Yellow crop
-
కష్టమే ఇష్టంగా.. ఓ మట్టిమనిషి
గాలికి గలగలా నవ్వుతున్నట్లు ఊగుతున్న ఆ పసుపు పంటను అలా చూస్తూ నర్సవ్వ మురిసిపోతోంది. ‘ఏందవ్వ.. అట్ల చూస్తున్నవ్’ అని అడిగితే.. ‘తొమ్మిది నెలలు కడుపుల బిడ్డను మోసినట్లే.. ఈ పంటనూ కాపాడాలే బిడ్డా..’ అని చెబుతూనే పొలంగట్టు మీద వడివడిగా ముందుకు నడుస్తోంది. పక్కన మడిలో విరిసిన గులాబీలు తల్లి తమ చెంతకు వస్తోందన్న ఆనందంతో ఆమెనే చూస్తున్నట్టు కనిపించాయి. వాటిని ఆమె చేతితో తడుముతుంటే అవి మరింత విచ్చుకున్నట్లు అనిపించాయి. వాటిని దాటుకుంటూ నల్లని భూమిలో నుంచి వెలికి వచ్చిన ఉల్లి నారు, పచ్చగా విచ్చుకున్న గోబీపువ్వు, వాసన చూడు తల్లీ.. అని పిలుస్తున్నట్లున్న పుదీనా కనిపించింది. గాలికి ఎగురుతున్న తన వెండి వెంట్రుకలను వెనక్కి తోసుకుంటూ.. కంటి అద్దాలను సరిచేసుకుంటూ.. ‘కూసో బిడ్డ..’ అని పంపుసెట్టు మూలమలుపు ఒడ్డుమీద కూర్చుంది. ‘చెప్పు బిడ్డా ఎటచ్చిండ్రు..’ అని ఆప్యాయంగా అడిగింది. ‘ఏం లేదవ్వ..’ అంటూనే ఒక్కో ప్రశ్న అడుగుతూ పోతుంటే.. గలగలా మాట్లాడుతూ.. తన కథను కళ్లకు కట్టించింది. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి సోపతి (దోస్తానా) చేస్తున్న ఆ భూమాతకున్నంత ఓపిక నర్సవ్వలోనూ కనిపించింది. అరవైమూడేళ్లు ఉన్న ఆమెలో కష్టం తాలూకు చాయలు ఇసుమంతైనా కనిపించలేదు. ఆ మట్టిమనిషి చెప్పిన కథలో కష్టాలున్నయ్.. కన్నీళ్లున్నయ్.. కొండంత బాధ్యతలున్నయ్.. నాయకత్వ లక్షణాలున్నయ్.. ఈ తరానికి కావల్సినన్ని ఆదర్శాలూ ఉన్నయ్. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామానికి చెందిన కొప్పుల లక్ష్మీబాయి, నర్సారెడ్డికి ఇద్దరు కూతుళ్లు, నలుగురు కుమారులు. ఆరుగురిలో నర్సవ్వ పెద్దది. నర్సారెడ్డి సొంతూరు శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టులో ముంపునకు గురైన పాత బొప్పారం. ఊరు మునిగిపోతే నర్సారెడ్డి తన కుటుంబంతో సిర్గాపూర్ వచ్చాడు. ఇక్కడ భూమి కొని సాగు మొదలుపెట్టాడు. అలా తెలిసీ తెలియని వయసులో తండ్రి వెంట వచ్చిన నర్సవ్వ కష్టాలను చూస్తూ పెరిగింది. ఆ జమానాలోనే ఐదో తరగతి వరకు చదివింది. చిన్నతనంలోనే పెళ్లి ఇంటికి పెద్దదైన నర్సవ్వకు తండ్రి నర్సారెడ్డి అప్పటి ఆచారాలకు తగ్గట్లు బాల్య వివాహం చేశాడు. కొన్ని కారణాంతరాల వల్ల పెరిగి పెద్దదైనా నర్సవ్వ తన అత్తారింటికి వెళ్లలేదు. తండ్రితోనే పొలం పనులకు వెళ్లడం ప్రారంభించింది. నాన్నకు నడకగా మారింది. ఇంటికి పెద్దదిక్కుగా.. తండ్రి నర్సారెడ్డి కాలంచేయడంతో నర్సవ్వే ఇంటికి పెద్దదిక్కయ్యింది. తానే ముందుండి తమ్ముళ్లు, చెల్లెళ్లకు పెళ్లి చేసింది. శ్రీరాంసాగర్‌లో ముంపునకు గురైన పాతబొప్పారం గ్రామస్తులకు సోన్ మండలంలోని కొత్త బొప్పారంలో భూములు ఇచ్చారు. అక్కడ వచ్చిన భూమిని ఇద్దరు తమ్ముళ్లకు.. సిర్గాపూర్‌లోని భూమిని మరో ఇద్దరికి ఇచ్చింది. నర్సవ్వ కాయకష్టం చేసి సొంతంగా నాలుగున్నర ఎకరాలు కొనుక్కుని అందులోనే పంటలు పండించుకుంటూ.. ఎనభయ్యేళ్లు దాటిన తల్లి లక్ష్మీబాయి, తమ్ముడి కొడుకు నర్సన్న బాగోగులు చూస్తోంది. పొద్దుపొడవక ముందే.. బారెడు పొద్దెక్కేదాకా లేవని ఈ జమానాలోనూ సూరీడు రాకముందే నర్సవ్వ దినచర్య ప్రారంభమవుతుంది. ముందురోజే కోసి, కట్టలు కట్టిన కూరగాయల మూటలను తానే ఆటో లేదా బస్సులో వేసుకుని ఆరుగంటలకే నిర్మల్ జిల్లాకేంద్రంలోని కూరగాయల మార్కెట్‌కు చేరుతుంది. వాటిని హోల్‌సేల్‌గా అమ్ముకుని ఎనిమిది గంటలకల్లా ఇంటికి చేరుతుంది. తొమ్మిదింటికల్లా మళ్లీ చేలోకి వెళ్తుంది. రోజంతా భూమితోనే ఆమె దోస్తానా. అక్కడి పంటలే ఆమె ఆత్మీయనేస్తాలు. ఎరువులు, మందులు, ఇతర విత్తనాలు ఇలా ఏది అవసరం పడినా తానే స్వయంగా వెళ్లి తెచ్చుకుంటుంది. సొంత బిడ్డల్లా చూసుకుంటున్నందుకేనేమో.. ఆ పంటలూ మంచి దిగుబడిని ఇస్తున్నాయి. అసలు.. నర్సవ్వ చేసే పని, ఆమె పాజిటివ్ థింకింగ్, చలాకీ మాటలు చూస్తుంటే.. ఆమె అరవయేళ్లు దాటిన అవ్వేనా.. అనిపించకమానదు. అరగంట కష్టపడకుండా.. అరక్షణమైనా ఆలోచించే తీరికలేని నేటితరం నర్సవ్వను చూసి నేర్చుకోవలసింది చాలానే ఉందనిపిస్తుంది. కష్టాన్నే నమ్ముకున్న చిన్నప్పటి నుంచి కష్టం చూసుకుంటనే పెరిగిన. నాన్నపోయిన తర్వాత ఇల్లు చూసుకుంట.. తోడబుట్టినోళ్ల పెళ్లిళ్లు చేసుకుంట వచ్చిన. నాలుగున్నర ఎకరాలను నమ్ముకుంటేనే ఇయ్యాల రోజులు గడుస్తున్నయ్. సొంతంగా ఇల్లు కట్టుకున్న. తల్లి లక్ష్మీబాయి, అల్లుడు నర్సారెడ్డిని చూసుకుంటున్న. పంట భూమి తప్ప వేరే సోపతి నాకు లేదు. – కొప్పుల నర్సవ్వ – రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్ ఫొటోలు: బాతూరి కైలాష్ -
పసుపు, ఎర్రజొన్న రైతులను ఆదుకోవాలి: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందిం చి, వారిని ఆదుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కోరారు. మంగళవారం సచివాలయంలో సీఎస్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లో పసుపు, ఎర్రజొన్న ప్రధాన వాణిజ్య పంటలు అయినప్పటికీ అక్కడి రైతుల పంటలను న్యాయమైన ధర చెల్లించి కొనుగోలు చేసే మార్కెట్ వ్యవస్థ లేదని పేర్కొన్నారు. పసుపు శుద్ధికి, అమ్మకానికి నిజామాబాద్‌లో కావాల్సిన సౌకర్యాలు లేవన్నారు. ఎర్రజొన్న మార్కెట్ కొంతమంది వ్యాపారుల చేతుల్లో ఉందని, వారే మార్కెట్‌ను శాసిస్తుండటం వల్ల గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోతున్నారన్నారు. అందు కే రైతులు గిట్టుబాటుధర కోసం ఆందోళన చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్య లు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం ఎర్రజొన్నలను క్వింటాల్‌కు రూ.3,500 చొప్పున, పసుపు క్వింటా ల్కు రూ.15 వేల ధర స్థిరీకరించేలా చర్యలు చేపట్టాలని, పసుపు బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలన్నా రు. మార్కెట్ చట్టంలోని సెక్షన్ 11ను పటిష్టంగా అమలు చేయాలన్నారు. కేంద్రం సూచించినట్లుగా కాంట్రాక్టు వ్యవసాయంలో రైతుల రక్షణకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఆందోళన చేస్తున్న రైతులపై, రైతు సంఘాల నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, జైల్లో ఉన్న నాయకులను విడుదల చేయాలని ఆయన కోరారు. -
పసిడి పంటకు ధర కరువు
