‘పసుపు’ పండింది | yellow, park in distic state government's decision | Sakshi
Sakshi News home page

‘పసుపు’ పండింది

Published Thu, Mar 24 2016 4:15 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

‘పసుపు’ పండింది

‘పసుపు’ పండింది

పసుపు పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
రూ. 30.81 కోట్లు అవసరం
తొలి విడతలో రూ. 15 కోట్లు కేటాయింపు
పార్క్ పూర్తయితే చేకూరే ప్రయోజనాలెన్నో..
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

పసుపు సాగును ప్రోత్సహించేందుకు జిల్లాలో పసుపు పార్క్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ ప్రాంత రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పార్క్ ఏర్పాటుకు  రూ. 30.81 కోట్లు అవసరం కాగా.. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 15 కోట్లను కేటాయించడంతో వేగంగా పనులు పూర్తవుతాయని ఆశిస్తున్నారు. పసుపు పార్క్ ఏర్పాటుతో జిల్లాతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పసుపు రైతులకూ ప్రయోజనం చేకూరనుంది.

మోర్తాడ్ : పసుపు పంటను సాగు చేసే రైతులను ప్రోత్సహించడానికి పసుపు పార్క్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.  రాష్ట్రంలో అత్యధికంగా ఆర్మూర్ ప్రాంతం లో పసుపు పంట సాగవుతుంది. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత రైతులు కొన్నేళ్లు గా డిమాండ్ చేస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పా టు ఆంశం కేంద్రంతో ముడిపడి ఉన్న అంశం. దీంతో పసుపు బోర్డు ఏర్పాటుకు ఇప్పట్లో అవకాశాలు కనిపించకపోవడంతో బోర్డు తరహా లోనే పసుపు పార్క్‌ను ఏర్పాటు చేస్తే కొంతైనా రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసం వేల్పూర్ మండలంలోని పడిగెల శివారులో 40 ఎకరాల భూమిని సేకరించింది. భూ సేకరణ కోసం రూ. 5 కోట్లను ఖర్చు చేసింది. భూమిని స్పైసిస్ పార్క్ పేరున రిజిస్టర్ చేసినప్పటికీ.. పసుపు పార్క్ ఏర్పాటు కోసం కేంద్రం నిధులు మంజూ రు చేయలేదు.

అంతేకాక గతంలో ఏర్పాటు చేసిన స్పైసిస్ పార్క్‌లతోనే సరిపెట్టుకోవాలని, కొత్త వాటిని ఇప్పట్లో ఏర్పాటు చేసే పరిస్థితి లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో పసుపు పార్క్‌పై రైతులు ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. పసుపు పార్క్‌ను ఎలాగైనా ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఆయనను ఒప్పించడంలో సఫలమయ్యారు. పసుపు పార్క్‌ను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడానికి ముందుకువచ్చింది. పసుపు పార్క్ ఏర్పాటుకు రూ. 30.81 కోట్లు అవసరం కాగా.. తొలి విడతలో ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.15 కోట్లను కేటాయించింది. మిగిలిన రూ.15.81 కోట్లను 2017-18 ఆర్థిక సంవత్సరంలో కేటాయించనున్నట్లు ప్రకటించింది.

 మూడు జిల్లాలకు లాభం..
వేల్పూర్ మండలం పడిగెల్ వద్ద ఏర్పాటు చేయనున్న పసుపు పార్క్ వల్ల మన జిల్లాలోని రైతాంగంతోపాటు ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని పసుపు రైతులకూ ప్రయోజనం చేకూరనుంది. ఏటా మన జిల్లాలో దాదాపు 25 వేల ఎకరాల్లో పసుపు పంట సాగు అవుతుంది. బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, వేల్పూర్, ధర్పల్లి, జక్రాన్‌పల్లి, నందిపేట్, ఆర్మూర్ మండలాలతో పాటు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి, కోరుట్ల ప్రాంతాల్లో పసుపు సాగు చేస్తారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పండించే పసుపులో 25 శాతం మన జిల్లాలోనే సాగవుతుందని అంచనా.

 ప్రయోజనాలివి..
పసుపు పార్క్ ఏర్పాటు వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. రైతులు పండిం చిన పసుపును నిజామాబాద్, ఈరోడ్, సాంగ్లీ, బసుమతినగర్ ప్రాంతాలలో విక్రయిస్తున్నారు. పసుపు పార్క్ ఏర్పాటైతే రైతులు దూర ప్రాంతాలలోని మార్కెట్‌లకు వెళ్లి విక్రయించాల్సిన అవసరం ఉండదు. దూర ప్రాంతాలలోని వ్యాపారులే పసుపు పార్క్‌కు వచ్చి రైతుల నుంచి పసుపును కొనుగోలు చేస్తారు.

 పంట సాగుకు అవసరమైన మేలు రకం వంగడాలను ఉత్పత్తి చేయడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపే అవకాశం ఉంటుంది. పసుపును పొడి చేసి తరలించే అవకాశాలు ఉన్నాయి.

పసుపు సాగులో మెలకువలపై రైతులకు అవగాహన కల్పించే చర్యలు చేపడుతారు.

రైతులు సేద తీరడానికి విశ్రాంతి గది, రెస్టారెం ట్, పసుపును నిలువ చేయడానికి గిడ్డంగులు, పసుపును శుద్ధి చేయడానికి అవసరమైన యంత్రాలు ఏర్పాటు చేస్తారు.

పసుపు పంటకు ధరను నిర్ణయించే అవకాశం పసుపు పార్క్ వల్ల ప్రభుత్వానికి ఏర్పడనుంది. ఇప్పటి వరకు పసుపు ధరలపై అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం ఉంది. ఒక్కోసారి పసుపు ధర దారుణంగా పడిపోతుండడంతో రైతులకు పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదు. పసుపు పార్క్ ఏర్పాటైన తరువాత ప్రభుత్వం ధరను నిర్ణయిస్తుంది. దీంతో అంతే ధరకు వ్యాపారులు లేదా ప్రభుత్వ పరిధిలోని సంస్థలు పసుపును కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీంతో రైతులు నష్టపోకుండా ఉంటారు.

రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
ప్రభుత్వం పసుపు పార్క్ ఏర్పాటుకు ముందుకు రావడం మంచి నిర్ణయం. పార్క్ ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. - పెద్దకాపు శ్రీనివాస్ రెడ్డి, రైతు, దోంచంద

 త్వరగా పనులు చేపట్టాలి
పసుపు పార్క్ పనులు త్వరగా చేపట్టాలి. సకాలంలో పనులు పూర్తి చేయాలి. పనులు పూర్తి చేసి పార్క్‌ను అందుబాటులోకి తెస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది.  - రొక్కం మురళి, రైతు, తిమ్మాపూర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement