాల భూమి కౌలుకు తీసుకుని... పత్తి పంట సాగు చేసింది. వర్షాభావంతో పత్తి పంట సరిగా పండలేదు. పంట సాగు కోసం చేసిన రూ.3.50 లక్షల అప్పు తీరేదారి కనిపించక తీవ్ర మానసిక ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే శనివారం మధ్యాహ్నం చేనుకు వెళ్లి అక్కడున్న చెట్టుకు చీరతో ఉరి వేసుకుని చనిపోయింది. దీంతో ఆమె కుటుంబం దుఖః సాగరంలో మునిగిపోయింది. గుగులోత్ లింగ, జ్యోతి దంపతులకు ఓ కుమార్తెతో పాటు పాఠశాల చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.