మోర్తాడ్(బాల్కొండ): రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి, తొమ్మిది నెలలు కష్టపడి పంట పండిస్తున్న పసుపు రైతుకు కన్నీరే మిగులుతోంది.. పంట ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉన్నా ధర క్రమంగా పతనమవుతోంది. అదేం విచిత్రమో కానీ, పంట సాగు ఖర్చు ఏటేటా పెరుగుతుంటే, ధర మాత్రం దిగజారుతుండడం రైతాంగాన్ని కలవరపెడుతోంది. పదేళ్ల క్రితం పసుపు క్వింటాల్ ధర రూ.16 వేలు ఉంటే, ప్రస్తుతం రూ.6 వేలకు మించడం లేదు. ప్రభుత్వాల నుంచి ‘మద్దతు’ లేకపోవడంతో రైతులు ప్రతి సంవత్సరం నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులంతా ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం మోర్తాడ్‌లో పసుపు రైతుల ఆవేదన సభ నిర్వహించనున్నారు. పడిపోయిన ధర పసుపు సాగు కోసం రైతులు పెడుతున్న పెట్టుబడులు ఏటేటా పెరుగుతున్నా పంటకు ఆశించిన ధర లభించక రైతులు నష్టాలను మూటగట్టుకుంటున్నారు. పదేళ్ల క్రితం అంటే 2009లో పసుపు ధర రూ.12 వేల నుంచి రూ.16 వేల వరకు పలికింది. ప్రస్తుతం మార్కెట్లో పసుపు ధర కనిష్టంగా రూ.4 వేలు, గరిష్టంగా రూ.6 వేలు పలుకుతోంది. ఈ పదేళ్లలో పంట సాగు వ్యయం రెట్టింపు కాగా, అదే స్థాయిలో పెరగాల్సిన ధర 60 శాతం మేర దిగజారి పోవడం విశేషం. ఎకరా విస్తీర్ణంలో పసుపు సాగుకు రైతులకు రూ.1.20 లక్షలకు పైగా పెట్టుబడి పెడుతున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం రైతులకు పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదు సరికదా వారు చేస్తున్న శ్రమకు ఫలితం లభించడం లేదు. వైఎస్ హయాంలో మద్దతు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పసుపు రైతులు దండిగా లాభాలు ఆర్జించారు. నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు వైఎస్ అప్పట్లో ఎంతో చొరవ తీసుకున్నారు. పసుపు పంటను ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా కొనుగోలు చేయించిన, పంటకు మద్దతు ధర ప్రకటించిన మొదటి, చివరి ముఖ్యమంత్రి ఆయనే కావడం విశేషం. మార్క్‌ఫెడ్ ద్వారా పసుపును కొనుగోలు చేయించిన వైఎస్ ప్రభుత్వం.. అప్పట్లో క్వింటాల్‌కు రూ.6 వేల చొప్పున మద్దతు ధర ప్రకటించింది. దీంతో వ్యాపారులు పంట కొనుగోలుకు పోటీ పడి ధరను పెంచడంతో రైతులు భారీగా లాభాలు ఆర్జించారు. ఆయన మరణం తర్వాత మళ్లీ పాత పరిస్థితులే పునరావృతమయ్యాయి. అప్పట్లో రూ.16 వేలు పెలికిన ధర క్రమంగా పతనమైంది. దీంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పసుపు రైతుల కోసం ఉద్యమించారు. ఆర్మూర్‌లో 48 గంటల పాటు దీక్ష చేయడంతో అప్పటి ప్రభుత్వం కొంత వరకు స్పందించినా, ఆ తర్వాత ధర పతనం కొనసాగింది. డిమాండ్ ఉన్నా ధర లేదు.. వాస్తవానికి పసుపు పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పసుపు ఉత్పత్తులను వివిధ రకాల ఔషధాలు, కాస్మోటిక్స్, ఆహార పదార్థాల్లో వినియోగిస్తుంటారు. దీంతో పసుపు పంటకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. పసుపు పంట దేశ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లోనే పండిస్తారు. అందులో మన నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కువగా పంట సాగవుతుంది. