
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందిం చి, వారిని ఆదుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కోరారు. మంగళవారం సచివాలయంలో సీఎస్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్‌లో పసుపు, ఎర్రజొన్న ప్రధాన వాణిజ్య పంటలు అయినప్పటికీ అక్కడి రైతుల పంటలను న్యాయమైన ధర చెల్లించి కొనుగోలు చేసే మార్కెట్ వ్యవస్థ లేదని పేర్కొన్నారు. పసుపు శుద్ధికి, అమ్మకానికి నిజామాబాద్‌లో కావాల్సిన సౌకర్యాలు లేవన్నారు. ఎర్రజొన్న మార్కెట్ కొంతమంది వ్యాపారుల చేతుల్లో ఉందని, వారే మార్కెట్‌ను శాసిస్తుండటం వల్ల గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోతున్నారన్నారు.
అందు కే రైతులు గిట్టుబాటుధర కోసం ఆందోళన చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్య లు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం ఎర్రజొన్నలను క్వింటాల్‌కు రూ.3,500 చొప్పున, పసుపు క్వింటా ల్‌కు రూ.15 వేల ధర స్థిరీకరించేలా చర్యలు చేపట్టాలని, పసుపు బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలన్నా రు. మార్కెట్ చట్టంలోని సెక్షన్ 11ను పటిష్టంగా అమలు చేయాలన్నారు. కేంద్రం సూచించినట్లుగా కాంట్రాక్టు వ్యవసాయంలో రైతుల రక్షణకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఆందోళన చేస్తున్న రైతులపై, రైతు సంఘాల నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, జైల్లో ఉన్న నాయకులను విడుదల చేయాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment