కుర్మయ్య చిత్రపటంతో భర్య, కుమారుడు
వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం పోల్కేపహాడ్ గ్రామానికి చెందిన కొమరోని కుర్మయ్య తనకున్న ఎకరా 10 గుంటల సొంత భూమికి తోడు మరో 4 ఎకరాలు(ఎకరానికి రూ. 10 వేలు) కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవారు. సొంత భూమిలో నీటి కోసం 6 బోర్లు వేయించారు. ఒక్క బోరులో కూడా నీరు పడలేదు. వర్షాధారంగా ఆ భూమిలో మొక్కజొన్న, వేరుశనగ పంటలు సాగు చేసేవారు. 2014, 2015 వరుస సంవత్సరాలలో పంటలో నష్టం కారణంగా(ఒక వైపు వర్షం లేక మరో వైపు అడవి పందుల బెడద) అప్పులు ఎక్కువయ్యాయి.
బోర్ల కోసం చేసిన అప్పులు, కౌలు ధరలు కూడా చెల్లించలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పులు వడ్డీతో కలిపి రూ. 3 లక్షలకు పెరిగాయి. అప్పుల వాళ్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి కారణంగా 2016 డిసెంబర్ 5న ఇంటిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఆత్మహత్య జరిగి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఈ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావలసిన ఎక్స్‌గ్రేషియా అందలేదు. కనీసం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కూడా అందలేదు. కొడుకు కాశీం డిగ్రీ పూర్తి చేయడానికి నెలలో ఒక వారం కూలికి పోవలసి వస్తున్నది. కూతురు కవిత ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కుర్మయ్య భార్య రాములమ్మ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నది.
– బి. కొండల్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక
Comments
Please login to add a commentAdd a comment