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో పసుపు ఎక్కువగా పండిస్తుంటారు. అయితే, మార్కెట్లో పసుపు ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా రైతుకు మాత్రం ధర దక్కడం లేదు. ఎకరా విస్తీర్ణంలో సాగుకు రూ.1.20 లక్షలకు పైగా ఖర్చు చేస్తుంటే ఆ పెట్టుబడి కూడా రావడం లేదు. పసుపు ధర క్వింటాల్‌కు కనీసం రూ.10 వేలు ఉన్నా లాభాలు రాకపోయినా పెట్టుబడితో పాటు శ్రమకు ఫలితం దక్కుతుందని రైతులు పేర్కొంటున్నారు. కానీ, ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు. సర్కారు స్పందించాలి.. తొమ్మిది నెలలు కష్టపడి పండిస్తే ఏటా నష్టాలే మిగులుతున్నాయి. ప్రభుత్వాలేమో పట్టించుకోవడం లేదు. పసుపు రైతుల ఆవేదన సభతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. పసుపు పంటను వాణిజ్య పంటగా చూడటమే కాదు ఈ పంటను సాగు చేస్తున్న రైతులు ధర లేక పోవడంతో ఎంత మేర నష్టపోతున్నారో గుర్తించాల్సి అవసరం ప్రభుత్వంపై ఉంది. మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. – సుంకెట్ అన్వేష్ఏఊరెడ్డి, పసుపు రైతుల ఉద్యమ నాయకుడు నష్టాలే వస్తున్నాయి.. పసుపు పంటను సాగు చేస్తున్న రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. విత్తనం ఖర్చు, ఎరువులు, కూలీలకు ఇచ్చే కూలి, పసుపు తవ్వడానికి కూలీలకు చెల్లించే సొమ్మును లెక్క వేస్తే రైతులకు రూపాయి లాభం కూడా రావడం లేదు. ప్రభుత్వం స్పందించాల్సి అవసరం ఉంది. – కొప్పుల రాజశేఖర్, రైతు, మోర్తాడ్ -
పసుపు రైతులకు మరోసారి నోటీసులు
నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో సంచలనం సృష్టించిన పసుపు కుంభకోణం కారణంగా పంట పండించిన అసలైన రైతులు నష్టపోతున్నారు. అధికార పార్టీ నాయకులు వారి అనుచరులను కాపాడుకునే పనిలో రైతులకు అన్యాయం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పొరుగున ఉన్న ప్రకాశం, కడప జిల్లాల రైతులు అందజేసిన ఆధారాలపై సంతృప్తి చెంది నగదు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన మార్క్‌ఫెడ్ అధికారులు జిల్లాలోని రైతుల విషయంలో ఓ స్పష్టతకు రాలేదు. గురువారం నుంచి అసలైన రైతులకు మరోసారి నోటీసులను పంపుతున్నారు. ప్రకాశం, కడప జిల్లాల రైతులకు క్లియరెన్స జిల్లాతో పాటు పొరుగున ఉన్న ప్రకాశం, కడప జిల్లాలో పండించిన పసుపును ఉదయగిరిలోని మార్క్‌ఫెడ్ కేంద్రంలో విక్రయించారు. పసుపు కుంభకోణం వెలుగుచూడడంతో విచారణలో భాగంగా మార్క్‌ఫెడ్ అధికారులు రైతుల ప్రమేయంపై దృష్టి సారించారు. ప్రకాశం జిల్లాకు చెందిన 23 మంది, కడప జిల్లాకు చెందిన 23 మంది, నెల్లూరు జిల్లాకు చెందిన 183 మంది రైతులకు ఈ నెల 3న నోటీసులు జారీ చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన రైతులు ఆధారాలతో సహా మార్క్‌ఫెడ్ అధికారుల నోటీసులకు సమాధానం ఇచ్చారు. పరిశీలించిన మార్క్‌ఫెడ్ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఆ జిల్లాకు చెందిన 23 మంది రైతులకు రావాల్సిన నగదును అందజేయాలని గురువారం ఆదేశాలు జారీ చేశారు. అలాగే కడప జిల్లాకు చెందిన 23 మంది రైతుల సమాధానాలను పరిశీలించిన అ«ధికారులు సంతృప్తి చెందినట్లు సమాచారం. త్వరలో వారికి కూడా