lean farmers
-
కుర్మయ్య కుటుంబానికి సాయం అందేనా?
వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం పోల్కేపహాడ్ గ్రామానికి చెందిన కొమరోని కుర్మయ్య తనకున్న ఎకరా 10 గుంటల సొంత భూమికి తోడు మరో 4 ఎకరాలు(ఎకరానికి రూ. 10 వేలు) కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవారు. సొంత భూమిలో నీటి కోసం 6 బోర్లు వేయించారు. ఒక్క బోరులో కూడా నీరు పడలేదు. వర్షాధారంగా ఆ భూమిలో మొక్కజొన్న, వేరుశనగ పంటలు సాగు చేసేవారు. 2014, 2015 వరుస సంవత్సరాలలో పంటలో నష్టం కారణంగా(ఒక వైపు వర్షం లేక మరో వైపు అడవి పందుల బెడద) అప్పులు ఎక్కువయ్యాయి. బోర్ల కోసం చేసిన అప్పులు, కౌలు ధరలు కూడా చెల్లించలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పులు వడ్డీతో కలిపి రూ. 3 లక్షలకు పెరిగాయి. అప్పుల వాళ్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి కారణంగా 2016 డిసెంబర్ 5న ఇంటిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఆత్మహత్య జరిగి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఈ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావలసిన ఎక్స్‌గ్రేషియా అందలేదు. కనీసం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కూడా అందలేదు. కొడుకు కాశీం డిగ్రీ పూర్తి చేయడానికి నెలలో ఒక వారం కూలికి పోవలసి వస్తున్నది. కూతురు కవిత ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కుర్మయ్య భార్య రాములమ్మ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నది. – బి. కొండల్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక -
సేంద్రియ మారాణి!
వాంకుడోతు మారోణి.. తెలంగాణ రాష్ట్రంలో ఓ మారుమూల గిరిజన తండా ఆమె ఊరు. చదువు లేదు. అయినా, గుండెల నిండా చైతన్యం నింపుకున్న రైతు. సేంద్రియ వ్యవసాయం చేస్తుంది. మెరుగైన వ్యవసాయ పద్ధతులు నేర్చుకుంటూ పాటిస్తుంది. తాను, తన కుటుంబం పచ్చగా ఉండటంతోపాటు.. తోటి రైతులు కూడా చల్లగుండాలనుకుంటుంది. అందుకోసం తమ తండాలో రైతు సంఘాన్ని ఏర్పాటు చేసింది. శక్తి మేరకు కష్టపడటంతో పాటు దేవుడి దయ కూడా కావాలనుకొంటుంది. అందుకే వాళ్ల రైతు సంఘానికి బాలాజీ పేరు పెట్టుకుంది. రోజుకు ముప్పూటా ఇంటిల్లిపాదీ తినే పచ్చజొన్న, కొర్ర, శ్రీవరితోపాటు ఒకటికి నాలుగు తిండి పంటలతో పాటు కొంత మేరకు పత్తి వేస్తుంటుంది. పోయిన సీజన్లో ఎకరం పత్తి పెట్టి.. నానా బాధలు పడి ఖర్చులు రాబట్టుకుంది. కానీ, తన కష్టం వృథా పోయిందని, రూ. 20 వేల వరకు నష్టం వచ్చిందని అంటుంది. అందుకే, ఈసారి మాత్రం పత్తి పెట్టనని తెగేసి చెబుతోంది.. చిన్నపాటి మహిళా రైతు మరోణి! వాంకుడోతు మారోణిది దయ్యబండ అనే తండా. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ఉంది ఆ తండా. చిన్న రైతు కుటుంబం ఆమెది. భర్త పేరు చిన్న రాములు. ఇద్దరు కుమారులు. ఓ కూతురు. ముగ్గురికీ పెళ్లిళ్లు అయిపోయాయి. పెద్ద కొడుకు, కోడులు వేరు కాపురం ఉంటున్నారు. చిన్న కొడుకు, కోడలితో పాటు కలిసి ఉంటూ మారోణి ఒడుపుగా వ్యవసాయం చేస్తున్నది. మొదట్లో ఎడ్లబండిపై భర్తతో కలిసి ఊరూరూ తిరిగి చెరకు నరకడం, కొన్నాళ్లు ఊళ్లకు వెళ్లి సీతాఫలాలు, ఉప్పు అమ్మటం అలవాటుగా ఉండేది. భర్తకు కంటి చూపు మందగించటంతో గత కొద్ది ఏళ్లుగా తండాలోనే స్థిరంగా ఉంటూ.. వ్యవసాయం చేస్తున్నారు. దయ్యబండ తండా