గాలికి గలగలా నవ్వుతున్నట్లు ఊగుతున్న ఆ పసుపు పంటను అలా చూస్తూ నర్సవ్వ మురిసిపోతోంది. ‘ఏందవ్వ.. అట్ల చూస్తున్నవ్’ అని అడిగితే.. ‘తొమ్మిది నెలలు కడుపుల బిడ్డను మోసినట్లే.. ఈ పంటనూ కాపాడాలే బిడ్డా..’ అని చెబుతూనే పొలంగట్టు మీద వడివడిగా ముందుకు నడుస్తోంది. పక్కన మడిలో విరిసిన గులాబీలు తల్లి తమ చెంతకు వస్తోందన్న ఆనందంతో ఆమెనే చూస్తున్నట్టు కనిపించాయి. వాటిని ఆమె చేతితో తడుముతుంటే అవి మరింత విచ్చుకున్నట్లు అనిపించాయి. వాటిని దాటుకుంటూ నల్లని భూమిలో నుంచి వెలికి వచ్చిన ఉల్లి నారు, పచ్చగా విచ్చుకున్న గోబీపువ్వు, వాసన చూడు తల్లీ.. అని పిలుస్తున్నట్లున్న పుదీనా కనిపించింది.
గాలికి ఎగురుతున్న తన వెండి వెంట్రుకలను వెనక్కి తోసుకుంటూ.. కంటి అద్దాలను సరిచేసుకుంటూ.. ‘కూసో బిడ్డ..’ అని పంపుసెట్టు మూలమలుపు ఒడ్డుమీద కూర్చుంది. ‘చెప్పు బిడ్డా ఎటచ్చిండ్రు..’ అని ఆప్యాయంగా అడిగింది. ‘ఏం లేదవ్వ..’ అంటూనే ఒక్కో ప్రశ్న అడుగుతూ పోతుంటే.. గలగలా మాట్లాడుతూ.. తన కథను కళ్లకు కట్టించింది. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి సోపతి (దోస్తానా) చేస్తున్న ఆ భూమాతకున్నంత ఓపిక నర్సవ్వలోనూ కనిపించింది. అరవైమూడేళ్లు ఉన్న ఆమెలో కష్టం తాలూకు చాయలు ఇసుమంతైనా కనిపించలేదు. ఆ మట్టిమనిషి చెప్పిన కథలో కష్టాలున్నయ్.. కన్నీళ్లున్నయ్.. కొండంత బాధ్యతలున్నయ్.. నాయకత్వ లక్షణాలున్నయ్.. ఈ తరానికి కావల్సినన్ని ఆదర్శాలూ ఉన్నయ్.
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం సిర్గాపూర్ గ్రామానికి చెందిన కొప్పుల లక్ష్మీబాయి, నర్సారెడ్డికి ఇద్దరు కూతుళ్లు, నలుగురు కుమారులు. ఆరుగురిలో నర్సవ్వ పెద్దది. నర్సారెడ్డి సొంతూరు శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టులో ముంపునకు గురైన పాత బొప్పారం. ఊరు మునిగిపోతే నర్సారెడ్డి తన కుటుంబంతో సిర్గాపూర్ వచ్చాడు. ఇక్కడ భూమి కొని సాగు మొదలుపెట్టాడు. అలా తెలిసీ తెలియని వయసులో తండ్రి వెంట వచ్చిన నర్సవ్వ కష్టాలను చూస్తూ పెరిగింది. ఆ జమానాలోనే ఐదో తరగతి వరకు చదివింది.
చిన్నతనంలోనే పెళ్లి
ఇంటికి పెద్దదైన నర్సవ్వకు తండ్రి నర్సారెడ్డి అప్పటి ఆచారాలకు తగ్గట్లు బాల్య వివాహం చేశాడు. కొన్ని కారణాంతరాల వల్ల పెరిగి పెద్దదైనా నర్సవ్వ తన అత్తారింటికి వెళ్లలేదు. తండ్రితోనే పొలం పనులకు వెళ్లడం ప్రారంభించింది. నాన్నకు నడకగా మారింది.