నగదు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిసింది. రాజకీయ ఒత్తిళ్లతో పెండింగ్ ప్రకాశం, కడప జిల్లాలలోని రైతులకు నోటీసులు పంపినప్పుడే జిల్లా రైతులకు నోటీసులు అందజేశారు. కానీ జిల్లా రైతుల విషయంలో ఉద్యాన శాఖ అధికారుల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ రాలేదు. రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు జిల్లా రైతుల విషయంలో నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తన అనచరులను కాపాడుకునేందుకు విచారణ చేస్తున్న అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్తు తెస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కుంభకోణంలో ప్రధాన సూత్రదారులు నగదు తీసుకుని మిన్నకుండిపోగా అసలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్లీ ఇచ్చారు ఈ నెల 3న జిల్లాలోని 183 మంది పసుపు రైతులకు మార్క్‌ఫెడ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రైతుల నుంచి వచ్చిన సమాధానం సరిగా లేకపోవడంతో రెండోసారి నోటీసులను గురువారం తయారు చేసి పంపారు. వీరితో పాటు గుర్తింపు లేని రైతుల కింద ఉన్న 51 మందికి నోటీసులు జారీ చేశారు. జిల్లా అధికారుల మధ్యన సమన్వయం లోపించడంతో పాటు రాజకీయ ఒత్తిళ్లతో రైతులకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండోసారి నోటీసులు ఇచ్చాం పసుపు రైతులకు మరోసారి నోటీసులు జారీ చేస్తున్నాం. ప్రకాశం, కడప జిల్లాల రైతుల విషయంలో స్పష్టత వచ్చింది. జిల్లాలోని రైతుల నుంచి వచ్చిన సమాధానాలపై స్పష్టత లేదు. అందుకే రెండోసారి జిల్లాలోని రైతులకు నోటీసులు పంపుతున్నాం. –ఈమని సంజీవరెడ్డి, మార్క్‌ఫెడ్ మేనేజర్ -
పసుపు రైతులను ఆదుకోండి
కేంద్ర వ్యవసాయ మంత్రికి ఎంపీ కవిత విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: కనీస మద్దతుధర ప్రకటించే పంటల జాబితాలో పసుపు పంటను కూడా చేర్చి పసుపు రైతులను ఆదుకోవాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ఎంపీ కవిత బుధవారం నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలసి రాధామోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో పసుపు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో చర్చించారు. భేటీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పసుపు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు గతంలో రూ. 16 వేలు ఉన్న పసుపు ధర ప్రస్తుతం రూ. 6 వేలకు పడిపోయినందున కనీస మద్దతు ధర ప్రకటించే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరామని చెప్పారు. దేశంలోనే పసుపు ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నా, పసుపు పంటకు మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కవిత ఆవేదన వ్యక్తంచేశారు. నిజామాబాద్ జిల్లాలో పండే పసుపునకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని జియోగ్రాఫికల్ గుర్తింపును ఇవ్వాలని కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇప్పటికే విజ్ఞప్తి చే సిన సంగతిని రాధామోహన్‌సింగ్‌కు చెప్పినట్లు కవిత తెలిపారు. ఈ సందర్భంగా ఓ వినతిపత్రాన్ని మంత్రికి