Sugarcane farmer
-
అమ్ముడుపోని చెరకుతో వెనిగర్ తయారీ.. భారీ లాభాలు గడిస్తున్న యూపీ రైతు
చెరకును ఫ్యాక్టరీ వాళ్లు కొనకపోతే రైతుకు ఏం చేయాలో తోచదు. అయితే, అమ్ముడు పోని చెరకుతో వెనిగర్ తయారు చేసి చక్కని ఆదాయం గడిస్తూ ఆశ్చర్యపరుస్తున్నది ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ రైతు కుటుంబం. సీతాపూర్ జిల్లా చావ్‌బిర్వ గ్రామానికి చెందిన 50 ఏళ్ల రామ్‌కిషోర్ మిశ్రా, ఆయన సోదరులు హిమాంశు మిశ్రా, శ్యాంకిశోర్ మిశ్రాలతో కలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నారు. తమకున్న 50 ఎకరాల్లో చాలా ఏళ్లుగా చెరకుతోపాటు ఇతర పంటల సాగుతోపాటు పశుపోషణ చేస్తున్నారు. గతంలో ఫ్యాక్టరీకి తోలగా మిగిలిపోయిన చెరకు వృథా అయ్యేది. ఇలా మిగిలిన చెరకును ఎలా ఉపయోగించాలా అని కొద్ది నెలల క్రితం ఆలోచిస్తుండగా.. చిన్నప్పుడు తమ బామ్మ తయారు చేసిన ఆరోగ్య పానీయం వెనిగర్ (సిర్కా) గుర్తొచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా వెనిగర్ తయారు చేసి, ప్లాస్టిక్ బాటిల్స్‌లో నింపి రిటైల్ మార్కెట్లో అమ్మటం ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దగ్గరి పట్టణ ప్రాంతాలకే కాకుండా రాజస్థాన్ మార్కెట్ల నుంచి కూడా వీరికి ఆర్డర్లు వస్తుండటం విశేషం. ఇప్పటికే 7 వేల లీటర్లు విక్రయించారు. ప్రతి నెలా రూ. 20 వేల వరకు వెనిగర్ ద్వారా ఆదాయం గడిస్తున్నారు. ఇంతకీ దీన్ని ఎలా తయారు చేస్తున్నారంటే.. చెరకు రసాన్ని పరిశుభ్రమైన ప్లాస్టిక్ డ్రమ్స్లో నింపి, గ్యాస్ బయటకు పోయేందుకు చిన్న బెజ్జం ఉంచి, బిగుతుగా మూత పెట్టేస్తారు. మూడు నెలల తర్వాత మూత తీసి.. అప్పటికే సిద్ధంగా ఉన్న పాత వెనిగర్‌ను ఈ డ్రమ్ముల్లో మజ్జిగ తోడు మాదిరిగా కొద్ది పరిమాణంలో కలుపుతారు. మరో మూడు నెలలకు.. (అంటే మొత్తం ఆర్నెల్లకు) వెనిగర్ వినియోగానికి సిద్ధమవుతుందని హిమాంశు మిశ్రా తెలిపారు. అయితే, దీనికి తేమ చేతులు తగలకూడదు. పరిశుభ్రత పాటించకపోతే మొత్తం పాడై చెడువాసన వచ్చి పనికిరాకుండా పోతుందన్నారు. వెనిగర్‌ను ఏ దశలోనూ మెటల్ కంటెయినర్లలో పోయకూడదు. ఫైబర్ లేదా ప్లాస్టిక్ డ్రమ్ములు, సీసాలు వాడాలి. 600 ఎం.ఎల్. ప్లాస్టిక్ సీసాల్లో నింపి, రూ. 70కి విక్రయిస్తున్నారు. ఖాళీ బాటిల్ రూ.7, స్టిక్కర్ రూ.5తో కలిపి ఒక సీసా వెనిగర్ ఉత్పత్తి ఖర్చు రూ. 25 వరకు అవుతుందని హిమాంశు వివరించారు. వెనిగర్‌ను తీసుకునే వారికి రక్తపోటు తగ్గుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని, పొట్ట భాగంలో కొవ్వు కరుగుతుందని, జీర్ణశక్తి పెరుగుతుందని, చర్మ సౌందర్యం ఇనుమడిస్తుందని మిశ్రా సోదరులు చెబుతున్నారు. తయారైన తర్వాత రెండేళ్లు ఇది నిల్వ ఉంటుందంటున్నారు. -
చెరుకు రైతు సమస్యలు పరిష్కరించండి
తమ్మినేని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చెరుకు రైతుల సమస్యల పరి ష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం కోరింది. ఎన్నికల ముందు చెరుకు రైతులను ఆదు కుంటామని, నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామని, నిజామాబాద్ జిల్లాలో చెరుకు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పేర్కొన్నట్లు గుర్తు చేసింది. చెరుకు రైతులకు రవాణా, కటింగ్ ఖర్చులు తలకు మించిన భారంగా మారి నందున కంపెనీలే వీటిని భరించేలా జోక్యం చేసుకోవాలని సీఎంకు ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశా రు. చెరుకు రికవరీ 8.5 శాతముంటే రూ.4 వేల మద్దతు ధర ఇవ్వాలని, విత్తనం ఉచితంగా ఇవ్వాలని, ఎరువులు, పురుగు మందులు, వడ్డీ లేని రుణాలిచ్చి, పంటల బీమాను ప్రభుత్వమే చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు. -