మహిళా గిరిజన రైతులు పిలుపు స్వచ్ఛంద సంస్థ సహకారంతో సేంద్రియ, శ్రీవరి సాగు పద్ధతులను అలవరచుకొని ముందడుగు వేస్తున్నారు. పచ్చజొన్న రొట్టె.. గటక.. మారోణి కుటుంబానికి సొంతం రెండెకరాల కుష్కి(మెట్ట), ఒక ఎకరం తరి(మాగాణి) పొలం ఉంది. మరో 3 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. మారోణి ఈ సంవత్సరం పది క్వింటాళ్ల మొక్కజొన్నలు, క్వింటన్నర కందులు, 4 క్వింటాళ్ల పచ్చజొన్నలు పండించింది. ఎన్ని పండినా పచ్చజొన్నలు మాత్రం అమ్మరు. ఇంట్లో పిల్లా పెద్దా అందరూ మూడు పూటలా జొన్న రొట్టె తింటారు. గటక తాగుతారు. ఆరోగ్యంగా ఉంటారు. పొలం పనులు చాలా వరకు సొంతంగానే చేసుకుంటారు. 3 ఎకరాలను కౌలుకు తీసుకున్నారు. ఎకరానికి ఏటా రూ. 10 వేలు కౌలు. బోరులో నీరు తక్కువ ఉండటంతో ఎకరంన్నరలో శ్రీవరి సాగు చేసింది. పంట చేతికి రాబోతుండగా రాళ్లవాన, గాలిదుమారం వచ్చి.. 40 బస్తాల ధాన్యం రాలటంతో.. 30 బస్తాల ధాన్యమే చేతికొచ్చింది. ‘ఎకరంలో పత్తి పెడితే.. పెట్టుబడి తిరిగి రావడమే కష్టమైంది. తమ కష్టం వృథా అయ్యింది. ఆ మేరకు రూ. 20 వేలు నష్టం వచ్చింది. ఈసారి మొక్కజొన్న, కందులు, కొర్రలు, సజ్జలు, శ్రీవరి పెడతా. పత్తి పెట్టేది లేద’ని మారోణి తేల్చి చెప్పారు. రైతు సంఘాలు.. విత్తన బ్యాంకు.. తండాలో రైతులు 20 మంది చొప్పున రెండు సంఘాలు పెట్టుకున్నారు. బాలాజీ రైతు సంఘం పెట్టుకొని నాలుగేళ్లు అయింది. వీటిల్లో సభ్యులు చాలా వరకు గిరిజన మహిళా రైతులే. మొదట్లో నెలకు తలకు రూ.50 మదుపు చేసేవారు. ఇప్పుడు రూ. 100 జమ చేస్తున్నారు. తొలకరికి రైతుకు రూ. 10 – 20 వేల వరకు అప్పు ఇస్తున్నారు. వందకు నెలకు రూ.1 వడ్డీ. నెలకు రూ.వెయ్యి/రెండు వేలు తిరిగి కట్టేస్తున్నారు. తోటి మహిళా రైతులతో సంఘం సమావేశం నిర్వహిస్తున్న మారోణి కాలం సరిగ్గా లేకపోవటమో, పంటలు సరిగ్గా పండకపోయినప్పుడు అప్పు ఎలా కడతారు? అనడిగితే.. ‘అట్లేం లేదు సారూ. ఏదో కష్టం చేస్తం. ఇంటికాడ ఉంటమా. సంఘం పెట్టుకున్న తర్వాత తెలివి వచ్చింది. అటూ ఇటూ మీటింగులకు వెళ్లి రావటం వల్ల విత్తనాలు వచ్చినై. విత్తన బ్యాంకు పెట్టినం. ఇప్పుడు మా దగ్గర తైదలు, కొర్రలు, సజ్జలు, పచ్చజొన్నలు, ఎర్రకందులు, తెల్లకందులు, అన్ని రకాల కూరగాయల విత్తనాలు ఉన్నయి. సంఘం సభ్యులకు కిలో విత్తనాలు ఇస్తే వచ్చే సంవత్సరం రెండు కిలోలు తిరిగి ఇస్తరు. వేరే ఊరోళ్లకైతే జొన్న విత్తనాలు కిలో రూ. 60కి, కందులు రూ.150కి.. అమ్ముతున్నం.. సంఘం వచ్చినంక జర మంచిగనే ఉంది..’ అంటున్నారు మారోణి. మేలైన, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అలవాటు చేసుకుంటూ అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహిస్తున్న మారోణిని మా మంచి రాణిగా తోటి రైతులు ప్రశంసిస్తున్నారు. స్వయంగా కౌలు రైతు కూడా అయిన మారోణి కౌలు రైతుల హక్కుల సాధన కోసం పోరాడుతున్నారు. ఇందిరాగాంధీ శ్రమ శక్తి అవార్డును గత ఏడాది మారోణి స్వంతం చే సుకోవడం ఎంతైనా సముచితం. కౌలు రైతులకు న్యాయం ఎక్కడ? వరి సాగులో శ్రీ పద్ధతిని అనుసరించడం, అదేవిధంగా అధిక లాభాలు అందించే చిరుధాన్యాలు, కంది వేస్తున్నాను. పంట మార్పిడితో మంచి దిగుబడులు సాధించాను. రసాయన ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించి సేంద్రియ వ్యవసాయానికి మొగ్గు చూపడం వల్ల చీడపీడల నుంచి రక్షణతో పాటుగా పంట దిగుబడి నూటికి