స్క్విడ్‌ గేమ్‌: రీల్‌ కాదు.. రియల్‌గానే జరుగుతోంది! | Real Life Squid Game In South Korea Debt Trap Kills Many | Sakshi
Sakshi News home page

Squid Game: సౌత్‌ కొరియాలో ‘స్క్విడ్‌ గేమ్‌’ నిజంగానే.. చంపరు కానీ, చస్తారు!

Published Fri, Oct 22 2021 9:53 AM | Last Updated on Fri, Oct 22 2021 11:48 AM

Real Life Squid Game In South Korea Debt Trap Kills Many - Sakshi

Squid Game South Korea Debt Trap: స్క్విడ్‌ గేమ్‌.. ఈ సెన్సేషన్‌ వెబ్‌ సిరీస్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  ఈ కథలో జీవితాలతో ఆడుకునేవాడు ఒకడైతే..  ఆ ఆటలో పాల్గొనేవాళ్లు 456 మంది. పేరుకు పిల్లల ఆటలేగానీ.. ఓడితే మాత్రం ప్రాణాలు తీస్తుంటాయి. 45 బిలియన్‌ వాన్‌ల ప్రైజ్‌మనీ (38 మిలియన్‌ డాలర్లు) గెల్చుకోవడానికి వాళ్లంతా పడే తాపత్రయమే ఈ కథ.  గమనార్హం ఏంటంటే.. ఈ ఆటగాళ్లంతా  అప్పుల్లో కూరుకుపోయిన వాళ్లే కావడం. అయితే ఈ అప్పుల ఊబి కథ.. కథ కాదు. దక్షిణ కొరియాలో లక్షలమంది ఎదుర్కొంటున్న సమస్యకు ప్రతిరూపం. 


రిటైర్‌మెంట్‌ వయసుకు దగ్గర పడుతున్న  యు వీ సూక్‌.. గతంలో అవసరాల కోసం కొంత అప్పు చేసి.. ఆపై మొత్తం తీర్చేసింది. కానీ, ఇప్పటికీ కలెక్షన్‌ ఏజెన్సీల నుంచి ఆమెకు కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. బ్యాంక్‌ అకౌంట్లను సీజ్‌ చేస్తామని ఆమెను బెదిరిస్తున్నారు. రీపేమెంట్‌ వ్యవస్థలో ఉన్న లోపాల్ని ఉపయోగించుకుంటున్న ఏజెన్సీలు, బాకీ తీర్చే సమయంలో ఆమె పక్కాగా లేకపోవడం.. వెరసి ఇప్పుడు ఆమె పీకల మీదకు వచ్చి పడింది.  


దక్షిణ కొరియాలో అప్పు  చేయడం ఒక పెద్ద అపరాధం. అవి తీర్చడం కంటే చావడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు అక్కడి ప్రజలు. 

కానీ, ఆర్థిక అవసరాలు కొందరిని అప్పుల వైపు ప్రొత్సహిస్తున్నాయి. ముఖ్యంగా చిరు వ్యాపారులకు అవే దిక్కుమరి. 

2017లో 48 శాతం ఉన్న అప్పుల శాతం.. 2021 జూన్‌ నాటికి 55 శాతానికి చేరుకుంది.  

అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి దివాళ తీసిన వాళ్లు 50 వేల మందికి పైనే ఉన్నట్లు 2020 కోర్టు గణాంకాలు చెప్తున్నాయి. ఈ సంఖ్య గత ఐదేళ్లతో పోలిస్తే.. చాలా ఎక్కువ అని కొరియా క్రెడిట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ చెబుతోంది.

 

దక్షిణ కొరియా అంటే గంగ్నమ్‌ స్టైల్‌ నుంచి బీటీఎస్‌ గ్రూప్‌ పాప్‌ ఆల్బమ్స్‌, సినిమాలు- వెబ్‌ సిరీస్‌లు, స్మార్ట్‌ ఫోన్‌లు ఇవే గుర్తుకొస్తాయి. కానీ, స్క్విడ్‌ గేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోణంలోనే కాదు.. సౌత్‌ కొరియాలో పెరిగిపోతున్న ‘అప్పు’ ముసుగులో జరుగుతున్న చీకటి కోణాల్ని ప్రస్తావించింది. 

అప్పుల నుంచి విముక్తి లేని దేశంగా, మోస్ట్‌ అడ్వాన్స్‌డ్‌ దేశాల్లో ఆత్మహత్యలు ఎక్కువగా నమోదు అవుతున్న దేశంగా దక్షిణ కొరియా టాప్‌లో ఉంది.

చిరు వ్యాపారులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అడ్డగోలు వడ్డీ గుంజుతూ పీల్చి పిప్పి చేస్తున్నాయి. 

కాలపరిమితిని సైతం పక్కన పెట్టి దారుణాతీ దారుణంగా వ్యవహరిస్తున్నారు అక్కడి బ్యాంకర్లు. తిరిగి చెల్లించేందుకు సైతం అవకాశాలు ఇవ్వకుండా ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి.  అందుకే ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. 

‘‘ట్రంప్‌ లాంటి కుబేరుడు కొరియాలో ఉండి ఉంటే.. అధ్యక్షుడు కాదు కదా.. ఈ పాటికి దివాళ తీసి రోడ్ల మీద అడుక్కు తీనేవాడేమో’’ అంటున్నారు సియోల్‌కు చెందిన ఓ ప్రముఖ న్యాయవాది. 

2018లో ఓ చట్టం తీసుకొచ్చారు.. పబ్లిక్‌ ఫైనాషియల్‌ ఇనిస్టిట్యూట్‌ వ్యవస్థపై నిషేధం విధించారు. అంటే.. బ్యాంకులు, ప్రభుత్వ సహకార గ్రూపుల ఆధిపత్యం కొనసాగుతోంది. దారుణం ఏంటంటే.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే కోణాన్ని పరిగణనలోకి తీసుకుని..  జాయింట్‌ షూరిటీల ద్వారా ఒకరు పోయిన మరొకరిని ఇబ్బందిపెట్టే చట్టం మార్చుకున్నాయి బ్యాంకులు.

టెక్నాలజీని అందిపుచ్చుకునే దేశం సౌత్‌ కొరియా..  స్టార్టప్‌లను సైతం ప్రొత్సహిస్తుంటుంది. కానీ, వ్యాపారాల విషయాల్లో మాత్రం చిన్న చూపు చూస్తూనే ఉన్నాయి. ఫలితంగా ర్యూ క్వాంగ్‌ హాన్‌ లాంటి వాళ్లు లోన్‌ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. 

సెప్టెంబర్‌ 17న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ అయిన స్క్విడ్‌ గేమ్‌ సిరీస్‌ను.. ఇప్పటిదాకా 142 మిలియన్ల మంది చూసినట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించుకుంది. అంతేకాదు ఈమధ్య కాలంలో 4.38 మిలియన్‌ సబ్‌ స్క్రయిబర్స్‌ పెరగడానికి ఈ సిరీస్‌ కూడా ఒక కారణం అయ్యింది. దక్షిణ కొరియా సమాజంలోని వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఈ సిరీస్‌ను తీసినట్లు ప్రకటించుకున్నాడు వాంగ్‌ డోంగ్‌ హ్యూక్‌.

- సాక్షి, వెబ్‌స్పెషల్‌ 

చదవండి: అక్కడేమో ప్రాణాలతో చెలగాటం! ఇక్కడేమో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement