మోర్తాడ్(బాల్కొండ): రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి, తొమ్మిది నెలలు కష్టపడి పంట పండిస్తున్న పసుపు రైతుకు కన్నీరే మిగులుతోంది.. పంట ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ ఉన్నా ధర క్రమంగా పతనమవుతోంది. అదేం విచిత్రమో కానీ, పంట సాగు ఖర్చు ఏటేటా పెరుగుతుంటే, ధర మాత్రం దిగజారుతుండడం రైతాంగాన్ని కలవరపెడుతోంది. పదేళ్ల క్రితం పసుపు క్వింటాల్ ధర రూ.16 వేలు ఉంటే, ప్రస్తుతం రూ.6 వేలకు మించడం లేదు. ప్రభుత్వాల నుంచి ‘మద్దతు’ లేకపోవడంతో రైతులు ప్రతి సంవత్సరం నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులంతా ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం మోర్తాడ్‌లో పసుపు రైతుల ఆవేదన సభ నిర్వహించనున్నారు.
పడిపోయిన ధర
పసుపు సాగు కోసం రైతులు పెడుతున్న పెట్టుబడులు ఏటేటా పెరుగుతున్నా పంటకు ఆశించిన ధర లభించక రైతులు నష్టాలను మూటగట్టుకుంటున్నారు. పదేళ్ల క్రితం అంటే 2009లో పసుపు ధర రూ.12 వేల నుంచి రూ.16 వేల వరకు పలికింది. ప్రస్తుతం మార్కెట్‌లో పసుపు ధర కనిష్టంగా రూ.4 వేలు, గరిష్టంగా రూ.6 వేలు పలుకుతోంది. ఈ పదేళ్లలో పంట సాగు వ్యయం రెట్టింపు కాగా, అదే స్థాయిలో పెరగాల్సిన ధర 60 శాతం మేర దిగజారి పోవడం విశేషం. ఎకరా విస్తీర్ణంలో పసుపు సాగుకు రైతులకు రూ.1.20 లక్షలకు పైగా పెట్టుబడి పెడుతున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం రైతులకు పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదు సరికదా వారు చేస్తున్న శ్రమకు ఫలితం లభించడం లేదు.
వైఎస్ హయాంలో మద్దతు..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పసుపు రైతులు దండిగా లాభాలు ఆర్జించారు. నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు వైఎస్ అప్పట్లో ఎంతో చొరవ తీసుకున్నారు. పసుపు పంటను ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా కొనుగోలు చేయించిన, పంటకు మద్దతు ధర ప్రకటించిన మొదటి, చివరి ముఖ్యమంత్రి ఆయనే కావడం విశేషం. మార్క్‌ఫెడ్ ద్వారా పసుపును కొనుగోలు చేయించిన వైఎస్ ప్రభుత్వం.. అప్పట్లో క్వింటాల్‌కు రూ.6 వేల చొప్పున మద్దతు ధర ప్రకటించింది. దీంతో వ్యాపారులు పంట కొనుగోలుకు పోటీ పడి ధరను పెంచడంతో రైతులు భారీగా లాభాలు ఆర్జించారు. ఆయన మరణం తర్వాత మళ్లీ పాత పరిస్థితులే పునరావృతమయ్యాయి. అప్పట్లో రూ.16 వేలు పెలికిన ధర క్రమంగా పతనమైంది. దీంతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పసుపు రైతుల కోసం ఉద్యమించారు. ఆర్మూర్‌లో 48 గంటల పాటు దీక్ష చేయడంతో అప్పటి ప్రభుత్వం కొంత వరకు స్పందించినా, ఆ తర్వాత ధర పతనం కొనసాగింది.
డిమాండ్ ఉన్నా ధర లేదు..
వాస్తవానికి పసుపు పంటకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. పసుపు ఉత్పత్తులను వివిధ రకాల ఔషధాలు, కాస్మోటిక్స్, ఆహార పదార్థాల్లో వినియోగిస్తుంటారు. దీంతో పసుపు పంటకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. పసుపు పంట దేశ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లోనే పండిస్తారు. అందులో మన నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కువగా పంట సాగవుతుంది. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో పసుపు ఎక్కువగా పండిస్తుంటారు. అయితే, మార్కెట్‌లో పసుపు ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా రైతుకు మాత్రం ధర దక్కడం లేదు. ఎకరా విస్తీర్ణంలో సాగుకు రూ.1.20 లక్షలకు పైగా ఖర్చు చేస్తుంటే ఆ పెట్టుబడి కూడా రావడం లేదు. పసుపు ధర క్వింటాల్‌కు కనీసం రూ.10 వేలు ఉన్నా లాభాలు రాకపోయినా పెట్టుబడితో పాటు శ్రమకు ఫలితం దక్కుతుందని రైతులు పేర్కొంటున్నారు. కానీ, ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు.
సర్కారు స్పందించాలి..
తొమ్మిది నెలలు కష్టపడి పండిస్తే ఏటా నష్టాలే మిగులుతున్నాయి. ప్రభుత్వాలేమో పట్టించుకోవడం లేదు. పసుపు రైతుల ఆవేదన సభతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. పసుపు పంటను వాణిజ్య పంటగా చూడటమే కాదు ఈ పంటను సాగు చేస్తున్న రైతులు ధర లేక పోవడంతో ఎంత మేర నష్టపోతున్నారో గుర్తించాల్సి అవసరం ప్రభుత్వంపై ఉంది. మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. – సుంకెట్ అన్వేష్‌ఏఊరెడ్డి, పసుపు రైతుల ఉద్యమ నాయకుడు
నష్టాలే వస్తున్నాయి..
పసుపు పంటను సాగు చేస్తున్న రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. విత్తనం ఖర్చు, ఎరువులు, కూలీలకు ఇచ్చే కూలి, పసుపు తవ్వడానికి కూలీలకు చెల్లించే సొమ్మును లెక్క వేస్తే రైతులకు రూపాయి లాభం కూడా రావడం లేదు. ప్రభుత్వం స్పందించాల్సి అవసరం ఉంది. – కొప్పుల రాజశేఖర్, రైతు, మోర్తాడ్
Comments
Please login to add a commentAdd a comment