Minimal price
-
‘మద్దతు’ కోసం మరో పోరు
మోర్తాడ్(బాల్కొండ): మద్దతు ధర కోసం అన్నదాతలు మరో పోరుకు సిద్ధమవుతున్నారు. డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. గత పదిహేను రోజుల నుంచి ఉద్యమిస్తున్నా సర్కారు స్పందించక పోవడంతో అన్నదాలు మరోసారి రోడ్డెక్కేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎర్రజొన్నలు, పసుపు పంటలను కొనుగోలు చేసే ఆంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ఈనెల 25న చలో ఆర్మూర్‌కు రైతు ఉద్యమ నాయకులు పిలుపునిచ్చారు. సర్కారును కదిలించేందుకు ఈసారి ఇంటికి ఇద్దరు చొప్పున తరలి రావాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పోరుబాట ఇప్పటికే ఆర్మూర్‌లో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రైతులు మూడు విడతలుగా శాంతియుత ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ రహదారుల దిగ్బంధనంతో ప్రభుత్వం స్పందించ లేదని భావిస్తున్న రైతులు మరోసారి ఆర్మూర్‌లో సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించారు. కలెక్టర్‌తో జరిపిన చర్చలు ఫలించక పోవడంతో రైతులు ఉద్యమ బాటనే ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ఆర్మూర్‌లో ఈనెల 25న నిర్వహించే ఆందోళన కార్యక్రమానికి మహిళా రైతులను ఎక్కువ మందిని తరలించాలని భావిస్తున్నారు. ఎర్రజొన్నలు, పసుపు పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉన్నా వ్యాపారులు తమ సంపాదనను పెంచుకోవడానికి కనీస ధర చెల్లించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం గతంలో ఎర్రజొన్నలను కొనుగోలు చేసినట్లే ఈ సారి కూడా కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, పసుపు పంటకు కూడా రూ.15వేల మద్దతు ధర ప్రకటించాలని పట్టు బడుతున్నారు. స్పందించని సర్కారు.. అయితే, మార్క్‌ఫెడ్ ద్వారా గతంలో ఎర్రజొన్నలను కొనుగోలు చేయించగా సంస్థకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఈసారి ఎర్రజొన్నలను కొనుగోలు చేసే అవకాశం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. అలాగే, పసుపు పంటకు మద్దతు ధర, కొనుగోలు చేసే ఆంశాలు రెండు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని, అందువల్ల పసుపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని అధికారులు వివరిస్తున్నారు. వాణిజ్య పంటల విషయంలో కేంద్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంటున్నారు. అందువల్ల ఎర్రజొన్నలు, పసుపు పంటలను కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో ఆగ్రహిస్తున్న రైతులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఎర్రజొన్నలు, పసుపు పంటలను పండించే ప్రతి రైతు కుటుంబం నుంచి ఇద్దరు చొప్పున ఆర్మూర్‌లో నిర్వహించనున్న ఆందోళనకు వచ్చేలా రైతు నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలలో పెద్ద మొత్తంలో ఎర్రజొన్నలు, పసుపు పంటలను సాగు చేస్తున్నారు. ఆందోళనలకు వెళ్లొద్దని ఒత్తిళ్లు ఎర్రజొన్నలు, పసుపు పంటల కొనుగోలు విషయంలో రైతులు చేపట్టిన ఉద్యమం అధికార పార్టీ మెడకు చుట్టుకుంటోంది. శాసనసభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు ఏకపక్షంగా పట్టం కట్టారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రెండు నెలల్లోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమించడం అధికార పార్టీ నాయకులను కలవరానికి గురి చేస్తోంది. దీంతో రైతులను ఆర్మూర్‌కు వెళ్లకుండా నిలవరించడానికి కొందరు టీఆర్ఎస్ నాయకులు రంగంలోకి దిగారు. తమకు పట్టు ఉన్న సంఘాల్లో రైతులతో సమావేశాలను నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించ వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు. అయితే, రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా నిర్వహిస్తున్న ఉద్యమానికి టీఆర్ఎస్ నాయకులు అడ్డుపడటం బాలేదని రైతులు ఆక్షేపిస్తున్నారు. కొన్నిచోట్ల నాయకులు, రైతుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తగా నేతలు వెనక్కి తగ్గడంతో వివాదం సమసి పోయింది. పోలీసుల కౌన్సెలింగ్.. చలో ఆర్మూర్‌కు రైతులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆర్మూర్‌కు భారీ సంఖ్యలో తరలి రాకుండా ఉండటానికి పోలీసులు రైతు సంఘాలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. రైతులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. రైతులు ఆర్మూర్‌కు తరలి రాకుండా చూసే బాధ్యతను ప్రభుత్వం పోలీసు శాఖకు అప్పగించడంతో వివిధ మండలాల ఎస్సైలు, ఇతర ఉన్నతాధికారులు రైతులతో సమావేశమవుతున్నారు. రైతులు ఎక్కువ సంఖ్యలో తరలి వెళితే తమకు ఇబ్బంది అని, ఆందోళన కార్యక్రమాలకు వెళ్లకూడదని పోలీసులు చెప్పడం గమనార్హం. అయితే, తాము మాత్రం శాంతియుతంగానే ఉద్యమాన్ని నిర్వహిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు. పార్టీలకు సంబంధం లేకుండానే.. పసుపు, ఎర్రజొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు మేలు చేయాలని ఉద్యమిస్తున్నాం. ఈ ఉద్యమానికి, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. రాజకీయ పార్టీల రంగు పులిమి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే రైతులే గుణపాఠం చెబుతారు. రైతులు శాంతియుతంగా పోరాటం చేస్తే అడ్డుకోవాలని పోలీసులు చూస్తున్నారు. మేము శాంతియుతంగానే ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం. పోలీసులు మాకు సహకరించాలి. – అన్వేశ్‌రెడ్డి, రైతు ఉద్యమ నాయకుడు -
జాతీయ రహదారి దిగ్బంధం
ఆర్మూర్/పెర్కిట్: రాష్ట్ర ప్రభుత్వమే ఎర్రజొన్నలు, పసుపు పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలంటూ రైతులు శనివారం 44వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఆర్మూర్ మండలం పెర్కిట్ శివారులోని మహిళా ప్రాంగణం ఎదురుగా జాతీయ రహదారిపై బైఠాయించి మధ్యాహ్నం వంటావార్పు నిర్వహించారు. రాత్రి 9 గంటల వరకు రహదారుల దిగ్భందం కొనసాగింది. మరో వైపు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల్లో ఉన్న రైతు నాయకులను శుక్రవారం అర్ధరాత్రి వారి ఇళ్లలోనే అరెస్టులు చేసి సమీపంలోని ఇతర మండలాల పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయినా రైతులంతా ఏకమై రహదారుల దిగ్బంధాన్ని శాంతియుతంగా నిర్వహించారు. ఆందోళన నేపథ్యంలో నిజామాబాద్ సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది పోలీసులు బలగాలు శుక్రవారమే ఆర్మూర్‌కు చేరుకున్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మామిడిపల్లి, పెర్కిట్ కూడళ్లలో, జాతీయ రహదారి కూడళ్లలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు శనివారం ఉదయం నుంచే రైతులు పెద్ద ఎత్తున పెర్కిట్ శివారులోని జాతీయ రహదారి వద్దకు చేరుకున్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 14 గ్రామాల్లో రెండు రోజుల పాటు విధించిన 144 సెక్షన్‌ను లెక్క చేయకుండా రైతులు గ్రామాల నుంచి కార్లు, మోటార్ సైకిళ్లపై తరలివచ్చారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మందికి పైగా రైతులు చేరుకొని జాతీయ రహదారిపై భైఠాయించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ ఎర్రజొన్న పంటకు క్వింటాలుకు రూ. 3,500 రూపాయలు, పసుపునకు క్వింటాలుకు రూ. వేల గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తమ దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు అరెస్టు చేసిన రైతు నాయకులను విడుదల చేయాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 వరకు జాతీయ రహదారులపైనే భైఠాయించారు. మధ్యాహ్నం గ్రామాల వారీగా రైతులు వంట పాత్రలను తెచ్చుకొని రహదారిపైనే పొయ్యిలను ఏర్పాటు చేసుకొని వంటా వార్పు నిర్వహించారు. అనంతరం అక్కడే సహపంక్తి భోజనాలు చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేంత వరకు కదిలేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్నారు. ఈ నెల 7న, 12న ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తాలోని 63వ నంబర్ జాతీయ రహదారిపై భైఠాయించి ధర్నా నిర్వహించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. రాత్రి 9 గంటలకు ఆందోళన విరమించారు. సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించాలని నిర్ణయించారు. ఆందోళన నేపథ్యంలో పోలీసులు ఆ మార్గం గుండా వచ్చే వాహనాలను ఉదయం నుంచే ఇతర మార్గాల గుండా మళ్లించి ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసుల భారీ బందోబస్తు 2008లో ఎర్రజొన్న రైతుల ఉద్యమం హింసాత్మకంగా మారిన పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో భారీ పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహించారు. సిద్దిపేట సీపీ, సంగారెడ్డి, నిర్మల్ ఎస్పీలతో పాటు ఆర్మూర్ ఏసీపీ రాములు, పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సుమారు వెయ్యి మంది పోలీసు బలగాలు బందోబస్తు నిర్వహించాయి. శనివారం ఉదయం నుంచే భారీగా బలగాలను రహదారికి ఇరువైపులా మోహరించారు. రహదారుల దిగ్భందా న్ని ప్రారంభించే ముందు రైతులతో సీపీ కార్తికేయ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరసన తెలపాలని సూచించా రు. రాస్తారోకోలు, రహదారుల దిగ్బంధం చేయడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా రైతులు దిగ్భందానికి పూనుకున్నారు. సాయంత్రం సమయంలో ఆర్మూర్ ఏసీపీ రాములు సైతం రైతులతో మాట్లాడుతూ రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి రైతు నాయకులతో కమిటీలను వేసుకోవాలని సూచించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఇలాంటి కార్యక్రమాలను చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అయినా రైతులు అంగీకరించకుండా రాత్రి వరకు కూడా రహదారిపై భైఠాయించారు. దీక్ష చేస్తున్న రైతులు సహనం కోల్పోయిన ప్రతీసారి పోలీసులు వారిని బుజ్జగిస్తూ శాంతి యుతంగా ఆందోళన చేయడానికి సహకరించారు అమరవీరులకు నివాళి.. ఇటీవల జమ్ము