‘మద్దతు’ కోసం మరో పోరు  | Farmers Protest For Minimum Price Armoor | Sakshi
Sakshi News home page

‘మద్దతు’ కోసం మరో పోరు 

Published Sat, Feb 23 2019 10:36 AM | Last Updated on Sat, Feb 23 2019 10:36 AM

Farmers Protest For Minimum Price Armoor - Sakshi

ఆర్మూర్‌లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న రైతులు (ఫైల్‌)

మోర్తాడ్‌(బాల్కొండ): మద్దతు ధర కోసం అన్నదాతలు మరో పోరుకు సిద్ధమవుతున్నారు. డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. గత పదిహేను రోజుల నుంచి ఉద్యమిస్తున్నా సర్కారు స్పందించక పోవడంతో అన్నదాలు మరోసారి రోడ్డెక్కేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎర్రజొన్నలు, పసుపు పంటలను కొనుగోలు చేసే ఆంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ఈనెల 25న చలో ఆర్మూర్‌కు రైతు ఉద్యమ నాయకులు పిలుపునిచ్చారు. సర్కారును కదిలించేందుకు ఈసారి ఇంటికి ఇద్దరు చొప్పున తరలి రావాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

పోరుబాట 
ఇప్పటికే ఆర్మూర్‌లో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రైతులు మూడు విడతలుగా శాంతియుత ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ రహదారుల దిగ్బంధనంతో ప్రభుత్వం స్పందించ లేదని భావిస్తున్న రైతులు మరోసారి ఆర్మూర్‌లో సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించారు. కలెక్టర్‌తో జరిపిన చర్చలు ఫలించక పోవడంతో రైతులు ఉద్యమ బాటనే ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ఆర్మూర్‌లో ఈనెల 25న నిర్వహించే ఆందోళన కార్యక్రమానికి మహిళా రైతులను ఎక్కువ మందిని తరలించాలని భావిస్తున్నారు. ఎర్రజొన్నలు, పసుపు పంటలకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నా వ్యాపారులు తమ సంపాదనను పెంచుకోవడానికి కనీస ధర చెల్లించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం గతంలో ఎర్రజొన్నలను కొనుగోలు చేసినట్లే ఈ సారి కూడా కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే, పసుపు పంటకు కూడా రూ.15వేల మద్దతు ధర ప్రకటించాలని పట్టు బడుతున్నారు.

స్పందించని సర్కారు.. 
అయితే, మార్క్‌ఫెడ్‌ ద్వారా గతంలో ఎర్రజొన్నలను కొనుగోలు చేయించగా సంస్థకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఈసారి ఎర్రజొన్నలను కొనుగోలు చేసే అవకాశం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. అలాగే, పసుపు పంటకు మద్దతు ధర, కొనుగోలు చేసే ఆంశాలు రెండు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని, అందువల్ల పసుపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని అధికారులు వివరిస్తున్నారు. వాణిజ్య పంటల విషయంలో కేంద్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంటున్నారు. అందువల్ల ఎర్రజొన్నలు, పసుపు పంటలను కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో ఆగ్రహిస్తున్న రైతులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఎర్రజొన్నలు, పసుపు పంటలను పండించే ప్రతి రైతు కుటుంబం నుంచి ఇద్దరు చొప్పున ఆర్మూర్‌లో నిర్వహించనున్న ఆందోళనకు వచ్చేలా రైతు నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాలలో పెద్ద మొత్తంలో ఎర్రజొన్నలు, పసుపు పంటలను సాగు చేస్తున్నారు.

ఆందోళనలకు వెళ్లొద్దని ఒత్తిళ్లు
ర్రజొన్నలు, పసుపు పంటల కొనుగోలు విషయంలో రైతులు చేపట్టిన ఉద్యమం అధికార పార్టీ మెడకు చుట్టుకుంటోంది. శాసనసభ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటర్లు ఏకపక్షంగా పట్టం కట్టారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రెండు నెలల్లోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమించడం అధికార పార్టీ నాయకులను కలవరానికి గురి చేస్తోంది. దీంతో రైతులను ఆర్మూర్‌కు వెళ్లకుండా నిలవరించడానికి కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు రంగంలోకి దిగారు. తమకు పట్టు ఉన్న సంఘాల్లో రైతులతో సమావేశాలను నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించ వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు. అయితే, రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా నిర్వహిస్తున్న ఉద్యమానికి టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుపడటం బాలేదని రైతులు ఆక్షేపిస్తున్నారు. కొన్నిచోట్ల నాయకులు, రైతుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తగా నేతలు వెనక్కి తగ్గడంతో వివాదం సమసి పోయింది.
 
పోలీసుల కౌన్సెలింగ్‌.. 
చలో ఆర్మూర్‌కు రైతులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆర్మూర్‌కు భారీ సంఖ్యలో తరలి రాకుండా ఉండటానికి పోలీసులు రైతు సంఘాలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. రైతులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. రైతులు ఆర్మూర్‌కు తరలి రాకుండా చూసే బాధ్యతను ప్రభుత్వం పోలీసు శాఖకు అప్పగించడంతో వివిధ మండలాల ఎస్సైలు, ఇతర ఉన్నతాధికారులు రైతులతో సమావేశమవుతున్నారు. రైతులు ఎక్కువ సంఖ్యలో తరలి వెళితే తమకు ఇబ్బంది అని, ఆందోళన కార్యక్రమాలకు వెళ్లకూడదని పోలీసులు చెప్పడం గమనార్హం. అయితే, తాము మాత్రం శాంతియుతంగానే ఉద్యమాన్ని నిర్వహిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు. 

పార్టీలకు సంబంధం లేకుండానే.. 
పసుపు, ఎర్రజొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు మేలు చేయాలని ఉద్యమిస్తున్నాం. ఈ ఉద్యమానికి, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. రాజకీయ పార్టీల రంగు పులిమి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే రైతులే గుణపాఠం చెబుతారు. రైతులు శాంతియుతంగా పోరాటం చేస్తే అడ్డుకోవాలని పోలీసులు చూస్తున్నారు. మేము శాంతియుతంగానే ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం. పోలీసులు మాకు సహకరించాలి.  – అన్వేశ్‌రెడ్డి, రైతు ఉద్యమ నాయకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement