నమ్ముకున్న వ్యవసాయం నట్టేట ముంచింది.. పెట్టిన పెట్టుబడులు మట్టి పాలయ్యూరుు.
కట్కూరు(బచ్చన్నపేట) : నమ్ముకున్న వ్యవసాయం నట్టేట ముంచింది.. పెట్టిన పెట్టుబడులు మట్టి పాలయ్యూరుు. ఈ అప్పులతోపాటు భర్త అనారోగ్యం నయం చేసేందుకు చేసిన ఖర్చులు మోయలేని భారం కావడంతో ఓ మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని కట్కూరులో ఆదివారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తుప్పతి లక్ష్మి(30) నాలుగేళ్లుగా ఒంటిచేత్తో వ్యవసాయం చేస్తోంది. తన భర్త అయిలయ్య అనారోగ్యానికి గురికావడంతో కుంగిపోకుండా కుటుంబ బాధ్యతలు నెత్తినెత్తుకుంది. తనకున్న 4 ఎకరాల్లో అప్పు చేసి పత్తి, వరి, మక్క పంటలను సాగుచేసింది.
బావి పూడిక తీయించగా బండ రావడంతో దేవుడిపై భారమేసి అందులో మూడు బోర్లు వేయించింది. నాలుగేళ్లుగా పంటల దిగుబడి తగ్గిపోయి, పెట్టుబడులు రాని దుస్థితి నెలకొంది. వ్యవసాయం ఇలా ఉంటే భర్త పరిస్థితి మరింత కలవరానికి గురిచేస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా తాను పడుతున్న కష్టాలను దిగమింగుకుంటూ చిరునవ్వుతో కుటుంబాన్ని నెట్టుకువచ్చింది. చేర్యాల ఎస్‌బీఐ, బచ్చన్నపేట సెంట్రల్ బ్యాంకులో రూ.లక్షా 50 వేలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.లక్ష వరకు అప్పు చేసింది. వ్యవసాయం నట్టేట ముంచడంతో అప్పులు తీర్చే మార్గం లేక కుమిలిపోయింది.
ఈ క్రమంలో బచ్చన్నపేట సంతలో కిరాణ సామగ్రి, కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి చేరుకున్న ఆమె ఇంట్లో పురుగుల మందు తాగి కుప్ప కూలింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానికుల సాయంతో చేర్యాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా ప్రజ్ఞాపూర్ వద్దకు వెళ్లగానే మృతిచెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై షాదుల్లాబాబా కేసు నమోదు చేసి, దర్యాపు చేస్తున్నారు. మృతురాలికి కూతురు, కుమారుడు ఉన్నారు.