కాశ్మీర్లో ఉగ్రదాడిలో అమరులైన 44 మంది వీర జవాన్ల ఆత్మలకు శాంతి కలగాలని కోరుతూ రైతులు రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం జై జవాన్, జై కిసాన్ నినాదాలు చేస్తూ రహదారి దిగ్భందాన్ని ప్రారంభించారు. ముందస్తు అరెస్టులు.. జాతీయ రహదారి దిగ్బంధం నేపథ్యంలో పోలీసులు పలువురు రైతు నాయకులను శుక్రవారం రాత్రి ముందస్తు అరెస్టులు చేశారు. నాయకుల ఇళ్లకు వెళ్లి అరెస్టు పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో దేగాం యాదగౌడ్, ఇటెం జీవన్, మంథని నవీన్‌రెడ్డి తదితరులున్నారు. పోలీస్స్టేషన్లకు రైతు నాయకుల తరలింపు మోర్తాడ్: ఎర్రజొన్నలు, పసుపు పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఉద్యమబాట పట్టిన రైతాంగాన్ని జాతీయ రహదారుల వైపు వెళ్లకుండా నియంత్రించడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. అయితే తాము శాంతియుతంగానే ఉద్యమాన్ని నిర్వహిస్తామని రైతులు పోలీసులతో స్పష్టం చేశారు. తమ మాట కాదని ఉద్యమానికి అండగా నిలిస్తే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు రైతు సంఘాల నాయకులను హెచ్చరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనెల 12న ఆర్మూర్‌లో రెండోసారి ఆందోళన నిర్వహించిన రైతులు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో శనివారం జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. రెండు జాతీయ రహదారులపై వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసన తెలిసేలా చేయాలని రైతులు భావించారు. అయితే శనివారం నాటి ఆందోళన కార్యక్రమాలకు రైతులు ఎక్కువ సంఖ్యలో తరలిపోకుండా చూడడానికి పోలీసులు రెండు మూడు రోజుల నుంచి రైతు సంఘాలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తే తాము చూస్తు ఊరుకోమని పోలీసులు రైతు సంఘాల నాయకులతో స్పష్టం చేశారు. తమపై తీవ్ర ఒత్తిడి ఉందని ఎట్టి పరిస్థితుల్లో రైతులు జాతీయ రహదారుల దిగ్బంధనానికి తరలివెళ్లవద్దని పోలీసులు చెప్పారు. అంతేకాక ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నాయకులను గుర్తించి నోటీసులు కూడా పోలీసులు జారీ చేశారు. తమ ఆదేశాలను ధిక్కరించి జాతీయ రహదారుల దిగ్బంధనానికి తరలివెళితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. గతంలో మాదిరిగానే పోలీసులు శనివారం పల్లెలకు చేరుకుని రైతు సంఘాల ముఖ్య నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కమ్మర్పల్లి, ఏర్గట్ల, మోర్తాడ్, మెండోరా, ముప్కాల్, బాల్కొండ, వేల్పూర్ తదితర మండలాల్లోని నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి జిల్లా సరిహద్దులోని రెంజల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయినప్పటికీ రైతులు ఎలాంటి బెదురు లేకుండా తమ ఉద్యమాన్ని కొనసాగించడానికి జాతీయ రహదారుల దిగ్బంధనానికి తరలివెళ్లారు. కొందరు రైతులు బైక్‌లపై వెళ్లగా, మరి కొందరు రైతులు డీసీఎం వాహనాల్లో తరలివెళ్లారు. పాలెం రైతుల వాహనాన్ని పోలీసులు మోర్తాడ్‌లో అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రైతుల ఉద్యమాన్ని నియంత్రించడం పోలీసులకు సవాల్‌గా మారింది. -
రోడ్డెక్కిన రైతన్న