నూరు శాతం పెరిగింది. వ్యవసాయం, పాడి గేదెల పెంపకం రెండూ లాభసాటిగా ఉన్నాయి. మహిళా రైతులు కూడా మంచి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ ఒకటికి నాలుగు రకాల పంటలు పండిస్తే వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించవచ్చు. అయితే, పంట నష్టపోయినా పరిహారం రావటం లేదు. మా వరి ధాన్యం సగానికి పైగా రాలిపోయింది. అధికారులు వచ్చి రాసుకున్నారు. అయినా రూపాయి రాలేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వటం లేదు. ఎకరానికి రూ. 4 వేల పెట్టుబడి సహాయం కూడా ప్రభుత్వం భూమి యజమానికే ఇస్తున్నది. కౌలు రైతులకు న్యాయం జరగటం లేదు. వాంకుడోతు మారోణి (95530 35321), దయ్యబండ తండా,తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా – టీవీ రమణాకర్, సాక్షి,తుర్కపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా -
కౌలు రైతులను గుర్తించరా?
సందర్భం ఈ రోజు వ్యవసాయం నడుస్తున్నదంటే అది కౌలు రైతుల పుణ్యమే. కానీ వీరికి ఎలాంటి సాయం అందడం లేదు. వచ్చే సంవత్సరం ఇచ్చే ఎకరాకు రూ. 4,000 సాయం మాత్రం కౌలు రైతులకు అందేటట్లు చూడటం మన బాధ్యత. తెలంగాణలో ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ రైతుల మధ్య ఒకటే చర్చ. ఎవరు నిజమైన రైతు? పట్టాదారు పాస్‌బుక్ కలిగి వ్యవసాయం చేయనివారా? భూమి కౌలుకు తీసుకుని కష్ట, నష్టాలకు ఓర్చుకుని వ్యవసాయం చేసేవారా? సాధారణంగా భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసే వ్యక్తినే నిజమైన రైతుగా గుర్తిస్తారు. కానీ ముఖ్యమంత్రి ప్రకటన, అధికారులు వ్యవహరిస్తున్న తీరు కౌలు రైతులను రైతులుగా గుర్తించే అవకాశం ఇవ్వడం లేదు. ‘ఎవరికి భూమి ఉంటే వారే రైతు. వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఎకరాకు రూ.4,000 వేస్తాం. రెండు పంటలు వేస్తే రూ. 8,000 వేస్తాం’ ఉచిత ఎరువుల పథకాన్ని ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఇది. ఈ ప్రకటన కౌలు రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది. రుణమాఫీ ప్రయోజనాన్ని భూమి యజమానులకే కట్టబెట్టారని, ఇప్పుడు సబ్సిడీ ఎరువులకు ఇచ్చే ప్రోత్సాహకాన్నీ వారి ఖాతాల్లోనే వేస్తున్నారని, నిజంగా భూమిని సాగు చేసి, అప్పుల పాలవుతున్న, అన్ని కష్టాలనూ ఎదుర్కొంటున్న కౌలు రైతులకు అన్యాయం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న రైతులకే అమలైంది. రూ.23,000 కోట్ల రుణ మాఫీ అయితే, కౌలు రైతులకు వర్తించింది కేవలం రూ. 23 కోట్లు. తెలంగాణలో ఈ మూడేళ్ల కాలంలో 3 వేలమందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో అత్యధికులు భూమి లేని కౌలు రైతులు. కొందరు కొంత భూమి ఉండి మరింత భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే కౌలు రైతులు. వీరి కుటుంబాలకు నష్ట పరిహారం కూడా లేదు. కౌలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కొన్ని: భూక్యా మరోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గిరిజన మహిళా కౌలు రైతు. కౌలు రైతు గుర్తింపు కార్డు గురించి తుర్కపల్లి తహసీల్దార్ కార్యాలయానికి నాలుగుసార్లు తిరిగింది, గుర్తింపు కార్డు రాలేదు, రెవెన్యూ అధికారులు చెప్పిన సమాధానం భూయజమాని అంగీకారం తెలపలేదని! మరోని ఆ కార్డుపై పెద్దగా ఆశించింది ఏమీలేదు, వడగండ్ల వాన పడి పంటనష్టం జరిగింది