చేదెక్కుతున్న సాగు
అనూహ్య ఉత్పాతాలు అన్నదాత ఉసురు తీస్తున్నాయి. కష్టనష్టాల సుడిగుండాల పాలబడి సేద్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చెరకు రైతు బతుకు చేదెక్కుతోంది. హుద్‌హుద్ కక్కిన విషంతో జీవనం ఆర్థికంగా దుర్భరమైంది. పెట్టుబడి వాయువేగానికి కొట్టుకుపోయింది. అందివచ్చిన పంటతో అప్పులు తీర్చేద్దామని ఆశించిన అన్నదాతకు చేతికి చిల్లిగవ్వరాని దుస్థితి. జిల్లాలో ఏ చెరకు రైతును కదిపినా కన్నీటి వెతలే. మారిన బతుకు చిత్రం చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఇలా అయితే కష్టమే నాది యలమంచిలి మండలం సోమలింగపాలెం. రెండు ఎకరాల్లో చెరకు పంట చేపట్టాను. హుద్‌హుద్ తుఫాన్‌కు ధ్వంసమైంది. మూడేళ్లుగా తుఫాన్లు, భారీ వర్షాలకు చెరకు పంట నష్టపోతున్నాం. పెట్టుబడులు సైతం తుడిచిపెట్టుకుపోతున్నాయి. గత నెల 12న సంభవించిన హుద్‌హుద్ కారణంగా పంటంతా కుళ్లిపోతోంది. ఇలా అయితే చెరకు సాగు కష్టమే. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లింపులో నిబంధనల పేరుతో తీవ్ర జాప్యం చేస్తోంది. - యల్లపు వెంకట్, చెరకు రైతు సాక్షి, విశాఖపట్నం: చెరకు సాగు కలిసిరావడంలేదు. ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఇంటిల్లిపాదీ రెక్కలు ముక్కలు చేసుకున్నాగిట్టుబాటు కావడం లేదు. దానికితోడు ఉత్పాతాలు నట్టేట ముంచుతున్నాయి. జిల్లాలోని నాలుగు చక్కెర మిల్లులు మద్దతు ధరను చెల్లించడం లేదు. తుఫాన్‌కు తీవ్రంగా నష్టపోయిన యాజమాన్యాలు ప్రభుత్వం ప్రకటించిన టన్నుకు రూ.2260లు కనీసపు ధరను ఇచ్చే పరిస్థితిలో లేవు. జిల్లాలో చెరకు సాగు సాధారణ విస్తీర్ణం 40,353 హెక్టార్లు. ఈ ఏడాది 37,435 హెక్టార్లలో పంటను చేపట్టారు. ఇందులో 50శాతం పంట తుఫాన్‌కు ధ్వంసమైంది. పెట్టుబడులు పెరిగిపోవడంతో ఇప్పటికే ఏటేటా చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఎకరం భూమి ఐదు దుక్కులకు రూ.5వేలు, విత్తనం,నాట్లుకు రూ.10వేలు, నాలుగుసార్లు జడచుట్టు, బోదెలకు రూ.4వేలు,కలుపుతీత, ఎరువులు ఇలా మొత్తంగా రూ.25వేలు ఖర్చవుతోంది. ఎకరాకు 25 నుంచి 30 టన్నుల చెరకు ఉత్పత్తి అవుతోంది. దానిని నరకడం,ఫ్యాక్టరీకి తరలించడానికి మరో రూ.ఆరు ఏడు వేలు ఖర్చు. ఇదంతా దిగుబడి బాగా వస్తేనే. హుద్‌హుద్‌లాంటి వాటికి గురయితే అంతే సంగతి. మిల్లులు మద్దతు ధర బాగా తగ్గించేశాయి. పర్యవసానంగా రైతుకు ఎకరాకు 30 వేలు కూడా గిట్టుబాటు కావడం లేదు. ఇప్పటికే తెగుళ్లు, మదుపుల భారంతో విలవిల్లాడుతున్న చెరకు రైతును తుఫాన్ మరింతగా ముంచేసింది. భారీ గాలులు, వర్షం ధాటికి పంట పూర్తిగా నేలమట్టమై కనీసం విత్తనం ఖర్చుకూడా రాని దయనీయ పరిస్థితి. దిగుబడి బాగా తగ్గి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎకరాకు కనీసం రూ.3వేలు రావని వాపోతున్నారు. ఇక కౌలుకు తీసుకుని పంట చేపట్టిన రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. చెరకు సాగు చేపట్టలేం నాది యలమంచిలి మండలం సోమలింగపాలెం. ఎకరా పొలంలో సాగుచేస్తున్న చెరకుతోట ఎండిపోతోంది. రెండేళ్లక్రితం నీలం, గత ఏడాది భారీ వర్షాలు, ఈ ఏడాది హుద్‌హుద్ తుఫాన్ మా పాలిట శాపమవుతున్నాయి. ఏటా నష్టపోతున్నాం. విపత్తులప్పుడు పాలకులు, అధికారుల ప్రకటనలు చూస్తే మరుసటి రోజే నష్టపరిహారం వస్తుందన్న ఆశ కలుగుతోంది. కాని అది కార్యరూపం దాల్చేసరికి ఎక్కువ సమయం పడుతోంది. దీంతో కోలుకోలేకపోతున్నాము. ప్రభుత్వం ఆదుకోవాలి. - వై.పరమేశ్వరరావు, చెరకు రైతు