అనూహ్య ఉత్పాతాలు అన్నదాత ఉసురు తీస్తున్నాయి. కష్టనష్టాల సుడిగుండాల పాలబడి సేద్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చెరకు రైతు బతుకు చేదెక్కుతోంది. హుద్‌హుద్ కక్కిన విషంతో జీవనం ఆర్థికంగా దుర్భరమైంది. పెట్టుబడి వాయువేగానికి కొట్టుకుపోయింది. అందివచ్చిన పంటతో అప్పులు తీర్చేద్దామని ఆశించిన అన్నదాతకు చేతికి చిల్లిగవ్వరాని దుస్థితి. జిల్లాలో ఏ చెరకు రైతును కదిపినా కన్నీటి వెతలే. మారిన బతుకు చిత్రం చూస్తే కడుపు తరుక్కుపోతుంది.
ఇలా అయితే కష్టమే
నాది యలమంచిలి మండలం సోమలింగపాలెం. రెండు ఎకరాల్లో చెరకు పంట చేపట్టాను. హుద్‌హుద్ తుఫాన్‌కు ధ్వంసమైంది. మూడేళ్లుగా తుఫాన్‌లు, భారీ వర్షాలకు చెరకు పంట నష్టపోతున్నాం. పెట్టుబడులు సైతం తుడిచిపెట్టుకుపోతున్నాయి. గత నెల 12న సంభవించిన హుద్‌హుద్ కారణంగా పంటంతా కుళ్లిపోతోంది. ఇలా అయితే చెరకు సాగు కష్టమే. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లింపులో నిబంధనల పేరుతో తీవ్ర జాప్యం చేస్తోంది.
- యల్లపు వెంకట్, చెరకు రైతు
సాక్షి, విశాఖపట్నం: చెరకు సాగు కలిసిరావడంలేదు. ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఇంటిల్లిపాదీ రెక్కలు ముక్కలు చేసుకున్నాగిట్టుబాటు కావడం లేదు. దానికితోడు ఉత్పాతాలు నట్టేట ముంచుతున్నాయి. జిల్లాలోని నాలుగు చక్కెర మిల్లులు మద్దతు ధరను చెల్లించడం లేదు. తుఫాన్‌కు తీవ్రంగా నష్టపోయిన యాజమాన్యాలు ప్రభుత్వం ప్రకటించిన టన్నుకు రూ.2260లు కనీసపు ధరను ఇచ్చే పరిస్థితిలో లేవు. జిల్లాలో చెరకు సాగు సాధారణ విస్తీర్ణం 40,353 హెక్టార్లు. ఈ ఏడాది 37,435 హెక్టార్లలో పంటను చేపట్టారు. ఇందులో 50శాతం పంట తుఫాన్‌కు ధ్వంసమైంది.
పెట్టుబడులు పెరిగిపోవడంతో ఇప్పటికే ఏటేటా చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఎకరం భూమి ఐదు దుక్కులకు రూ.5వేలు, విత్తనం,నాట్లుకు రూ.10వేలు, నాలుగుసార్లు జడచుట్టు, బోదెలకు రూ.4వేలు,కలుపుతీత, ఎరువులు ఇలా మొత్తంగా రూ.25వేలు ఖర్చవుతోంది. ఎకరాకు 25 నుంచి 30 టన్నుల చెరకు ఉత్పత్తి అవుతోంది. దానిని నరకడం,ఫ్యాక్టరీకి తరలించడానికి మరో రూ.ఆరు ఏడు వేలు ఖర్చు. ఇదంతా దిగుబడి బాగా వస్తేనే. హుద్‌హుద్‌లాంటి వాటికి గురయితే అంతే సంగతి. మిల్లులు మద్దతు ధర బాగా తగ్గించేశాయి.
పర్యవసానంగా రైతుకు ఎకరాకు 30 వేలు కూడా గిట్టుబాటు కావడం లేదు. ఇప్పటికే తెగుళ్లు, మదుపుల భారంతో విలవిల్లాడుతున్న చెరకు రైతును తుఫాన్ మరింతగా ముంచేసింది. భారీ గాలులు, వర్షం ధాటికి పంట పూర్తిగా నేలమట్టమై కనీసం విత్తనం ఖర్చుకూడా రాని దయనీయ పరిస్థితి. దిగుబడి బాగా తగ్గి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎకరాకు కనీసం రూ.3వేలు రావని వాపోతున్నారు. ఇక కౌలుకు తీసుకుని పంట చేపట్టిన రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది.
చెరకు సాగు చేపట్టలేం
నాది యలమంచిలి మండలం సోమలింగపాలెం. ఎకరా పొలంలో సాగుచేస్తున్న చెరకుతోట ఎండిపోతోంది. రెండేళ్లక్రితం నీలం, గత ఏడాది భారీ వర్షాలు, ఈ ఏడాది హుద్‌హుద్ తుఫాన్ మా పాలిట శాపమవుతున్నాయి. ఏటా నష్టపోతున్నాం. విపత్తులప్పుడు పాలకులు, అధికారుల ప్రకటనలు చూస్తే మరుసటి రోజే నష్టపరిహారం వస్తుందన్న ఆశ కలుగుతోంది. కాని అది కార్యరూపం దాల్చేసరికి ఎక్కువ సమయం పడుతోంది. దీంతో కోలుకోలేకపోతున్నాము. ప్రభుత్వం ఆదుకోవాలి.
- వై.పరమేశ్వరరావు, చెరకు రైతు
చేదెక్కుతున్న సాగు
Published Thu, Nov 13 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM
Advertisement