సమర్పించినట్టు తెలిపారు. మద్దతు ధరపై అధ్యయనానికి కేంద్ర బృందాన్ని పంపిస్తామని మంత్రి హామీ ఇచ్చారని, జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుపై అధికారులతో సమావేశం జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారని కవిత చెప్పారు. న్యూక్లియర్ సీడ్ ప్రొడక్షన్ సెంటర్‌ను జగిత్యాలలో ఏర్పాటు చేయనున్నట్టు రాధామోహన్ సింగ్ తెలిపారు. ప్రతినిధి బృందంలో ఎంపీ కవితతో పాటు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, విద్యాసాగర్‌రావు, జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ నేత డాక్టర్ సంజయ్‌కుమార్, నిజామాబాద్ జిల్లాకు చెందిన పసుపు రైతులు ఉన్నారు. -
‘పసుపు’ పండింది
♦ పసుపు పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ♦ రూ. 30.81 కోట్లు అవసరం ♦ తొలి విడతలో రూ. 15 కోట్లు కేటాయింపు ♦ పార్క్ పూర్తయితే చేకూరే ప్రయోజనాలెన్నో.. ♦ హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు పసుపు సాగును ప్రోత్సహించేందుకు జిల్లాలో పసుపు పార్క్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ ప్రాంత రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పార్క్ ఏర్పాటుకు రూ. 30.81 కోట్లు అవసరం కాగా.. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 15 కోట్లను కేటాయించడంతో వేగంగా పనులు పూర్తవుతాయని ఆశిస్తున్నారు. పసుపు పార్క్ ఏర్పాటుతో జిల్లాతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పసుపు రైతులకూ ప్రయోజనం చేకూరనుంది. మోర్తాడ్ : పసుపు పంటను సాగు చేసే రైతులను ప్రోత్సహించడానికి పసుపు పార్క్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అత్యధికంగా ఆర్మూర్ ప్రాంతం లో పసుపు పంట సాగవుతుంది. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత రైతులు కొన్నేళ్లు గా డిమాండ్ చేస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పా టు ఆంశం కేంద్రంతో ముడిపడి ఉన్న అంశం. దీంతో పసుపు బోర్డు ఏర్పాటుకు ఇప్పట్లో అవకాశాలు కనిపించకపోవడంతో బోర్డు తరహా లోనే పసుపు పార్క్‌ను ఏర్పాటు చేస్తే కొంతైనా రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసం వేల్పూర్ మండలంలోని పడిగెల శివారులో 40 ఎకరాల భూమిని సేకరించింది. భూ సేకరణ కోసం రూ. 5 కోట్లను ఖర్చు చేసింది. భూమిని స్పైసిస్ పార్క్ పేరున రిజిస్టర్ చేసినప్పటికీ.. పసుపు పార్క్ ఏర్పాటు కోసం కేంద్రం నిధులు మంజూ రు చేయలేదు. అంతేకాక గతంలో ఏర్పాటు చేసిన స్పైసిస్ పార్క్‌లతోనే సరిపెట్టుకోవాలని, కొత్త వాటిని ఇప్పట్లో ఏర్పాటు చేసే పరిస్థితి లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో పసుపు పార్క్‌పై రైతులు ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. పసుపు పార్క్‌ను ఎలాగైనా ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఆయనను ఒప్పించడంలో సఫలమయ్యారు. పసుపు పార్క్‌ను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడానికి ముందుకువచ్చింది. పసుపు పార్క్ ఏర్పాటుకు రూ. 