కాబట్టి తనపేరు నమోదు చేసుకోమంటే కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే నీ పేరు నమోదు చేసుకుంటామన్నారు వ్యవసాయ అధికారులు. అదే మండలం ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన నర్సిరెడ్డి తనకు కౌలు రైతు గుర్తింపు కార్డు, ఆ కార్డు మీద పంట పెట్టుబడి కోసం కొంత బ్యాంకు రుణం ఇప్పించమని అప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్ కాళ్లపై పడ్డాడు. ఆ హఠాత్ పరిణామానికి చలించిన కలెక్టర్ జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్‌ను పిలిచి నర్సిరెడ్డికి రుణం మంజూ రు చేయవలసిందిగా ఆదేశించారు. అయినా బ్యాంకు అధికారులు నిరాకరించారు. కారణం అప్పటికే భూ యజ మాని పంట రుణం తీసుకున్నాడు. 2015 కరువు నష్ట పరి హారం రాష్ట్రంలో ఒక్క కౌలు రైతుకు కూడా రాలేదు. ఈ సందర్బంగా కౌలు రైతుల రక్షణ కోసం 2011లో వచ్చిన భూ అధీకృత సాగుదారుల చట్టం అమలు తీరు గురించి ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆ చట్టం ప్రకా రం ప్రభుత్వం నుంచి∙వ్యవసాయ పరమైన ఏ సంక్షేమ పథకాలు వచ్చినా కౌలు రైతులకు దక్కాలి. ఈ పథకాలు వర్తించటానికి కౌలు రైతుకు గుర్తింపు కార్డు ఉండాలి. ఆ కార్డులు ఇచ్చే ప్రక్రియ దారుణంగా ఉంది. తెలంగాణలో 10 లక్షలకు పైగా కౌలు రైతులు ఉంటే గత సంవత్సరం 10 వేల మందికి కూడా అందలేదు. రెవెన్యూ శాఖ దీనిని ఎన్నడూ సమీక్షించిన దాఖలాలు లేవు. ఈ మూడు సంవత్సరాలలో ఆ శాఖ మంత్రి మహమ్మద్ అలీ గారు కౌలు రైతుల సమస్య గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదు.ఈ విషయం గురించి చర్చించటానికి రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయం ఇఇఔఅ (భూ పరిపాలన ప్రధాన అధికారి కార్యాలయం)కు వెళితే ఆ పోస్ట్ ఎప్పుడూ ఖాళీగానే కనిపిస్తుంది. భూ అధీకృత సాగుదారుల చట్టం గురించి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ అంశం మీద చిన్న కదలిక కూడా లేదు. పైగా కౌలు రైతులను మోసగించే ప్రక్రియకు వ్యవసాయ అధికారులు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుంచి రైతులకు ఎకరాకు పంటకు రూ.4,000 సాయం అందిస్తామన్నది. దాని కోసం అన్ని జిల్లా కేంద్రాలలో వ్యవసాయ అధికారులు రైతు సమగ్ర సర్వే అని ఒక ప్రశ్నపత్రం రూపొందించారు. ఈ సర్వే ఆధారంగానే వచ్చే సంవత్సరం ఎకరాకు పంటకు ప్రకటించిన ఆ సాయం అందిస్తారని అంటున్నారు. కానీ వ్యవసాయ అధికారులు రూపొందించిన ఈ సర్వే పత్రంలో రైతుకు సంబంధించి 25 రకాల వివరాలు ఉన్నాయి. కౌలు రైతుకు సంబంధించిన ఒక్క విషయం కూడా లేదు. ఈ విషయం గురించి రైతు స్వరాజ్య వేదిక వ్యవసాయ కమిషనర్‌ను కలిసినా ఇంతవరకు ఎలాంటి ఫలితం కనిపించలేదు. సర్వే అధికారులకు కూడా ఈ మేరకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. జూన్ 10వ తేదీతో సర్వే ముగుస్తుంది. ఇంకెప్పుడు కౌలు రైతుల పేర్లు నమోదు చేస్తారు? కౌలు రైతుల సమస్యల మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? ఈ రోజు వ్యవసాయం నడుస్తున్నదంటే అది కౌలు రైతుల పుణ్యమే. కానీ వీరికి ఎలాంటి సాయం అందడం లేదు. వచ్చే సంవత్సరం ఇచ్చే ఎకరాకు రూ. 4,000 సాయం మాత్రం వాస్తవంగా వ్యవసాయం చేస్తున్న రైతులకు అందేటట్లు చూడటం మన బాధ్యత. - బి. కొండల్ రెడ్డి వ్యాసకర్త రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి మొబైల్ : 99488 97734