ఆర్మూర్/పెర్కిట్: ప్రభుత్వాల ‘మద్దతు’ కోసం రైతన్నలు రోడ్డెక్కారు.. గిట్టుబాటు ధరలు ప్రకటించాలని నాలుగు గంటల పాటు గురువారం 63వ జాతీయ రహదారిపై బైఠాయించారు. పసుపు, ఎర్రజొన్నలకు మద్దతు ధర కల్పించడంతో పాటు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి చౌరస్తాలో నిరసనకు దిగారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆత్మగౌరవ ర్యాలీ కార్యక్రమానికి ఆర్మూర్ డివిజన్లోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలి వచ్చి రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం వచ్చి తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ ఆందోళన విరమించబోమని భీష్మించారు. ఒక దశలో రాస్తారోకో చేసేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత తలెత్తింది. చివరకు పోలీసులు నచ్చజెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించుకుని శాంతియుత నిరసన ప్రదర్శన చేపట్టారు. నాలుగు గంటల పాటు బైఠాయింపు.. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో మామిడిపల్లి చౌరస్తాకు తరలి వచ్చిన రైతులు ఉదయం 11 గంటలకు హైవేపై బైఠాయించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రైతుల నిరసన కొనసాగింది. గిట్టుబాటు ధరలు ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించారు. వన్ వే నుంచి వాహనాలను మళ్లించారు. డిమాండ్లు నెరవేర్చాల్సిందే.. రైతులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహిస్తుండటంతో జిల్లా వ్యవసాయాధికారి గోవిందు, ఉద్యాన శాఖ జిల్లా అధికారి నర్సింగ్‌దాస్, మార్కెటింగ్ ఏడీ రియాజ్, ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ రాణాప్రతాప్ సింగ్ అక్కడకు చేరుకొని రైతు నాయకులతో మాట్లాడారు. మీ డిమాండ్లు తెలియజేస్తే కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారు. దీంతో ఐక్య వేదిక నాయకులు వి.ప్రభాకర్, అన్వేష్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, దేవరాం, చిన్నారెడ్డి తదితరులు మాట్లాడుతూ పసుపు పంటకు రూ.15 వేలు, ఎర్రజొన్నకు రూ.3,500 చొప్పున గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దళారులకు అధికారుల వత్తాసు మహారాష్ట్రలోని సాంగ్లి మార్కెట్లో పసుపు ధర రూ.9 వేలు పలుకుతుంటే, నిజామాబాద్ మార్కెట్లో రూ.4–5 వేల లోపు ధర పలకడం వెనక ఆంతర్యమేమిటని రైతు నాయకులు ప్రశ్నించారు. అధికారులు దళారులకు, వ్యాపారులకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఈనామ్‌లో పసుపు పంట నాణ్యత వివరాలను అధికారులు నమోదు చేయకపోవడంతో దేశ వ్యాప్తంగా ఉన్న వ్యాపారులు టెండర్లో పాల్గొనడం లేదన్నారు. ఈనామ్‌లో అధికారులే రూ.4 వేల నుంచి ధర టెండర్ కోట్ చేయడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత తక్కువ కోట్ చేసే అధికారం వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. పలుమార్లు రైతులను మోసం చేసిన వ్యాపారులకే తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఇచ్చిన అధికారులు మళ్లీ అదే పునారవృతమైతే బాధ్యత వహిస్తారా? అన్ని ప్రశ్నించారు. ఈనామ్‌లో పసుపు ధర రూ.10 వేల నుంచి టెండర్ కోట్ చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర నిర్ణయించే సమయంలో రైతు సమన్వయ సమితి సభ్యులే కాకుండా రైతు కమిటీల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. సర్కారుకు అల్టిమేటం.. ప్రభుత్వం రైతులకు