ఇంటికి పెద్దదిక్కుగా..
తండ్రి నర్సారెడ్డి కాలంచేయడంతో నర్సవ్వే ఇంటికి పెద్దదిక్కయ్యింది. తానే ముందుండి తమ్ముళ్లు, చెల్లెళ్లకు పెళ్లి చేసింది. శ్రీరాంసాగర్‌లో ముంపునకు గురైన పాతబొప్పారం గ్రామస్తులకు సోన్ మండలంలోని కొత్త బొప్పారంలో భూములు ఇచ్చారు. అక్కడ వచ్చిన భూమిని ఇద్దరు తమ్ముళ్లకు.. సిర్గాపూర్‌లోని భూమిని మరో ఇద్దరికి ఇచ్చింది. నర్సవ్వ కాయకష్టం చేసి సొంతంగా నాలుగున్నర ఎకరాలు కొనుక్కుని అందులోనే పంటలు పండించుకుంటూ.. ఎనభయ్యేళ్లు దాటిన తల్లి లక్ష్మీబాయి, తమ్ముడి కొడుకు నర్సన్న బాగోగులు చూస్తోంది.
పొద్దుపొడవక ముందే..
బారెడు పొద్దెక్కేదాకా లేవని ఈ జమానాలోనూ సూరీడు రాకముందే నర్సవ్వ దినచర్య ప్రారంభమవుతుంది. ముందురోజే కోసి, కట్టలు కట్టిన కూరగాయల మూటలను తానే ఆటో లేదా బస్సులో వేసుకుని ఆరుగంటలకే నిర్మల్ జిల్లాకేంద్రంలోని కూరగాయల మార్కెట్‌కు చేరుతుంది. వాటిని హోల్‌సేల్‌గా అమ్ముకుని ఎనిమిది గంటలకల్లా ఇంటికి చేరుతుంది. తొమ్మిదింటికల్లా మళ్లీ చేలోకి వెళ్తుంది. రోజంతా భూమితోనే ఆమె దోస్తానా. అక్కడి పంటలే ఆమె ఆత్మీయనేస్తాలు. ఎరువులు, మందులు, ఇతర విత్తనాలు ఇలా ఏది అవసరం పడినా తానే స్వయంగా వెళ్లి తెచ్చుకుంటుంది. సొంత బిడ్డల్లా చూసుకుంటున్నందుకేనేమో.. ఆ పంటలూ మంచి దిగుబడిని ఇస్తున్నాయి.
అసలు.. నర్సవ్వ చేసే పని, ఆమె పాజిటివ్ థింకింగ్, చలాకీ మాటలు చూస్తుంటే.. ఆమె అరవయేళ్లు దాటిన అవ్వేనా.. అనిపించకమానదు. అరగంట కష్టపడకుండా.. అరక్షణమైనా ఆలోచించే తీరికలేని నేటితరం నర్సవ్వను చూసి నేర్చుకోవలసింది చాలానే ఉందనిపిస్తుంది.
కష్టాన్నే నమ్ముకున్న
చిన్నప్పటి నుంచి కష్టం చూసుకుంటనే పెరిగిన. నాన్నపోయిన తర్వాత ఇల్లు చూసుకుంట.. తోడబుట్టినోళ్ల పెళ్లిళ్లు చేసుకుంట వచ్చిన. నాలుగున్నర ఎకరాలను నమ్ముకుంటేనే ఇయ్యాల రోజులు గడుస్తున్నయ్. సొంతంగా ఇల్లు కట్టుకున్న. తల్లి లక్ష్మీబాయి, అల్లుడు నర్సారెడ్డిని చూసుకుంటున్న. పంట భూమి తప్ప వేరే సోపతి నాకు లేదు.
– కొప్పుల నర్సవ్వ
– రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్
ఫొటోలు: బాతూరి కైలాష్
Comments
Please login to add a commentAdd a comment