30.81 కోట్లు అవసరం కాగా.. తొలి విడతలో ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.15 కోట్లను కేటాయించింది. మిగిలిన రూ.15.81 కోట్లను 2017-18 ఆర్థిక సంవత్సరంలో కేటాయించనున్నట్లు ప్రకటించింది. మూడు జిల్లాలకు లాభం.. వేల్పూర్ మండలం పడిగెల్ వద్ద ఏర్పాటు చేయనున్న పసుపు పార్క్ వల్ల మన జిల్లాలోని రైతాంగంతోపాటు ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని పసుపు రైతులకూ ప్రయోజనం చేకూరనుంది. ఏటా మన జిల్లాలో దాదాపు 25 వేల ఎకరాల్లో పసుపు పంట సాగు అవుతుంది. బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్, ధర్పల్లి, జక్రాన్‌పల్లి, నందిపేట్, ఆర్మూర్ మండలాలతో పాటు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, కరీంనగర్ జిల్లా మెట్పల్లి, కోరుట్ల ప్రాంతాల్లో పసుపు సాగు చేస్తారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పండించే పసుపులో 25 శాతం మన జిల్లాలోనే సాగవుతుందని అంచనా. ప్రయోజనాలివి.. ♦ పసుపు పార్క్ ఏర్పాటు వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. రైతులు పండిం చిన పసుపును నిజామాబాద్, ఈరోడ్, సాంగ్లీ, బసుమతినగర్ ప్రాంతాలలో విక్రయిస్తున్నారు. పసుపు పార్క్ ఏర్పాటైతే రైతులు దూర ప్రాంతాలలోని మార్కెట్లకు వెళ్లి విక్రయించాల్సిన అవసరం ఉండదు. దూర ప్రాంతాలలోని వ్యాపారులే పసుపు పార్క్‌కు వచ్చి రైతుల నుంచి పసుపును కొనుగోలు చేస్తారు. ♦ పంట సాగుకు అవసరమైన మేలు రకం వంగడాలను ఉత్పత్తి చేయడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపే అవకాశం ఉంటుంది. పసుపును పొడి చేసి తరలించే అవకాశాలు ఉన్నాయి. ♦ పసుపు సాగులో మెలకువలపై రైతులకు అవగాహన కల్పించే చర్యలు చేపడుతారు. ♦ రైతులు సేద తీరడానికి విశ్రాంతి గది, రెస్టారెం ట్, పసుపును నిలువ చేయడానికి గిడ్డంగులు, పసుపును శుద్ధి చేయడానికి అవసరమైన యంత్రాలు ఏర్పాటు చేస్తారు. ♦ పసుపు పంటకు ధరను నిర్ణయించే అవకాశం పసుపు పార్క్ వల్ల ప్రభుత్వానికి ఏర్పడనుంది. ఇప్పటి వరకు పసుపు ధరలపై అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం ఉంది. ఒక్కోసారి పసుపు ధర దారుణంగా పడిపోతుండడంతో రైతులకు పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదు. పసుపు పార్క్ ఏర్పాటైన తరువాత ప్రభుత్వం ధరను నిర్ణయిస్తుంది. దీంతో అంతే ధరకు వ్యాపారులు లేదా ప్రభుత్వ పరిధిలోని సంస్థలు పసుపును కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీంతో రైతులు నష్టపోకుండా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం ప్రభుత్వం పసుపు పార్క్ ఏర్పాటుకు ముందుకు రావడం మంచి నిర్ణయం. పార్క్ ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. - పెద్దకాపు శ్రీనివాస్ రెడ్డి, రైతు, దోంచంద త్వరగా పనులు చేపట్టాలి పసుపు పార్క్ పనులు త్వరగా చేపట్టాలి. సకాలంలో పనులు పూర్తి చేయాలి. పనులు పూర్తి చేసి పార్క్‌ను అందుబాటులోకి తెస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. - రొక్కం మురళి, రైతు, తిమ్మాపూర్ -
గిరిజన రైతు సజీవ దహనం
పాకకు నిప్పంటుకోవడంతో దుర్ఘటన భోగి పండగ పూట డెయిరీనగర్‌లో విషాదం చింతపల్లిరూరల్: పసుపుపంట కాపలాకు వెళ్లిన గిరిజన రైతు అగ్ని ప్రమాదానికి గురై సజీవదహనమయ్యాడు. మండలంలోని డె యిరీ నగర్లో బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. చింతపల్లి పంచాయతీ శివారు డెయిరీనగర్‌లో ఉంటున్న కొర్రా లక్ష్మణరావు(35) గ్రామ సమీపంలోని గరువులో పసుపు పంటను చేపట్టాడు. దానికి కాపలాగా ఉండేందుకు అక్కడే చిన్న పాకను వేసుకున్నాడు. రోజూ భార్య బిమలతో కలిసి కొద్దికొద్దిగా పంటను సేకరించి ఉడకబెట్టి ఆరబెడుతున్నాడు. రోజూ మాదిరి మంగళవారం రాత్రి దంపతులు చలికి చిన్న మంట వేసుకుని ఇద్దరూ పాకలో నిద్రపోయారు. బుధవారం వేకువజామున అది పెద్దదైంది. అగ్నికీలలు ఎగిసిపడి పాకను చుట్టుముట్టాయి. భార్య బిమలమ్మ మేలుకొని కొద్దిపాటి గాయాలతో బయటపడింది. లక్ష్మణరావు అగ్నికీలల్లో చిక్కుకుపోయాడు. తప్పించుకునే అవకాశం లేక సజీవ దహనమయ్యాడు. బిమలమ్మ ఫిర్యాదు తో ఎస్ఐ తారకేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పండగపూట సంఘటనతో డెయిరీనగర్‌లో విషాదం అలుముకుంది. -
అంగట్లో అద్దెకు ఎడ్లు
బాల్కొండ, న్యూస్‌లైన్ : ఇప్పుడు ఎడ్లు కూడా అంగట్లో అద్దెకు దొరుకుతున్నాయి. ఖరీప్ సీజన్ ముంచుకు వస్తుండటంతో రైతులు విత్తనాలు వేసేందుకు వీటిని ముందస్తుగా అద్దెకు తీసుకుంటున్నారు. మండల కేంద్రంలో గురువారం జరిగిన సంతలో చాలామంది రైతులు ఎడ్లను కొనుగోలు చేయకుండా అద్దెపైనే తీసుకెళ్లారు. గత ఏడాది నెలవారీగా కిరాయిపై ఇచ్చేవారు. ఈ ఏడాది నుంచి సంవత్సరం లెక్కన గుత్తాగా అద్దెకు ఇస్తున్నారు. ఇప్పటి నుంచి ఖరీప్ విత్తనాలు వేయడం పూర్తయ్యే వరకు ఎడ్లను తీసుకెళ్తే 10 వేలు చెల్లించాలి. ఎడ్లు మార్కెట్లో విక్రయిస్తే ఎంత ధర పలుకుతుందో అంత సొమ్మును వ్యాపారి వద్ద డిపాజిట్ ఉంచాలని నిబంధన పెడుతున్నారు. పశుగ్రాసం కొరతతో పశుగ్రాసం కొరత వల్ల సన్న, చిన్నకారు రైతులు తమ పశువులను సాకటం కష్టమవ్వడంతో ముందుగానే విక్రయించుకున్నారు. ప్పుడు వ్యవసాయ పనులు దాదాపు యంత్రాలతోనే చేపడుతున్నారు. రైతు ఇంట సిరులు కురిపించె పసుపు పంటను విత్తాలంటే తప్పనిసరిగా రైతు నాగలి పట్టి దుక్కి దున్నాల్సిందే. ఇందుకోసం రైతులు ఎడ్లను అద్దెకు తీసుకుంటున్నారు. అద్దెకు తీసుకుపోయిన ఎడ్ల మేత, అవి ఉండటానికి నివాసం అంతా రైతులే ఏర్పాటు చేసుకోవాలి. అంగట్లో నుంచి పశువులను తీసుకెళ్లేప్పుడు ఎట్లా ఉన్నాయో.. అప్పగించేప్పుడు అట్లాగే ఉండాలి. వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే డిపాజిట్ తిరిగి ఇవ్వరు. వ్యాపారులు ఇన్ని నిబంధనలు పెట్టినా రైతులు ఎడ్లను కిరాయికి తీసుకుపోతున్నారు. ఎడ్లను గుత్తగా అద్దెకు తీసుకోవాలని నిబంధన లేదు. అవసర నిమిత్తం ఎనిమిది రోజుల నుంచి నెలరోజుల వరకు తీసుకెళ్లవచ్చు. పసుపు పంట సాధారణంగా జూన్ మధ్యలో నుంచి విత్తుతారు. ఒకే రైతుకు ఎనిమిది రోజుల పాటు పసుపు విత్తె అవసరం ఉండదు. కనుక ముగ్గురు నుంచి నలుగురు రైతులు కలిసి రెండు ఎడ్లను అద్దెకు తీసుకుం టున్నారు. యంత్రాలను, వాహనాలను అద్దెకు ఇచ్చినట్లు.. మూగ జీవాలను సైతం కిరాయి ఇవ్వడం విచారకరమే. ఒకప్పుడు పాడితో వ్యవసాయాన్ని చేసుకునే రైతు ఇప్పుడు కిరాయి పశువులతో సాగుచే యడం బాధాకరమే.