తోడ్పాటునందించాలని, స్వామినాథన్ కమిషన్ సూచనల మేరకు పంటకు మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు చేయాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు. రూ.2 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని డి మాండ్ చేశారు. అదేవిధంగా రైతులకు హెల్త్ కా ర్డులు అందజేసి, ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రైతుల డిమాండ్లపై అధికారుల నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. దీంతో తమ డిమాండ్లు సా ధించుకొనే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. మీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, కలెక్టర్‌తోనూ మాట్లాడతామని, ఆందోళన విరమించాలని అధికారులు, పోలీసు లు నచ్చజెప్పారు. అయితే, ఈ నెల 11వ తేదీ వర కు తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే 12వ తేదీన కుటుంబానికి ఇద్దరు చొప్పున ఆర్మూర్‌కు తరలి వచ్చి భారీ ఆందోళన చేపడతామని రైతు నాయకులు హెచ్చరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్.. గతానుభవాల నేపథ్యంలో పోలీసులు రైతుల ఆందోళన విషయంలో శాంతియుతంగా వ్యవహరించారు. 2008లో ఎర్రజొన్న రైతులు చేపట్టిన ఆందోళన పోలీస్ శాఖ వైఫల్యం కారణంగా హింసాత్మకంగా మారి కాల్పులకు దారి తీసింది. అయితే, తాజాగా పోలీసులు రైతులతో శాంతియుతంగా వ్యవహరించారు. సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ శ్రీధర్‌రెడ్డి, ఆర్మూర్ ఏసీపీ రాములు, సీఐలు, ఆర్ ఎస్సైలు, సివిల్ ఎస్సైలు పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు. రైతులు సంయమనం కోల్పోయిన ప్రతీసారి పోలీసులు వారిని బుజ్జగిస్తూ శాంతిభద్రతలు అదుపు తప్పకుండా చూశారు. -
పసిడి పంటకు ధర కరువు
మోర్తాడ్(బాల్కొండ): రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి, తొమ్మిది నెలలు కష్టపడి పంట పండిస్తున్న పసుపు రైతుకు కన్నీరే మిగులుతోంది.. పంట ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉన్నా ధర క్రమంగా పతనమవుతోంది. అదేం విచిత్రమో కానీ, పంట సాగు ఖర్చు ఏటేటా పెరుగుతుంటే, ధర మాత్రం దిగజారుతుండడం రైతాంగాన్ని కలవరపెడుతోంది. పదేళ్ల క్రితం పసుపు క్వింటాల్ ధర రూ.16 వేలు ఉంటే, ప్రస్తుతం రూ.6 వేలకు మించడం లేదు. ప్రభుత్వాల నుంచి ‘మద్దతు’ లేకపోవడంతో రైతులు ప్రతి సంవత్సరం నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులంతా ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం మోర్తాడ్‌లో పసుపు రైతుల ఆవేదన సభ నిర్వహించనున్నారు. పడిపోయిన ధర పసుపు సాగు కోసం రైతులు పెడుతున్న పెట్టుబడులు ఏటేటా పెరుగుతున్నా పంటకు ఆశించిన ధర లభించక రైతులు నష్టాలను మూటగట్టుకుంటున్నారు. పదేళ్ల క్రితం అంటే 2009లో పసుపు ధర రూ.12 వేల నుంచి రూ.16 వేల వరకు పలికింది. ప్రస్తుతం మార్కెట్లో పసుపు ధర కనిష్టంగా రూ.4 వేలు, గరిష్టంగా రూ.6 వేలు పలుకుతోంది. ఈ పదేళ్లలో పంట సాగు వ్యయం రెట్టింపు కాగా, అదే స్థాయిలో పెరగాల్సిన ధర 60 శాతం మేర దిగజారి పోవడం విశేషం. ఎకరా విస్తీర్ణంలో పసుపు సాగుకు రైతులకు రూ.1.20 లక్షలకు పైగా పెట్టుబడి పెడుతున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం రైతులకు పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదు సరికదా వారు చేస్తున్న శ్రమకు ఫలితం లభించడం లేదు. వైఎస్ హయాంలో మద్దతు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పసుపు రైతులు దండిగా లాభాలు ఆర్జించారు. నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు వైఎస్ అప్పట్లో ఎంతో చొరవ తీసుకున్నారు. పసుపు పంటను ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా కొనుగోలు చేయించిన, పంటకు మద్దతు ధర ప్రకటించిన మొదటి, చివరి ముఖ్యమంత్రి ఆయనే కావడం విశేషం. మార్క్‌ఫెడ్ ద్వారా పసుపును కొనుగోలు చేయించిన వైఎస్ ప్రభుత్వం.. అప్పట్లో క్వింటాల్‌కు రూ.6 వేల చొప్పున మద్దతు ధర ప్రకటించింది. దీంతో వ్యాపారులు పంట కొనుగోలుకు పోటీ పడి ధరను పెంచడంతో రైతులు భారీగా లాభాలు ఆర్జించారు. ఆయన మరణం తర్వాత మళ్లీ పాత పరిస్థితులే పునరావృతమయ్యాయి. అప్పట్లో రూ.16 వేలు పెలికిన ధర క్రమంగా పతనమైంది. దీంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పసుపు రైతుల కోసం ఉద్యమించారు. ఆర్మూర్‌లో 48 గంటల పాటు దీక్ష చేయడంతో అప్పటి ప్రభుత్వం కొంత వరకు స్పందించినా, ఆ తర్వాత ధర పతనం కొనసాగింది. డిమాండ్ ఉన్నా ధర లేదు.. వాస్తవానికి పసుపు పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పసుపు ఉత్పత్తులను వివిధ రకాల ఔషధాలు, కాస్మోటిక్స్, ఆహార పదార్థాల్లో వినియోగిస్తుంటారు. దీంతో పసుపు పంటకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. పసుపు పంట దేశ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లోనే పండిస్తారు. అందులో మన నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కువగా పంట సాగవుతుంది. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో పసుపు ఎక్కువగా పండిస్తుంటారు. అయితే, మార్కెట్లో పసుపు ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా రైతుకు మాత్రం ధర దక్కడం లేదు. ఎకరా విస్తీర్ణంలో సాగుకు రూ.1.20 లక్షలకు పైగా ఖర్చు చేస్తుంటే ఆ పెట్టుబడి కూడా రావడం లేదు. పసుపు ధర క్వింటాల్‌కు కనీసం రూ.10 వేలు ఉన్నా లాభాలు రాకపోయినా పెట్టుబడితో పాటు శ్రమకు ఫలితం దక్కుతుందని రైతులు పేర్కొంటున్నారు. కానీ, ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు. సర్కారు స్పందించాలి.. తొమ్మిది నెలలు కష్టపడి పండిస్తే ఏటా నష్టాలే మిగులుతున్నాయి. ప్రభుత్వాలేమో పట్టించుకోవడం లేదు. పసుపు రైతుల ఆవేదన సభతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. పసుపు పంటను వాణిజ్య పంటగా చూడటమే కాదు ఈ పంటను సాగు చేస్తున్న రైతులు ధర లేక పోవడంతో ఎంత మేర నష్టపోతున్నారో గుర్తించాల్సి అవసరం ప్రభుత్వంపై ఉంది. మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. – సుంకెట్ అన్వేష్ఏఊరెడ్డి, పసుపు రైతుల ఉద్యమ నాయకుడు నష్టాలే వస్తున్నాయి.. పసుపు పంటను సాగు చేస్తున్న రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. విత్తనం ఖర్చు, ఎరువులు, కూలీలకు ఇచ్చే కూలి, పసుపు తవ్వడానికి కూలీలకు చెల్లించే సొమ్మును లెక్క వేస్తే రైతులకు రూపాయి లాభం కూడా రావడం లేదు. ప్రభుత్వం స్పందించాల్సి అవసరం ఉంది. – కొప్పుల రాజశేఖర్, రైతు, మోర్తాడ్ -
చేదెక్కుతున్న సాగు
అనూహ్య ఉత్పాతాలు అన్నదాత ఉసురు తీస్తున్నాయి. కష్టనష్టాల సుడిగుండాల పాలబడి సేద్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చెరకు రైతు బతుకు చేదెక్కుతోంది. హుద్‌హుద్ కక్కిన విషంతో జీవనం ఆర్థికంగా దుర్భరమైంది. పెట్టుబడి వాయువేగానికి కొట్టుకుపోయింది. అందివచ్చిన పంటతో అప్పులు తీర్చేద్దామని ఆశించిన అన్నదాతకు చేతికి చిల్లిగవ్వరాని దుస్థితి. జిల్లాలో ఏ చెరకు రైతును కదిపినా కన్నీటి వెతలే. మారిన బతుకు చిత్రం చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఇలా అయితే కష్టమే నాది యలమంచిలి మండలం సోమలింగపాలెం. రెండు ఎకరాల్లో చెరకు పంట చేపట్టాను. హుద్‌హుద్ తుఫాన్‌కు ధ్వంసమైంది. మూడేళ్లుగా తుఫాన్లు, భారీ వర్షాలకు చెరకు పంట నష్టపోతున్నాం. పెట్టుబడులు సైతం తుడిచిపెట్టుకుపోతున్నాయి. గత నెల 12న సంభవించిన హుద్‌హుద్ కారణంగా పంటంతా కుళ్లిపోతోంది. ఇలా అయితే చెరకు సాగు కష్టమే. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లింపులో నిబంధనల పేరుతో తీవ్ర జాప్యం చేస్తోంది. - యల్లపు వెంకట్, చెరకు రైతు సాక్షి, విశాఖపట్నం: చెరకు సాగు కలిసిరావడంలేదు. ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఇంటిల్లిపాదీ రెక్కలు ముక్కలు చేసుకున్నాగిట్టుబాటు కావడం లేదు. దానికితోడు ఉత్పాతాలు నట్టేట ముంచుతున్నాయి. జిల్లాలోని నాలుగు చక్కెర మిల్లులు మద్దతు ధరను చెల్లించడం లేదు. తుఫాన్‌కు తీవ్రంగా నష్టపోయిన యాజమాన్యాలు ప్రభుత్వం ప్రకటించిన టన్నుకు రూ.2260లు కనీసపు ధరను ఇచ్చే పరిస్థితిలో లేవు. జిల్లాలో చెరకు సాగు సాధారణ విస్తీర్ణం 40,353 హెక్టార్లు. ఈ ఏడాది 37,435 హెక్టార్లలో పంటను చేపట్టారు. ఇందులో 50శాతం పంట తుఫాన్‌కు ధ్వంసమైంది. పెట్టుబడులు పెరిగిపోవడంతో ఇప్పటికే ఏటేటా చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఎకరం భూమి ఐదు దుక్కులకు రూ.5వేలు, విత్తనం,నాట్లుకు రూ.10వేలు, నాలుగుసార్లు జడచుట్టు, బోదెలకు రూ.4వేలు,కలుపుతీత, ఎరువులు ఇలా మొత్తంగా రూ.25వేలు ఖర్చవుతోంది. ఎకరాకు 25 నుంచి 30 టన్నుల చెరకు ఉత్పత్తి అవుతోంది. దానిని నరకడం,ఫ్యాక్టరీకి తరలించడానికి మరో రూ.ఆరు ఏడు వేలు ఖర్చు. ఇదంతా దిగుబడి బాగా వస్తేనే. హుద్‌హుద్‌లాంటి వాటికి గురయితే అంతే సంగతి. మిల్లులు మద్దతు ధర బాగా తగ్గించేశాయి. పర్యవసానంగా రైతుకు ఎకరాకు 30 వేలు కూడా గిట్టుబాటు కావడం లేదు. ఇప్పటికే తెగుళ్లు, మదుపుల భారంతో విలవిల్లాడుతున్న చెరకు రైతును తుఫాన్ మరింతగా ముంచేసింది. భారీ గాలులు, వర్షం ధాటికి పంట పూర్తిగా నేలమట్టమై కనీసం విత్తనం ఖర్చుకూడా రాని దయనీయ పరిస్థితి. దిగుబడి బాగా తగ్గి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎకరాకు కనీసం రూ.3వేలు రావని వాపోతున్నారు. ఇక కౌలుకు తీసుకుని పంట చేపట్టిన రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. చెరకు సాగు చేపట్టలేం నాది యలమంచిలి మండలం సోమలింగపాలెం. ఎకరా పొలంలో సాగుచేస్తున్న చెరకుతోట ఎండిపోతోంది. రెండేళ్లక్రితం నీలం, గత ఏడాది భారీ వర్షాలు, ఈ ఏడాది హుద్‌హుద్ తుఫాన్ మా పాలిట శాపమవుతున్నాయి. ఏటా నష్టపోతున్నాం. విపత్తులప్పుడు పాలకులు, అధికారుల ప్రకటనలు చూస్తే మరుసటి రోజే నష్టపరిహారం వస్తుందన్న ఆశ కలుగుతోంది. కాని అది కార్యరూపం దాల్చేసరికి ఎక్కువ సమయం పడుతోంది. దీంతో కోలుకోలేకపోతున్నాము. ప్రభుత్వం ఆదుకోవాలి. - వై.పరమేశ్వరరావు, చెరకు రైతు